ఆఫ్రికా సుప్రసిద్ధ రచయిత జబులో ఎన్. డిబేలే దక్షిణాఫ్రికా దేశస్థుడు.1948లో జొహెన్నెస్ బర్గ్ లో జన్మించాడు. గొప్ప కథకుడు. నవలాకారుడు. సాహితీ విమర్శకుడు. తత్వవేత్త.
తెలుగు అనువాదం: డా.ఎయం.అయోధ్యారెడ్డి
డ్రాయింగ్ హాలలోంచి బిగ్గరగా మాటలూ, ఆ వెనుకే పగలబడి నవ్వులూ బెడ్రూములో కూర్చొని చదువుకుంటున్నఉకాని చెవుల్లో దూరాయి. అతని ఏకాగ్రత చెదిరింది. పుస్తకం లోంచి తలెత్తి కొంచెం సేపు శ్రద్ధగా విన్నాడు. కానీ ఆ గొంతు లేవరివో పోల్చుకోలేక పోయాడు. నేపధ్య సంగీతంలా నవ్వులూ, ఆ నవ్వుల నడుమ మాటలూ ఇంకా వినబడుతూనే ఉన్నాయి.
పుస్తకంలోకి చూపుల్ని దూర్చి బలవంతంగా చదవాలని చూశాడు.
‘ఈ కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. సామ్రాజ్యవాదులైన తెల్లవారి ఆగమనం ఆఫ్రికాలోని బంటూ జాతి గిరిజనుల సుఖసంతోషాలు, శాంతి సౌభాగ్యాలకు ఏవిధంగా దోహదపడిందో వివరించుము’
undefined
ప్రశ్నయితే చదివాడుగానీ తర్వాత దానికి సమాధానం చదవలేకపోయాడు ఉకాని. మనసు నిలకడ పోయింది. పుస్తకాన్ని బల్ల మీద పడేసి ఇటు తిరిగాడు. మంచానికి ఎదురుగా మ్యూజిక్ స్టాండ్ కనబడింది. దాన్ని చూడగానే నిన్న తను ప్రాక్టీస్ చేసిన కొత్త మోజార్డ్ గీతం మనసులో మెదిలింది. తర్వాత అతని చూపులు స్టాండ్ పక్కన గోడకు ఆనించి వున్న వయోలిన్ మీద పడ్డాయి.
‘ఇంత తీరుబడిగా ఇప్పుడీ అతిథులెందుకొచ్చినట్టు? ఎవరివో తానెప్పుడూ వినని కొత్త గొంతుల్లా ఉన్నాయి. తన గదిలోకి రారుకదా..! వొచ్చినా రావచ్చు. మమ్మీ తప్పక తీసుకొస్తుంది. తక్షణం ఇంట్లోంచి జారుకోవడం మంచిది’
తప్పించుకోవడం ఎలాగా అని యోచిస్తూ లేచి నిలబడ్డాడు ఉకాని. డ్రాయింగ్ హాల్లోంచి మరోమారు నవ్వులు వడగండ్ల వానలా కురిశాయి. బయట వచ్చిన అతిథులెవరో అప్పటికీ పోల్చుకోలేకపోయాడు. తలుపు కొద్దిగా తెరిచి చూశాడు. బయటి నవ్వుల హోరు అతన్ని దాటుకొని గదిలో చొరబడింది. ఇంట్లోంచి తప్పించుకోవడం సాధ్యమనిపించలేదు ఉకానికి. బయట పడాలంటే ముందు హాల్లోంచి వెళ్ళాలి. అట్లా వెళితే తల్లి తప్పకుండా చూస్తుంది. చూడటమే కాదు.. తనను పిలిచి అతిథులకు పరిచయం చేస్తుంది. అక్కణ్ణుంచి మొదలవుతాయి తన కష్టాలు. ప్రతిక్షణం మానసిక హింస పెట్టి తనను జీవచ్చవం చేస్తారు.
చిన్నగా కప్పుసాసర్ల శబ్దం వినిపించింది ఉకానికి. అంటే హాల్లో అతిథి సత్కారం మొదలైందన్నమాట. వచ్చినవాళ్లు ఛాయ్ తాగుతున్నారు. కాఫీ కావొచ్చేమో. కాదు.. ఛాయ్ కావడానికే ఎక్కువ అవకాశం. ఎందుకంటే మమ్మీ ఛాయిస్ టీ గనుక.
మాటలను బట్టి వచ్చినవాళ్లలో ఒకరు మగ, ఒకరు ఆడ అని భావించాడు ఉకాని. ఐతే వాళ్లు ఎవరో మాత్రం తెలియలేదు. అతిథులతో పాటు గొంతు కలిపి పెద్దగా నవ్వేస్తున్నాడు ఉకాని తండ్రి. తలుపు మరో రెండంగుళాలు తెరిచి చూశాడు.
కుషన్ చైర్లో విలాసంగా కూర్చాని కాళ్ళూపుతున్నఒకావిడ కనబడింది. ఆవిడను తనెనప్పుడూ చూసిన గుర్తు లేదు. ఉకాని తల్లి హాస్పిటల్ నుంచి వొచ్చి ఇంకా డ్రస్సు మార్చుకోలేదు. తెల్లటి నర్సు యూనిఫారంతోనే ఉన్నది. అతిథులతో పెద్దగా మాట్లాడుతోంది. వచ్చిన మరో మగ అతిథి ఏవైపు కూర్చున్నాడో కనిపించలేదు. ఏదో అన్నాడు ఉకాని తండ్రి. ఆ మాటకి అతిథులు బిగ్గరగా నవ్వారు. “కాస్త మెల్లగా నవ్వండి బాబూ” వారించింది ఉకాని తల్లి.
“ఈ రోజు నేనో స్కూలుకు ముందుగా చెప్పకుండా హఠాత్తుగా తనిఖీకి వెళ్ళి అందరినీ భలే కంగారు పెట్టేశాను తెలుసా..!” అన్నాడు ఉకాని తండ్రి హుషారుగా.
“అవును.. అట్లాగే చెయ్యాలి. స్కూళ్ళు చక్కగా పనిచేయాలంటే ఇలా ముందు సమాచారం ఇవ్వకుండా తనిఖీ చేయడం మంచిది” మెచ్చుకుంటూ అన్నాడు అతిథిగా వొచ్చిన పెద్దమనిషి.
ఈ పొగడ్తకి పొంగిపోయాడు ఉకాని తండ్రి. ఆవేళ స్కూల్లో ఏం జరిగిందో వివరంగా చెప్పటం మొదలుపెట్టాడు. “ ఆ స్కూలు హెడ్మాస్టరు మిస్టర్ మబాసో భలే కన్నింగ్ మనిషి. లేనివి ఉన్నట్టు చెబుతూ తెలివిగా పరిస్థితిని సర్దుబాటు చేయడంలో సమర్థునిలా కనిపించాడు. విద్యార్థుల గార్డెన్ ప్లాట్స్ ఎక్కడున్నాయో చూపించమన్నాను. ఒక్కక్షణం అతని ముఖంలో కంగారు కనబడినా వెంటనే కవర్ చేశాడు. అలాగే సార్.. అదిగో ఇక్కడే ఉన్నాయి పదండి సార్..అంటూ నన్నతడు చాలా దూరం నడిపించాడు. ఇంకా ఎంత దూరమయ్యా అంటే.. అదిగో దగ్గరే. వొచ్చేశాం అని చెపుతాడేకానీ గార్డెన్ ప్లాట్స్ మాత్రం ఎక్కడా కనబడలేదు” చెప్పడం ఆపుతూ కప్పులో టీ ఓగుక్క చప్పరించాడు. శ్రోతలు ముగ్గురు శ్రద్ధగా వింటున్నారని గ్రహంచి మళ్ళా చెప్పసాగాడు. “చివరికా హెడ్మాస్టరు ఒక మైలు దూరంలో ఉన్న పెద్ద గుట్టలను చేత్తో చూపుతూ విద్యార్థుల గార్డెన్ ప్లాట్స్ ఆ గుట్టల అవతల ఉన్నాయి సార్. పడమటి గాలికి మొక్కలు పడిపోకండా ఉంటాయని గుట్టలకు అవతల గార్డెనింగ్ ప్లాట్స్ తయారు చేయించాను. ఎలావుంది సార్ నా ఐడియా అని ప్రశ్నించాడు కూడా ”
“తెలివైన హెడ్మాస్టరు” గట్టిగా నవ్వారు అందరూ.
“నేను ఎట్లాగూ గుట్టలెక్కి ఆవలివైపుకు వెళ్ళి చూడలేను. నిజానికి అక్కడ గార్డెనింగ్ ప్లాట్స్ ఏవీ లేవని నాకు తెలుసు. కానీ అది నిరూపించేందుకు ఆధారాలేవీ..?”
“నిజమే” అంది ఉకాని తల్లి. తలూపారు అతిథులు.
“మన పాఠశాలలన్నీ ఇట్లాగే ఏడుస్తాయి. వీటివల్ల మీలాంటి అధికారులకు తలనొప్పి కదూ..?” అన్నాడు మగ అతిథి నవ్వుతూ.
“అవును మిస్టర్ బీట్రిస్..! అయితే నల్లజాతి వాళ్లను ఉద్ధరించాలన్న ఎజండా కింద యావత్ బరువునూ టీచర్ల నెత్తిన ఎత్తలేము. అట్లాని ఎవరమూ సోమరిగా ఉండలేము కదా! తెలివిగా అధికారులను మోసగించినంత మాత్రాన సరిపోదు. దానివల్ల మనకు స్వయం సమృద్ధి సాధ్యపడదు. ఆ హెడ్మాస్టరు పిల్లలతో గార్డెనింగ్ చేయించడం లేదు. పైగా ఆ సంగతి తెలివిగా దాచిపెడుతున్నాడు. అది తప్పు.. ”
***
ఉకాని తలుపు మూసి వెనుదిరిగాడు. డెస్క్ దగ్గరికి నడిచి మళ్ళా కొద్దిసేపు చదవాలని ప్రయత్నించాడు. లాభంలేదు .. ఇంక చదువు సాగదు. ఎదురుగా తెరిచివున్నకిటికీ అతన్ని ఆకర్షించింది. ‘కిటికీ లోంచి దూకి బయటికి పోతేనో..? అదీ లాభం లేదు.. కిటికీ చాలా ఎత్తు. పైగా మమ్మీకి తెలిస్తే అదో పెద్ద గొడవ’.
