దర్భముళ్ల చంద్రశేఖర్ కథ ఆశాజ్యోతి ఇక్కడ చదవండి
"అక్కడే నిలబడ్డాడా..? ఆ..అలాగే అనిపిస్తోంది. గాలి తెస్తోందిగా అతడి పెర్ఫ్యూమ్ వాసన. దగ్గరకు రాడేం? మాట్లాడడేం? అబ్బో! టెక్కు.... నాకేనేంటి రోషం లేనిది. నేను మాట్లాడను." బుంగమూతి పెట్టుకు నిలబడిందామె.
బస్ స్టాప్ ఆ చివరలోనున్న అతడూ అదే ఆలోచిస్తున్నాడు."దగ్గరకు రాదేం? మాట్లాడదేం? సరే నాదేం పోయింది. నేనూ మాట్లాడను!"
ఆ ఇద్దరి మధ్య ఆ ఏడడుగుల దూరంలోనే పరుచుకున్న ఆకాశమంతటి శూన్యం.
బస్సొచ్చింది. అతడు చేతిలో కర్ర విప్పుకుని చకచకా వెళ్లి ఎక్కేశాడు. ఇంకో ఇద్దరికి ఎక్కడానికి సహాయం చేస్తున్న కండక్టర్ కుర్రాడు ఆలోచనలో మునిగిపోయిన ఆమెను చూస్తూ అల్లరిగా అన్నాడు.
"ఏం మేడం! మళ్లీ సార్ తో గొడవ పడ్డారా?! ఆయన బస్సెక్కేశారు. రండి మీదే లేటు."
ఆమె గుండె ఝల్లుమంది. కర్ర ఊతగా ముందుకు కదిలింది. కుర్రాడు చేయందిస్తే బస్సెక్కింది. అలవాటైన పరిమళం ఆహ్వానిస్తే అతడి పక్కన ఖాళీగా ఉన్న సీట్లో బిడియ పడుతూ తడుముకుంటూ కూర్చుంది.
ఒకరి దేహం ఒకరిని తాకగానే వారిద్దరికీ కనబడని సిగ్గుల గులాబీ రంగు, నల్ల కళ్ళద్దాలు ధరించిన వాళ్ల ముఖాల్లో 'గుప్పు'న ముప్పిరి గొంది. నిన్న సాయంత్రం మొదలైన 'టీ కప్పులో తుఫాను' చివరికి శాంతించింది.
మొత్తానికి "భలే జంట" అని కండక్టర్ నవ్వాడు, డ్రైవరూ నవ్వాడు. ఏం గుర్తుకొచ్చిందో మరి కొత్తగా పెళ్లయిన వాళ్ళిద్దరూ ముసిముసిగా లోలోపల నవ్వుకున్నారు.
'ఆశాజ్యోతి-అంధుల పాఠశాల' అని రాసి ఉన్న బస్సు మీద వాలిన సూర్య కిరణాలు కూడా వంత పాటగా 'ఫెళ్లు'న నవ్వాయి.