ముఖంలోని చర్మ రంధ్రాల్లో మురికి పేరుకుపోవడం వల్లే బ్లాక్ హెడ్స్ ఏర్పడతాయి. ఈ నల్ల మచ్చలు అందాన్ని తగ్గిస్తాయి. అసలు ముఖంపై ఉండే ఈ నల్లమచ్చలను ఎలా పోగొట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
చాలా మందికి బుగ్గలు, ముక్కు, గడ్డంపై వంటి వివిధ భాగాల్లో నల్లమచ్చలు ఏర్పడుతుంటాయి. ఈ చర్మ సమస్య చాలా మందికి ఉంటుంది. ఈ నల్ల మచ్చలు ఏర్పడటానికి అసలు కారణం.. చర్మ రంధ్రాల్లో మురికి పేరుకుపోవడమే. ఈ నల్ల మచ్చలు ఏం చేసినా పోవని చాలా మంది అనుకుంటుంటారు. కానీ మీరు ప్రయత్నిస్తే.. వీటిని చాలా ఈజీగా, తొందరగా పోగొట్టొచ్చు. అదికూడా ఇంటి చిట్కాలతో. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
చక్కెర
నల్ల మచ్చలను పూర్తిగా పోగొట్టడానికి మీకు పంచదార బాగా సహాయపడుతుంది. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా పంచదారతో స్క్రబ్ చేసుకోవడమే. ఇందుకోసం నిమ్మకాయను కట్ చేసి దాని పైన కొద్దిగా పంచదార చల్లి బ్లాక్ హెడ్ ఉన్న ప్రదేశంలో కొద్దిసేపు స్క్రబ్ చేయండి.
ఉప్పు
బ్లాక్ హెడ్స్ ను పోగొట్టడానికి మీకు ఉప్పు కూడా సహాయపడుతుంది. ఉప్పులో ఉండే బ్లీచింగ్ ఎఫెక్ట్ నల్ల మచ్చలను పోగొట్టడానికి బాగా సహాయపడుతుంది. ఇందుకోసం ఉప్పులో నిమ్మరసం కూడా మీరు కలుపుకోవచ్చు. ఎందుకంటే నిమ్మకాయలో కూడా బ్లీచింగ్ గుణాలు ఉంటాయి. నల్ల మచ్చలను పోగొట్టడానికి మీరు నిమ్మరసంలో కొద్దిగా ఉప్పు మిక్స్ చేసి బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రాంతాల్లో అప్లై చేయాలి.
బొప్పాయి
బొప్పాయితో కూడా మీరు ముఖంపై ఉండే నల్ల మచ్చలను పోగొట్టొచ్చు. ఇందుకోసం బొప్పాయి, పాలపొడి, నిమ్మరసం, బియ్యప్పిండి అన్నింటినీ పేస్ట్ లా చేసి ముఖానికి అప్లై చేయాలి. ఆ తర్వాత సున్నితంగా స్క్రబ్ చేయాలి. 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడిగేసుకుంటే సరి.
అరటిపండ్లు - ఓట్స్ - తేనె
ముఖంపై ఉండే నల్లమచ్చలను పోగొట్టడానికి ఒక అరటిపండు గుజ్జు, రెండు చెంచాల ఓట్ మీల్ పొడి, ఒక చెంచా తేనెను తీసుకోండి. వీటన్నింటినీ బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయండి. 15 నిమిషాల తర్వాత కడిగేసుకోండి.
కొబ్బరి నూనె
కొబ్బరి నూనె కూడా ముఖంపై ఉండే నల్లమచ్చలను పోగొట్టడానికి బాగా సహాయపడుతుంది. ఇందుకోసం ఒక టీస్పూన్ కొబ్బరి నూనెలో ఒక టీస్పూన్ పసుపు కలిపి పేస్ట్ లా చేసుకోండి. దీన్ని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోండి.
నిమ్మకాయ
ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసంలో ఒక దాల్చిన చెక్క ముక్క, చిటికెడు తేనె వేసి కలపండి. తర్వాత ఈ మిశ్రమాన్ని బ్లాక్ హెడ్స్ పైన అప్లై చేయండి. 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయండి.