నడిచే గ్రంథాలయం

By telugu team  |  First Published Jan 29, 2021, 2:53 PM IST

మహోమహోపాధ్యాయ , శాస్త్రరత్నాకర, శాస్త్రవిద్వన్మణి, శాస్త్రభాస్కర రాష్ట్రపతి సమ్మాన గ్రహీత శ్రీమాన్  డా. సముద్రాల వేంకట రంగరామానుజాచార్య గురించి ఎస్.టి.జి. అంతర్వేది కృష్ణమాచార్య అందిస్తున్న వ్యాసం.


పరమాత్మ అనుగ్రహంవల్లనే ఉత్తమోత్తమమైన మానవజన్మ లభిస్తుంది. ఆ జన్మలో  పరమాత్మకే అక్షరకైకంకర్యం చేసుకొనే అదృష్టం ఏ కొందరికో లభిస్తుంది. అలాంటి అవకాశం లభించినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకొనే వ్యక్తులు కొందరే మనకు తారసపడతారు. అలాంటివారు తాము పూర్వులు చూపించిన మార్గంలో వెళ్తూ ఎక్కడ మార్గం ఆగిపోయిందో అక్కడనుండి ముందుకు కొత్త మార్గం వేయడానికి ప్రయత్నిస్తారు. ఇరుగ్గా ఉన్న తావుల్ని వెడల్పు చేసి ఎత్తుపల్లాల్ని చదునుచేసి తరువాత తరాలవారికి పూర్వ సంప్రదాయాన్ని అందంగా తీర్చిదిద్ది అందిస్తారు. అలాంటి వారు నిశ్శబ్దంగా తమ పనిని తాము చేసుకుపోతుంటారు.  ఆలోపాల్ని పక్కకు రానివ్వరు. గుర్తింపు కోసం గుంపుల్లో చేరిపోరు. కంటి ముందు వెలిగే కర్తవ్య దీపాన్ని కొండెక్కి పోనివ్వకుండా నిరంతరం శ్రమిస్తూ  ఉంటారు. అటువంటి అరుదైన వ్యక్తుల్లో సంస్కృతభాషాసాహిత్యాలకూ భారతీయ తాత్త్విక చింతనకూ విశ్వఖ్యాతిని కలిగిస్తూ ప్రపంచవ్యాప్తంగా తన పరిశోధన కిరణాలనురింపజేస్తున్న శాస్త్రభాస్కరులు శ్రీమాన్ డా. సముద్రాల వేంకట రంగరామానుజాచార్యులు.  సంస్కృతభాషనూ భారతీయ సంప్రదాయ వైభవాన్ని ముందు తరాలకు అందించాలన్న సంకల్పంతో పరిశ్రమిస్తూ ఉపాధ్యాయస్థాయి నుండి మహామహోపాధ్యాయస్థాయి వరకూ సాగిన వారి అక్షరప్రస్థానం అత్యంత స్ఫూర్తి దాయకమైనది.

 విద్య  పరిమళించాలి అంటే జీవితంలో అధ్యయనం అనే పూల తోటలు విరియాలి. ఆ తోటలకు సంస్కారమనే సారం నిత్యం అందుతూ ఉండాలి. ఎంత విద్వత్తు ఉన్నా ఉత్తమ చారిత్రం, సమున్నత వ్యక్తిత్వం, ఉదాత్త గుణాలు లేకపోతే వారి కీర్తి ప్రకాశించదు.  విద్వత్తుతో పాటు అటువంటి గుణాలు కూడా కలిసి ఉంటే వారి గురించి లోకం కొన్ని తరాలు చెప్పుకుంటుంది. సముద్రాలవారు ఈ గుణాలన్నింటి మేలు కలయిక.  సౌమ్యగుణం, సౌశీల్యం, విద్యార్థుల పట్ల వల్లమాలిన వాత్సల్యం, ఉద్యోగంలో నిబద్ధత, అంకితభావం లాంటి గుణాలు  వారి శాస్త్రపటిమకు పరిమళం అద్దినట్లు చేశాయి. ఎందరో విద్యార్థుల భవితకు పల్లవులు ఊదిన వీరి శాస్త్రశోధన అపారమైనది.  విద్యార్థులే కాదు విద్వన్మణులు కూడా వీరి పాండితీప్రకర్షకూ శాస్త్ర వైదుష్యానికి ఆశ్చర్యపోతూ వీరిని నడిచే గ్రంథాలయం అని సంభావిస్తుంటారు.

