బతుకు దిక్సూచి ‘‘అక్కన్నపేట రైల్వే స్టేషన్‌’’ కథలు

By Siva Kodati  |  First Published Feb 24, 2023, 4:27 PM IST

మాడభూషి రంగాచార్య స్మారక పురస్కారం 2022 కు ఎగుమామిడి అయోధ్య రెడ్డి కథా సంపుటి ' అక్కన్నపల్లి రైల్వే స్టేషన్ '  ఎంపికయింది.  ఈ పురస్కారాన్ని రేపు అనగా 25 ఫిబ్రవరి 2023 రోజున రవీంద్ర భారతిలోని మినీ హాల్లో బహూకరించనున్నారు


మాడభూషి రంగాచార్య స్మారక పురస్కారం 2022 కు ఎగుమామిడి అయోధ్య రెడ్డి కథా సంపుటి ' అక్కన్నపల్లి రైల్వే స్టేషన్ '  ఎంపికయింది.  ఈ పురస్కారాన్ని రేపు అనగా 25 ఫిబ్రవరి 2023 రోజున రవీంద్ర భారతిలోని మినీ హాల్లో బహూకరించనున్నారు. ఈ సందర్భంగా అయోధ్య రెడ్డి కథలపై డా. సిద్దెంకి యాదగిరి రాసిన వ్యాసం ఇక్కడ చదవండి:


కదిలే కాలంతో కలసి నడవడమే బతుకు. సమాజాన్ని సమాజంలోని జీవితాలను పరిశీలించే మనసుంటే ప్రతీ జీవితం పఠనీయ గ్రంథమే అవుతుంది. శోధించే దృక్పథముంటే ప్రతి మనిషి గుణపాఠం నేర్చుకోవచ్చుననీ ఎగుమామిడి అయోధ్యారెడ్డి కథలు చదివితే అర్థమవుతుంది.

Latest Videos

చీమలు నిరంతర శ్రమ జీవులు. చీమల్ని వస్తువులుగా గైకొని తెలుగు కథా సాహిత్యంలో రావిశాస్త్రి రాసిన ‘పిపీలీకం’ ఒక మహత్తరమైన కథగా విమర్శకులచే మన్ననలు పొందింది. ఆ కథలో చీమ తన్నుతాను తెలుసుకొని తనజాతి గుంపులో వెళుతుంటది. తాము నిర్మించిన పుట్టను ఆక్రమించిన పాముపై చీమలు అన్నీ కలసి పోరాటంచేసి విజయం పొందుతాయి. చీమలు ఎంతో ప్రయాసపడి సమిష్టిగా సంపాదించిన రొట్టెముక్కను తమ చోటికి చేర్చే క్రమములో ఏదో ఒక అదృశ్యహస్తం చూస్తుండగానే కబళిస్తుందనీ అయోధ్యారెడ్డి ‘ఆహార యాత్ర’ కథలో వ్యక్తం అయ్యింది. ఈ ఇద్దరు రచయితల వస్తువు చీమలే అయినా రావిశాస్త్రి ‘పిపీలీకం’ లో విజయం కనపడుతుంది. ‘ఆహారయాత్ర’ కథలో చీమల ఆహారం తస్కరించబడిన విషయం వ్యక్తం చేస్తుంది. చీమలు సామాన్య ప్రజలకు ప్రతీకగా ఉన్నవి.

పుస్తక పఠనాభిలాష తనకు ఆకలికంటే తీవ్రమైందని చెప్పుకునే ఎగుమామిడి(ఎ.యం.) అయోధ్యారెడ్డి 11 ఫిబ్రవరి 1955న సిద్ధిపేట జిల్లా, మిట్టపల్లి గ్రామంలో జన్మించారు. వీరి తొలికథ ‘మృత్యువులో వ్యత్యాసం’ 1974లో ‘గులాబి’ మాస పత్రికలో అచ్చయింది. ఇప్పటి వరకు డెబ్బయికి పైగా కథలు, రెండు నవలలు రాసారు. రచయితగా ఎదుగుతున్న తొలినాళ్లలో మంజీరా రచయితల సంఘంతో అనుబంధం ఉంది. ఆంధ్ర భూమి విజయవాడ రెసిడెంట్‌ జర్నలిస్టుగా చాలా సంవత్సరాలు పనిచేశాడు.

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గుగి ‘వీప్‌ నాట్‌ చైల్డ్‌’ తెలుగులో అంతే సహజంగా ‘ఏడువకు బిడ్డా!’గా అనువదించాడు. ఈ గ్రంథానికి 2020కి గాను పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమ అనువాద పురస్కారం లభించింది. ‘అక్కన్నపేట రైల్వేస్టేషన్‌’ కథా సంపుటి ప్రసిద్ధ ‘మాడభూషి కథా పురస్కారం’నకు ఎంపికైంది. వారు అనువదించిన అంతర్జాతీయ కథల సంపుటి ‘కథా సంగమం’.

సామాజిక బాధ్యత కలిగిన రచయితగా ఏది రాసినా సమాజంలో భాగమై సమాజహితం కోసమే రాస్తాడు. కథను సామాజిక యజ్ఞంలా భావించే అయోధ్యారెడ్డి తన కథలలో సమాజాన్ని మైక్రోస్కోపిక్‌ కళ్లతో చూపుతాడు. జీవితాలను లోతుగా చదివినవాడై కథలలో  ఆర్థిక, సామాజిక సంబంధాలను నిక్షిప్తం చేస్తాడు. పాఠకుని మనసుకు మరుపురాకుండా రాయడం వీరి సొంతం.  అణచివేయబడుతున్న జీవితాలను పాఠకులకు అద్దంలో ప్రతిబింబంలా చూపుతాడు. రచనలో సూటిదనం, కథనంలో స్ఫష్టత, ఆకట్టుకునే శైలీ విన్యాసం వీరి ప్రత్యేకత. సంక్లిష్టమైన విషయాన్ని అతి సునాయసంగా వివరించడం వీరి కథల్లో కనపడే ప్రధాన లక్షణం. సాధారణంగా కనపడే వస్తువులో లోతైన మార్మికతను, దాగిన నిగూఢతను సుళువుగా పాఠకులకు అందజేయడం వారి విశిష్టత. బలహీనుల ఆత్మగౌరవానికి కావ్యగౌరవం కలిగిస్తాడు. బాధలను బహుముఖాలుగా దర్శించి, స్పర్శించి, సృశించిన బతుకు వెతలే అయోధ్యారెడ్డి ‘అక్కన్నపేట రైల్వేస్టేషన్‌’ కథలు. అక్కన్నపేట రైల్వేస్టేషన్‌ మెదక్‌జిల్లాలో ఉంది.
‘‘జీవితంలోని ఒకానొక మహత్తర సత్యాన్ని అద్భుత శిల్పనైపుణ్యంతో కళ్ళకు కట్టినట్లు చూపించి, హృదయాన్ని ఒక మహత్తరమైన అనుభూతితో నింపి, పదే పదే చదవాలనిపింపజేసేది గొప్ప కథ.’’ గా పోరంకి దక్షిణామూర్తి కొనియాడారు.

‘‘అక్కన్నపేట రైల్వే స్టేషన్‌’’ కథాసంపుటి ప్రత్యేకత:

కొన్ని కథలు ఊహాలోకంలోకి తీసుకువెళ్తాయి. కొన్ని కథలలో పరిష్కారం లభించవు. కొన్ని కథలు పాఠకులకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. మనిషి నేలవిడిచి సాముచేయనట్లే రచయిత జీవితం వదిలి కథరాయలేదు. ఈ ‘‘అక్కన్నపేట రైల్వే స్టేషన్‌’ కథలలో పాఠకునికి సరిపడేంత పరిష్కారం లభిస్తుంది. భవిష్యత్తు మీద ఆశపుడుతుంది. అది ఆశయంగా రూపుకడుతదని చెప్పొచ్చు. సామాజిక ప్రయోజనం ఆశించి రాసిన కథలుగా అక్కన్నపేట రైల్వేస్టేషన్‌. కథల నిండా జీవితం కనపడుతుంది. మనుషుల మధ్య సంఘర్షణలను పాత్రలుగా మలిచాడు. సమాజంలో వివిధ వర్గాలు, కులమతాలు, పేద, ధనిక తేడాలు, వివక్షలు అన్నీ ఈ కథా సంపుటంలో దర్శనమిస్తాయి. రోజు కనపడే మనుషులు పాత్రలుగా మాట్లాడినట్లు, ముచ్చట చెప్పినట్లు అనిపిస్తుంది. సమాజం కనపడుతుంది. ఇవి వర్తమాన కాలాన్ని, భూతకాలాన్ని రికార్డు చేసిన కథలున్నాయి. భవిష్యత్తుకు దారిచూపే దిక్సూచిలా ఉన్నాయనడంలో అతిశయోక్తిలేదు.

అక్కన్నపేట రైల్వే స్టేషన్‌ కథలను రెండు భాగాలుగా విభజించుకుంటే 1. వస్తువు 2. భాష వస్తువు, శైలి, శిల్పం: 

వ్యక్తమయ్యే ప్రధాన భావాన్ని వస్తువనచ్చు. రచయిత సాహిత్యంలో వివరించిన అంశాన్ని వస్తువుగా చెప్పవచ్చు. ఆ వస్తువు ఏ రూపంలో అభివ్యక్తం అవుతుందో ఆ రూపాన్ని శిల్పం అంటారు. ఏదైతే రచయిత చెప్పదలుచుకున్నాడో ఆ అంశాన్ని వస్తువు అంటారు. ఉదాహరణకు మట్టి. ఏ రూపంలో ఏ ఆకృతిలో చూపుతున్నాడో దానిని శిల్పం అని అంటారని అర్థం చేసుకోవచ్చు. ఉదా॥ వస్తువు మట్టి. దానితో శివునిగా తయారుచేస్తే శివుడు. అదే మట్టితో నందిని చేస్తే అది నంది అవుతుంది. రెండు వస్తువులే. ఒకటి శివుడు. రెండవది నంది. రెండింటికి చాలా తేడా ఉంటుంది. ఆకర్షణీయంగా చెప్పడమే శైలి. 

అక్కన్నపేట రైల్వేస్టేషన్‌ కథా సంపుటిలో రచయిత తనచుట్టూ ఉన్న సమాజంలోని అనేక వస్తువులను ఎంపిక చేసుకున్నాడు. వాటిని 1. సామాజిక కథలు,  2. స్త్రీవాద దృక్పథం రెండురకాలు విభజించుకోవచ్చును.

1. సామాజిక కథలు: సమకాలీన సమాజాన్ని కథల్లో ప్రతిబింబించిన కథల్ని సామాజిక కథలుగా చెప్పవచ్చు. అయోధ్యారెడ్డి తన అక్కన్నపేట రైల్వేస్టేషన్‌ కథల్లో నడుస్తున్న కాలాన్ని పిక్చరైజైషన్‌ చేసాడు. కదులుతున్న కాలంలో మారుతున్న సమాజాన్ని ఒడిసి పట్టుకున్నాడు. ఉమ్మడి కుటుంబాల నుంచి వ్యష్టి కుటుంబాల జీవన స్థితిగతులను చిత్రించాడు. తల్లిదండ్రులను మోసం చేసే కొడుకులను, తండ్రి చీత్కరించడం వలన ఆత్మహత్యకు ప్రేరేపితుడైన కొడుకును కాపాడిన మాసిన గుడ్డలు, చింపిరి జుట్టు తల్లి తెచ్చిన మార్పును చిత్రిస్తాడు. జర్మన్‌ తత్త్వవేత్త గోథే అన్నట్లు సంకల్పం మంచిదైతే శక్తి దానంతటదే ఉద్భవిస్తుంది. రచయిత క్రమక్రమంగా హత్యచేసే వ్యవస్థను, భూస్వామ్య వ్యస్థలో చూస్తుండగానే మనిషిని చంపే దుర్మార్గాన్ని చూపుతాడు.

ప్రపంచంలో ఆకలి అతిపెద్ద సమస్య. అంతకంటే వృద్ధాప్యంలో నిరాదరణ మరో సమస్య. తల్లిదండ్రులను పట్టించుకోని సమాజం మీద వదిలిన గురితప్పని వడిసెల రాయిగా రువ్వడితో సమాజాన్ని  ఢీకొట్టే కథ ‘చావు వాసన’. మానవసంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారిపోయాక ఎవరి పిల్లలు? ఎవరు తల్లిదండ్రులు అనే ప్రశ్నలుద్భవిస్తాయి. ఎవరికి ఎవరూ ఏమీ కారనీ, ఆదరణ కూడా ఎవరివద్ద దొరుకదనీ తెలుపుతుందీ కథ. 

సంప్రదాయ కుటుంబవ్యవస్థలో వృద్ధులకు సముచిత గౌరవం దక్కేది. కొడుకులు కోడండ్లు, మనవలు మనువరాండ్లతో ఆహ్లాదకరంగా జీవిత చరమాంకంలో మహాభినిష్క్రమణంలా వారి అంత్యదినాలుంటాయి. అలాంటిది ఇద్దరున్న ఒంటరివారవుతున్నారు. వ్యాపారమయమవుతున్న నేటి జీవితాల్లో మానవ సంబంధాలు నేతీబీరకాయలో నేతిచందంలా మారుతున్నాయి. సరైన ఆదరణలేక వృద్ధాప్యం బిక్కుబిక్కుమనుకుంటూ కాటికి కాళ్లు చాపుకొని చనిపోతే బాగుండననే ఎదురుచూసే దురవస్థ దాపురించిన కాలంలో మనమూ ఉన్నాము. వృద్ధులపట్ల సానుభూతితో చాలా కథలే వచ్చాయి. సమస్యలోంచి పరిష్కారం దిశగా తల్లిదండ్రులను అనాదలుగా విడువకూడదనీ ఆలోచించే దిశగా ముగింపు వుండడం ‘చావు వాసన’ కథ ప్రత్యేకత.

మూడు రోజులుగా ఆకలితో అలమటిస్తున్న వృద్ధుడు వీరయ్య బస్టాండ్‌లో సొమ్మసిల్లి పడిపోయాడు. రచయిత బిర్యాని ఇప్పిస్తే తన భార్యకని తువ్వాలులో మూటకడుతాడు. తినుమని మరొకటి ఆర్డర్‌ చేస్తే ఐదు నిమిషాల్లో తింటాడు. తన బాధను చెప్పుతాడు వీరయ్య.

పెద్ద కొడుకు దుబాయి వెళ్లాడు. పోషిస్తాడు అన్న నమ్మకం లేదు. రెండోవాడు హైదరాబాదులో ఉన్నతంగా జీవిస్తునాడు. చిన్నవాన్ని నమ్మిన తల్లిదండ్రులు తమ జీవనోపాధి కల్పించే హోటల్‌, ఆస్తినంత అమ్మి చిన్నకొడుకు ఇల్లు చేరారు. కొద్దిరోజుల్లోనే ఆదరణ కరువైంది. రోగాల పుట్టగా మారిన తల్లివల్ల ఇంట్లో ‘చావు వాసన’ వస్తుందని అసహ్యించుకున్నాడు. చేసేదేం లేక వీధినపడ్డారు. ఫ్లైవోవర్‌ కింద నివాసం. అక్కడక్క అడుక్కొచ్చి తినిపించిందే తిండి. ఆమెచుట్టు మలమూత్రాల వాసనలో ముల్లెకట్టిన మూటలా పడివున్న ఆ తల్లి ఇగ నేను పోతున్నాననీ బిర్యాని తేగానే ఆఖరిశ్వాస వదులుతుంది. తల్లి చనిపోయినంక రాకపోతడా? అనే ఆశతో కొడుక్కి ఫోన్‌ చేయమనడం పిల్లల మీదున్న తండ్రుల మమకారానికి ప్రతీకగా ఉంది. ఆ మాట దూసుకొచ్చిన వడిసెలతో కొట్టినట్లు అనిపించిందని రచయిత ముగిస్తాడు. కాని ఆ దెబ్బ పాఠకునికి తగులుతుంది. సమాజానికి తగులుతుంది. వీరయ్య పాత్రలాంటి జీవితాలు ఆధునిక సమాజ పోకడలపై ఎక్కుపెట్టిన బాణం.