అతనికి హఠాత్తుగా అక్కయ్య టెబొహో గుర్తొచ్చింది. అక్క ఇప్పుడేం చేస్తూంటుంది..? బహుశా తన గదిలో ఓ ఖైదీలా కూర్చొని దిక్కులు చూస్తూ ఉంటుంది. ఈ మధ్య మమ్మీకి, అక్కకి పడటంలేదు. తరుచూ గొడవపడుతూ వాదులాడుకుంటున్నరు. రానురాను ఇంట్లో మమ్మీ పెట్టే ఆంక్షలు మితిమీరిపోతున్నయి. అన్నీఆమె చెప్పినట్టుగానే జరగాలి. ఎదుటివాళ్ల ఇష్టాఇష్టాలను అస్సలు పట్టించుకోదు. వెళ్ళి అక్కతో కబుర్లు చెప్పుకోవాలనిపించింది. అక్కా తమ్ముళ్ళనే కాకుండా చిన్నప్పటి నుంచీ తామిద్దరూ మంచి స్నేహితులు. ఒకరిమీద ఒకరికి ఎంతో ప్రేమ’
హాల్లోంచి మళ్ళా బిగ్గరగా నవ్వులు వినిపించాయి. ఉకాని ఆలోచనల దండ పుటుక్కున తెగిపోయింది. అతడు తిరిగి తలుపు వద్దకు నడిచి ఇంతకుముందు లాగే కొంచెం తెరిచి చూశాడు. తల్లి అతిథులను మరోమారు ఛాయ్ తాగమని అడుగుతోంది.
“అబ్బే వద్దండీ..! థ్యాంక్యూ..” అన్నాడు బీట్రిస్. ఆ తర్వాత వాళ్లు మళ్ళా మాటల్లో పడిపోయారు. కలగాపులగంగా నవ్వులు.
“మీకు టీ కావాలా ఇన్స్పెక్టరు గారూ..?” అని మమ్మీ అడిగింది.
“నో థ్యాంక్స్ డార్లింగ్.. నో థ్యాంక్స్..! హ..హ..హ..హహ..” హ్యాండ్ కర్చిప్ తో పెదాలు తుడుచుకంటూ అదేపనిగా నవ్వాడు ఉకాని తండ్రి. “భలే సరదాగా గడిచిందీ సాయంత్రం” అన్నాడు తిరిగివెళ్ళి తన కుర్చీలో కూర్చుంటూ.
“మీ ఆతిథి మర్యాదలకు చాలా కృతజ్ఞతలు” అన్నాడు మిస్టర్ బీట్రిస్ జేబురుమాలు తీసి ముక్కు గట్టిగా చీదుకుంటూ.
“బేబీ టెబొహో..” కేకేసింది ఉకాని తల్లి లోపలికి చూస్తూ “ ఓసారి ఇట్లా వొచ్చి ఇక్కడంతా శుభ్రం చెయ్” అన్నది.
నిమిషం తర్వాత చేతిలో చిన్న ట్రేతో హాల్లో ప్రత్యక్షమైంది టెబొహో. బ్లూ జీన్ పాంటు మీద లైట్ రోజ్ కలర్ వొదులు టాప్ ధరించి ఉన్నదామె. “ఛాయ్ చాలా బాగుందమ్మా టెబొహో” మెచ్చుకున్నాడు మిస్టర్ బీట్రిస్. చిన్నగా నవ్వింది టెబొహో సిగ్గుపడుతూ.
“మీ యూనివర్శిటీ ఎప్పుడు తెరుస్తారమ్మా?”
“ఇంకా రెండువారాలుంది అంకుల్” బదులిచ్చింది.
“నువ్వు చాలా అదృష్టవంతురాలివి డియరీ..” మిసెస్ బీట్రిస్ ఉకాని తల్లి వంక చూస్తూ ప్రశంసాపూర్వకంగా అన్నది.
“నీ పిల్లలు చక్కగా చదువుకుంటారు.. బుద్ధిమంతులు”
“ఏం బుద్ధిమంతులు లెండి..” కూతురు వంక చురచురా చూస్తూ అన్నది డియరీ. కప్పులు సాసర్లు తీసుకొని టెబొహో వెళ్ళిపోయింది.
హాల్లో కొద్దిసేపు నిశ్శబ్దం. “ఒక్కోసారి దక్షిణాఫ్రికా యూదులను చూస్తుంటే నాకు చెడ్డ కోపంగా వుంటుంది” అన్నాడు బీట్రిస్ చర్చ తిరిగి ప్రారంభిస్తూ.
“ఎందుకనీ..?” ఆడవాళ్లిద్దరూ ఒకేమారు ప్రశ్నించారు.
“వాళ్లు పచ్చి హిపోక్రెట్స్. జర్మన్లు తమను చిత్రహింసల పాలు చేశారని ఓపక్క చెబుతూనే ఇక్కడేమో బోయర్లకు సాయం చేస్తూ రానురాను మన నెత్తిమీద కూర్చోబెడుతున్నరు”
“అట్లా అంటే నేనొప్పుకోను. మన ఆఫ్రికన్లతో నిజమైన స్నేహం చేసేవాళ్ళు కూడా ఉన్నారు” భర్తతో వాదనకు దిగింది మిసెస్ బీట్రిస్.
“మనమిట్లా కూర్చొని పనికిరాని రాజకీయాలు మాట్లాడుకునేకంటే చక్కటి సంగీతం వినొచ్చుకదా..” మెరుస్తున్న కళ్ళతో ఆనందంగా అన్నది డియరీ “మా అబ్బాయి ఉకాని సీరియస్ గా సంగీతం నేర్చుకుంటున్నడు. వాడు వయోలిన్ చక్కగా వాయిస్తాడు. మంచి టాలెంటెడ్”
“అవునవును.. నేను మరిచేపోయాను సుమా..” అన్నాడు ఉకాని తండ్రి.
ఉలికిపడ్డాడు ఉకాని. ఏదైతే జరుగుతుందని భయపడ్డాడో అదే జరిగింది. చటుక్కున తలుపు మూశాడు. డ్రాయింగ్ రూము సంభాషణలతో సంబంధాన్నితెంచుకున్నాడు. గది మధ్యలో కొద్దిసేపు బొమ్మలా నిలబడ్డాడు. హఠాత్తుగా అతడు ఒంటరితనం ఫీలయ్యాడు. ఏదో తెలియని భయం ఆవహంచింది. ఉద్వేగంతో కలవరపడి పోయాడు.
బల్లమీద తెరచి ఉంచిన చరిత్ర పుస్తకం వైపు చూశాడు. కళ్లు పైకెత్తి టేబుల్ మధ్యలో గుండ్రంగా పడుతున్న రీడింగ్ ల్యాంప్ వెలుతురు మీద దృష్టి సారించాడు. అతనికి తన ప్రియమిత్రుడు డోక్షి గుర్తుకొచ్చాడు.
ఇప్పుడు వాడేం చేస్తున్నాడో..! అన్నట్టు ఈరోజు శుక్రవారం కదా.. తప్పకుండా వాడు వాళ్ళ నాన్న హేర్ కటింగ్ షాపులో ఉండివుంటాడు. వాడి నాన్న చిన్నగా కూనిరాగాలు తీస్తూ కస్టమర్లకు హెయిర్ కటింగ్, షేవింగ్, ట్రిమ్మింగ్ చేస్తుంటే వాడలా చూస్తుండి ఉంటాడు. ఉకానితో ఎప్పుడూ అంటుంటాడు డోక్షి. పెరిగి పెద్దయ్యాక తనూ తండ్రిలా బార్బర్ అవుతానని. తండ్రి కటింగ్ చేస్తుంటే గచ్చుమీద గుత్తులు గుత్తులుగా రాలిపడే వెంట్రుకలను చూడటం అతనికి సరదా. అట్లా పోగైన జుట్టునంతా వారానికోసారి బయటికి తీసుకపోయి తగులబెట్టేవాడు డోక్షి.
ఉకాని కూడా అప్పుడప్పుడు అతనితో కలిసేవాడు. వెంట్రుకలు కాల్చడం ఇద్దరికీ అదో ఆటలా ఉండేది. మంటల్లో వెంట్రుకలు వేస్తుంటే అవి చిటపటమని కాలుతుంటే చూసేందుకు గమ్మత్తుగా వుండేది. డోక్షి ఉత్సాహంతో గంతులువేస్తూ కేకలు పెట్టేవాడు. వెంట్రుకల్ని కాల్చినప్పుడు వచ్చే చమురు కంపును ఏమాత్రం పట్టించునేవాడు కాదు.
పైగా కాలుతున్న వెంట్రుకలను చూసి పైన భగవంతుడు సంతోషిస్తాడని చెప్పేవాడు.
“మనిషికి జుట్టు దేవుడిచ్చింది కదా.. దాన్ని కాల్చివేయడమంటే దేవుణ్ణి ధిక్కరించినట్టే” అని ఉకాని వాదిస్తే డోక్షి హఠాత్తుగా సీరియస్ అయిపోయి “ ఈ ప్రపంచంలో పనికిరాని దేదైనా కాలి బూడిద కావాల్సిందే. దాన్నిచూసి దేవుడు సంతోషించాల్సిందే” అనేవాడు.
