చాలా కాలంగా గర్భం దాల్చడానికి ప్రయత్నించి విఫలమైన వారు చాలా మందే ఉన్నారు. పదే పదే ఇలా ఎందుకు జరుగుతుందని చాలా బాదపడుతుంటారు. కానీ గర్భం దాల్చకపోవడానికి కొన్ని కారణాలు ఉంటాయి. అవేంటంటే?
పిల్లలంటే ప్రతి ఒక్కరికీ ఇష్టమే. పెళ్లైన ప్రతి జంట పిల్లల కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తారు. గర్భం దాల్చారన్న వార్త వింటే ఇంటిళ్లిపాది ఆనందిస్తారు. కానీ ప్రస్తుత కాలంలో చాలా మంది పేరెంట్స్ కాలేకపోతున్నారు. ఇది ఎంతో బాధకు గురిచేస్తుంది. చాలా మంది గర్భం దాల్చడానికి ఎంతో ప్రయత్నిస్తారు. అయినా విఫలమవుతూనే ఉంటారు. అసలు గర్భం ఎందుకు దాల్చరు? దానికి కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
గర్భాశయ పరిమాణం: గర్భాశయం పరిమాణం నార్మల్ గా లేకపోతే కూడా గర్భం దాల్చడంలో సమస్య ఉంటుంది. గర్భాశయం సరైన ఆకారంలో లేకపోతే ఫలదీకరణ గుడ్డుకు స్థానం ఇవ్వదు. దీనివల్ల గర్భం దాల్చలేరని నిపుణులు అంటున్నారు.
గర్భాశయంలో ఫైబ్రాయిడ్లు: గర్భం దాల్చకపోవడానికి ఫైబ్రాయిడ్లు ఒక ప్రధాన కారణం. గర్భాశయంలోని ఫైబ్రాయిడ్లు ఫలదీకరణ గుడ్డు స్థానాన్ని ప్రభావితం చేస్తాయి. దీనివల్ల ప్రగ్నెన్సీ కాలేరు.
పురుషుల ఆరోగ్యం: స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండటం, నాణ్యతలేని, చలనశీలత సరిగ్గా లేదా పరిమాణం సరిగ్గాలేని స్పెర్మ్ వల్ల కూడా పురుషులలో వంధ్యత్వ సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటుగా మధుమేహం, ఆల్కహాల్ ను ఎక్కువగా తాగడం వల్ల, స్మోకింగ్ చేయడం వల్ల పురుషుల్లో సంతానలేమి సమస్యలు వస్తాయి.
ఒత్తిడి: ప్రస్తుత కాలంలో చాలా మంది బాగా ఒత్తిడికి గురవుతున్నారు. ఈ ఒత్తిడి ఎన్నో అనారోగ్యసమస్యలను కలిగిస్తుంది. పలు అధ్యయనాల ప్రకారం.. ఒత్తిడి కారణంగా స్త్రీ సంతానోత్పత్తి తగ్గుతుంది. ఒత్తిడి మహిళల కంటే పురుషులే దీనికి ఎక్కువగా ప్రభావితం అవుతున్నారు.
వయసు: మీ సంతానోత్పత్తి వయస్సుతో పాటుగా మారుతుంది. మీకు తెలుసా? వయసు పెరిగే కొద్దీ అండాల పరిమాణం, నాణ్యత తగ్గుతాయి. స్త్రీ శరీరం అండాలను కోల్పోయే రేటు 37 సంవత్సరాల వయస్సులో ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో మీరు గర్భం దాల్చడం కష్టమవుతుంది. ఇక పురుషుల విషయానికొస్తే 40 సంవత్సరాల తర్వాత వీరిలో సంతానోత్పత్తి తగ్గడం ప్రారంభమవుతుంది.
హార్మోన్లు: గర్భం దాల్చాలంటే స్త్రీ సెక్స్ హార్మోన్లు అవసరం. అయితే కొన్ని కారణాల వల్ల ఈ హార్మోన్లు అసమతుల్యంగా మారుతాయి. దీనివల్ల గర్భం దాల్చే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయి.
అనారోగ్యకరమైన జీవనశైలి: మీ పేలవమైన జీవనశైలి వల్ల కూడా సంతానోత్పత్తి దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. పిల్లలు పుట్టాలంటే మీ లైఫ్ స్టైల్ బాగుండాలి.