రైల్వే స్టేషన్‌లు అర్థం చేసుకుంటే సమాజం అర్థమవుతుంది. ఎందుకంటే అది మరొక సమాజం. సమాజంలోని అన్ని వర్గాలవారి రాకపోకలు జరిగేది అక్కడి నుండే. అనేక జీవితాలకు ఆలంబన.  బ్రతుకు త్రోవలు. ఉపాధి మార్గాలు. అభివృద్ధికి ఆధారం కూడా. లుప్తమవుతున్న ఆత్మీయతలు. చెదురుతున్న మనసులకు బ్రతుకుపైన ఆశలు చిగురింపజేసే కథ ‘అక్కన్నపేట్‌ రైల్వేస్టేషన్‌’. ఒక జీవితానికి కావలిసిన చేయూతనివ్వడమే అసలైన చికిత్సగా చూడగలం. కన్నీళ్లతో కరచాలనం చేస్తే చాలు మనసు చిగురిస్తుంది. విరక్తి చెందిన హృదయం నూతనోత్తేజంతో ముందుకు సాగుతుందనడానికి ఉదాహరణగా నిలుస్తుంది.

మృత్యువును ముద్దాడబోతున్న వెంకటేష్‌ది అభం శుభం తెలియని పన్నేండేళ్ల వయసు. ఆత్మహత్య, బలవన్మరణం ఏదో ఒకటి చేసుకొని ఖచ్చితంగా ఈరోజు చనిపోవాలనుకున్నాడు. వెంకటేశ్‌ పరిగెత్తుతున్నప్పుడు తనను తప్పించబోయి చనిపోయిన తల్లిని గుర్తు చేసుకున్నాడు. తండ్రి నీ వల్ల నా భార్య ప్రాణం పోయింది. నువ్వే మింగినవురా అని తిట్టిపోసిన మాటలు, ఏడాదిన్నరగా చావు దెబ్బలు తిన్న గుర్తులు జ్ణాపకం తెచ్చుకుంటున్నాడు.  ట్రైన్‌ వస్తుంది. దాని కింద పడి చనిపోతానని నీరసంగా పట్టాల వెంట నడుస్తున్న వెంకటేశుని చూసిన నలభై ఏళ్ల ఆవిడ అతనితో మాటకలిపింది. ఆమె ముఖంలో ప్రశాంతత తన తల్లి లాంటి హృదయం కలిగిన మనిషిలా అనిపించింది వెంకటేష్‌కు. ఆమెతో మాట్లాడితే ప్రాణంగా ప్రేమించే తన తల్లితో మాట్లాడినట్లు అనిపించింది వెంకటేశుకు. మనసు తేలికపడిరది. తన తండ్రి పైనున్న కోపం పూర్తిగా సమసిపోయింది. బ్రతుకు మీది ఆశతో ఇంటికి వెనుదిరిగాడు వెంకటేశ్‌. 

రెండు రోజుల తర్వాత రైల్వేస్టేషన్‌కి వెళ్లిన వెంకటేష్‌ ‘‘మాసిన బట్టలు .... చింపిరి జుట్టు,... ఒక దేవత కనిపించిందా మీకు..?’’ అని ఆమె కోసం వెతుకుతాడు. మాసిన బట్టల్లో దేవతా?...! ఎవరు బాబూ ఆమె..?’’ అని విచిత్రంగా ప్రశ్నించిన వాళ్లకు ఆమె మా అమ్మ. ఇక్కడే ఉంటుందని వెంకటేశు సమాధానమిస్తాడు. అనామకమైన పాత్రతో వెంకటేష్‌ మాట్లాడుతున్నప్పుడు ఆరా తీస్తున్నప్పుడు మాసిన బట్టల్లో దేవత ఎవరు బాబు ఆమె అని విచిత్రంగా ప్రశ్నించిన వాళ్లకు ‘‘ఆమె మా అమ్మ. ఇక్కడే ఉంటుంది’’ అని వెంకటేష్‌ చెప్పే సమాధానం వల్ల మురికిగుడ్డల, చింపిరి జుట్టుగల ఆవిడ పాత్రను అత్యున్నత స్థాయిగా చిత్రీకరించబడింది.

పై మొదటికథలో తల్లిదండ్రుల్ని ఈసడించుకునే కొడుకు కనపడితే, రెండవకథలో ఈసడించుకునేతండ్రిని ప్రేమించే కొడుకు కనబడతాడు. 

జీవి మనుగడ సాగించాలంటే ఆకలి తీరాల్సిందే. ఆహారం కావాల్సిందే. ఆకలిముందు సిద్ధాంతాలు ఏమీ పనిచేయవు. రూపాయి దొరకని పేదరికం కొత్తగా ఆవిష్కరించబడుతుంది. తెలంగాణ సమాజంలో దొరల గడీల ఆగడాలు, దొరల ఆలోచనలు వ్యక్తుల జీవితాలమీద, కుటుంబాల మీద ఎంత ప్రభావం చూపుతుందో తెలుపుతుంది.
ఆకలి ముందు ఏ సిద్దాంతమైనా బలాదూరేనని వివరించే కథ ‘ఇడ్లి పొట్లం’. ఒక్కరు దానం చేయరు. రచయిత ఇరువై రూపాయలు దానం చేస్తాడు. కూడ పెట్టుమని ఒకరు. ఖర్చుచేస్తేనే అభివృద్ధి అని మరొకరు. ఇద్దరు పెద్దమనుషుల మధ్య పెద్ద గొడవ జరుగుతుంది. చివరకు గాలివానలాగా ముదిరిన వాతావరణంలోంచి జీవిత విలువలు జీవితం తెలియనివాడి నుంచి సమాజం నేర్చుకునేలా పాత్రను తీర్చీకరించాడు రచయిత.