ఉకాని కెందుకో తన టేబుల్ మీదున్న పుస్తకాలన్నీ వెంట్రుకల మాదిరి తగలబడిపోతుంటే చూడాలనిపించింది. ఆ క్షణంలో తన ఆలోచన విపరీతంగానూ, హాస్యాస్పదంగానూ అతనికి అనిపించలేదు. టేబుల్ ల్యాంపును బాగా కిందికి వొంచి పుస్తకాలకు తాకించాడు. అట్లా ల్యాంపుతో కాగితాలు అంటుకోవని అతనికా క్షణంలో స్పురించలేదు.
అతని చూపు వయోలిన్ మీద పడి మనసునిండా దిగులు ఆవరించింది. కాసింత సంతోషాన్ని.. అదే సమయంలో గూడుకట్టిన బాధను ఏకకాలంలో కలిగించే మంత్రదండంలా వయోలిన్ అతని కళ్ళకి కనబడింది. అతడు కొద్దిసేపు రెప్పలార్పకుండా దానివంకే చూశాడు. అట్లా చూస్తుంటే అప్పుడప్పుడూ ఎర్ర డ్రస్సులో మెరిసిపోతూ వచ్చే తమ క్లాసు టీచరు మిస్ ఎండే గుర్తొచ్చింది. అతిథులొచ్చిన ప్రతిసారీ ఉకానికి ఇల్లు ఒక జైలులా మారుతుంది. నాలుగు గోడల మధ్య అతడో ఖైదీ అయిపోతాడు. ఇంట్లోంచి పారిపోవాలని ఉంటుంది. కానీ అది సాధ్యపడదు. వొచ్చిన అతిథులకు కొడుకు సంగీత ప్రావీణ్యం గురించి వివరించి చెపుతుంది తల్లి. అంతేకాదు, వచ్చినవాళ్లను వెంటేసుకొని కొడుకు గదికి తీసుకువస్తుంది. చదువులోనో, వయోలిన్ ప్రాక్టీసులోనో ఉండే ఉకానికి అవి మానేసి అతిథులను తన సంగీతంతో సంతోషపెట్టవలసి వస్తుంది. ఉకానికి ఇదంతా చీదరగా వుంటుంది. సంగీతం గురించి తెలియనివాళ్ళకి, అసలా అభిరుచి ఏమాత్రం లేనివాళ్ల ముందు ప్రదర్శన చేయడమంటే అతనికి అసహ్యం. తల్లికి భయపడి ఆ హింసను భరిస్తూ నిస్సహాయుడవుతాడు. ఇప్పుడీ అతిథి మహాశయులు ఎలాంటివారో..! అసలు వయోలిన్ రాగమంటే కనీసం తెలుసునో లేదో...! వాళ్ళిప్పుడు తన గదికి వొస్తారేమో..! అవును..మమ్మీ తప్పకుండా తీసుకొస్తుంది.
వాళ్ల ముందు వయోలిన్ వాయించను అంటే ఏం చేస్తుంది మమ్మీ ..? కోపంతో రెచ్చిపోతుంది. ఆ కోపంలో తల్లి తిట్టే తిట్లు ఎలాంటివో ఉకానికి తెలుసు. ఆమె సంగతి తెలిసీ ఆమె మాటఎట్లా జవదాటగలడు..? తనకు యిష్టమున్నా.. లేకపోయినా ఫిడేలుచేత రాగాలు పలికించక తప్పదు. ఉకాని భారమైన మనసుతో ఓమారు గదినంతా పరికించి చూశాడు.
నిజానికి అతని గదిలో ఎన్నోసౌకర్యాలున్నయి. చదువుకోవడానికి, రాసుకోవడానికి చక్కటి అనువైన టేబుల్. ఎన్సైక్లోపీడియా బ్రిటానికాతో సహా అలమర నిండా రకరకాలైన పుస్తకాలు. బల్లమీద మంచి రీడింగ్ ల్యాంప్, టైమ్ పీస్, రెండు ఈజీ ఛైర్లు, బట్టల కోసం వార్డురోబ్, కేవలం తనకోసమే పోర్టబుల్ ట్రాన్సిస్టర్, మ్యూజిక్ స్టాండ్, చెస్ బోర్డు, క్యారమ్స్.. గదినిండా కావాలసినవన్నీ ఉన్నాయి.
ఉకాని ఎంత అదృష్టవంతుడో,అతని కోసం తాము ఎన్ని సౌకర్యాలు సమకూర్చిపెట్టామో తల్లి అలసట లేకుండా ఎప్పుడూ చెపుతూనే వుంటుంది. “చూడరా ఉకానీ..! నీకున్నన్ని సౌకర్యాలు మొత్తం సొవిటోలో మరే పిల్లవాడికి లేవు. ఇట్లాంటి గది నీ ఈడు పిల్లలెవరికైనా ఉన్నదేమో చూపించు. అసలు నీగది ఏ తెల్లజాతి పిల్లవాడి గదికి తీసిపోదు తెలుసా..? నీకోసం మేము ఇన్నిచేసినా నువ్వుమాత్రం కృతఘ్నడివిరా. నామాటంటే నీకు లెక్కలేదు. నా అదుపాజ్ఞల్లో నడుచుకోవు” అంటూ మందలిస్తుంది.
కానీ ఈ సౌకర్యాలేవీ అతని బాధను నివారించేవి కాదు. మనిషికి కావాల్సిన స్వేచ్ఛ లేకపోయాక ఎన్ని వుండీ ఏం లాభం..?
ఒకరోజు క్లాసులో లెక్కల టీచరు మసికో చెప్పిన మాటలు అతనికి గుర్తుకొచ్చాయి.
“పిల్లలూ.. ఈ ప్రపంచంలో మనిషికి ముఖ్యంగా కావాల్సింది స్వేచ్ఛ. ఆకలితో నకనకలాడి పోతున్నా వీధుల్లో స్వేచ్ఛగా తిరిగే కుక్కలా బతకడమే నాకు ఇష్టం. తెగబలిసినా సరే.. బందీగా ఉంటూ మెడకు గొలుసు బరువుతో కంగిపోయే కుక్కలాంటి బతుకు వొద్దు. మేము మీ దేశానికొచ్చాకే మీ బతుకుల్నిబాగుచేశాం. ఆఫ్రికాలో అందర్లోకి మీ జాతివాళ్ళు గొప్పగా బతుకుతున్నారంటూ తెల్లోడు చెప్పే మాయమాటలు నమ్మకండి. అవన్నీఅబద్ధాలు. తెల్లవాడు ఒక మేకవన్నెపులి. వాడు శాశ్వతంగా వెళ్లిపోతేనే మనం నిజంగా బాగుపడేది” అంటూ ఆయన చేసిన ప్రసంగానికి పిల్లలంతా కరతాళధ్వనులు చేశారు. కొందరు ఆవేశంతో దేశభక్తి గీతాలు పాడారు.
కానీ ఆ తర్వాత రెండు వారాలకే దారుణం జరిగిపోయింది. మసికో టీచరుని పోలీసులు ఎన్కౌంటర్ చేశారు.
ఆరోజు ఉదయం ప్రార్థన సమయంలో ప్రిన్సిపాల్ ఈ సంగతి చెప్పాడు. మసికో టీచరు తిరుగుబాటు ధోరణిని ఆయన చాలా తీవ్రంగా విమర్శించాడు. అతడో దేశద్రోహి అని చిత్రిస్తూ ప్రిన్సిపాల్ తన ప్రసంగంలో ఆవేశపడ్డాడు. “విచ్చలవిడిగా తిరుగుతూ ప్రతి మురికిలోనూ మూతిపెట్టే వీధికుక్క చాలా ప్రమాదకరమైన జంతువు. అది కొత్త రోగాలను వ్యాపింప జేస్తుంది. అంచేత అట్లాంటి కుక్కను వెంటనే రాళ్ళతో కొట్టి చంపాలి. ఏం చెయ్యాలీ..?” అనిచెపుతూ ఆగి చుట్టూ చూశాడు.
“రాళ్ళతో కొట్టి చంపాలి” కోరస్ గా అరిచారు పిల్లలు.
ప్రిన్సిపాల్ మాటలు ఉకానికి ఆవేశం కలిగించాయి. 'మసికో టీచరు ప్రమాదకరమైన కక్కలాంటివాడని ఆయన అభిప్రాయమా? అయినా మసికో టీచరు మీదికి రాళ్ళు విసురుతారా ఎవరైనా? ఎవరూ చేయరా పని'
హాల్లోంచి నవ్వులు వినిపించి మంచుముద్దతో కొట్టినట్టు ఉలికిపడ్డాడు ఉకాని. భారంగా నిట్టూర్చి మంచంలో చతికిలబడిపోయాడు. తనకు కల్పించిన సౌకర్యాలు, పెడుతున్న ఖర్చు గురించి తల్లి మాటిమాటికి గుర్తు చేయడమెందుకో ఉకానికి అర్థం కాదు. మనిషిని మాటలతో పొడవడం ఆమెకు బాగా చేతనవును.
