మన శరీరానికి ఫుడ్ అవసరమే. కానీ అతిగా తింటే మాత్రం మీ శరీర బరువు పెరగడంతో పాటుగా ఎన్నో వ్యాధులు కూడా వస్తాయి. అయితే కొంతమందికి ఎంత తిన్నా మళ్లీ మళ్లీ ఆకలి అవుతూనే ఉంటుంది. అసలు ఇలా ఎందుకు అవుతుందంటే?
మన శరీరంలో శక్తి లేనప్పుడు లేదా తినే సమయం అయిప్పుడు ఆకలి అవుతుంటుంది. ఇది సర్వ సాధారణ విషయం. ఫుడ్ మన శరీరానికి కావాల్సిన పోషకాలను, ఖనిజాలను, ఎనర్జీని అందిస్తుంది. కానీ కొంతమందికి అదేపనిగా ఆకలి అవుతూనే ఉంటుంది. అంటే ఎంత తిన్నాగాని మళ్లీ ఆకలి అవుతూనే ఉంటుంది. అసలు ఇలా ఎందుకు అవుతుందో కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం..
నిద్రలేమి
ప్రస్తుత కాలంలో చాలా మంది ఈ నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. అయితేఆకలి హార్మోన్ అయిన గ్రెలిన్ నిద్రలేమి వల్ల ప్రభావితమవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ గ్రెలిన్ అనే హార్మోన్ మీరు ఆకలితో ఉన్నారని మీ మెదడుకు తరచుగా సంకేతాలను పంపుతూనే ఉంటుంది. దీంతో మీకు ఎంత తిన్నా ఆకలి అవుతూనే ఉంటుంది.
ఒత్తిడి
ఒత్తిడి ఒక మానసిక సమస్యగానే భావిస్తారు చాలా మంది. కానీ ఒత్తిడి ఎన్నో సమస్యలకు దారితీస్తుంది. ఒత్తిడి వల్ల కార్టిసాల్ అనే హార్మోన్ రక్తప్రవాహంలోకి విడుదల అవుతుంది. ఈ హార్మోన్ ఎక్కువగా లేదా తక్కువగా ఉన్నప్పుడు మనకు ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. వీటిలో తరచుగా ఆకలి అవడం కూడా ఉంది.
ప్రోటీన్ లోపం
మన శరీరం ఆరోగ్యంగా, ఎనర్జిటిక్ గా ఉండటానికి ప్రోటీన్ చాలా అవసరం. అయితే మనం తినే ఆహారంలో ప్రోటీన్ లేకపోవడం వల్ల మన శరీరానికి అవసరమైన శక్తి అందదు. దీనివల్ల మీరు మరింత ఆకలితో ఉంటారు. అందుకే ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినాలి.
డయాబెటిస్ మెల్లిటస్
డయాబెటీస్ ఉంటే కూడా తరచుగా ఆకలి అవుతుంది. డయాబెటిస్ ఉన్నవారికి సాధారణంగా రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల మీకు ఎక్కువ సార్లు తినాలనిపిస్తుంది.
థైరాయిడ్ వ్యాధి
థైరాయిడ్ వ్యాధి ఉన్నవారికి కూడా తరచుగా ఆకలి అవుతుంటుంది. ఎందుకంటే ఈ వ్యాధి శరీరంలోని కేలరీలను తగ్గిస్తుంది. దీనివల్ల మీకు తరచుగా ఆకలిగా అనిపిస్తుంది. ఎక్కువగా తినాలనిపిస్తుంది.