Latest Videos

- జీవనరేఖ :

కవిపండితులైన శ్రీ సముద్రాల వేంకట రంగరామానుజాచార్యులవారు   తేది. 05.08.1949 వ సంవత్సరంలో గుంటూరు జిల్లాలోని రేపల్లె తాలూకా పెద్దవరం గ్రామంలో జన్మించారు. తండ్రిగారు న్యాయ వేదాన్త విద్వాన్ శ్రీమాన్ సముద్రాల లక్ష్మణాచార్యులవారు, తల్లిగారు వేణుగోపాలమ్మ.

మహాపండితులకు పుట్టునిల్లైన పెద్దవరగ్రామంలో ఆచార్యులవారి బాల్యం పెద్ద ‘వరం’లా సాగింది. పిన్నవయస్సులోనే తండ్రిగారు పరమపదించగా, ధర్మన్యాయమీమాంసాది మహావిద్వాన్ శ్రీ ఎస్.టి.జి. అంతర్వేది నృసింహాచార్య స్వామివారు ఉపనయన పంచసంస్కారాలను చేశారు.

ధూళిపూడిలో ఆరంభమైన ఆచార్యులవారి విద్యావ్యాసంగం తిరుపతిలోని శ్రీనివాసుని సన్నిధిలోని ప్రాచ్యకళాశాలలో రెండుసంవత్సరాలు సాగి, కొవ్వూరులోని ఎస్.వి.జె.వి. కళాశాలద్వారా సాహిత్య విద్యా ప్రవీణను సాధించిపెట్టింది.  

బ్రహ్మశ్రీ పేరి వేంకటేశ్వర శాస్త్రివారి నుండి వ్యాకరణశాస్త్రాన్ని, బ్రహ్మశ్రీ థూళిపాళ రామచంద్రశాస్త్రిగారి నుండి అలంకారశాస్త్రం తర్కప్రకరణాలు, మీమాంసప్రకరణాలు, బ్రహ్మశ్రీ రెమెళ్ల సూర్యప్రకాశ శాస్త్రిగారి వద్ద పూర్వమీమాంసా శాస్త్రాన్ని, మహామహోపాధ్యాయ శ్రీభాష్యం అప్పలాచార్యులవారి నుండి విశిష్టాద్వైతవేదాన్తాన్ని, శ్రీమాన్ పురిహెళ్ల వేంకటాచార్యులవారి నుండి ద్రవిడ వేదాన్తాన్ని అధ్యయనం చేశారు.
ఆంధ్రాయూనివర్సిటీనుండి ఎం.ఏ. వ్యాకరణ పట్టభద్రులయ్యారు. అటుపై సంస్కృత సాహిత్య పరిశోధనకావించి ఆంధ్రాయూనివర్సిటీద్వారానే డాక్టరేట్ ను పొందారు. బాల్యంనుండి ఎన్ని అవరోధాలు ఎదురైనా బెదరలేదు, చెదరలేదు, ఆశయసాధన ఆపలేదు, జ్ఞానార్జనలో కొదవలేదు ఆచార్యులవారికి.