ఒకరోజు ఉకాని స్కూలుకు వెళుతూ వెంట వయోలిన్ తీసుకపోయాడు. స్కూల్లో పిల్లలెవరికీ వయోలిన్ వాయించడం రాదు. కొందరికైతే అసలు అదంటే తెలియదు కూడా. ఉకాని వయోలిన్ వాళ్లకో విచిత్ర వస్తువులా తోస్తుంది. తెలిసిన ఒకరిద్దరు పిల్లలు అతని దగ్గరికొచ్చి ఫిడేలు మీద మంచి పాటలు వినిపించమని అడుగుతారు. ఆవేళ్ళ మధ్యాహ్నం ఉకాని టాయిలెట్ కు వెళ్లొచ్చేసరికి అతని వయోలిన్ కనిపించలేదు. క్లాసులో అందరినీ అడిగాడు. ఎవరూ మాట్లాడలేదు. స్కూలు వొదిలాక అంతా ఇళ్ళకి వెళ్ళిపోయారు. అతని వయోలిన్ మాత్రం దొరుకలేదు. ఉకానికి కంగారెక్కువైంది. అది లేకుండా మ్యూజిక్ క్లాసుకి ఎలా వెళ్తాడు..? వయోలిన్ ఏమైందంటే తల్లికి యేమని చెపుతాడు..? దిగులుగా క్లాసు బయటికొచ్చాడు. అక్కడ అతనికోసం మిత్రుడు డోక్షి ఎదురుచూస్తూ కనబడ్డాడు. మ్యూజిక్ క్లాసుకి వెళ్లాల్సినరోజు తప్ప మిగతా అన్ని రోజులూ మిత్రులిద్దరూ స్కూలు నుంచి కలిసే ఇంటికి వెళ్తారు.
“నా వయోలిన్ కనిపించడం లేదురా దాన్నెవరో దొంగలించారు” విచారంగా చెప్పాడు ఉకాని.
డోక్షి మిత్రుని వైపు సానుభూతిగా చూశాడు. వివరాలు అడుగలేదు. స్నేహితుని కష్టమేమిటో అతనికి తెలుసు.
కొద్దిసేపు మౌనం తర్వాత అన్నాడు “నీ కెవరిమీదనైనా అనుమానం ఉన్నదా..?”
“లేదు కానీ, క్లాసు అంతా కూడబలుక్కొని కుట్ర చేశారని అనిపిస్తుంది. ఎందుకో తెలియదు నేనంటే క్లాసులో అందరికీ ద్వేషమే”
“నీతో ఇదే చిక్కురా ఉకానీ..! మరీ సున్నితంగా ఉంటావు. ఇట్లా నాకు జరిగితే నేనైతే ఊరుకునేవాణ్ణి కాదు. మీలో వయోలిన్ కొట్టేసిన పిరికిపంద ఎవడో నాచేతికి చిక్కితే వాణ్ని తుక్కుకింద కొట్టేస్తాను అని అందరికీ వార్నింగ్ ఇచ్చేవాణ్ణి. నాకైతే మీ క్లాసులో ఉన్నారే.. ఆ నలుగురు ఆకతాయి అడ్డగాడిదల మీదే అనుమానం. వొట్టి రౌడీ వెధవలు. వాళ్ళంటే స్కూల్లో అందరికీ భయమే. దున్నపోతుల్లా వొళ్ళు పెంచారు తప్ప తెలివితేటలు శూన్యం. కానీ వాళ్ళు నా జోలికి మాత్రం రారులే. ఎందుకంటే మా అన్నయ్యల గురించి ఆ వెధవలకు బాగా తెలుసు. పిచ్చివేశాలేస్తే మావాళ్ళు సున్నంలోకి ఎముక మిగలనివ్వరు”
“ప్రిన్సిపాల్ తో చెపుదాం పద” అన్నాడు ఉకాని. అంతలోనే మనసు మార్చుకొని “ఆయన లాభం లేదులే” అన్నాడు. ప్రిన్సిపాల్ కూడా అప్పుడెప్పుడో తమ ఇంటికి అతిథిగా వొచ్చి తన వయోలిన్ రాగం విన్నవాడేనని గుర్తొచ్చి “ వొద్దులే.. ఆయనతో చెప్పొద్దు” అన్నాడు. ఈలోగా ఇంకా ఇంటికి వెళ్ళిపోకుండా నిలబడి మాట్లాడుకుంటున్న అమ్మాయిల ముందుకు వెళ్ళి వయోలిన్ గురించి దబాయించి అడిగాడు డోక్షి.
వాళ్ళు మొత్తం నలుగురు ఉన్నారు. వారిలో ముగ్గురు ఉకాని, డోక్షి ఈడువాళ్ళే. నాలుగో అమ్మాయి తాప్సానా అందరికంటే పెద్దది. ఉకాని ముందుకొచ్చి అన్నది “ఇన్నిరోజులకు భలే చిక్కావు ఉకానీ..! కమాన్.. నాదగ్గర కొచ్చి నాకో ముద్దు ఇస్తే నీ వయోలిన్ ఎక్కడున్నదో చెపుతాను"అన్నది చిలిపిగా. ఈ మాటకి మిగతా అమ్మాయిలు బిగ్గరగా నవ్వడంతో తలకొట్టేసినట్టయింది ఉకానికి. తెలిసి తెలిసి ఆ వెకిలి పిల్ల జోలికి పోయినందుకు చింతించాడు.
“ఒరే ఫిడేలబ్బాయి.. నీ ఫిడేలు ఎవరు తీశారో నాకు తెలుసు. కంగారుపడకు. దాన్ని మీ ఇంటికి భద్రంగా చేర్చేబాధ్యత నాది. కానీ దానికి బదులుగా నువ్వు నాకో ముద్దు ఇవ్వాలి. లేదా నేనే నిన్నుముద్దు పెట్టుకుంటాను. ఏమంటావు..” అంటూనే తాప్సానా ఒక్కడుగు ముందుకేసింది. ఉకాని భయంగా వెనక్కి జరిగాడు. ఇదంతా చూస్తున్న డోక్షికి కోపమొచ్చింది.
“నువ్వు ఉండరా ఉకానీ! ఈ పోకిరిదాని సంగతి నేను చూసుకుంటాను” అంటూ ఆమె మీదికి పోయాడు.
ఉకాని అతన్ని వారించి “వొద్దురా డోక్షీ.. గొడవెందుకు. పద వెళ్ళిపోదాం” అన్నాడు. ఇద్దరూ ఇంటిముఖం పట్టారు. ఉకానికి తోవ పొడుగునా తాప్సానా మాటలే మనసులో మెదిలాయి. ఆమె చెప్పింది నిజమైతే వయోలిన్ భద్రంగా ఇంటికి చేరుతుంది. అందుకోసం వేచి చూడాలి. వయోలిన్ పోయిన విషయం ఇంట్లో ఎవరికీ తెలియదు. ఉకాని చెప్పలేదు. ఎవరూ దాని సంగతి ఎత్తలేదు.
మరునాడు పొద్దునే తల్లి పెద్దగా వేసిన కేకలకు మెళుకు వొచ్చింది ఉకానికి. ఆమె సుడిగాలిలా అతని గదిలోకి దూసుకొచ్చి అతడు కప్పుకున్న దుప్పటిని విసురుగా లాగిపారేసింది. ఉలికిపడుతూ లేచి కూర్చున్న ఉకానికి తల్లి చేతిలో తన వయోలిన్ దర్శనమిచ్చింది.
దాన్నిచూసి ఆశ్చర్యపోయాడు. తాప్సానా చెప్పినట్టుగానే ప్రత్యక్షమైంది వయోలిన్. ఎట్లా వొచ్చింది..? ఎవరు తెచ్చిఇచ్చారు..?
తల్లి రౌద్రాకారం చూస్తే వయోలిన్ అట్లాగే ఎత్తిపెట్టి తన నెత్తిమీద కొడుతుందని భయమేసింది. ఆమె అప్పటికే యునిఫారం అవతారం
ఎత్తినదంటే డ్యూటీకి రెడీ అయిందన్నమాట. డే డ్యూటీ ఉన్నరోజున ఆమె చీకటితోనే లేచి తయారైపోతుంది.
“ఉకానీ ” పిలుపు కాదది పిడుగుపాటు “ఏమిటీ నిర్లక్ష్యం?ఎందుకు చేశావిలా..? నామీద పగ తీర్చుకోవాలనుకుంటున్నవా.. నిజం చెపుు. లేదా ఈవేళ నిన్నుచంపేస్తాను”
“ఏమిటా అరుపులు..! ఏం జరుగుతుంది ఇంట్లో..?” అంటూ తండ్రి కూడా గదిలోకి వొచ్చేశాడు.
“ఇదిగో.. ఇది చూశారా..?” భర్తకేసి తిరిగింది డియరీ. ఈ వయోలిన్ నాకు బయట వీధిలో దొరికింది. డ్యూటీకి వెళుతూ గుమ్మం దాటానో లేదో ఎదురుగా ఇది కనిపించింది. సంగతేమిటో మీ కొడుకుని అడుగుతున్నా”
“ఏరా ఏమిటీ పని? వయోలిన్ బయటెందుకు పడేశావు..?" ఉకాని వైపు తీక్షణంగా చూస్తూ ప్రశ్నించాడు తండ్రి.
“నాకేం తెలియదు. నేను పడెయ్యలేదు డాడీ”
“ నోర్ముయ్..” గొంతు చించుకున్నది తల్లి. “అబద్ధాలు చెప్పకు వెధవా..! మమ్మీనే మోసగిస్తావా.. నిన్నూ..”
“ఒక్క నిమిషం ఉండవే” తండ్రి అడ్డు వచ్చాడు. “వాడు చెప్పేది కూడా విందాం. ఏం జరిగిందో నువ్వే చెప్పరా”
ఉకానికి నీరసం ఆవహించింది. గొంతులోంచి మాట పెగల్లేదు. అతనికేమీ చెప్పాలనిపించలేదు. తల్లి తిట్టిన తిట్లు మనసును గాయపరిచాయి. ఉకాని ఆవేదన కన్నీళ్ల రూపంలో బయటికొచ్చింది. ఇంత గొడవకు కారణమైన వయోలిన్ అతని పక్కనే
మంచం మీద మూగవేదన పడుతుంది. దాని వేదన వినగలిగాడు ఉకాని.
