గంట కాదు.. అరగంట పాటు నడిచినా ఎన్ని లాభాలున్నాయో తెలుసా?

By Shivaleela RajamoniFirst Published Oct 2, 2024, 10:29 AM IST
Highlights

మీరు ప్రతిరోజూ జస్ట్ 30 నిమిషాలు వాకింగ్ కు వెళితే లెక్కలేనన్ని ప్రయోజనాలను పొందుతారు. ఎలాంటి కష్టం లేకుండా రోజూ అరగంట నడిస్తే ఆరోగ్యం బాగుండటంతో పాటుగా దీర్ఘాయుష్షుతో బతకొచ్చు. 

వాకింగ్ మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇది చాలా తేలికపాటి వ్యాయామం. దీన్ని ఏ వయసు వారైనా సులువుగా చేయొచ్చు. చాలా మంది రోజూ గంట నడిస్తేనే ప్రయోజనాలు కలుగుతాయని అనుకుంటారు. కానీ మీరు ప్రతిరోజూ కేవలం 30 నిమిషాలు నడిచినా బోలెడు లాభాలను పొందుతారు. 

రోజూ అరగంట పాటు నడిస్తే మీ ఎముకలు బలంగా అవుతాయి. అలాగే శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి. అలాగే మీ కండరాల బలం కూడా బాగా పెరుగుతుంది. అంతేకాదు ఈ అరగంట నడక మీ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ వాకింగ్ డయాబెటీస్, గుండె జబ్బులు, బోలు ఎముకల వ్యాధితో పాటుగా కొన్ని రకాల వ్యాధులు రాకుండా చేయగలదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

Latest Videos

మంచి శారీరక ఆరోగ్యం కోసం మీరు కఠినమైన వ్యాయామాలను చేయాల్సిన అవసరం లేదు. ఎలాంటి పరికరాలు అవసరం లేని వాకింగ్ కు వెళితే మీ ఆరోగ్యానికి ఏ డోకా ఉండదు. అందులోనూ ఈ సమయంలో నడవాలి, ఆ సమయంలో నడవొద్దు అన్న ముచ్చటే ఉండదు. ఎప్పుడంటే అప్పుడు వాకింగ్ కు వెళ్లొచ్చు. బరువు తగ్గాలనుకునేవారు, ఆరోగ్యంగా ఉండాలనుకునే పెద్దలు రోజూ అరగంట పాటు వాకింగ్ చేస్తే మంచి ప్రయోజనాలను పొందుతారు. అసలు రోజూ 30 నిమిషాల పాటు నడిస్తే ఎలాంటి ప్రయోజనాలను పొందుతామో  ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

రోజూ 30 నిమిషాలు నడిస్తే ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి? 

మీ శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ ప్రతి ఒక్కరూ కనీసం 30 నిమిషాలైనా చురుగ్గా నడవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బ్రిస్క్ వాకింగ్ కూడా మీకు మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే కొన్ని కొన్నిసార్లు 30 నిమిషాలు నడవడం కూడా కష్టంగా అనిపించొచ్చు. ఇలాంటి సమయంలో మీరు 10 నిమిషాల వ్యవధిలో మూడు సార్లు బ్రేక్ తీసుకుని నడకను మొదలు పెట్టడం. అయితే మీరు బరువు తగ్గాలనుకుంటే మాత్రం ఈ 30 నిమిషాల వాకింగ్ అస్సలు సరిపోదు. దీనివల్ల మీరు ఎక్కువ ప్రయోజనాలను పొందలేరు.

గుండె ఆరోగ్యం

అమెరికాలో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం.. క్రమం తప్పకుండా ప్రతిరోజూ 30 నిమిషాలు వాకింగ్ చేస్తే 19 శాతం గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించొచ్చు. నడక మన శరీరంలో అధిక రక్తపోటును నియంత్రిస్తుందని, శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గిస్తుందని పరిశోధనలో తేలింది. 