ద్వారకాతిరుమల శ్రీవేంకటేశ్వరుని పదసీమలో మొదలైన ఉద్యోగ ప్రస్థానం ఒక సంవత్సరం సాగి, మళ్లీ కొవ్వూరు చేర్చింది. అధ్యయనంచేసిన కళాశాలలోనే అధ్యాపకునిగా రాజిల్లే అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. ప్రధానాచార్యుల పదవినిసైతం కట్టబెట్టింది (1973-2007 పదవికాలం). ఉభయవేదాన్తాచార్య, కార్యదర్శిగా, పీఠాధ్యక్షులుగా, శ్రీశ్రీశ్రీ  చిన్నజీయర్ స్వామివారి నేతృత్వంతో సంప్రదాయసేవ అప్రతిహతంగా సాగుతోంది.  కళాశాలాధ్యాపకత్వం నుండి విశ్రాన్తులైన తరువాత శ్రీవేంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీ పరిశోధన ప్రకాశన విభాగంలో భాగస్వామ్యాన్నిపొంది ఒక సంవత్సరం విశేషకృషి సలిపారు. ఉత్తమ కార్యాలను నిలిపారు. ఆతరువాత 2009 నుండి జీవా వేదిక్ అకాడమీ వైదిక సంశోధన ప్రకాశన విభాగానికి డైరెక్టరుగా శ్రీరామానుజదర్శన సంప్రదాయ ప్రకాశన సేవలో కొనసాగుతున్నారు. ఇది ఆచార్యులవారి పదవీ ప్రస్థానం.

సద్వంశసముద్భవులైన ఆచార్యులవారు ఆచారనిష్ఠతోపాటుగా ఆచార్యనిష్ఠ కలవారు. గీర్వాణాంధ్రాంగ్లాది భాషలలో నిష్ణాతత్వం బహుశాస్త్ర పాండిత్యం, వివిధ విషయ ప్రవేశత్వం ఆచార్యులవారి విద్యాతత్వం. వారు నేర్చినవి, నెరవేర్చినవి ఎంతో ఉన్నా, సమాజానికి ఎదో అందించాలన్న నిరంతర తపన చిరంతర తపస్సులా కొనసాగుతూనేఉంది. నిత్యము పఠనమో, పాఠనమో, వ్యాసలేఖనమో, ఉపన్యాసఉల్లేఖనమో వారి దినచర్య. అలా సాగే ఆ సాహిత్య పరిచర్యలో ఆచార్యులవారి కలంనుండి జాలువారిన గ్రంథాలెన్నో, గళంనుండి అనర్గళంగా తొణికిసలాడిన సద్విషయాంతరార్థాలెన్నో. అంతేవాసుల అంతరంగాలు మురిసి విరిసి వారిపై కురిసిన వినయకుసుమాలెన్నో.

సమున్నతస్థానంలో ఉన్నా సామాన్యులుగా అందరితో కలిసిమెలిసి ఉండే సల్లక్షణం వారి సౌజన్యానికి ప్రతీక. సమయపాలనంలోను, సభానిర్వహణలోను వారు మర్యాదా పురుషోత్తములు.  నిండుమనంబు నవ్య నవనీత సమానము పల్కు దారుణాఖండల శస్త్రతుల్యము ..  అని నన్నయగారు అన్నట్టుగా -  ముక్కుసూటితనం కలవారు సముద్రాలవారు. స్ఫుటమైనవాక్కుతో  మొహమాటంలేని వైఖరి, దోషం ఉంటే ఎంతటి వారినైనా నిలబెట్టి నిగ్గదీయగల తత్త్వం వీరిది. ఈ లక్షణాలు వీరికి ప్రత్యేక ఆకర్షణలు. ఎస్.వి.ఆర్. ఆర్. ఆచార్యులుగా, సముద్రాల గురువుగారుగా, కొవ్వూరు స్వామివారుగా, జీవా పెద్ద గురువుగారుగా లబ్ధప్రతిష్ఠులు.  అనేకులైన ఆధ్యాత్మిక గురువుల ఆదరాభిమానాలనూ అందుకొన్న అదృష్టశాలి, వినయశీలి ఆచార్యులవారు. 

