
యూపీలోని గోరఖ్ పూర్ లో జరిగిన ఓ వింత ఘటన ప్రస్తుతం వైరల్ అవుతోంది. తాగుబోతు భర్తలతో విసిగి వేసారిన ఇద్దరు మహిళలు.. వారి భర్తలను వదిలేసి పెళ్లి చేసుకున్నారు. కవిత, గుంజ అనే ఇద్దరు మహిళలు దేవరియాలోని ఒక ఆలయంలో వివాహం చేసుకున్నారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో కలుసుకున్న ఈ జంట.. వారి తాగుబోతు భర్తల చేతుల్లో అనుభవించిన బాధలను ఒకరితో ఒకరు పంచుకున్నారు. ఇద్దరు తమ కష్టాలను చెప్పుకొని ఓదార్పు పొందేవారు. దీంతో వారి బంధం బలపడి.. చివరికి ఇద్దరు కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు.
చోట కాశీగా పిలువబడే శివాలయంలో గుంజ కవితతో దండలు మార్చుకున్నారు. ఈ జంట ఆలయంలో 5 ప్రదక్షిణలు చేసి, జీవితాంతం ఒకరికొకరు అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. ఆలయ పూజారి ఉమా శంకర్ పాండే మహిళల వివాహాన్ని నిర్ధారించారు.
తాగుబోతు భర్తలు పెట్టే చిత్రహింసలతో తాము విసిగిపోయినట్లు మహిళలు చెబుతున్నారు. ఈ పెళ్లితో తమ జీవితాల్లో ప్రేమ, శాంతి నెలకొంటుందని ఆశపడుతున్నారు. గోరఖ్‌పూర్‌లో ఒక గదిని అద్దెకు తీసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాలని చూస్తున్నట్లు ఆ జంట చెప్పుకొచ్చారు.