Latest Videos

దొంగ పనిచేసిన ఉద్యోగులపై వేటు... సిమ్యులేటెడ్‌ కీబోర్డు యాక్టివిటీ గుర్తించి కఠిన చర్యలు

By Galam Venkata RaoFirst Published Jun 14, 2024, 8:08 PM IST
Highlights

ఫేక్ వర్క్ పద్ధతి వినియోగించిన ఉద్యోగుల ఆటకట్టించింది అమెరికాకు చెందిన ఫైనాన్స్ సంస్థ. పనిచేయకుండానే చేస్తున్నట్లు నటించిన కొందరు ఉద్యోగులను గుర్తించి వేటు వేసింది.

దొంగ పని చేసిన ఉద్యోగులపై వెల్స్‌ ఫార్గో బ్యాంక్‌ కొరడా ఝళిపించింది. సిమ్యులేటెడ్‌ కీబోర్డు యాక్టివిటీని ఉపయోగించి పనిచేస్తున్నట్లుగా బురిడీ కొట్టించిన పలువురు ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంది. ఉద్యోగులు సిమ్యులేటెడ్‌ కీబోర్డు యాక్టివిటీని వినియోగించిన విషయాన్ని గుర్తించిన సంస్థ వారందరినీ ఉద్యోగాల నుంచి తొలగించింది. ఇలా ఉద్యోగం నుంచి తొలగించబడ్డ వారందరూ వెల్త్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజ్‌ విభాగానికి చెందినవారు కావడం గమనార్హం. 

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన గత నెలలో జరిగినట్లు బ్లూమ్‌బర్గ్‌ నివేదిక తెలిపింది. ఫేక్‌ వర్క్‌ చేసినట్లు విచారణలో తేలడంతో పదుల సంఖ్యలో ఉద్యోగులను తొలగించినట్లు ఫైనాన్సియల్ ఇండస్ట్రీ రెగ్యులేటరీ అథారిటీకి ఇచ్చిన నివేదికలోనూ వెల్స్‌ ఫార్గో బ్యాంకింగ్‌ సంస్థ పేర్కొంది. తమ సంస్థ ఉద్యోగులకు సంబంధించి అత్యున్నత ప్రమాణాలను పాటిస్తుందని... తప్పుడు ప్రవర్తనను సహించబోమని వెల్స్ ఫార్గో ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగుల పనిని అనుకరించేందుకు తరచుగా ‘‘మూవ్ జిగ్లర్లు’’ లేదా ‘‘మౌస్ మూవర్స్’’ను వినియోగించినట్లు గుర్తించామని తెలిపారు. కోవిడ్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ‘వర్క్ ఫ్రం హోం’ విధానం అమలులోకి వచ్చిన తర్వాత ఇలాంటి ‘వర్క్ ఫేకింగ్’ పద్ధతులు అనుకరిస్తున్నట్లు గుర్తించామన్నారు. 

టిక్ టాక్, రెడిట్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌ల ద్వారా ఇలాంటి ఫేక్‌ వర్కింగ్‌ పద్ధతులు/అనుకరణలు వ్యాప్తి చెందాయి. అందుకు అవసరమైన పరికరాలు అమెజాన్‌ లాంటి వెబ్‌సైట్‌లో అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎంఎన్‌సీలు, ఇతర సంస్థలు సైతం అప్రమత్తమయ్యాయి. ఉద్యోగులపై ఓ కన్నేసి ఉంచుతున్నాయి. 'ఫేక్‌ వర్కింగ్‌'ను గుర్తిచేందుకు అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నాయి. షిఫ్ట్‌ టైమ్‌లో ఉద్యోగులు ఏం చేస్తున్నారు? ఎలాంటి వెబ్‌సైట్‌లు సందర్శిస్తున్నారన్న అంశాలను పరిశీలిస్తున్నాయి. 
.
కోవిడ్ ప్యాండమిక్‌ అనంతరం 2022 ప్రారంభంలో వర్క్‌ ఫ్రం హోంను వదిలేసి ఆఫీసులకు రావాలని ఉద్యోగులు వెల్స్‌ ఫార్గో పేర్కొంది. అధిక మంది ఉద్యోగులు వారానికి మూడు రోజులు ఆఫీసుకు రావాలని, మేనేజ్‌మెంట్‌ కమిటీ నాలుగు రోజులు పనిచేయాలని వెల్స్‌ ఫార్గో భావించింది. అయితే, ఐదు రోజులు ఆఫీసుకు రావాలని సంస్థ ఉద్యోగులను కోరినట్లు నివేదికలు చెబుతున్నాయి. 

కాగా, వెల్స్ ఫార్గో ఇలా ఉద్యోగులను తొలగించడం 2018లో సంస్థలో జరిగిన ఒక సంఘటనను గుర్తుచేస్తుంది. ఉద్యోగులు దాని వ్యయ విధానాన్ని ఉల్లంఘించారని, ‘‘అర్హత లేని సాయంత్రం భోజనం’’ కోసం కంపెనీ చెల్లించాల్సి వస్తోందని గతంలో ఆరోపించింది.

వెల్స్ ఫార్గో బ్యాంక్ యూఎస్‌కు చెందిన ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ సంస్థ. గతంలో ఈ సంస్థ భారతీయ ఉద్యోగులపైనా వేటు వేసింది. భారత్‌లో మూడు చోట్ల వర్క్‌‌ఫోర్స్‌‌ను తగ్గించింది. దీంతో వందలాది మంది ఉద్యోగులపై ప్రభావం పడింది. అయితే, కంపెనీని మరింత సమర్థవంతంగా నడిపించేందుకు ఉద్యోగుల కోత ప్రక్రియను ప్రారంభించినట్లు అప్పట్లో వెల్స్‌‌ ఫార్గో సమర్థించుకుంది..

click me!