కొవ్వూరు గౌడీయమఠం దామోదరమహరాజ్ వారు, మేహర్ బాబా ట్రస్ట్ వారు, భీమవరం శ్రీభాష్యకారసిద్ధాన్తపీఠం శ్రీశ్రీశ్రీ రామచంద్ర రామానుజ జీయర్ స్వామి వారు, శ్రీరంగం, తిరుమల, కాకినాడ, ఉల్లిపాలెం జీయర్ స్వాములు మొదలైన పీఠాథిపతుల ఆదరాభిమానాలను పొందారు.  శ్రీశ్రీశ్రీ అహోబిల రామానుజ జీయర్ స్వామి వారికి,  శ్రీశ్రీశ్రీ దేవనాథ రామానుజ జీయర్ స్వామి వారికి వీరు శ్రీభాష్య-సంస్కృతవేదాన్త- ఆచార్యులు.

అందరికన్నా గరిష్ఠమైన, ఘనిష్ఠమైన సంబంధం శ్రీశ్రీశ్రీ చినజీయర్ స్వామివారితో ఆచార్యులవారికి ఏర్పడింది. వీరంటే శ్రీశ్రీశ్రీ చినజీయర్ స్వామికి అమితమైన అభిమానం. ఉభయవేదాన్తాచార్య పీఠానికి కార్యదర్శిగా, అధ్యక్షులుగా వీరు చేసే లోకోపకారకమైన అనేక శ్రీకార్యాలకు స్వామివారు సామోదంగా మంగళాశాసనాలు అందిస్తూ ఉంటారు.  అలాగే శ్రీస్వామివారి భక్తినివేదన పత్రికకు కూడా పదివత్సరాలపాటు సంపాదకులుగా కొనసాగారు. వీరి సంపాదకీయాలు సంప్రదాయవేత్తలనూ భాషాభిమానులనే కాక ఆధునిక శాస్త్రవేత్తలనూ ఆలోచింపచేసేవి.

పండితునిగా, పరిశోధకునిగా, కవిగా, సంపాదకునిగా, పీఠికారచయితగా, వ్యాసకర్తగా, స్వతంత్ర గ్రంథకర్తగా, అనువాదకునిగా, వ్యాఖ్యాతగా, సంకలకర్తగా, గ్రంథపరిష్కర్తగా, ఆచార్యులవారి ప్రతిభావైభవం పలురేకుల ప్రసూనమై జ్ఞానగంథాన్ని ప్రసరిస్తున్నది. వారి మహత్వాన్ని ప్రవచిస్తున్నది.

- సర్వాంగీణ ప్రతిభామూర్తి:

