
ప్రస్తుత కాలంలో చాలా మంది హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్నారు. దీనికి తోడు చుండ్రు, నెత్తిమీద దురద, నిర్జీవమైన జుట్టు వంటి సమస్యలను ఫేస్ చేస్తున్నారు. ఈ సమస్యలకు కారణాలు చాలానే ఉన్నాయి. రెగ్యులర్ గా షాంపూతో తలస్నానం చేయడం వల్ల వెంట్రుకలు జీవం లేనట్టుగా కనిపిస్తాయి. ఈ సమస్యను తగ్గించుకోవడానికి మార్కెట్ లో దొరికే ఎన్నో ప్రొడక్ట్స్ ను వాడుతుంటారు. కానీ అవి తగ్గించినట్టే తగ్గించి ఎక్కువ చేస్తాయి. అందుకే ఇలాంటి కెమికల్ ప్రొడక్ట్స్ కు బదులుగా నెయ్యిని వాడటం మంచిదని నిపుణులు చెబుతున్నారు. మీకు తెలుసా నెయ్యి ఎన్నో సమస్యల నుంచి మనల్ని రక్షిస్తుంది. అంతేకాదు మీ జుట్టును మునుపటి కంటే మందంగా, మృదువుగా, అందంగా మారుస్తుంది. నెయ్యి జుట్టుకు ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం.. నెయ్యిలో ఎక్కువ మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటుగా జుట్టుకు మేలు చేస్తాయి. అలాగే చర్మాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి. నెయ్యి జుట్టు బలంగా పెరిగేందుకు సహాయపడుతుంది. అలాగే నెత్తిమీద సమస్యలను పరిష్కరించడానికి సహాయపడుతుంది. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. ఇది జుట్టుకు నేచురల్ కండీషనర్ గా కూడా పనిచేస్తుంది.
బలమైన జుట్టు కోసం నెయ్యి మసాజ్
వెంట్రుకలు ఎక్కువగా రాలుతుంటే మీ నెత్తి బలహీనంగా మారుతుంది. అందుకే హెయిర్ ఫాల్ సమస్యలతో బాధపడేవారు దేశీ నెయ్యితో తలకు మసాజ్ మసాజ్ చేయడం మంచిది. ఇది జుట్టు మూలాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఇందుకోసం తలస్నానం చేయడానికి 2 గంటల ముందు గోరువెచ్చని నెయ్యిను తలకు అప్లై చేసి మసాజ్ చేయండి. ఇది జుట్టు మూలాలను బలోపేతం చేస్తుంది. అంతేకాదు ఒత్తిడి, తలనొప్పి వంటి సమస్యలను తగ్గిస్తుంది కూడా.
చుండ్రును వదిలిస్తుంది
చుండ్రు అంత సులువుగా వదిలిపోదు. దీనివల్ల నెత్తిమీద విపరీతమైన దురద పెడుతుంది. నెత్తిమీద ఫంగల్ ఇన్ఫెక్షన్ లేదా మురికి పేరుకుపోవడమే చుండ్రుకు ప్రధాన కారణం. ఈ సమస్య ఉన్నవారికి నెయ్యి ఔషదంలా ఉపయోగపడుతుంది. ఇందుకోసం గిన్నెలో 2 నుంచి 3 టీస్పూన్ల నెయ్యి తీసుకోండి. అందులో 2 టీస్పూన్ల బాదం నూనె, 2 టీస్పూన్ల నిమ్మరసం మిక్స్ చేసి తలకు మసాజ్ చేయండి. గంట తర్వాత నీట్ గా తలస్నానం చేయండి. నెయ్యిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు నెత్తిని తేమగా ఉంచుతుంది. అంతేకాదు పొడి, దురద నుంచి ఉపశమనం కలిగిస్తాయి. నిమ్మకాయ నెత్తిమీద ఇన్ఫెక్షన్ ను తొలగించి నెత్తిని శుభ్రంగా ఉంచుతుంది.
పొడి, నిర్జీవ జుట్టు
జుట్టుకు పోషణ అందకపోయినా, తేమగా లేకపోయినా జుట్టు పొడిగా, నిర్జీవంగా మారతుంది. ఈ సమస్యకు నెయ్యి, ఆలివ్ ఆయిల్ కండీషనర్లుగా పనిచేస్తాయి. ఇందుకోసం 3 టీస్పూన్ల ఆలివ్ ఆయిల్, కలబందను 4 నుంచి 2 టీస్పూన్ల నెయ్యితో కలపండి. కలబందలో ఉండే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు జుట్టును మృదువుగా మారుస్తాయి. బలంగా చేస్తాయి. ఆలివ్ ఆయిల్ జుట్టును మరింత స్ట్రాంగ్ గా మారుస్తుంది.
మృదువైన జుట్టు కోసం
కొందరి జుట్టు పొడుగ్గా ఉంటుంది కానీ.. షైన్ గా కనిపించదు. దీనివల్ల జుట్టు జీవం లేనట్టుగా కనిపిస్తుంది. ఇలాంటి వారికి నెయ్యి మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందుకోసం రెండు టీస్పూన్ల నెయ్యిలో 2 టీస్పూన్ల ఆలివ్ ఆయిల్ మిక్స్ చేయండి. దీనిలో కొన్ని చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ ను కూడా వేయండి. 2గంటల తర్వాత ఈ హెయిర్ మాస్క్ ను తొలగించండి. ఆలివ్ ఆయిల్ , నెయ్యి మిశ్రమం జుట్టును మృదువుగా, సహజంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇది మీ జుట్టు తెగిపోకుండా కాపాడుతుంది కూడా.