కొన్ని రకాల ఆహారాలు మనల్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటుగా చర్మానికి, జుట్టుకు ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా ఇవి జుట్టు రాలడాన్ని చాలా వరకు తగ్గిస్తాయి.
ప్రతి అమ్మాయికి తన జుట్టు పొడుగ్గా, ఒత్తుగా ఉండాలని ఉంటుంది. కానీ కలుషిత వాతావరణం, ఒత్తిడి వంటి ఎన్నో కారణాల వల్ల ఆడవారిలోనే హెయిర్ ఫాల్ సమస్య ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వానాకాలంలో వాతావరణంలోని తేమ వల్ల జుట్టు మూలాల్లో మురికి పేరుకుపోయి బలహీనపడతాయి. దీంతో జుట్టు విపరీతంగా రాలుతుంది. అయితే జుట్టు సంరక్షణతో పాటుగా మీ రోజువారి ఆహారంలో కొన్ని చేర్చుకున్నా మీ జుట్టు రాలడం చాలా వరకు తగ్గుతుంది. అందుకే జుట్టు ఊడిపోకుండా ఉండేందుకు ఏం తినాలో ఇప్పుడు తెలుసుకుందాం..
మెంతులు : మన అమ్మమ్మలు, నానమ్మలు జుట్టును బలంగా, ఒత్తుగా ఉంచడానికి మెంతులను బాగా ఉపయోగించేవారు. ఇప్పుడు కూడా చాలా మంది మెంతులను ఉపయోగిస్తున్నారు. అవును మెంతుల్లో ఉండే విటమిన్ ఇ మన ఒత్తిడిని తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తాయి. ఇవి జుట్టుకు మంచి మేలు చేస్తాయి. అందుకే మెంతులను రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఆ నీటిని ఉదయాన్నే పరిగడుపున తాగండి.
గుడ్లు: గుడ్లలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. అలాగే ఇది జుట్టు బాగా పెరిగేందుకు కూడా బాగా సహాయపడుతుంది. గుడ్లలో కెరాటిన్, బయోటిన్, కెరాటిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు పెరగడానికి ఎంతగానో సహాయపడతాయి. గుడ్లు జుట్టులో కెరాటిన్ మొత్తాన్ని పెంచి జుట్టును పొడుగ్గా పెంచుతుంది.
పాలకూర: పాలకూరలో విటమిన్ బి, ఐరన్, పోలాట్ తో పాటుగా ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. ముఖ్యంగా వర్షాకాలంలో పాలకూరను ఆహారంలో చేర్చుకుంటే మీ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. జుట్టు బలంగా ఉంటుంది. అస్సలు ఊడిపోదు.
చేపలు: చేపల్లో విటమిన్ ఎ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మీ జుట్టుకు మంచి బలాన్నిస్తాయి. దీనిలో ఉండే విటమిన్ ఎ నెత్తిమీద తేమను నిలుపుకోవటానికి, జుట్టును మందంగా ఉంచడానికి సహాయపడుతుంది.
నట్స్: ప్రతి సీజన్ లో మీ జుట్టు ఆరోగ్యంగా, సురక్షితంగా ఉండాలంటే మాత్రం మీరు ప్రతిరోజూ బాదం, వాల్ నట్స్, పిస్తా వంటి గింజలను ఖచ్చితంగా తినాలి. నట్స్ లో విటమిన్లు, ఎక్కువ మొత్తంలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టును తేమగా ఉంచడానికి సహాయపడతాయి. కాబట్టి జుట్టు రాలిపోకుండా ఉండాలంటే డ్రై ఫ్రూట్స్ ను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోండి.
అలాగే మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో పాలు తాగినా, పెరుగు తిన్నా.. మీ శరీరం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా.. మీ జుట్టుకు కూడా ఎంతో మేలు జరుగుతుంది. వీటిలో ఉండే ప్రోటీన్, కాల్షియం జుట్టును బలోపేతం చేస్తాయి. అలాగే జుట్టు కోల్పోయిన తేమను తిరిగి మెరిసేలా చేస్తుంది.