“నువ్వే వయోలిన్ కావాలనే బయట పారేశావు. చెయాలిసిందంతా చేసి ఇంకా దొంగ ఏడుపులెందుకు ” చీదరించుకుంటూ వెళ్ళిపోయింది తల్లి. అసలు నిన్న స్కూల్లో ఏం జరిగిందో ఆమెకు తెలియదు. నిజమేదో తెలుసుకోవాలనే మనిషి కూడా కాదామె.
వయోలిన్ కారణంగా అతనికెప్పుడూ ఏదోవిధంగా అవమానాలు తప్పటం లేదు. ఈ రోజు మళ్ళా తనను మానసికంగా హంసించేందుకు రంగం సిద్ధమైంది. బయట అతిథులుగా వచ్చిన అపరిచితుల ఎదుట తాను సంగీతం వినిపించాలి. అది తనకు కష్టం. తన కష్టం అంటే వయోలిన్ కష్టం. వయోలిన్ బాధ తన బాధ. కొద్దిసేపు చీకాకు మరిచిపోదామని పుస్తకం చేతిలోకి తీసుకున్నాడు. ‘దక్షిణాఫ్రికా చరిత్ర’ లోని ఒక అధ్యాయం తెరిచాడు. ‘దక్షిణాఫ్రికాలోకి తెల్ల జాతీయుల ఆగమనం.’ కాస్సేపు చదవాలని కుస్తీ పట్టసాగాడు.
వారానికి మూడురోజులు టౌనులో సంగీత క్లాసులకు వెళతాడు ఉకాని. వయోలిన్ పట్టుకొని అలా వీధుల్లో నడిచివెళ్లాలంటే అతనికి ప్రతిసారీ ఒక గండమే. ముఖ్యంగా మపోన్యా షాపింగ్ కాంప్లెక్స్ వద్దకు వొచ్చేసరికి అతని కాళ్ళు తడబడుతాయి. షాపు ముందు గుంపుగా కొందరు రౌడీ యువకులు ఉకాని కోసం సిద్ధంగా వుంటారు. అతన్ని చూడగానే
“వయోలిన్ మాస్టారు వస్తున్నాడురోయ్” అంటూ ఎగతాళి చేస్తారు.
ఒక రోజైతే వాళ్ళ అల్లరి తారస్థాయికి చేరుకున్నది. ఆ రోజు గుర్తుకొస్తే ఉకానికి ఇప్పటికీ భయమేస్తుంది. ఎప్పుడూ దూరం నుంచే గోలచేసే వాళ్లంతా ఆ దినం ఉకాని చుట్టూ కమ్ముకొని వేధించడం మొదలెట్టారు. వాళ్ల నడుమ బెదురుచూపులు చూస్తూ ఉకాని నిల్చుండిపోయాడు.
“ఏమోయ్ సంగీత చక్రవర్తీ.. బాగున్నావా..?” అన్నాడు గుంపుకు నాయకునిలా కనిపించే ఒకడు.
“నీ సంగీతానికి రాళ్ళు కరుగుతాయట నిజమా మాస్టారూ..?” మరొకరు.
“రాళ్లు వొద్దు గానీ సంగీతానికి చింతకాయలు కూడా రాలుతాయట కదా.. ముందు వాటిని రాలగొట్టు” ఇంకొకడు.
ఎవరికీ జవాబివ్వలేదు ఉకాని. గుంపులోంచి దారిచేసుకొని నెమ్మదిగా ముందుకు సాగిపోయాడు. వాళ్ళు వెనుకనుంచి ఏవేవో కూతలు కూస్తూనే వున్నారు. కానీ అది అంతటితో పోలేదు. ఆ సాయంత్రం ఉకాని ఇంటికి తిరిగొస్తుంటే చౌరస్తా దగ్గర మలుపు తిరిగేసరికి రౌడీమూక అతని కోసమే ఎదురుచూస్తూ కనిపించింది. ఉకాని కనబడగానే “ బాబూ.. ఓ ఫిడేలు బాబూ.. నీ పేరేమిటీ?” అని కోరస్ గా అరుస్తూ వెనుకపడ్డారు. వాళ్ళు రోడ్డుకు అడ్డంగా ఉకానిని కవర్ చేస్తూ నిలబడ్డారు. అతన్ని ఆటపట్టిస్తూ యేవో పాటలు పాడసాగారు. ఊళ్ళో పేరుమోసిన రౌడీమూక అది. వాళ్లను ఎవరూ ఏమీ అనే ధైర్యం ఎవరికీ లేదు. ఉకాని అక్కణ్నుంచి పారిపోవాలనుకున్నాడు. కానీ తను పరిగెడితే వాళ్ళు వెంటతరిమి పట్టుకునేలా వున్నారు. అప్పుడిక వాళ్ళు మరింత రెచ్చిపోతారు. అందుకని నిలబడటమే మంచిదనుకున్నాడు. గుంపులో వాళ్ళు తలోమాట అంటూ ఉకానిని ఏడిపిస్తున్నారు. అక్కడ జనం వినోదం చూసేవాళ్లే. ఉకానిలో అవమానం, రోషం..
దానివెనుకే ఎమీచేయలేని నిస్సహాయత. కొద్దిసేపటి నుంచి అక్కడ జరిగేది చూస్తున్న ఒక పెద్దాయన ఇక సహించలేక కలుగజేసుకున్నాడు.
“ఏమిటీ అల్లరి?ఎవరు మీరంతా? ఆ కుర్రవాణ్ణి ఎందుకలా ఏడిపిస్తున్నారు? అందరూ ఇక్కణ్నుంచి వెళ్లిపోండి” అన్నాడు మందలిస్తూ.
“నీకెందుకు పెద్దమనిషీ.. నీ దారిన నువ్వు పోరాదూ..” వాళ్లలో లీడర్ భూకా గట్టిగా కసిరాడు.
“అవునూ.. ఈ పోరడు నీకేమైతడు తాతయ్యా?” మరొకడు దీర్ఘం తీశాడు.
"వీడు నీ మనుమడా తాతగారూ?”
“తాతయ్యకి సంగీతం పిచ్చి ఉన్నట్టుందిరోయ్ ”
“మనుమడు నేర్పుతున్నాడేమో..”
జనం కూడా వీళ్ల మాటలకు నవ్వడంతో పెద్దాయన అవమానపడి వాళ్ళ వంక తీక్షణంగా చూశాడు.
“అట్లా నవ్వుతారెందుకరా..? మీరసలు మనుషులేనా..? పనికిమాలిన వెధవలంతా కలిసి ఓ కుర్రవాణ్ణి బజార్లో వేధిస్తుంటే చోద్యం చూస్తున్నారా..? మీకు సిగ్గులేదూ? రేయ్ అడ్డగాడిదలు.. ఏమిట్రా అన్నారూ? తాతయ్యనా..? అవును.. నా మనుమలకు నేను తాతనే. మీలాంటి రౌడీ వెధవలకి కాదు. మీకు తాతయ్యలంటూ వుంటే మీలాంటి మనవలున్నందుకు ఎప్పుడో ఉరేసుకొని చచ్చేవాళ్ళు. థూ.. సిగ్గులేని జన్మలు” చీదరించుకొని అక్కణ్ణుంచి వెళ్లిపోయాడతను.
ఉకానిలో మళ్ళా పిరికితనం ఆవరించింది. తాతగారి తిట్లకు బాగా రెచ్చిపోయారు వాళ్ళు. భూకా కోపంతో ముందుకొచ్చి ఉకాని షర్టు కాలరు పట్టుకొని గట్టిగా గుంజాడు. విడిపించుకోవాలని చూశాడు ఉకాని. భూకా పట్టును మరింత బిగించి ఉకాని చెంపమీద చెళ్ మని కొట్టాడు. దెబ్బకి ఉకాని కళ్ల వెంట నీళ్ళు తిరిగాయి. భూకా చేతిలో కాలరు గట్టిగా బిగుసుకున్నది.
మరోసారి చెంప పగలగొట్టాడు భూకా. “చెప్పురా రాస్కెల్..! నీకో అక్క వున్నది కదూ..? ఎక్కడుంది ఇప్పుడది..? నాకు మీ అక్క కావాలి. దాంతో పడుకోవాలని ఉందిరా. వింటున్నావా.. నా పక్కలోకి నీ అక్క కావాలి. ఈ సంగతి దానికి చెప్పు” కాలరొదిలేసి ఉకాని జుట్టు పట్టుకున్నాడు భూకా. తలను అటూఇటూ ఊపాడు. “రేయ్ నేను మీ అక్కతో పడుకున్నప్పుడు నువ్వక్కడే వుండి వయోలిన్ వాయించాలి. చెప్పరాబుజ్జీ .. అప్పుడు ఏపాట పాడతావో చెప్పు..”
భూకా మాటలకు పెద్దగా నవ్వారు జనం. ఎంత అణుచుకున్నాఉకానికి దుఃఖం తన్నుకొచ్చింది. అవమానంతో అతని మనసు దహించింది. ఇంక తను జన్మలో వయోలిన్ ముట్టుకునే ప్రసక్తి లేదన్న నిర్ణయానికొచ్చాడు. ఇంటికెళ్లగానే మమ్మీకి ఈ విషయం చెప్పేయ్యాలని అనుకున్నాడు. మమ్మీ ఎంత సర్దిచెప్పినా తను ప్రతిఘటిస్తాడు. అవసరమైతే ఇంట్లోనుంచి వెళ్ళిపోతాడు గానీ వయోలిన్ మాత్రం ముట్టడు
“చెప్పు మాస్టారూ.. నేను మీ అక్కతో పడుకున్నప్పుడు నువ్వే పాట పాడుతావు..?”
తనను వదిలేయమని అర్థించాడు ఉకాని. “వొదిలేయాలా.. సరే పో..! రేపు వొచ్చినప్పుడు వెంట మీ అక్కను కూడా తీసుకరా”
ఉకాని కాలరు వొదిలేసి అతన్నిగట్టిగా వెనక్కి నెట్టాడు భూకా.
