చాలా వరకు సమస్యలకు మన వంటింట్లోనే పరిష్కారం లభిస్తుంది. వాటిని ఎలా వాడుకోవాలనే విషయం తెలియాలి అంతే. ఆరోగ్యానికి కాదు మరి కొన్నింటికి కూడా వంటింటి చిట్కాలు ఉపయోగపడతాయని మీకు తెలుసా.? అలాంటి ఓ వంటింటి చిట్కా గురించి ఈరోజు తెలుసుకుందాం.
ఇంట్లో ఎలుకలు సృష్టించే రచ్చ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక్క ఎలుక ఇంట్లోకి చేరిందా ఇక అంతే సంగతులు సంతానాన్ని పెంచేస్తుంటాయి. ముఖ్యంగా పాత ఇళ్లలో ఎలుకలు రచ్చ రచ్చ చేస్తుంటాయి. ఆహార పదార్థాలు మొదలు, బట్టలు, పేపర్లను కొరికేస్తుంటాయి. ఇక దుకాణాల్లో అయితే ఎలుకల బెడద ఓ రేంజ్‌లో ఉంటుంది. దీంతో చాలా మంది ఎలుకలకు చెక్ పెట్టేందుకు మార్కెట్‌లో లభించే రకరకాల వస్తువులను ఉపయోగిస్తుంటారు.
ఇంట్లోకి వచ్చే ఎలుకలకు చెక్ పెట్టేందుకు మార్కెట్లో రకరకాల వస్తువులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో గ్లూ పేపర్ బోర్డులు ఒకటి. వీటిపై నుంచి ఎలుకలు వెళితే అతుక్కుపోతాయి. ఆ తర్వాత ప్రాణం పోయేంత వరకు అవి విలవిలలాడుతుంటాయి.
అయితే దీనిని జంతువులపై క్రూరత్వం నిరోధక చట్టం 1960లోని సెక్షన్ 11లో భాగంగా ఎలుకలను పట్టేందుకు ఇలాంటివి ఉపయోగించడాన్ని నిషేధించారు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఇప్పటికే ఇలాంటి గ్లూ పేపర్ బోర్డలను నిషేధిస్తూ నిర్ణయం సైతం తీసుకున్నాయి.
దేశవ్యాప్తంగా సుమారు 16 రాష్ట్రాల్లో బ్లూ పేపర్ బోర్డులను ప్రభుత్వాలు నిషేధించాయి. మరి ఈ నేపథ్యంలో ఎలుకలను ఇంటి నుంచి ఎలా తరిమికొట్టాలనే ఆలోచన రావడం సర్వసాధారణం. అయితే ఇందుకు కూడా సహజ విధానాలు అందుబాటులో ఉన్నాయని మీకు తెలుసా.?
వీటిలో ఒకటి లవంగాలు. అవును లవంగాలతో ఎలుకలను ఇంట్లోకి రాకుండా చేయొచ్చు. ఆచర్యంగా అనిపించినా లవంగాలు ఇందుకు బాగా ఉపయోగపడతాయి. అదేలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
లవంగాల నుంచి వచ్చే ఘాటైన వాసన ఎలుకలకు నచ్చదు. ఈ కారణంగానే లవంగాలు ఉన్న చోటుకు ఎలుకలు రావని నిపుణులు చెబుతున్నారు. ఎలుకలు ఎక్కువగా సంచరిస్తున్న ప్రదేశాల్లో లవంగాలను చల్లాలి. ముఖ్యంగా వంట గదిలో ఉన్న ఆహార పాత్రల దగ్గర, దుస్తులు ఉండే షెల్ఫ్స్‌లో కొన్ని లవంగాలు చల్లాలి. ఇలా చేయడం వల్ల ఎలుకలు అటు వైపు రావడానికి కూడా ఇష్టపడవు.
లవంగాలతో స్ప్రే కూడా తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా లవంగాలను నీటిలో వేసి బాగా మరిగించాలి. నీరు సగానికి వచ్చే వరకు ఉడికించి ఆ నీటిని స్ప్రే బాటిల్‌లో పోసుకోవాలి. ఈ నీటిని ఇంట్లో ప్రతీ మూలలో చల్లాలి. ముఖ్యంగా ఎలుకలు వచ్చే వాష్ బెషిన్ మూలలు, కిటికీల వద్ద లవంగాల నీటిని స్ప్రే చేయాలి. ఇలా చేయడం వల్ల ఎలుకలు పారిపోతాయి.
మరో విధానంలో కూడా లవంగాలతో ఎలుకలను తరిమికొట్టొచ్చు. ఇందుకోసం ఒక సన్నని క్లాత్‌ను తీసుకోవాలి. అనతరం అందులో కొన్ని లవంగాలను తీసుకోకి ఒక మూటలా కట్టాలి. దీనిని ఎలుకలు ప్రవేశించే కిటికీలు, గడప మూలలు, మెట్ల కింద ఉంచాలి ఇలా చేసినా ఎలుకలు అటువైపు రావు. లవంగం నూనెను గుడ్డతో తడిపి ఉపయోగించినా ఎలుకలు పరార్ అవుతాయి.
గమనిక: పైన తెలిపిన విషయాలు కేవలం ఇంటర్నెట్ వేదికగా అందుబాటులో ఉన్న సమాచారాన్ని క్రోడీకరించి అందించడం జరిగింది. ఇందులో శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.