బరువు తగ్గడానికి సహాయపడే నడక

క్రమం తప్పకుండా మీరు అరగంట పాటు వాకింగ్ కు వెళితే బరువు పెరగకుండా ఉండొచ్చు. అలాగే ఇది కొన్ని సార్లు మీరు బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. వాకింగ్ వల్ల మీ శరీరంలో అదనపు కేలరీలు కరుగుతాయి. దీంతో మీరు కొంచెం బరువు తగ్గొచ్చు. మీరు కరిగించిన కేలరీల సంఖ్య మీరు నడిచే వేగంపై  ఆధారపడి ఉంటుంది. ఏ రకంగా చూసినా అరగంట నడకలో 150 కేలరీలను కరిగించొచ్చని నిపుణులు చెబుతున్నారు. 

ఎముకల బలం

ప్రతిరోజూ మీరు వాకింగ్ చేస్తే మీ ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. అరగంట పాటు నడిస్తే మీ ఎముకల బలం పెరుగుతుంది. అలాగే కండరాలు బలంగా ఉంటాయి. ముఖ్యంగా అరగంట వాకింగ్ కాళ్లు, తుంటి ప్రాంతం, వెన్నెముకలోని ఎముకలను బలంగా చేయడానికి సహాయపడతాయి. వాకింగ్ వల్ల ఎముకల సాంద్రతను కూడా పెరుగుతుంది. ఇది ఎముకల పగుళ్లు, బోలు ఎముకల వ్యాధి ప్రమాదం కూడా తగ్గుతుంది. 

జీర్ణక్రియకు సహాయపడుతుంది

తిన్న తర్వాత అరగంట పాటు నడిస్తే మీ జీర్ణక్రియకు మంచి మేలు జరుగుతుంది. వాకింగ్ మీరు తిన్న ఆహారాన్ని జీర్ణాశయంలోకి సులభంగా చేరుస్తుంది. ముఖ్యంగా కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్యలు, మలబద్దకం సమస్యలను తగ్గించుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. 

మానసిక ఆరోగ్యానికి

వాకింగ్ కేవలం మన శారీరక ఆరోగ్యాన్ని మాత్రమే కాదు.. మానసిక ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. ఒక అధ్యయనం.. ప్రతిరోజూ 30 నిమిషాల పాటు వాకింగ్ చేయడం వల్ల స్ట్రెస్, యాంగ్టైటీ వంటి లక్షణాలు తగ్గుతాయి. వాకింగ్ తో మన శరీరం మూడ్ లిఫ్టర్సైన ఎండార్ఫిన్లను ఉత్పత్తి చేస్తుంది. ఇది మీ ఒత్తిడిని తగ్గించి మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. 
 
ఇమ్యూనిటీ పవర్

వాకింగ్ వల్ల కూడా మన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఒక అధ్యయనం ప్రకారం.. ప్రతిరోజూ వాకింగ్ చేసే వారికి చలికాలంలో వ్యాధులొచ్చే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుందని కనుగొన్నారు. ముఖ్యంగా రోజుకు అరగంట పాటు నడిచేస్తే శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, జలుబు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. 

దీర్ఘాయుష్షు

నడక మన ఆయుష్షును పెంచడానికి కూడా బాగా సహాయపడుతుంది. అవును పరిశోధన ప్రకారం.. నడక మన జీవితకాలాన్ని పెంచడానికి సహాయపడుతుంది. పిఎల్ఓఎస్ మెడిసిన్ లో ప్రచురించబడిన పరిశోధన ప్రకారం.. రోజుకు అరగంట పాటు నడిస్తే అకాల మరణ ప్రమాదం 20% వరకు తగ్గుతుందని తేలింది. ఈ వాకింగ్ మీ గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. బరువును తగ్గిస్తుంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వీటన్నింటి వల్ల మీ ఆయుష్షు  పెరుగుతుంది. 
 

click me!