ఆ విసురుకు దూరంగా పడ్డాడు ఉకాని. చేతిలో వయోలిన్ మాత్రం వొదిలిపెట్టలేదు.
“రేయ్.. మరిచిపోక.. రేపు నీ అక్కను తీసుకొని రావాలి” వెనుక నుంచి అరుస్తున్నాడు భూకా. దాదాపు పరిగెత్తినట్టు నడిచి తమ వీధిమలుపు వద్దకు వొచ్చాడు. అక్కడ ఆగి వయోలిన్ తీసి పక్కనున్న చెత్తకుండిలోకి విసిరేశాడు. ఫిడేలు వల్లా, సంగీతం నేర్చుకోవడం వల్లా తను బయట ఎన్నిఅవమానాలు పొందుతున్నదీ, రౌడీలు తనను ఎట్లా వేధిస్తున్నదీ ఇంట్లో తల్లితో చెప్పాడు. అదే విసురులో వయోలిన్ వీధిలో పెంటకుప్పలో పడేసినట్టు కూడా చెప్పేశాడు. అయితే కొడుకును రౌడీలు వేధించడాన్నిఆమె తేలిగ్గా తీసుకుంది. అతడు ఫిడేలు పారేసి రావడం ఆమెకు నచ్చలేదు. అందుకు తీవ్రంగా మందలించింది.
“ఇవన్నీ మామూలుగా జరిగేవే. ఎవరో ఏదో అంటున్నారని వయోలిన్ పారేసి వొస్తావా.. బుద్ధుందా నీకు..?” అంది.
“నువ్వేమైనా చెప్పు మమ్మీ! నేనింక వయోలిన్ ముట్టుకోను. చక్కగా చదువుకుంటాను. నువ్వు నాకు ఇంకో ఫిడేలు కొనిచ్చినా నేనది పట్టుకొని బయటకు వెళ్లను”
“పిచ్చిపట్టిందా..! వీధిలో మొరిగే కుక్కలను పట్టించుకుంటారా ఎవరైనా? గొప్పగొప్ప విద్వాంసులందరికీ ఇట్లాంటి అనుభవాలు తప్పలేదు. వాళ్ళు నీలాగే డీలా పడిపోయివుంటే సంగీత సామ్రాట్ యెహుడీ మేనుహీన్ ఈరోజు ఇంత మహా విద్వాంసుడయ్యేవాడా చెపుు..? నువ్వు ఎవరి మాటలు లెక్కచెయ్యొద్దు. నీకు కొత్త వయొలిన్ కొనిపెడతాను. నువు సంగీతం నేర్చుకోవాలి అంతే..” ఆమె స్పష్టం చేసింది. ఆ మర్నాడే ఉకాని చేతికి కొత్త వయోలిన్ వచ్చింది. మళ్ళా సంగీత శిక్షణ మొదలైంది. వారంలో మూడు రోజులూ బయట వేధింపులు తప్పలేదతనికి.
అతని ఆలోచనలను చెదరగొడుతూ గది తలుపులు తెరుచుకున్నాయి. తల్లి లోపలికి తొంగిచూసి “ ఇదిగో.. మావాడు లోపలే వున్నాడు” అని చెపుతూ లోపలికొచ్చింది. ఆమె వెనకాలే అతిథులు గదిలోకి వొచ్చారు.
ఉకాని నిర్లిప్తంగా చేతిలో వున్న చరిత్ర పుస్తకంలోకి చూస్తుండిపోయాడు.
“బంటూ గిరిజనుల్లో ఐరోపా తరహా విద్య విధానాన్ని ప్రవేశ పెట్టినదెవరు..?” ప్రశ్నవరకే చదువగలిగాడు. గదిలోకి తండ్రి కూడా రావడాన్నిఅతడు గమనించాడు.
“ఉకా..!” మెల్లగా పిలిచింది తల్లి “ఈవేళ ఫిడేలు ప్రాక్టీసు చేయనట్టున్నావే..” అంది.
ప్రాక్టీసు చేయనందుకు తప్పుపడుతున్నదో లేక కొద్దిసేపట్లో జరగబోయే సంగీత వేధింపుల పర్వానికి ఉపోద్ఘాతమో ఉకానికి అర్థం కాలేదు. అతడు గదిలో అతిథులను అప్పుడే గుర్తించినట్టు చిన్నగా నవ్వాడు.
మిస్టర్ బీట్రిస్ అతన్నిచూస్తూ “ఏ బాబూ.. ఏమి చదువుతున్నావు” అని అడిగాడు.
“హిస్టరీ” చెప్పాడు ఉకాని.
“గుడ్..మంచి కుర్రాడివి” అభినందిస్తున్నట్టు భుజం తట్టాడు.
“మావాడు కలుపుగోలు మనిషి కాదు. కంచెం ఇంట్రావర్టు. సీరియస్ మైండెడ్” ఈమాటలు కొంచెం గర్వంగానే చెప్పింది తల్లి.
“నువ్వు చాలా లక్కీ డియరీ! మీ అబ్బాయి సీరియస్ మైండెడ్ మాత్రమే కాదు, స్టడీ మైండెడ్ కూడా” అంది మిసెస్ బీట్రిస్.
“ఇదిగో.. ఇదే మావాడి సంగీత సాధనం” గోడ కానించి పెట్టిన వయోలిన్ చూపుతూ అన్నాడు ఉకాని తండ్రి. అనడమే కాదు వెళ్ళి ఫిడేలు బయటికి తీశాడు. “ అంకుల్, ఆంటీ నీ సంగీతం వినాలని కుతూహల పడుతున్నరు. నువ్వు వాళ్ళని ఆనందింపజేయాలి ఉకానీ”
ఉకాని ఒక్కక్షణం తండ్రి చేతుల్లోని తన వయోలిన్ వంక చూశాడు. ఆయన అప్పటికే వయోలిన్ రాగాల గురించి అతిథులకు వివరించి చెబుతున్నాడు. “ఇది చాలా అరుదైన పరికరం” అన్నాడు తన చేతిలో సాధనాన్నిఎత్తిచూపుతూ.
"చూస్తుంటేనే తెలిసిపోతుంది. దీని ఖరీదు కూడా ఎక్కువే అనుకుంటా” అంది మిసెస్ బీట్రిస్.
“అవును.. చాలా ఎక్కువ”
“నన్నడిగితే పాఠశాల స్థాయిలో సంగీతాన్ని ప్రవేశపెట్టాలంటాను”
మీ ఈవోలంతా స్కూళ్ళలో సంగీత బోధన జరిగేటట్టు చూడాలి ఏమంటారు..?”
“నిజమే” ఒప్పుకున్నడు ఉకాని తండ్రి.
“కానీ ఇందుకు మనవాళ్ళే(బోయర్లు) ఒప్పుకోరే. పశ్చిమ దేశాల నాగరికత మనల్ని పాడుచేస్తుందని ఇప్పటికే గగ్గోలు పెడుతున్నారు”
“ఇప్పుడా రాజకీయాలు ఎందుకు గానీ మనవాడి సంగీతం విందాం” అన్నది తల్లి.
వయోలిన్ తీసి ఉకానికి అందించాడు తండ్రి. వొణికే చేతులతో అందుకున్నాడు. అతనికి ఆరోజు సాయంత్రం బజార్లో భూకా చూసిన ఎర్రటి చూపులు గుర్తొచ్చాయి. ఎగతాళిగా జనం నవ్వులు చెవుల్లో మారుమోగాయి. ఇంట్లో ఆగ్రహంచిన తల్లి ముఖం గుర్తుకొచ్చింది. అన్నిటినిమించి ఈ మధ్య తరుచుగా తనకొచ్చే ఒక పీడకల గుర్తుకొచ్చింది. తనను ఎవరో తరుముతున్నారు. తను ఒంటి మీద బట్టలు లేకుండా వీధుల్లో పిచ్చిగా పరిగెడుతున్నాడు. అదిచూసి జనం నవ్వుతున్నారు. తాను అట్లా బట్టలు లేకుండా ఎందుకయ్యాడో అతనికి అర్థం కాలేదు. అట్లాగే పరిగెడుతూ ఇల్లు చేరుకున్నాడు. తన అవతారాన్ని చూసి తల్లి విపరీతంగా తిట్టిపోసింది.
కల వొచ్చిన ప్రతిసారి అతడలా పరిగెడుతూ ఇల్లు చేరడం.. అక్కడితో కల ముగిసిపోతుంది.
ఉకాని మెల్లగా వయోలిన్ యెత్తి భుజానికి ఆనించుకున్నడు. అదతని భుజం మీద క్షణక్షణం బరువెక్కుతున్నట్టు అనిపించింది.
‘తాను వయోలిన్ వినిపించలేనంటూ వుంటే ఎందుకిలా అందరూ వేధిస్తారు? ఈ యాతనేమిటి తనకు..?"
అతని కళ్లు నీళ్ళతో నిండుకున్నాయి. ఏడవటం అతనికి ఇష్టం లేదు. కంటిరెప్పలని గట్టిగా మూశాడు. “మమ్మీ” అని కష్టం మీద పిలిచాడు.
“ఇంకా ఆలస్యమెందుకు మొదలుపెట్టు. ఈపూట నీ వయోలిన్ రాగాలతో అందరినీ పరవశింప చేయాలి. బ్రాహం, మొజార్ట్, లిస్జత్.. ఒకటేమిటి అన్నిరాగాలూ నువ్వీవేళ వినిపించి మన అతిథులను ఉర్రూతలూగించాలి” తల్లి ఉత్సాహంగా చెప్పుకపోతున్నది. ఆమె మనసులో అప్పుడే యేవో సంగీత ధ్వనులను ఊహించుకుంటూ తలవూపసాగింది. ఉకాని చెప్పేది వినిపించుకునేలా లేదామె.
