ఆధునిక తెలుగు నిఘంటు సృష్టికర్త డా. రవ్వా శ్రీహరి అస్తమయం..

By SumaBala Bukka  |  First Published Apr 22, 2023, 9:19 AM IST

ఆచార్య రవ్వా శ్రీహరి ఇక లేరు. ఆధునిక తెలుగు నిఘంటు సృష్టికర్తగా.. సంస్కృత, తెలుగు సాహిత్యంలో ఎనలేని సేవలు అందించిన ఆయన 80యేళ్ల వయసులో మృతి చెందారు. 


హైదరాబాద్ : సంస్కృత భాషా అధ్యయనం, వ్యాకరణ నిర్మాణంలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న మహా మహో పాధ్యాయ ఆచార్య డా. రవ్వా శ్రీహరి ఇకలేరు. ఆధునిక తెలుగు నిఘంటు కర్తగా,  వ్యాకరణ వేత్తగా సుపరిచితుడైన డాక్టర్ రవ్వా శ్రీహరి 80 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. ఆదివారం ఉదయం 10 గంటలకు అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబసభ్యులు తెలిపారు. తెలంగాణలోని నల్గొండ జిల్లా వెల్దుర్తికి చెందిన ఒక సామాన్య చేనేత కుటుంబంలో పుట్టిన డా. రవ్వా శ్రీహరి ఆ తర్వాత కాలంలో వ్యాకరణ వేత్తగా ఎదిగారు. 1943 సెప్టెంబర్ 12వ తేదీన జన్మించిన రవ్వా శ్రీహరి చిన్నతనంలోనే తల్లిని కోల్పోయారు. 

ఏం నర్సింగరావు సురవరం ప్రతాపరెడ్డిల సహకారంతో యాదగిరి లక్ష్మీనరసింహ సంస్కృత విద్యాపీఠంలో చేరారు. రవ్వా శ్రీహరి గురువు కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి.  సంస్కృతం మీద ఉన్న ఆసక్తితో సీతారాంబాగ్ లోని సంస్కృత కాలేజీలో డిఓఎల్, బిఓఎల్ వ్యాకరణం చదివారు. బి ఓ ఎల్ వ్యాకరణంలో పాసైన తర్వాత వివేకవర్ధిని కాలేజీలో తెలుగు పండితుడిగా చేరారు.

Latest Videos

అటు తెలుగు పండితుడుగా పనిచేస్తూనే బిఏ పూర్తి చేశారు. తెలుగు పండితుడిగా శిక్షణ పూర్తి చేసుకుని ఎంఏ తెలుగు, సంస్కృతం పూర్తి చేశారు. ఆ తర్వాత  1967లో సరస్వత పరిషత్ లో లెక్చరర్ గా చేరారు. అక్కడ పరిషత్ లోని విద్యార్థులకు తెలుగు సంస్కృతం రెండు బోధించేవారు. 1973 లో ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో చేరారు.

అక్కడే ఆచార్య బిరుదురాజు రామరాజు సలహాతో భాస్కర రామాయణం మీద తెలుగులో పరిశోధన చేసి పీహెచ్డీ పట్టాపుచ్చుకున్నారు. కేంద్రీయ విశ్వవిద్యాలయంలో 17 సంవత్సరాలు బోధన, పరిశోధనలు చేశారు. ఆ తర్వాత 2002లో ద్రావిడ విశ్వవిద్యాలయానికి ఉపాధ్యక్షులుగా రవ్వ శ్రీహరి నియమితులయ్యారు. 2011లో  తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణల విభాగానికి ఎడిటర్ ఇన్చార్జిగా కూడా పనిచేశారు.

తన రచన ప్రక్రియలో తెలుగు రచనలకే పెద్దపీట వేశారు ఆచార్య రవ్వా శ్రీహరి. తెలుగులో 50 గ్రంథాలు, సంస్కృతంలో 25 పుస్తకాలు రచించారు. ఆయన రచనల్లో ముఖ్యమైనవి.. శ్రీహరి నిఘంటువు, అన్నమయ్య పదకోశం, నల్లగొండ జిల్లా మాండలిక పదకోశం, వ్యాకరణ పదకోశం,  సంకేత పదకోశం అనే  నిఘంటువులను రచించారు.

వీటితోపాటు అనేక విమర్శ గ్రంధాలు, వ్యాకరణ గ్రంథాలు, ఇతర గ్రంథాలను  రచించారు. ఆచార్య రవా శ్రీహరి కృషికిగాను తిరుపతిలోని కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం వారు మహో మహోపాధ్యాయ బిరుదు ప్రదానం చేసి సత్కరించారు. 2013లో సిపి బ్రౌన్ పురస్కారం కూడా ఆయనను వరించింది. 2013లోనే ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం వారు విశిష్ట పురస్కారం కూడా అందుకున్నారు. 2014లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం వారిచే గిడుగు రామ్మూర్తి పురస్కారం ఆయనను వరించింది.

click me!