చాలా మంది నాలుకను రోజూ క్లీన్ చేస్తుంటారు. కానీ దీనివల్ల ఏం జరుగుతుందో మాత్రం వీళ్లకు తెలియదు. అసలు రోజూ నాలుకను క్లీన్ చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
నిజానికి నాలుకను రోజూ క్లీన్ చేయడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. నాలుకను క్లీన్ చేయడంతో నాలుకపై ఉన్న బ్యాక్టీరియా, ఆహార శిధిలాలు, చనిపోయిన కణాలు తొలగిపోతాయి. దీనివల్ల మీ శ్వాస ఫ్రెష్ గా ఉండటమే కాకుండా.. కావిటీస్ తో పాటుగా ఎన్నో చిగుళ్ల వ్యాధులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
మార్కెట్ లో మనకు టంగ్ స్క్రాపర్లు ఎన్నో ఆకారాలు, సైజుల్లో దొరుకుతాయి. ఇవి మీకు కంఫర్ట్ గా ఉండాలంటే వీటిని మెడికల్ షాపుల్లో కొనడం మంచిదంటారు ఆరోగ్య నిపుణులు. బ్రషింగ్, ఫ్లోసింగ్ తో కలిపి మీరు నాలుకను శుభ్రం చేయాలి. ఇది మీ నాలుక పై భాగంలో ఉన్న అదనపు కణాలను తొలగించడానికి చక్కగా ఉపయోగపడుతుంది.
నాలుకను శుభ్రం చేయడం వల్ల నాలుకపై ఉన్న బ్యాక్టీరియా పోతుంది. అలాగే నాలుక క్లియర్ అవుతుంది. మనం పళ్లను తోముకున్నప్పుడు లేదా నాలుకను నీళ్లతో కడిగినప్పుడు ఈ బ్యాక్టీరియా తొలగిపోదు. అదే మీరు నాలుకను క్లీన్ చేస్తే ఈ బ్యాక్టీరియా చాలా వరకు తొలగిపోతుంది. ఒక అధ్యయనం ప్రకారం.. టంగ్ స్క్రాపర్లు జస్ట్ పళ్లు తోముకోవడం కంటే 79% ఎక్కువ బ్యాక్టీరియాను తొలగించగలవని కనుగొన్నారు. టంగ్ స్క్రాపర్లు నోట్లో నుంచి వచ్చే దుర్వాసనకు, దంత క్షయానికి కారణమయ్యే లాక్టోబాసిల్లిని తొలగిస్తాయి.
రోజుకు రెండు సార్లు టంగ్ స్క్రాపర్లను ఉపయోగిస్తే ఫుడ్ రుచి మీకు స్పష్టంగా తెలుస్తుంది. దీనివల్ల రుచి భావన మెరుగుపడుతుందని 2004 లో ఒక పరిశోధన కనుగొంది. ఇది ఉప్పు, తీపి, చేదు, పుల్లని రుచుల మధ్య తేడాను బాగా గుర్తించడానికి సహాయపడుతుందని తేలింది.
అవయవాలను ఉత్తేజితం చేస్తుంది
టంగ్ స్క్రాపర్ ను ఉపయోగిస్తే మీ అంతర్గత అవయవాలకు కూడా మేలు జరుగుతుంది. ఇవి రాత్రిపూట మీ నాలుకపై పేరుకుపోయిన ఆహార పదార్థాలను, చెడు పదార్థాలను తొలగిస్తాయి. మీరు గమనించారా? ఉదయం లేచిన వెంటనే మీ నాలుకపై అదనపు శిధిలాలు పేరుకుపోవడాన్ని. నాలుకపై తెలుపు పూత బాగా పేరుకుపోయి ఉంటుంది. అయితే మీరు ఉదయాన్నే టంగ్ స్క్రాపర్ ను ఉపయోగిస్తే ఈ పూత పూర్తిగా తొలగిపోతుంది. మీరు ఆరోగ్యంగా ఉంటారు.