అతనికి గట్టిగా అరవాలని ఉన్నది. కానీ మూగబోయినట్టు మాట బయటికి రాలేదు. అతడు కుదురుగా కూర్చోలేకపోతున్నడు. లేచినిలబడాలని ప్రయత్నించి విఫలమయ్యాడు. అక్కడున్ననలుగురు అది గ్రహించారు.
“ఏమైంది ఉకా.. ఎందుకలా ఉన్నావు..?” అడిగింది తల్లి.
“ఏంలేదు..బాగానే ఉన్నాను” కంగారుగా అనేశాడు ఉకాని. కానీ మనసులోని మాట చెప్పలేకపోయాడు. వచ్చిన అవకాశం పోయింది. ఎందుకలా భయపడిపోయాడు? తల్లి అడిగినప్పుడు వొంట్లో బాగాలేదని చెప్పివుంటే బాగుండేది. తనకీ సంగీత హింస తప్పేది. ఎదురుగా కూర్చొనివున్న అతిథుల మీద కోపమొచ్చింది. వాళ్ళ కారణంగానే తనకీ కష్టాలు.
ఇంతలో వంట గదిలోంచి పెద్ద శబ్దం వినిపించింది. ఏదో కిందపడి ముక్కలైనట్టున్నది. ఉకాని తల్లి ఒక్క ఉదుటున లేచింది.
“ఈ దరిద్రగొట్టు పిల్ల మళ్ళా ఏదో చేసినట్టుంది” పెద్దగా విసుక్కుంటూ లోపలికి వెళ్ళింది. నిమిషం తర్వాత గట్టిగా అరుస్తూ కిచెన్ లోంచి బయటికి వొచ్చింది. “ఓరి దేవుడో..! ఈ చుప్పనాతి పిల్ల కొంప ముంచేసింది నాయనో. అయ్యయ్యో.. ఎంత విలువైన వస్తువు. ఎంత ప్రేమతో కొన్నాను? ముక్కలు చేసేసింది. కావాలనే పగలగొట్టింది దొంగముండ. పైగా నామీదే అరుస్తున్నది. ఎంత పొగరు? ఈ ఇంట్లో స్వేచ్ఛఅనే మాటే అది మరిచిపోయిందట. ఇంకా ఏవేవో వాగుతున్నది తల్లిననే గౌరవం కాస్త కూడా లేకుండా..”
కొన్నిక్షణాలు అక్కడ ఇబ్బందికరమైన నిశ్శబ్దం నెలకొంది. అతిథులు ముఖాలు చూసుకున్నరు. తల్లి విచారవదనంతో వొచ్చి కూర్చున్నది.
“ఈ పిల్లల మనస్తత్వాలు ఎంతకీ అర్థం కావు డియరీ..” అన్నది మిసెస్ బీట్రిస్ అక్కడి వాతావరణాన్ని తెలికపరుస్తూ.
“అవును నిజమే” అన్నాడు ఆమె భర్త. గదిలో మళ్ళా నిశ్శబ్దం నెలకొన్నది.
“డామిట్.. అందరి మూడ్స్ పాడైపోయాయి. నీ సంగీతంతో అందరినీ మళ్ళా మామూలుగా చెయ్యాలిరా ఉకానీ” అన్నాడు తండ్రి.
“కానీ ! ఇక మొదలుపెట్టు" తొందర చేసింది తల్లి. ఉకాని పట్టించుకోకుండా అక్కయ్య గురించి ఆలోచించాడు. ఆమె దగ్గరకు పోవాలనిపించింది. అక్కా.. తానూ ఇద్దరం ఎవరికివారే ఒంటరివాళ్ళమనే భావం కలిగిందతనికి. తామిద్దరిదీ ఆంక్షల బతుకై పోయింది. ఈ ఆంక్షల వల్లే స్నేహితులను దూరం చేసుకున్నారు. ఫ్రెండ్స్ ఇంటికి రావడం మమ్మీకి డాడీకి అస్సలు ఇష్టముండదు. అట్లాగే తమనూ ఎక్కడికీ వెళ్ళనీయరు. డోక్షి కూడా అందుకే తనకు దూరమయ్యాడు.
“మన అంతస్తుకు సరితూగే వాళ్ళతోనే స్నేహం చెయ్యాలి” అని అంటుంది తల్లి. డోక్షితో తిరుగొద్దని ఖచ్చితంగా చెప్పిందామె.
"ఒక బార్బరు కొడుకుతో స్నేహమేమిటి అసహ్యంగా" అంటుంది.
గదిలో ఎదురుగా నలుగురూ ఉకానివైపే ఆసక్తిగా చూస్తున్నారు. ఉకాని చేతులు మాత్రం వయోలిన్ పైన కదలడం లేదు.
దాన్నలాగే గోడకేసి బాది గదిలోంచి పారిపోవాలని ఉన్నదతనికి. కానీ ఎక్కడికి వెళ్తాడు? ఊళ్ళో తెలిసిన వాళ్ళెవరూ లేరు. బంధువులు ఎక్కడో ఉన్నారు. ఉన్నా వాళ్ళు అతనికి అంతగా గుర్తులేరు. సెలవుల్లోనూ అక్కాతమ్ముళ్లకు ఎక్కడికీ వెళ్ళడానికి లేదు. జైలు మాదిరి ఎప్పుడూ ఇంట్లోనే గడపాలి. సెలవుల్లో చూట్టాల ఇండ్లకు వెళ్ళే తోటి విధ్యార్థులను చూసి అసూయ పడేవాడు.
“మనకు చుట్టాలెవరూలేరా మమ్మీ?” అని తల్లిని గుచ్చిగుచ్చి అడిగితే ఆమె సరైన జవాబు చెప్పేదికాదు. బంధువుల గురించి తల్లి ఓసారి డాడీతో అన్న మాటలు అతడెన్నటికీ మరిచిపోడు.
“ఈ చూట్టాలంటే నాకు చెడ్డ చిరాకు బాబూ..! తలుపులు తీసిపెడితే చాలు, చీమలబారులా వచ్చిపడతారు. అయినా ఈ రోజుల్లో
బంధువులను ఎవరు భరిస్తారు? ఖర్చు గురించి కాదుగానీ వాళ్ళో పెద్ద న్యూసెన్స్. తెల్లవాళ్ళు ఈ విషయాన్నిఎప్పుడో గ్రహించారు. కాబట్టే బంధువులను దగ్గరికి రానివ్వరు. మన ఇల్లు నీటుగా వుండాలంటే ఈ బంధువులూ అదీ పెట్టుకోగూడదు” అన్నది.
బంధువుల పట్ల తన మిత్రుడు డోక్షి అభిప్రాయం దీనికి పూర్తిగా భిన్నం. అతనికి చూట్టాలన్నా స్నేహితులన్నాఇష్టం. అతడనేవాడు – “మనకు ఎక్కువమంది చుట్టాలు, స్నేహితులు వుంటే బాగుంటదిరా. ఇంట్లో మనకు ఏదైనా గొడవొచ్చినా ఎవరో ఒక చుట్టం యింటికి వెళ్ళి ఉండిపోవచ్చు. అప్పుడు మమ్మీ, డాడీ మనకోసం బంధువుల ఇళ్ళన్నీగాలిస్తారు. మనం ఒకరి ఇంట్లో కనిపించామనుకో.. ఆ సందర్భంగా పెద్దవాళ్ళు కలుసుకొని ఆప్యాయంగా మాట్లాడుకుంటారు. అదెంత బాగుంటుందీ..!”
“రేయ్ ఉకానీ..! ఏం ఆలోచిస్తున్నావు?” తల్లి గద్దింపుకి ఉలికిపడి ఈ లోకంలో కొచ్చాడు.
“ఇంకెంతసేపు ఎదురు చూడమంటావు..? సంగీతం మొదలుపెట్టు” ఉకాని మాట్లడకుండా వయోలిన్ పక్కనబెట్టాడు తనకు వాయించే ఉద్దేశ్యం లేనట్టుగా. అతనికి ఒక్కసారిగా నీరసం ఆవహించింది. మెల్లగా లేచి నిలబడ్డాడు. శక్తి కూడదీసుకున్నట్టుగా అన్నాడు
“నేను వయోలిన్ వాయించలేను మమ్మీ.. సారీ..!”
ఒక్క క్షణం అంతా ఆశ్చర్యపోయారు. భర్త మొహంలోకి చూరుక్కుమని చూసింది తల్లి. మరోక్షణంలో గట్టిగా అరిచింది.
“ఎందిరా అన్నావూ?”
“నాకు వయోలిన్ ఇష్టం లేదు. అసలు నాకు సంగీతమే వొద్దు. నేనిక వయోలిన్ ఎప్పటికీ ముట్టుకొను” స్పష్టం చేశాడు ఉకాని. అట్లా అన్న తర్వాత ఆశ్చర్యపోయాడు తనకు అంత తెగింపు ఎట్లా వొచ్చిందాని.
“నోర్ముయ్..” తల్లి అరుపుతో గది దద్దరిల్లింది.
“పిచ్చిపిచ్చిగా మాట్లాడకు. నువ్వు వయోలిన్ వాయిస్తున్నావు అంతే..”
“సంగీతం వినిపించరా అంటే ఏమిట్రా నీలుగుతున్నావు? ముందా వయోలిన్ తీసుకో” తండ్రి గద్దించడంతో ఉకాని కాస్త బెదిరాడు.
“పిల్లవాడికి వంట్లో బాగాలేదేమో” అన్నది మిసెస్ బీట్రిస్.
“వాడికేం రోగం.. బాగానే వున్నాడు. సంగీతం వినిపించరా అంటే అంత పొగరా..?” అన్నది తల్లి నిప్పులు కురిసేలా చూస్తూ.