ఆకలి బాధితుడు చెప్పే అంశాలను విని ఎకనామిక్స్‌ చదివినోళ్లకు కూడా మెదడు మొద్దుపారుతది. నిజమే రచయితకుండాల్సిన ప్రధానలక్షణం సామాజిక పరిశీలన . అది దాదాపు అన్ని కథలలో ఉంది. సార్వజనీనసందేశం ఇవ్వడం తెలియాలి. ఆ రెండు తెలిసిన రచయిత చక్కటి శిల్పం, ఆకట్టుకునే శైలితో పాఠకుల్ని ఆకుట్టుకుంటాడు. కథ చదువుతున్నంతసేపు మరో వాక్యంలో ఏమవుతుందా అనే ఆతృత పెరుగుతుంది. అడుగడుక్కు మలుపులతో మళ్ళిస్తాడు. ఇది రచయిత రచనా నైపుణ్యానికి మచ్చుతునక.

డబ్బులు అడుగుతుంటే ‘‘పోరా బేకార్‌ నా కొడుకా...! నా దెగ్గర నిలవడ్డవంటే తంతాను’’ అని వెంకటరెడ్డి అసహ్యించుకుంటాడు. జీన్స్‌ వేసుకున్న ఆధునిక యువతి ‘‘ఎల్లెల్లు... చిల్లర లేదు పోరా వెధవా...!’’అని కసిరింది. ‘‘పోరా ఇటడియట్‌! దగ్గరికొస్తే బొక్కలిరుగ్గొడుత’’ అని నీట్‌గా టక్‌ చేసుకున్న యువకుడు ఈసడించాడు. రచయిత ఇచ్చిన ఇరువై రూపాయలతో యాదగిరి కళ్లు మెరిసినయి. ‘‘ఆ డబ్బులతోని సేవింగ్‌ చెయ్యిమని ఒకరు. పుక్కటికొచ్చిందని ఖర్చుచేయమని మరొకరు. " పైసల విలువ తెల్సుకో...’’అని దానం చేయనివాడి ఉచిత సలహా. " ఈ నోటు నీ గొప్ప భవిష్యత్తు మొదటి మెట్టు అనుకోరా.’’ అని ఇంకొకరు. అనుకుంటూ రిలయన్స్‌, అంబాని, కర్సన్‌భాయి పటేల్‌, రామోజిరావు, షారుక్‌ఖాన్‌, రజినీకాంత్‌లు ఎలాపైకొచ్చారో తెలుపుతున్నారు. అవేవీ పట్టించుకోని యాదగిరి రెేకుల హోటల్లకు వెళ్లి నాలుగు ఇడ్లీలు తెచ్చుకొని తింటుంటాడు.

సదాశివం సార్‌ ‘‘రేయ్‌ నిన్నేరా బాడుకావ్‌! ఇట్రా.... మాట జెప్పుత’’ ఈ సారి దీనంగా వచ్చి నిలవడ్డడు యాదగిరి. ఏం రా యాదిగా! నీ కోసమే వాళ్లు పంచాది పెట్టుకుంటున్నారు బస్టాండ్ల. ఆలోచించవార? అని అడిగితే, నాకు గదంత తెలువది. రూపాయి దొరక్క మూడు రోజులనుంచి పస్తులున్న. నాకు గిప్పుడు అన్నిటికంటే ముందున్నది ఆకలే సార్‌. మనిషి బతుకాలన్నా.. సంపాయించాలన్నా బొండిగెల పాణం ఉండాల్నంటే ఆకలి దీరాలే. గీలోకంల ఆకల్ని మించి ఏమున్నది సారూ! యాదగిరి మామూలుగానే చెప్పినా, అతడి మాటల్లోని వాస్తవం మనల్ని ఆలోచనలో పడేసింది. నిజమే కదా! ప్రాణంతో జీవించడం ఎంత ముఖ్యమో తెలియజేయబడుతుంది.

ఒక రచయిత మరణిస్తాడా? చంపేస్తారా? చంపబడుతాడా? ఆ కథకున్ని ప్రత్యేకించి చంపాల్సిన పనిలేదు. ఇది కథకాదు. శైలీ, శిల్పం, కథనం, కంఠ స్వరం లేదనీ కొన్ని మాటలంటే చాలని చెప్పే కథ ‘ఒక రచయిత మరణం’.

ఆశనో, అత్యాశనో కథకు తప్పక బహుమతి వొస్తదనుకున్నడు. తన కథ ఒక సెన్సేషన్‌ అయితదనుకున్నడు. ఆ కథతో తన గ్రాఫ్‌ పైకివెళ్తదా.... పాతాళానికి పడిపోతదా? తేలిపోతదనుకున్నడు. ‘‘అసలు తను రాసింది గొప్పకథేనా...?’’ మౌళికి డౌటు.
జీవితాలను, అదీ రైతుల జీవితాలను కథగా రాయడం కోసం కథకుడు పడిన తాపత్రయం అంతా ఇంతా కాదు. ఆ కథ కోసం రచయిత మూన్నెల్లు రైతులను కలుసుకొని బాధల్ని విన్నాడు. తదాత్మ్యం చెందాడు. కన్నీటితో రాసాడు. రాసిన ప్రతీ వాక్యాన్ని పరిశీలించి చూసుకున్నాడు. సన్నిహిత మిత్రునికి చెపితే చాలా బాగుందని కితాబిస్తూనే అనుభవాలకు జీవం నింపు. కనువిప్పు కలిగించే సందేశం అంతర్లీనంగా వుండేట్టు కథకు రక్తమాంసాలు సమకూర్చు’’ అన్న మిత్రుని మాటలు రచయితకు ఎంతో సంతోషాన్నిచ్చింది.

