తుర్రెబాజ్ ఖాన్: భారత స్వతంత్ర సంగ్రామ యోధుడు ఈ 'తురుమ్ ఖాన్' !

By Mahesh Rajamoni  |  First Published Mar 23, 2022, 4:34 PM IST

Turrebaz Khan : Turrebaz Khan జీవితం గ్రంథస్తం కాలేదు. ఆయన కుటుంబ నేపథ్యం.. తుర్రెబాజ్ ఖాన్ వ్యక్తిగత జీవితం.. హైదరాబాద్‌లో బ్రిటీషర్లపై తిరుగుబాటుకు ముందు ఆయన ఎవరు? అనే విషయాలు కాలగర్భంలోనే కలిసిపోయాయి.
 


Azadi Ka Amrit Mahotsav: భారత తొలి స్వతంత్ర సంగ్రామంగా పేరున్న 1857 సిపాయిల తిరుగుబాటకు(Sepoy Mutiny) దేశ చరిత్రలో ప్రత్యేక అధ్యాయమున్నది. పాలనను వ్యతిరేకించి.. వారిని ఎదిరించి చేసిన దశాబ్దాల పోరులో సిపాయిల తిరుగుబాటు ప్రభావం అసమానమైంది. అయితే, ఈ తిరుగుబాటు గురించిన చరిత్ర ఎక్కువగా ఉత్తరాది రాష్ట్రాలకే పరిమితమైనట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ, ఈ తిరుగుబాటుకు Hyderabadతోనూ ముడివేసే అధ్యాయమే.. తుర్రెబాజ్ ఖాన్ జీవితం. 

Turrebaz Khan జీవితం గ్రంథస్తం కాలేదు. ఆయన కుటుంబ నేపథ్యం.. తుర్రెబాజ్ ఖాన్ వ్యక్తిగత జీవితం.. హైదరాబాద్‌లో బ్రిటీషర్లపై తిరుగుబాటుకు ముందు ఆయన ఎవరు? అనే విషయాలు కాలగర్భంలోనే కలిసిపోయాయి. తుర్రెబాజ్ ఖాన్(తండ్రి రుస్తుమ్ ఖాన్) అంటే హైదరాబాద్ బేగంబజార్‌కు చెందిన ఓ సాధారణ సిపాయి అని, హైదరాబాద్‌లోని బ్రిటీష్ రెసిడెన్సీపై దాడికి సుమారు ఆరు వేల మందిని తీసుకెళ్లిన యోధుడిగా మాత్రమే చరిత్ర గుర్తుపెట్టుకున్నది. కనీసం ఆయన చిత్రపటమూ లేదు. 1857 తిరుగుబాటు కోసమే జన్మించి, ఆ తిరుగుబాటుతోనే ఆయన అస్తమించినట్టుగా అనిపిస్తుంది. గెలిచినవారే చరిత్ర లిఖిస్తారన్నట్టుగా నిజాం పాలకులు బ్రిటీషర్లతో మిలాఖతవ్వడంతో తుర్రెబాజ్ ఖాన్ సాధికారిక చరిత్రలో నమోదు కాకున్నా.. తెలంగాణ ప్రజల నాలుకలపై తురుమ్ ఖాన్‌గా ఇప్పటికీ జీవిస్తూనే ఉన్నాడు.