“నీకు తెలుసా మమ్మీ.. ఈ రోజు బయట ఆ రౌడీగ్యాంగ్ నన్ను మళ్ళీ ఏడిపించారు” సంజాయిషీ చెప్పుకోబోయాడు ఉకాని.
“ఎవరు నిన్ను అడ్డుకున్నది..? ఆ వీధి కుక్కలా..? అలగా వెధవలా..”
“ఏమిటి.. ఎవరు అడ్డుకున్నది..?” అడిగింది మిసెస్ బీట్రిస్. సంగతి వివరించింది ఉకాని తల్లి.
భర్త వైపు తిరిగి అంది “ మీతో చెప్పాను కదా.. మనవాడు సంగీతం నేర్చుకుంటున్నందుకు బయట కొందరు ఆకతాయిలు వేధిస్తున్నారని”
“ఇది కేవలం జెలసీ తప్ప మరేమీ కాదు. మనలో ఎవరైనా ఏ రంగంలోనైనా బాగుపడుతుంటే మనజాతివాళ్ళకే నచ్చదు. ఓర్వలేరు.”
“అవును.. నువుచెప్పినట్టు వాళ్ళది కేవలం అసూయ మాత్రమే కాదు. అసూయ మనిషి లక్షణం. కానీ వాళ్ళు మనుషులు కారు.. జంతువులు. తమలోలేనిదాన్ని చూసి గౌరవించడం వాళ్ళకి రాదు, తెలియదు. ఒక్క సంగీతమనే కాదు.. ఏదైనా వాళ్ల ప్రవృత్తి అంతే. ఒరే ఉకానీ..! నువ్వదేమీ పట్టించుకోకుండా వయోలిన్ వినిపించు”
తల్లి పట్టుదల ఉకానికి దిక్కుతోచకుండా చేసింది. వయోలిన్ హింస నుంచి తప్పుకోవడం ఎలాగో అతనికి అర్థంకాలేదు. నిస్సహాయత వల్ల దుుఃఖం ముంచుకొచ్చింది. ఈసారి కన్నీళ్లను ఆపుకునే యత్నం చేయలేదు. అవి చెంపల మీదుగా కారిపోయాయి. “ సంగీతం వొద్దు మమ్మీ ప్లీజ్.. నన్ను వొదిలెయ్యి. నేను ఫిడేలు వాయించలేను ” అన్నాడు బిగ్గరగా. ఈ మాటన్నతర్వాత ఉకాని మనసు తేలికపడింది. స్వేచ్ఛగా ఫీలయ్యాడు. తనకు ఇష్టం లేని ఒక బంధాన్ని తెంచేసుకున్నాడు. ఇప్పుడిక తను పక్షిలా ఆకాశంలో ఎగురగలడు.
అంతా చూస్తున్న మిస్టర్ బీట్రిస్ దీర్ఘంగా నిట్టూర్చి “ఏమిటో.. సొవిటోలో పిల్లలను క్రమశిక్షణగా పెంచడం పెద్ద సమస్య అయింది”
అంటూ ఆయన ఉకాని తల్లి వైపు ఒకింత సానుభూతిగా చూశాడు. ఆమె ఇక నిగ్రహంచుకోలేక పోయింది. కోపంతో లేచి కొడుకు
చొక్కా పట్టుకొని లాగి చెంపమీద కొట్టింది. ఆ దెబ్బకు ఉకాని మంచం మీద పడ్డాడు. పక్కన వయోలిన్ యెగిరి కిందపడింది.
ఆమె అతని దగ్గరగా వెళ్ళి మరోసారి కొట్టేందుకు చెయ్యెత్తింది. ఇంతలో లోపలి గదిలోంచి సుడిగాలిలా దూసుకొచ్చింది టెబొహో. తమ్ముణ్ణి కొట్టబోతున్నతల్లిని దూరంగా నెట్టేస్తూ “ ఏమిటి నువ్వు చేస్తున్నపని..?" అంది గట్టిగా.
కూతురు తనను అట్లా నెట్టేయడంతో ఆమెకు పిచ్చెత్తినట్టయింది.
“నన్నునెట్టేస్తావా.. ఎంత ధైర్యం నీకు?” ఆవేశంతో ఊగిపోతూ అరిచింది. “మమ్మీ” అని వారించింది టెబొహో “ఎంతసేపూ నీ మంకుపట్టు నీదేగాని ఎదుటివాళ్ళ గురించి ఆలోచించవా..?"
“టెబోహో.. తప్పమ్మా మమ్మీని అట్లా అనకూడదు” వారించాడు తండ్రి.
“ ప్లీజ్ డియరీ ఊరుకో.. ఆవేశపడకు. నీ పిల్లల మీద నీకంత శతృత్వమేమిటీ” అనునయంగా అన్నది మిసెస్ బీట్రిస్.
“ఛీఛీ.. తల్లితండ్రులకు తలవంపులు తెచ్చే పిల్లలు శత్రువులు కాక మరేమిటి? తల్లి గవర్నమెంటు హాస్పిటల్లో నర్సు. తండ్రి ఇన్స్పెక్టరాఫ్ స్కూల్స్. కానీ మా పిల్లలేమో బయట అకతాయి వెధవలకు భయపడతారు. బయటివాళ్ల ఉత్తుత్తి బెదిరింపులకు తలొగ్గితే ఎందుకూ పనికిరాకుండా పోతారు. అసలు మన జాతి అంతే. మనం ఎందుకూ పనికిరాము.”
“డియరీ ఇంక చాలు ఆపు” గట్టిగా అరిచి వారించాడు తండ్రి. అక్కడ జరుగుతున్నది ఆయనకు అస్సలు నచ్చలేదని అతని స్వరం తెలుపుతున్నది. ఉకాని తల్లి దెబ్బతిన్నట్టు అతనివైపు చూసింది. ఆశ్చర్యపోయి చూస్తున్న అతిథులను గమనించింది.
అంతే.. మరేం మాట్లాడకుండా విసురుగా బయటికి వెళ్ళిపోయింది. మరోక్షణంలో ఆమె తన గదిలోకి వెళ్ళి దఢాలున తలుపులు వేసుకున్నది. ఆతర్వాత పెద్ద గొంతుతో ఆమె శోకాలు పెట్టటం బయట అందరికీ వినిపించింది.
---------------------
రచయిత బయో
ఆఫ్రికా సుప్రసిద్ధ రచయిత జబులో ఎన్. డిబేలే దక్షిణాఫ్రికా దేశస్థుడు.1948లో జొహెన్నెస్ బర్గ్ లో జన్మించాడు. గొప్ప కథకుడు. నవలాకారుడు. సాహితీ విమర్శకుడు. తత్వవేత్త. సామ్రాజ్యవాద పాలన తదనంతరం దేశంలో వచ్చిన సామాజిక, ఆర్థిక మార్పులు, అస్థిరతలకు నెలవైన ఆఫ్రికాదేశాల జనజీవన స్థితిగతులపై గొప్ప సాహిత్యాన్ని సృజించారు.
డిబేలే ఇంగ్లీష్, తత్వశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ, ఇంగ్లీష్ లిటరేచర్ లో మాస్టర్ డిగ్రీ, క్రియేటివ్ రైటింగ్ లో డాక్టరేట్ పొందారు. పలు వర్సిటీల్లో ప్రొఫెసర్ గా, కేప్ టౌన్ వర్శిటీ వైస్ ఛాన్సలర్ గా చేసి, ప్రస్తుతం నెల్సన్ మండేలా ఫౌండేషన్ ఛైర్మన్ గా వున్నారు.
2004 లో వచ్చిన “ది క్రై ఆఫ్ విన్నీ మండేలా” నవల ఆయనకు ప్రపంచస్థాయి ఖ్యాతి తెచ్చింది. అంతకుముందు 1994 లో పబ్లిష్ అయిన తొలి కథల సంపుటి “ఫూల్స్ అండ్ అదర్ స్టోరీస్” ఆఫ్రికా అత్యున్నత సాహిత్య పురస్కారం నోమా అవార్డు పొందింది. దక్షిణాఫ్రికా సాహిత్యం, సంస్కృతిపై ఆయన రాసిన ఎన్నో విమర్శ వ్యాసాలు పలు దేశీయ అవార్డులు గెలుచుకున్నాయి. వివిధ దేశాలకు చెందిన డజనుకు పైగా వర్సిటీలు ఆయనకు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశాయి. సాహిత్యంలో చేసిన కృషికి ఆయన పదుల సంఖ్యలో ప్రతిష్టాత్మక పురస్కారాలు పొందారు. ప్రెసిడెంట్స్ అవార్డు, నోమా అవార్డు, మొఫోలో-ప్లోమర్ పురస్కారం వాటిల్లో ముఖ్యమైనవి.
“ఫూల్స్ అండ్ అదర్ స్టోరీస్”, “బొనోలో అండ్ ది పీచ్ ట్రీ” కథలు; “ది క్రై ఆఫ్ విన్ని మండేలా”, “ది ప్రొఫెట్ నెస్”, “డెత్ ఆఫ్ ఎ సన్”, “సారా, రింగ్స్, అండ్ ఐ” నవలలు; “ఫైన్ లైన్స్ ఫ్రమ్ ది బాక్స్”, “ఆఫ్రికన్స్ మస్ట్ ట్రెజర్ దేర్ లిటరేచర్”, “రీ డిస్కవరీ ఆఫ్ ది ఆర్డినరీ” వ్యాస సంపుటాలు ఆయన రచనల్లో మైలురాళ్ళు. ఆయన “ఫూల్స్ అండ్ అదర్ స్టోరీస్” సంపుటంలోని ప్రసిద్ధ కథ “ఎ బాయ్ విత్ వయోలిన్”కు ఇది నా అనువాదం.