పేదరైతు జీవితం లిఖించాడు. ఆ రైతే సిద్దప్ప. పత్తివేసిన రైతు నష్టపోయిండు. అప్పులు తెచ్చిండు, వడ్డీలు పెరిగినయి. అలా మూడుసార్లు నష్టపోయిండు. పురుగుమందు తాగిండు. అతను కట్టుకున్న దూదిమేడ అతనినే కూల్చేసింది. రైతు ఆత్మహత్యల పరంపరలో మరో చీకటి కోణం బాధిత మహిళలు. వాళ్ల కుటుంబాలు. సిద్దప్ప పోవడంతో సావిత్రి ఒంటరిదైంది. అప్పులోల్లు ఇంటిమీదికి రావడం వలన సావిత్రి బతుకుకూడా సగం బతుకే అని అనుకున్నది. ఇది స్థూలంగా కథ. ఇది కథే అయినా ఆ రచయిత దాన్ని శిల్పి చెక్కినట్లు, విద్వాంసుడు వీణ మీటినట్లు, గాజు ముక్కలు కిందపడి గజ్జెల శబ్దం చేసినట్టు ఒక మహా కావ్యంగా రాసిండు. కథారూపం, భాష, కథనం, అన్ని సరిచేసాడు. తనను తాను అభినందించుకున్నాడు.

ఇంటికి వచ్చేవరకు ఒక లేఖ వచ్చింది. గౌరవనీయ చంద్రమౌళిగారికి మీరు పంపించిన కథ ఎంపిక కాలేదని చెప్పడానికి చింతిస్తున్నాం. దాన్ని తిరిగి పంపటం సాధ్యంకాదు. అని తెలుగుజిలుగు లేఖ సారాంశం. కథను తరచిచూడాలనుకోలేదు. ఆ కథను మిత్రులెవరికీ వినిపించలేదు. చర్చించలేదు. అతని లక్ష్యం నీరుకారింది. సంకల్పం కూలిపోయింది. మౌళికథ రాసే ప్రయత్నం చెయ్యలేదు. తత్ఫలితంగా ఒక రచయిత మరణించాడు.

2. స్త్రీల సమస్యల చిత్రణ: అయోధ్యారెడ్డి బలమైనగొంతుగా స్త్రీల పక్షంగా కలం ఎత్తుతాడు. ముఖ్యంగా స్త్రీవాద కథ అన్నది మాత్రం 1980ల తర్వాత మాత్రమే కనిపించే భావన. కథా పుట్టుక ప్రారంభంలోనే స్త్రీల జీవితాలను వ్యక్తీకరించాయి. 1902లో వెలువడ్డ భండారు అచ్చమాంబ ‘స్త్రీవిద్య’ కథతో  స్త్రీ జీవితం నేపధ్యంగా తెలుగుకథలో రచయిత్రుల కథ మొదలైంది. భర్త కోసం చదువుకుంది అచ్చమాంబ కథానాయిక. చదువుకోవడంతో మొదలైన స్త్రీ చైతన్యం నెమ్మదిగా ఆర్ధిక స్వాతంత్య్రం, ఆత్మగౌరవం, స్వాభిమానం, కుటుంబంలో, సమాజంలో సమానస్థానం, సమానహక్కుల గురించి మాట్లాడడం వరకూ వచ్చింది. సామాజికంగా స్త్రీలలో క్రమక్రమంగా  వచ్చిన ఈ చైతన్యానికి రచయిత్రుల సాహిత్యం దర్పణం పట్టింది.

గురజాడ అప్పారావు ‘దిద్దుబాటు’ కథలో కమిలిని పాత్రద్వారా సంస్కరణవాదాన్ని జొప్పిస్తాడు. చదివింది కాబట్టి ఉత్తరం రాసిపోయింది అని గోవిందరావు నౌకరితో అంటాడు. గోవిందరావులో పరిణామం తెచ్చిన పాత్రగా తీర్చిదిద్దుతాడు. ‘‘ఆధునిక మహిళ మానవ చరిత్రను తిరిగి రచిస్తుంది.’’అని (21.05.1909న ఒంగోలు ముని సుబ్రహ్మణ్యంకు రాసిన లేఖ)లో ఉటంకించారు.

‘‘నన్నడక్కుండా సుబ్బికి పెళ్లెందుకు నిశ్ఛయించావు’’ అని కన్యాశుల్కం నాటకంలో వెంకమ్మ అగ్నిహోత్రావధానిని నిలదీసింది. మోసగిస్తున్ను గిరీశంను కొట్టడానికి పూటకూళ్లమ్మ చీపురు తీసుకొని మధురవాణి ఇంటికి వెళ్లింది. ‘‘మా యిళ్ళాల్లాకు కోపం వస్తే చీపురు కట్టలు ఎగురుతుంటాయి’’ అని కర్కాటక శాస్త్రిచే అనిపించాడు. సంస్కరణాత్మక భావాలను గురజాడ వెదజల్లారు. ‘‘అసలు బిడ్డలకు వలెనే కథలకు కూడా మాతృత్వం మాది’’ అంటుంది కనపర్తి వరలక్షమ్మగారి కథ రాజేశ్వరి(కల్పనా రెంటాల ఆగస్ట్‌21 కల్పనారెంటాల.వర్డ్‌ప్రెస్‌) స్రీ, పురుషులు ఎవరు రాసినా ప్రత్యక్షంగానో పరోక్షంగానో    స్త్రీ జీవితాదర్శంతోనే ప్రారంభమైందని చెప్పుకోవాల్సిందే. వాస్తవం కూడా.

కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థలపై ధిక్కారం స్త్రీవాద కథల్లో కనిపించే ప్రధానాంశం. చలం, భండారు అచ్చమాంబ, మల్లాది సుబ్బమ్మ, రంగనాయకమ్మ, ఇల్లందలీ సరస్వతీ దేవి, డా. పాకాల యశోదారెడ్డి  స్త్రీ కథలకు ప్రాణం పోశారు. సొంతంగా జీవితాన్ని నిర్మించుకునే స్త్రీల పాత్రలు కొందరు స్త్రీవాదుల కథల్లో కనిపిస్తాయి. కుప్పిలి పద్మ ‘నిర్ణయం’, ‘ది ఇన్‌స్టెంట్‌ లైఫ్‌’, ఓల్గా ‘ప్రయోగం’, కొండేపూడి నిర్మల ‘ఎద్దుపుండు’ ‘ఉష్ట్రపక్షి’, ఇంకా మరికొందరు రాసిన కథల్లో కూడా ఈ అంశాలు కనిపిస్తాయి. వివాహ వ్యవస్థలోని అసమానతల్ని ప్రశ్నిస్తాయి. ఈ వ్యవస్థ మనుగడపై ప్రశ్నల్ని లేవనెత్తుతాయి. స్త్రీల రక్షణకు పెళ్లి మంచిదనే వాదనల్ని ధిక్కరిస్తాయి. (భూమిక అంతర్జాల పత్రిక ఆగష్టు, 2012, రాజేశ్వరి, శివుని.) సరిగ్గా ఆధునిక కాలంలో వారి వారసత్వం పుణికిపుచ్చుకున్న అయోధ్యారెడ్డి హృదయాన్ని పిండేలా విషాదంగా, ఆలోచనాత్మకంగా, సంప్రదాయం మీద తిరుగుబాటుగా  ఈ ‘అక్కన్నపేట రైల్వే స్టేషన్‌’లో అధికభాగం ఉన్నాయి.

ఒక జీవితకాల విషాదం. తిరిగి ప్రాణాన్ని భూమ్మీదికి తీసుకొచ్చి అనేక ప్రశ్నల బాణాలు ఎక్కుపెడుతూ భ్రూణ హత్యలను విషాదంగా అక్షరబద్దం చేసాడు రచయిత. స్త్రీల మనోభావాలను, తమ్మున్ని కోల్పోయిన, వెలివేసిన ఒక స్త్రీకి దగ్గరైన తమ్ముడుకానీ తమ్మున్ని పరిచయం చేస్తాడు. ఆదర్శాలను వల్లిస్తూ లోలోన భార్యల్ని హింసించే భర్తల మనస్తత్వాలను ప్రతిబింబించాడు. వాస్తవాన్ని లిఖించే, చర్చించే, బలహీనుల పక్షంగా గొంతెత్తితే మానసికంగా ఎలా చంపేస్తారో కళ్లకట్టినట్లు చూపుతాడు. ప్రేమించేటప్పుడు లేని భేదం పెళ్లివద్ద కులమతాల కుళ్లుకు మోసపోతున్న అమ్మాయిల అంతరంగం కనపడుతుంది. సంపదను కాదనీ లేచిపోయి వచ్చిన జీవితానికి బదులుగా మరణం బహుకరించిన కామం ఎలా వెంటపడుతుందో తెలుపుతుంది. అంటే దాదాపు శిశువు నుంచి మరణించే వరకు స్త్రీలను, స్త్రీల అంతస్సంఘర్షణను లిఖిస్తాడు.

ఆడ పుట్టుకకు ఆర్నెల్ల ముందునుంచే హత్యాప్రయత్నం ప్రారంభమైందని తెలిపే కథ ‘పేగుముడి’ కథ. కలవారి కోడలు సావిత్రి. మెట్టినిల్లు ఒక ముళ్ల పంజరమై అందులో అంగుళమైనా ఎగురలేని పక్షిలా ఐదేళ్లు ఇంకుతున్న నీడలా గడిపింది. అప్పటికే ఆమెకు రెండు సార్లు గర్భస్రావం చేయించారు. హాస్పిటల్‌కి వెళ్లితే మూడవసారి మళ్లీ ఆడపిల్లే అని నిర్ధారణ అయ్యింది.  పేగుముడి కథ సమకాలీన పరిస్థితుల్లో అబలల జీవితాన్ని ఆధారం చేసుకుని రాసిన కథ. ఆడపిల్ల పుట్టింది మొదలుకొని ఎప్పుడు చంపుదామా అని చూసే పితృస్వామ్య వ్యవస్థలో అనేకమంది మనుషుల్లో ఉన్న దుర్మార్గపు ఆలోచనలు బట్టబయలు చేస్తుంది. పురుషునికి భార్య రావాలి. చెల్లి కావాలి. అక్క కావాలి. కానీ పుత్రిక వద్దని నివారించే అనేక మందికి ఈ కథ ఒక మేల్కొలుపు.