Latest Videos

undefined

హైదరాబాద్‌లో సిపాయి తిరుగుబాటుకు తుర్రెబాజ్ ఖాన్ నాయకత్వం వహించారని చెప్పవచ్చు. ఢిల్లీకి పంపిన హైదరాబాద్ సైనికుల్లో ఒకడైన జమేదార్ చీదా ఖాన్.. తెల్ల సైనికులపై దాడి చేశాడు. నిజాం పాలకుల మద్దతు లభిస్తుందని భావించి భంగపడి ఖైదుగా మారాడు. ఆ చీదా ఖాన్‌ను విడిపించుకోవాలనే లక్ష్యంతోనే అప్పటికే దేశభక్తిని గుండెల్లో నింపుకున్న తుర్రెబాజ్ ఖాన్, మౌల్వీ అల్లాఉద్దీన్‌లు ప్రస్తుత కోఠీలో అప్పుడు ఉన్న బ్రిటీష్ రెసిడెన్సీపై 1857 జులైలో దాడి చేశారు. రెసిడెన్సీ గోడకు సమీపంలో ఉన్న రెండు ఇళ్లను ఖాళీ చేయించి అందులో నుంచి గోడను ధ్వంసం చేసి రెసిడెన్సీలోకి ప్రవేశించారు. వీరి వెంట ఐదు వేలకు పైగా రొహిల్లాలు, అరబ్‌లు, విద్యార్థులు, ఇతర సామాన్యులూ ఉన్నారు. కానీ, దాడి గురించిన సమాచారాన్ని నిజాం మంత్రి తురబ్ అలీ ఖాన్ బ్రిటీషర్లకు చేరవేయడంతో గోడను ధ్వంసం చేసి రెసిడెన్సీలోకి తుర్రెబాజ్ సారథ్యంలో తిరుగుబాటు దారులు ప్రవేశించగానే బ్రిటీష్ సైన్యం సాయుధులై ప్రతిదాడికి సిద్ధంగా ఉన్నారు. జులై 17 సాయంత్రం ఆరు.. ఏడు గంటల ప్రాంతంలో మొదలైన ఈ పోరాటం తెల్లవారు జామున నాలుగు గంటల వరకు జరిగింది. సుశిక్షితులైన బ్రిటీష్ సైన్యం చేతిలో ఆవేశం.. దేశభక్తి తప్పా శిక్షణ లేని తుర్రెబాజ్ ఖాన్ చిన్ని దళం ఓడిపోక తప్పలేదు. ఇది గమనించే ఎక్కడివారక్కడ పరారయ్యారు. తుర్రెబాజ్ ఖాన్ మరోసారి దాడి చేద్దామనే భరోసాతో తప్పించుకు వెళ్లిపోయాడు.

ఆయన ఆచూకీని మరో సారి మంత్రి తురబ్ అలీ ఖాన్ జులై 22న ఆంగ్లేయులకు పంపాడు. కంటి దగ్గర మరకతో తుర్రెబాజ్ ఖాన్‌ను గుర్తించి అషూర్ ఖానా సమీపంలోని అడవిలో అరెస్టు చేసి హైదరాబాద్ కోర్టుకు తెచ్చారు. విచారించి అండమాన్ జైలులో యావజ్జీవ ఖైదు శిక్ష వేసింది కోర్టు. కానీ, ఇంతలోపే అంటే 1859 జనవరి 18న చాకచక్యంగా తుర్రెబాజ్ ఖాన్ జైలులోని కాపలాదారులను తనవైపు మళ్లించుకుని పరారయ్యాడు. ఆయనను పట్టిస్తే రూ. 5వేల నజరానాను బ్రిటీషర్లు ప్రకటించారు. ఈ సారి తుర్రెబాజ్ ఖాన్ ఆచూకీని ఖుర్బాన్ ఖాన్ తెలియజేసినట్టు కొందరు చరిత్రకారులు చెబుతారు. ఆయనను తూప్రాన్ సమీపంలోని ఓ అడవిలో జనవరి 24న తాలూక్‌దార్ మీర్జా ఖర్బాన్ అలీ బెయిగ్ సారథ్యంలోని సైన్యం కాల్చి చంపారని వివరిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్ వరకు ఈడ్చుకు వచ్చారు. రెసిడెన్సీ బిల్డింగ్ సమీపంలో ఓ చెట్టుకు ఆయన మృతదేహాన్ని నగ్నంగా వేలాడదీశారు. ఇంకెవ్వరూ ఇంతటి సాహసం చేయవద్దనే ఉద్దేశంతో బెదిరించడానికి ఈ పనిచేసినట్టు చెబుతారు.

ఇప్పుడు అదే ప్రాంతంలో తుర్రెబాజ్ ఖాన్‌ స్మరిస్తూ ఓ స్మారకం నిర్మించారు. కానీ, చరిత్ర గురించి అవగాహన ఉన్నవారికి మినహా దాని ప్రాధాన్యత పెద్దగా ఎవరికీ తెలియదు. అంతేకాదు, కోటి విమెన్స్ కాలేజీ నుంచి పుత్లి బౌలీ ఎక్స్ రోడ్ వరకు ఉన్న దారికి తుర్రెబాజ్ ఖాన్ పేరు పెట్టారు. కానీ, దాన్ని ఆ పేరుతో వ్యవహరించడం అరుదుల్లోకెల్లా అరుదు. కాబట్టి, మన స్థానిక యోధుడి గురించి స్మరించడం మన కనీస బాధ్యతగా భావించడం సముచితం.
 

click me!