మంచి జీర్ణక్రియకు
నాలుకను క్లీన్ చేయడం వల్ల మీ లాలాజలంలో ఉండే ఎంజైమ్లు మీరు తిన్న ఆహారాన్ని సులువుగా జీర్ణం చేయడానికి సహాయపడతాయి. నాలుకను క్లీన్ చేసుకోవడం వల్ల మీ జీర్ణక్రియ సాఫీగా సాగడానికి అవసరమైన ఎంజైమ్లు సక్రియం అవుతాయి.
చెడు శ్వాసను తొలగిస్తుంది
టంగ్ స్క్రాపర్లు నోటి దుర్వాసనను వదిలించుకోవడానికి కూడా బాగా సహాయపడతాయి. ఇవి నోటి దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను సులువుగా తొలగిస్తాయి. దీంతో శ్వాస తాజాగా ఉంటుంది. స్క్రాపర్ లను రోజుకు రెండుసార్లు ఉపయోగించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఉదయం మాత్రమే స్క్రాపింగ్ చేయడం వల్ల నోటి దుర్వాసనను పోగొట్టలేం.
మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
మీకు తెలుసా? మన నాలుక ఎన్నో రకాల బ్యాక్టీరియాలకు నిలయం. ఈ బ్యాక్టీరియాల్లో కొన్ని మంచివి ఉంటే.. మరికొన్ని చెడ్డవి ఉంటాయి. అయితే మీరు టంగ్ స్క్రాపర్ ను ఉపయోగిస్తే.. మన శరీరానికి హాని చేసే బ్యాక్టీరియా తొలగిపోతుంది. అలాగే ఇది మీ ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి కూడా సహాయపడుతుంది. అలాగ చిగుళ్ల వ్యాధులు, కావిటీస్ తో పాటుగా ఇతర సమస్యలు రాకుండా చేయడానికి మీకు సహాయపడుతుంది.
చాలా మంది టంగ్ స్క్రాపర్లను నోటి దుర్వాసనను పోగొట్టడానికే ఉపయోగిస్తుంటారు. అయితే మీరు ఉల్లి, వెల్లుల్లిని ఎక్కువగా తినడం మానుకోండి. ఎందుకంటే వీటివల్లే నోటి దుర్వాసన వస్తుంది. అలాగే నోటి ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం, టీ, కాఫీలను ఎక్కువగా తాగడం, చక్కెర ఫుడ్స్ ను ఎక్కువగా తినడం వంటి వివిధ కారణాల వల్ల నోట్లో నుంచి దుర్వాసన వస్తుంది. కొన్ని అనారోగ్య సమస్యల వల్ల కూడా నోట్లో నుంచి దుర్వాసన రావొచ్చంటున్నారు నిపుణులు.అందుకే ఈ వాసన రాకుండా ఉండటానికి అన్ని రకాల ప్రయత్నాలు చేసినా.. అలాగే వస్తుంటే మీరు ఖచ్చితంగా హాస్పటల్ కు వెళ్లండి.
మీరు ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం మీరు ప్రతిరోజూ నోటి పరిశుభ్రతను పాటించాలి. దంతాలను సరిగ్గా శుభ్రపరచాలి. ఫ్లోరైడ్ ఆధారిత టూత్ పేస్ట్ తో రోజుకు రెండు సార్లు పళ్లను తోముకోవాలి. అలాగే రోజుకు ఒకసారి మౌత్ వాష్ ను ఉపయోగించండి. అలాగే నాలుకపై ఉన్న ఆహార శిథిలాలను తొలగించడానికి రోజుకు ఒక్కసారైనా ఫ్లోస్ లేదా వాటర్ ఫ్లోసర్ ను ఉపయోగించండి. నీళ్లను పుష్కలంగా తాగండి. అలాగే స్మోకింగ్, పొగాకుకు దూరంగా ఉండండి. చక్కెర, కార్బోనేటెడ్ పానీయాలకు దూరంగా ఉండండి. ముఖ్యంగా ప్రతి 6 నెలలకోసారి డెంటల్ హాస్పటల్ కు ఖచ్చితంగా వెళ్లండి.