ఆచార్యులవారి పాండిత్యంగురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన పనిలేదు. అది జగద్వితం, సతత సర్వాదరణపాత్రం. పరిశోధకునిగా వారు వ్రాసిన వ్యాసాలు, ముద్రించిన గ్రంథాలు జ్ఞానప్రదీపికలు. సంస్కృతంలో వారు పరిశోధించిన గ్రంథం కావ్యప్రకాశ హృదయప్రకాశం. అలంకారశాస్త్రంలో ఆచార్యమమ్మటుడు రచించిన కావ్యప్రకాశ గ్రంథానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. అలాంటి కావ్యప్రకాశపై వచ్చిన ప్రసిద్ధ-అజ్ఞాత-వ్యాఖ్యానాలను పరిశోధించి కావ్యప్రకాశ హృదయాన్ని తరచిచూసి మలచిన వ్యాఖ్యానరూపమైన అద్భుతగ్రంథం కావ్యప్రకాశ హృదయప్రకాశము. ఈ గ్రంథాన్ని కావ్యప్రకాశ మూలంతో రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంవారు ప్రకాశింపచేశారు. అలాగే వారి పరిశోధనలో పరిమళించిన మరో రెండు గ్రంథాలు ఏకవిజ్ఞానేన సర్వవిజ్ఞానం మరియు యతివరయశశ్చంద్రిక అనేవి. బ్రహ్మకారణతావాదం వేదాన్తంలో ప్రసిద్ధిపొందిన అంశాలలో ప్రధానమైంది. 
ఈ అంశాన్ని ఉపనిషత్ శ్రీభాష్యాది గ్రంథాలను ఆలంబనగా చేసుకుని, మీమాంసా-సాంఖ్య-మాయావాద-న్యాయవైశేషికాదులలోని కారణతావాదాలను ఖండిస్తూ ‘ఏకవిజ్ఞానేన సర్వవిజ్ఞాన’మనే గ్రంథాన్ని రచించారు. ఇక్కడ ఒక్క విషయం తప్పక చెప్పుకోవాలి. అది పై అంశంపైనే, ఆచార్యులవారి జనకులు శ్రీమాన్ సముద్రాల లక్ష్మణాచార్యులవారు సుమారు 1953 సంవత్సరంలో సంగ్రహంగా ఒక వ్యాసాన్ని భక్తినివేదన పత్రికకు అందించారు. ఈ విషయం తెలియని ఆచార్యులవారు అదే అంశాన్ని విస్తారంగా వివరించారు. యాదృచ్ఛికంగా జరిగిన ఈ విషయాన్ని శ్రీ అహోబిల స్వామివారి ద్వారా తెలుసుకుని ఆశ్చర్యాన్ని పొందారు. తమ పితృపాదుల అభిమతాన్ని నెరవేర్చినందుకు కృతకృత్యతను పొందినట్లు భావించారు. తండ్రిగారి వ్యాసాన్ని తమగ్రంథంలో ముందుచేర్చి తమగ్రంథానికి పరిమళాన్ని అద్దుకున్నారు.

శ్రుతిస్మృతి పురాణేతిహాస సంప్రదాయ గ్రంథాలలో ఉన్న యతిధర్మాలను, వాటిలోని ప్రభేదాలను, వాటి స్వరూపస్వభావాలను, వాటి మహత్త్వాన్ని నిరూపణంచేస్తూ, శ్రీవైష్ణవ యతిధర్మాలను విశేషంగా వివరిస్తూ ప్రాచీన యతులు ఎలా మార్గదర్శకంగా నిలిచారో వివరించిన విశేష గ్రంథమే యతివరయశశ్చంద్రిక. ఇది, సామాన్యంగా యతిధర్మంతోపాటు, భగవద్యామున-భగద్రామానుజ-వరవరమునుల యతిజీవన వైశిష్ట్యాన్నికూడా విశేషంగా చాటుతుంది.

ఆచార్యులవారి మరో పరిశోధనాత్మక గ్రంథం ప్రణవమంజూష. వేదపురాణేతిహాసాలలో ప్రస్తావించిన ఓంకారవైభవాన్ని సంగ్రహసుందరంగా ప్రకటించిన గ్రంథమే ఈ ప్రణవమంజూష. సంస్కృతంలో ఈ గ్రంథం వ్రాయబడింది. ఈ గ్రంథం ఆంధ్రీకరించబడింది కూడా.

ఇలాంటివి సంస్కృతంలో ఉంటే, తెలుగులో శ్రీకృష్ణతత్త్వమధురిమ అనే గ్రంథాన్ని పరిశోధించి ప్రకాశింపచేశారు. ఈ గ్రంథం శ్రీకృష్ణతత్త్వానికి సర్వంకషమైన పరిశోధన. ఒక  విజ్ఞాన సర్వస్వం. భారత, భాగవత, విష్ణు-పాద్మాది పురాణ, కావ్య, స్తోత్ర, ద్రవిడ ప్రబంధాదులలో ప్రస్తుతించబడిన శ్రీకృష్ణతత్త్వాన్ని ఆగమనిరూపితతత్త్వంతోపాటు అందులోని మహత్త్వాన్ని మహత్తరంగా 735 పుటలలో చెప్పిన గ్రంథం ఇది.

