తింటూ ఫోన్ చూస్తే ఏమౌతుందో తెలుసా?

By Shivaleela Rajamoni  |  First Published Jul 2, 2024, 4:15 PM IST

చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఫోన్లకు బాగా అడిక్ట్ అయిపోయారు. కానీ లిమిట్ కు మించి ఫోన్ ను వాడితే మాత్రం లేని పోని సమస్యలను ఫేస్ చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా తింటూ మొబైల్ ఫోన్ చూసే అలవాటు చాలా మందికి ఉంటుంది. దీనివల్ల ఏమౌతుందో తెలిస్తే షాక్ అవుతారు.
 


ఫోన్ లేని కాలమే బాగుండేదని పెద్దలు అంటుంటారు. అది నిజమే మరి. ఫోన్ వాడకం అలవాటైన తర్వాత ఒకరితో ఒకరికి సంబంధాలు తగ్గిపోయాయి. అంతేనా ఆరోగ్యం కూడా బాగా దెబ్బతింటోంది. ఈ ఆధునిక ప్రపంచంలో ఫోన్ మన దైనందిన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. చాలా మంది తినేటప్పుడు, నిద్రపోతున్నప్పుడు, టాయిలెట్లో ఉన్నప్పుడు కూడా మొబైల్ ఫోన్లను ఉపయోగిస్తారు. దీనివల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. కానీ తినేటప్పుడు ఫోన్ చూడటం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఊబకాయం: చిన్న పిల్లలు తినడానికి మారాం చేస్తారని తల్లిదండ్రులు ఫోన్ లో రైమ్స్ పెట్టి వారికి చూపిస్తూ తినిపిస్తారు. ఇక పెద్దవారు తింటూ మొబైల్ స్క్రోల్ చేస్తుంటారు. ఇది అందరికీ తెలిసిన ముచ్చటే. కానీ దీని పరిణామాలు ఎలా ఉంటాయో ఎవ్వరికీ తెలియవు. మీకు తెలుసా? ఫోన్ చూస్తూ తింటే ఎంత తింటున్నామో తెలియకుండా ఎక్కువ తినేస్తాం. దీనివల్ల మీరు బరువు పెరిగిపోయే అవకాశం ఉంది. 

Latest Videos

జీర్ణ సమస్య: ప్రస్తుత కాలంలో చాలా మంది జీర్ణ సమస్యలతో  బాధపడుతున్నారు. దీనికి మొబైల్ ఫోన్ కూడా ఒక కారణమేనంటున్నారు నిపుణులు. అవును మొబైల్ ఫోన్ ను చూస్తూ తింటే ఆహారాన్ని సరిగ్గా నమలరు. ఇలా నమలకుండా ఆహారాన్ని మింగేయడం వల్ల అది నేరుగా కడుపులోకి వెళ్లి జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. 

అసంతృప్తి: మొబైల్ చూస్తే ఏ పనిచేసినా.. దాన్ని ఏకాగ్రతతో చేయలేరు. దానిపై మనసు పెట్టలేరు. దీనివల్ల ఆ పని చేసినట్టుగా కూడా ఉండదు. కాబట్టి మీరు తినేటప్పుడు ఫోన్ చూస్తే మీ మనస్సు కేవలం మొబైల్ ఫోన్ పైనే ఉంటుంది తప్ప తినడంపై ఉండదు. దీనివల్ల మీకు తిన్నదానితో సంతృప్తి ఉండదు. 

డయాబెటీస్: తినేటప్పుడు టీవీ లేదా ఫోన్ ను చూడటం వల్ల మీరు అవసరానికి మించి ఎక్కువగా తినడం వల్ల మీ శరీర బరువు బాగా పెరిగిపోతుంది. దీంతో మీ జీవక్రియ బాగా తగ్గుతుంది. ఇది మీకు డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే మీ శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగే ప్రమాదం కూడా ఉంది. 

కుటుంబ బంధం తగ్గుతుంది: ఒకప్పుడు కుటుంబ సభ్యులంతా ఒకేసారి కూర్చొని తింటూ మాట్లాడుకునేవారు. కానీ మొబైల్ వాడకం మొదలైనప్పటి నుంచి ఎవరికి వాళ్లు తింటున్నారు. ఒకవేళ అందరూ కలిసి తిన్నా.. తలా ఒక ఫోన్ పట్టుకుని దానిలో తల దూరుస్తూ తింటున్నారు. 

పరధ్యానం : తినేటప్పుడు మొబైల్ ఫోన్ చూడటం వల్ల పరధ్యానంగా ఉంటారు. అంటే ఫోన్ లో తలదూర్చడం వల్ల ఆహారంలో దుమ్ముందా, పురుగులు ఉన్నాయా; ఈగలు వాలాయా? అని కూడా చూసుకోకుండా తింటుంటారు. ఇది మీ ఆరోగ్యాన్ని డేంజర్ జోన్ లో పడేస్తుందని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదేమో. 

click me!