పెళ్లయ్యాక ఎటువంటి గర్భనిరోధక పద్ధతులూ పాటించకుండా సంవత్సరంపాటు భార్యాభర్తలు కలిసినా గర్భం దాల్చకపోతే.. లోపం ఉన్నట్లే.
‘‘ ఓ వ్యక్తికి పెళ్లి జరిగి మూడు సంవత్సరాలు గడుస్తున్నా.. పిల్లలు కలగలేదు. దీంతో.. అతని పెద్దలు.. భార్యకు విడాకులు ఇప్పించి మరో యువతితో వివాహం జరిపించారు. అయినా పిల్లలు కలగలేదు. ఆమెకు కూడా విడాకులు ఇప్పించి.. మరో యువతితో వివాహం జరిపించారు. అయినా సంతానం కలగలేదు. చివరకు అతనికి పరీక్షలు జరపగా.. లోపం ఆ అమ్మాయిల్లో కాదు.. అతనిలోనే అని తేలింది.’’
పూర్వం ఇలానే జరిగేది. పిల్లలు పుట్టడం లేదు అంటే.. అది అమ్మాయి తప్పుగానే పరిగణించేవారు. కానీ.. పిల్లలు కలగకపోవడానికి కేవలం భార్యలోనే కాదు.. భర్తలోనూ లోపం ఉండొచ్చు అంటున్నారు నిపుణులు.
పెళ్లయ్యాక ఎటువంటి గర్భనిరోధక పద్ధతులూ పాటించకుండా సంవత్సరంపాటు భార్యాభర్తలు కలిసినా గర్భధారణ జరగకపోతే కచ్చితంగా లోపం ఉందని అనుమానించవచ్చు. ఎటువంటి వ్యాధులూ లేని వంద జంటలు, సురక్షిత పద్ధతులు పాటించకుండా నెల రోజులపాటు ‘ఫర్టైల్ పీరియడ్’లో (నెలసరి ఆగిన 10వ రోజు నుంచి 18వ రోజు వరకు) కలిస్తే, గర్భం దాల్చే అవకాశాలు 5%నుంచి 10% ఉంటాయి.
ఇలాకాకుండా 100% కచ్చితత్వం తెలుసుకోవాలనుకుంటే సంవత్సరంపాటు ఆగాల్సిందే! అప్పటికీ గర్భధారణ జరగకపోతే ఆలస్యం చేయకుండా వైద్యుల్ని సంప్రతించాలి. పిల్లలు పుట్టకపోవడానికి సమస్య ఎవరిలో ఉందో తెలుసుకోవడానికి దంపతులిద్దరూ పరీక్షలు చేయించుకోవాలి. ఒకవేళ వంశంలో ఎవరికైనా వంధత్వ సమస్య ఉంటే పెళ్లయిన వెంటనే వైద్యుల్ని కలవాలి.
పురుషుల్లో సమస్య ఉండటానికి చాలా కారణాలే ఉన్నాయి. వారికి స్మోకింగ్ డ్రింకింగ్ అలవాటు ఉండి ఉండొచ్చు. ల్యాప్ టాప్ ఒడిలో పెట్టుకొని పని చేస్తూ ఉండి ఉండొచ్చు. జీవన సైలిలో మార్పులు కావచ్చు. జెనిటికల్ ఇన్ ఫెక్షన్స్, బిగుతైన లోదుస్తులు ధరించడం ఇలా చాలా కారణాల వల్ల సంతానం కలగకపోవచ్చు. కాబట్టి ముందే జాగ్రత్త పడి డాక్టర్ ని సంప్రదించడం ఉత్తమం.