తల్లి గర్భాన్ని చిదిమితే వందేళ్లు జీవించాల్సిన పాప దేవలోకంలోకి వెళ్లిపోయింది. దేవలోకం ఒక అద్భుతమైన ప్రపంచం. అందాలకు ఆనందాలకు నెలవైన ప్రదేశం. కలతలకు కన్నీళ్ళకు తావులేదక్కడ. అయితే ఎన్నిఉన్నా అమ్మలేనితనంవల్ల జీవితమే శూన్యం అనిపించింది ఆ పాపకు. దిగులుగా ఉన్న పాపను ‘‘భూలోకం వెళ్తావా’’ అని దేవుడు పిలిచి అడుగుతాడు. అట్లా భూలోకంలోని తన తల్లి గృహంలోకి ప్రవేశిస్తుంది. వాచ్ మెన్‌ వారిస్తున్నా పాప ఇంట్లోకి ప్రవేశించింది. వయసు ముప్పై ఏళ్లలోపు ఉన్న ఆవిడని చూసి ‘‘అమ్మ’’ అని సంబోధించింది. నన్నెందుకు చంపావు? అని ప్రశ్నించింది. ఏం మాట్లాడుతున్నావ్‌ నాకు పిల్లలులేరు అని ఆమె సమాధానం ఇచ్చింది. నేను నీ బిడ్డనే. కాదంటే అవుననీ అనేక ప్రశ్నలతో విసిగిస్తుంది పాప. అయితే ఏమంటున్నవ్‌? నిన్ను కావాలనే చంపేసినం. అని తల్లి ప్రశ్నిస్తుంది. నన్ను కావాలని చంపేశారా? ఎందుకు చంపారు? కనేది ఆడో మగో తెలియనపుడు చంపే హక్కు మీకెక్కడిది? అని ప్రశ్నిస్తూ లాన్లో పడి అమ్మా అని అరిచింది. దిగ్గున మేల్కొన్న సావిత్రి ‘‘అయ్యో బిడ్డా!’’అని అరిచింది.

మరునాడు హాస్పిటల్‌లో -  కొద్దిసేపట్లోనే డాక్టర్‌ నిన్ను లోపలికి పిలుస్తుంది అని సావిత్రి భర్త చెప్పిపోయాడు. ఒక శూన్యం... ఒక మృత అనుభూతి. గర్భస్థ శిశువును చిదిమేసే క్రమంలో గదిలో బలివేదిక. పుట్టబోయే బిడ్డ నన్ను బతుకనివ్వు అని దీనస్వరంతో ప్రాధేయపడుతూ నిలదీసినట్లు అనిపించింది. తన దేహంపై తనకే అసహ్యం కలిగింది. సావిత్రి మనసు అడవిలా కాలుతుంది. ఈ సారి ' నీతో పాటు నేనూ వస్తున్న 'అంటూ పొట్ట నిమురుతూ ఆరంతస్తుల భవనం నుంచి దుమికింది. అవే సావిత్రి చివరి మాటలు.

పేగుముడి కథ విషాందంతంతో ముగుస్తుంది. తెలుగు కథా సాహిత్యంలో విషాదాంతంగా ముగిసే కథలు రాయడం అతితక్కువ.  వాస్తవాన్ని కుండబద్దలు కొట్టినట్లు, సమాజంలో జరిగే దానిని ఉన్నది ఉన్నట్టు చెప్పడం వ్యవస్థ మీద ఉమ్మివేసినట్లున్నది. పాఠకుడు కథ చదువుతున్నంత సేపు సంఘర్షణకు లోనవుతాడు. కథ చదివాక మనసు మనసులా ఉండదు. మనసు అగ్నిగోళంగా మారుతుంది. మనసులో సునామీల భీభత్సం జరుగుతుంటది. మనసును పిండిన సినిమా భాషలో చెప్పాలంటే ఒక ‘పుట్టింటి పట్టుచీర’, ఒక ‘మాతృదేవోభవ’ స్పురణకొచ్చింది.

మగడు వేల్పన పాతమాటది ప్రాణమిత్రుడ నీకు ‘(కాసులు: ఆంధ్రభారతి ఆగష్టు,1910) గురజాడ వెలిబుచ్చిన అభిప్రాయాన్ని (ప్రజాశక్తి చంద్రశేఖరరెడ్డి, రాచపాళెం. 4.10.2021) రూఢీ చేస్తూ ఆధునిక కాలంలో మారుతున్న జీవనస్థితిగతులు, ఆర్థికంగా నిలదొక్కుకుంటున్న మహిళల ప్రభావం అటు ఇళ్లల్లో, ఇటు సమాజంపైన ఎంతో ప్రభావాన్ని చూపుతుంది. ఎవరిమీద ఆధారపడని స్త్రీ స్వతంత్ర నిర్ణయాలు ఊహకందకుండా ఎలా ఉంటాయో ఆధునిక జీవితాన్ని అత్యాధునికంగా రాయడం అయోధ్యారెడ్డికే చెల్లుతుంది.

ఇద్దరిమధ్య ఉండాల్సిన ప్రేమ కొరవడడం, ఒక మనస్పర్థ జీవితకాలం వేధిస్తుందనడానికి ఉదహరించే కథ. క్షణకాలంలో తీసుకున్న నిర్ణయాలు పచ్చని జీవితాలను ఎలా శిథిలం చేస్తాయో ‘శిథిల’ కథ తెలుపుతుంది. ఈ కథ స్త్రీస్వాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని, సహాయ నిరాకరణ చేసే పురుషస్వామ్యంపై తిరుగుబాటు ప్రకటిస్తుంది.
 
             (మిగతా భాగం రేపు )
 

click me!