ఆర్చర్-అమిష్ లిటరరీ అవార్డు: విజేతలకు $25వేల నగదు పురస్కారం.. వివరాలివే

By Galam Venkata Rao  |  First Published Jun 25, 2024, 12:28 PM IST

ఇండియా గ్లోబల్ ఫోరం కీలక ప్రకటన చేసింది. సమకాలన భారతదేశంపై భారతీయ కోణంలో వెలువడే ఉత్తమ రచనలకు పురస్కారాలను ప్రకటించింది.


ఇండియా గ్లోబల్ ఫోరమ్.. సమకాలీన భారతదేశ కథను ప్రపంచానికి వివరించే వేదిక. ప్రపంచ దేశాలతో భారత్‌ సంబంధాలు, వాణిజ్య పరంగా అవకాశాలు పెంపొందించుకోవడం తదితర అంశాల్లో గేట్‌ వేలా ఈ వేదిక వ్యవహరిస్తుంది. ఈ ఫోరం ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసింది. సమకాలీన భారతీయ కాల్పనిక సాహిత్యంలో భారతదేశ కథకు విశేషమైన సహకారం అందించిన రచయితలకు పురస్కారాలు అందించేందుకు సిద్ధమైంది. 

లండన్‌లోని క్వీన్ ఎలిజబెత్-2 సెంటర్‌లో ఇండియా గ్లోబల్ ఫోరం (ఐజీఎఫ్) 6వ వార్షికోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ రచయితలు జెఫ్రీ ఆర్చర్, అమిష్ త్రిపాఠి కీలక ప్రకటన చేశారు. సమకాలీన భారతదేశ సారాంశాన్ని వివరించే ఉత్తమ రచనలకు IGF ఆర్చర్-అమిష్ అవార్డును ప్రదానం చేయనున్నట్లు ప్రకటించారు. అవార్డు గ్రహీతలకు 25వేల డాలర్ల నగదు బహుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ అవార్డులు చాలా ముఖ్యమైనవి... రచయితలను ప్రోత్సహించడంతో పాటు వారి కృషికి మంచి గుర్తింపునిస్తాయన్నారు. ‘‘ఎందుకంటే... రచయితలు అన్నిటినీ త్యాగం చేస్తారు. రేయింబవళ్లు ఒంటరిగా గడుపుతూ పుస్తక రచన కోసం కష్టపడతారు. ఇంకా మరింత మంచి రచనలు చేసేందుకు ఈ అవార్డులు ప్రోత్సహిస్తాయి’’ అని లార్డ్ జెఫ్రీ తెలిపారు.  

Latest Videos

undefined

శివత్రయం, రామ్ చంద్ర సిరీస్ లాంటి ప్రఖ్యాత రచనలు చేసిన అమిష్ త్రిపాఠి.. ఐజీఎఫ్ అవార్డుల గురించి ఇలా అన్నారు. ఆర్చర్-అమిష్ అవార్డు ఇతర అవార్డుల్లాంటిది కాదన్నారు. ‘‘ఇతర అవార్డులు కథపై కాకుండా భాషపైనే ఎక్కువ దృష్టిని కేంద్రీకరిస్తాయి. ఆర్చర్-అమిష్ అవార్డు సాంప్రదాయ కాలంలో, ముఖ్యంగా పాశ్చాత్యేతర సంస్కృతుల్లో ఏది ముఖ్యమైందిగా పరిగణించబడుతుందో గుర్తిస్తుంది. కథా కథనం, అది తెలియజేసే తత్వాలపై దృష్టి పెట్టింది’’ అని అమిష్ తెలిపారు. కథ రాసిన కోణం ఈ అవార్డుకు రెండో కోణమని చెప్పారు. ‘‘ఇప్పటి వరకు, చాలామంది పాశ్చాత్య కోణంలో భారత్ గురించి రచనలు చేశారు. అంటే పాశ్చాత్యులు భారతదేశాన్ని చూసే కోణంలో అభివర్ణించారు. కానీ ఆర్చర్-అమిష్ అవార్డు భారతీయ దృక్కోణాన్ని గుర్తిస్తుంది. భారతీయులు భారతదేశాన్ని ఎలా చూస్తారన్న కోణంలో ఉండే రచనలకు ఈ అవార్డుకు మద్దతు ఇస్తుంది. మన గురించి మనం చెప్పుకొనే భారతీయ సొంత కథలకు ప్రాధాన్యం ఉంటుంది'' అని అమిష్‌ పేర్కొన్నారు. 

ఈ సందర్భంగా ఐజీఎఫ్‌ ఫౌండర్‌, ఛైర్మన్‌ మనోజ్‌ లడ్వా మాట్లాడుతూ.. రచన అనేది సృజనాత్మక వ్యక్తీకరణలో ముఖ్యమైంది, పురాతనమైందని గుర్తుచేశారు. దృష్టి కోణాలను మార్చడంతో పాటు మార్పును ప్రేరేపించడంలో రచన కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ‘‘ఐజీఎఫ్‌లో మేం కథకులం. సమకాలీన భారతదేశ కథను చెబుతాం. వాణిజ్యం, సైన్స్, టెక్నాలజీ పరంగా భారతీయ కోణాన్ని వివరిస్తాం. నాలుగేళ్ల క్రితం క్రితం మేం IGFలో భాగంగా కల్చర్ అండ్ క్రియేటివిటీ ఫోరమ్‌ ప్రారంభించాం. IGFలో మనం చేసే పనిలో భాగంగా సాహిత్యాన్ని తీసుకురావడం చాలా అర్ధవంతం చేసింది. భారతదేశంపై పాశ్చాత్యుల కోణం, భారతీయుల కోణం వేర్వేరుగా ఉంటుంది. ఈ వేర్వేరు దృక్కోణాలను కలపాలని IGF ప్రయత్నిస్తోంది’’ అని మనోజ్ లడ్వా పేర్కొన్నారు.  

ఇకపోతే, వచ్చే అక్టోబర్‌ లేదా నవంబర్‌లో ఆర్చర్-అమిష్ అవార్డుల వివరాలు వెల్లడి కానున్నాయి. లాంగ్‌ ఫామ్‌ ఇంగ్లీష్‌ ఫిక్షన్‌ నవలల విభాగంలో నామినేషన్లు చేస్తారు. విజేత వివరాలను IGF మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ప్రసారం చేసి ప్రకటిస్తారు. అలాగే, IGF మీడియా ప్లాట్‌ఫామ్‌లోని ప్రత్యేకమైన వర్చువల్ స్టూడియో సెషన్‌లో కూడా ప్రదర్శించబడతారు. 

click me!