వీరి మరో విశేషపరిశోధనగ్రంథం అకర్దమమిదంతీర్థం. శ్రీవాల్మీకి రామాయణంలోని కథాకథన ప్రక్రియ, విభిన్న వాక్య నిర్మాణ విధానం ఏవిధంగా సాగిందో అనే విషయాన్ని కొత్తకోణంలో చూపించారు. గ్రంథమంతా రామాయణంలో మూడు శ్లోకాల వ్యాఖ్యానంతో సాగింది.  శాస్త్రవిజ్ఞానం, పరిశోధనాభిలాష ఉన్నవాళ్ళకు కవిత్వం చెప్పే శక్తి ఉండదు.  కానీ సముద్రాలవారు అందుకు అపవాదం. సంస్కృతభాషపై అధికారంకల ఆచార్యులవారు వందలకొద్దీ శ్లోకాలను,  హృద్యమైన గద్యాలను, స్తుత్యాత్మకంగా భగవత్పరంగా రచించారు.
‘వైకుంఠనాథ విలాసం’ పేరిట సంస్కృతంలో కూర్చిన ఖండకావ్యం ఎంతో మనోహరమైనది.  శ్రీమన్నారాయణుని పరవ్యూహాది స్వరూపవర్ణనను ఎంతో రమణీయంగా పరమపఠనీయంగా కావ్యబద్ధంచేశారు.   తెలుగులో వెలుగుచూసిన వీరి గేయకావ్యం నీలామాధవం. సంస్కృతాంధ్రద్రవిడ ప్రబంధాలలో, ఆంగ్లేయుల పరిశీలనలో కల నీలాదేవి లీలావిభూతిని డెబ్భై ఒక్క పుటలలో పుటంపెట్టిన బంగారంలా పీఠికారూపంలో దర్శింపచేశారు. కావ్యం 200 పుటలపైనే.

1969 సంవత్సరంలో తొలిగేయం ‘మధురమురళి’ పేరిట రచించారు. దాన్ని ముముక్షువు అనే పత్రికవారు ప్రచురించారు. అలాగే బ్రహ్మసంహితను బృహద్గేయంగా ఆచార్యులవారు ‘తత్త్వదీథితి’ అనేపేరున ఆవిష్కరించారు. ఇది గౌరాంగ పత్రికలో ధారావాహికగా ప్రవహించింది.   జగదాచార్యులు భగవద్రామానుజాచార్యులవారి వైభవాన్ని గీతరూపంలో ‘గురుకీర్తిచంద్రిక’ అనే C.D. అందిస్తే, వాటిని సుప్రసిద్ధ గాయనీగాయకులు ఆలపించారు.

- అపాతమధురమైన సంగీతంలోనూ..

1967 సంవత్సరం నుండి 1970 వరకు శ్రీ తిరుపతి పొన్నారావుగారు అనే సంగీత విద్వాంసుల దగ్గర సంగీతాన్ని కూడా సాధన చేశారు ఆచార్యులవారు. అంతేకాక 1970లో ప్రభుత్వంవారి కర్నాటక సంగీత ప్రవేశ పరీక్షలోకూడా ఉత్తీర్ణులయ్యారు.

- సంపాదకునిగా...

శ్రీవేంకటేశ్వర వేదవిశ్వవిద్యాలయం, జీయర్ ఇంటిగ్రేటెడ్ వేదిక్ అకాడమీల ద్వారానే గాక స్వతంత్రంగా కూడా న్యాయ, మీమాంసా, వేదాన్త, ధర్మశాస్త్ర, ఆగమ, ఇతిహాస, పురాణ, శ్రీవైష్ణవ సంప్రదాయ గ్రంథాలు వందకు పైగా వీరి సంపాదకత్వంలో వెలువడ్డాయి.

-వ్యాఖ్యానాలూ అనువాదాలూ...

వ్యాఖ్యానరూపంగానూ అనువాదాలుగానూ  వీరు అనేక గ్రంథాలు రచించారు.  శ్రీరామానుజుల వేదార్థసంగ్రహం, శ్రీభాష్యజిజ్ఞాసాధికరణం (వేదాన్తదీపంగా), శరణాగతిగద్యం, శ్రీవైకుంఠగద్యం, అలాగే వేదాన్త కారికావళి, సుబాలోపనిషత్, కౌషీతకీఉపనిషత్, శ్వేతాశ్వతరోపనిషత్ మొదలైన ఉపనిషత్ గ్రంథాలను వ్యాఖ్యాసహితంగా అనువదించారు. వ్యాసకర్తగా వారు రచించిన వందలాది వ్యాసాలు అనేక పత్రికలలో, విశిష్ట సంచికలలో ప్రచురితమైయ్యాయి, నేటికీ అవుతున్నాయి. ఇటీవల ఆచార్యులవారి కలం నుండి జాలువారిన వచనరచన తంజమ్మ. శ్రీరామానుజుల ధర్మపత్ని తంజమ్మ/తంజమాంబ. చరిత్రకారులు ఈమె పాత్రను అవనతంగానే చిత్రీకరించి రచనలు చేశారు. కాని ఆచార్యులవారు అలా కాక తంజమ్మ పాత్రని సమున్నతస్థానంలో నిలిపి సహేతుకంగా ఆమె పాత్రను ఔచితీపూర్ణంగా ఒక తెలుగు నవలగా మలిచారు.

-వరించిన బిరుదులు:

శాస్త్రరత్నాకర బిరుదును శ్రీరంగం ఆండవన్ స్వామివారు ఆచార్యులవారికి అనుగ్రహించారు. మహామహోపాధ్యాయ లాంఛనంతో రాష్ట్రియ సంస్కృత విద్యాపీఠం తిరుపతివారు, శాస్త్రభాస్కర అంటూ కవికులగురు కాళిదాస సంస్కృత విశ్వవిద్యాలయం – నాగపూర్ వారు, రాష్ట్రపతి పురస్కారంతో భారత ప్రభుత్వంవారు, అలాగే అనేక సంస్థలవారు సముద్రాల వేంకట రంగరామానుజాచార్యులవారిని సత్కరించారు, సంతసించారు.  నిత్యకృషీవలులైన ఆచార్యులవారు పాఠరూపంలో అందించిన శ్రీభాష్యం కూడా వారి అంతేవాసులు అక్షరరూపంలోనికితెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే వారి మరో పరిశోధనాజన్యమైన స్వతంత్ర అలంకార గ్రంథం, అనుష్టుప్ మరియు ఇతర వృత్తాలతో శోభిల్లే శ్లోకాత్మకమైన ‘ప్రీతిరసప్రప’ త్వరలో వెలువడుతోంది.  మరియు ఆచార్యులవారి గురువర్యులు బ్రహ్మశ్రీ కర్రి శ్రీరామమూర్తి శాస్త్రిగారు వ్యక్తి వివేకంలో ధ్వని సిద్ధాంతంపై చేసిన ఖండన ప్రక్రియకు సమాధానంగా ‘ఆనన్దహృదయం’ అనే గ్రంథం వ్రాయగా దానికి సంస్కృత వ్యాఖ్యనుకూడా త్వరలోనే వెలువరిస్తున్నారు ఆచార్యులవారు. గృణాతి హితమస్యేతి గురుః అన్న వాక్యార్థం, శ్రీమాన్ సముద్రాల వేంకట రంగరామానుజాచార్యుల వారికి సాకారమైన దనటం సమయోచితం, సందర్భోచితం.

click me!