పొద్దు పొద్దున్నే తలనొప్పి ఎందుకు వస్తుంది? దాన్ని ఎలా తగ్గించుకోవాలి?

Published : Sep 30, 2024, 11:12 AM IST
పొద్దు పొద్దున్నే తలనొప్పి ఎందుకు వస్తుంది? దాన్ని ఎలా తగ్గించుకోవాలి?

సారాంశం

కొంతమందికి ఉదయం నిద్రలేవగానే తలనొప్పిగా అనిపిస్తుంటుంది. కానీ ఈ తలనొప్పి వల్ల ఏ పనీ చేయలేం. అయితే మీరు కొన్నిచిట్కాలను ఫాలో అయితే మాత్రం ఈ తలనొప్పి చిటికెలో తగ్గిపోతుంది.   

తలనొప్పి అనేది ప్రతి ఒక్కరికీ ఎప్పుడో ఒకసారి వచ్చే సర్వ సాధారణ సమస్య.  అయితే కొంతమందికి మాత్రం తలనొప్పి ఉదయం నిద్రలేవగానే వస్తుంటుంది. దీనివల్ల ఏ పనీ చేయాలన్న ఇంట్రెస్ట్ ఉండదు. అలాగే చాలా ఇబ్బందిగా, అసౌకర్యంగా అనిపిస్తుంటుంది. అయితే ఉదయం నిద్రలేచిన వెంటనే తలనొప్పి ఎందుకు వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

ఉదయాన్నే తలనొప్పి ఎందుకు వస్తుంది?

చాలా మంది రాత్రిళ్లు సరిగ్గా నిద్రపోరు. కానీ ఇలా నిద్రలేకుంటే కూడా మీకు తలనొప్పి వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి ఇలా ఉదయం తలనొప్పి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీకు తెలుసా? తలనొప్పి, నిద్ర సమస్యలు ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయట. 

మీకు సరిగ్గా నిద్రపట్టకపోవడం వల్ల మీరు పగటిపూట బాగా టెన్షన్ కు లోనయ్యి బాగా తలనొప్పి వస్తుంది. తలనొప్పి విపరీతంగా ఉంటే నిద్రపట్టదు. దీనివల్ల మీకు తలనొప్పి మరింత ఎక్కువ అవుతుంది. స్లీప్ అప్నియా  సమస్యతో బాధపడేవారికి కూడా ఉదయం నిద్రలేవగానే బాగా తలనొప్పి వస్తుందని పలు నివేదికలు చెబుతున్నాయి.

ఉదయాన్నే తలనొప్పి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?

ఉదయాన్నే తలనొప్పితో మీరు లేవకూడదంటే రాత్రిపూట బాగా నిద్రపోవాలి. అంటే మీరు రోజూ ఒకే సమయానికి పడుకోవడం, ఉదయం నిద్రలేవడం అలవాటు చేసుకోవాలి. రాత్రిపూట తొందరగా పడుకుని, ఉదయం తొందరగా నిద్రలేస్తే మీకు ఎలాంటి తలనొప్పి రాదు. మైగ్రేన్ సమస్య ఉంటే కూడా మీకు ఉదయం విపరీతమైన తలనొప్పి వస్తుంది. కాబట్టి మైగ్రేన్ ను కంట్రోల్ చేయండి. 

అలాగే ఆల్కహాల్ వల్ల కూడా మీకు తలనొప్పి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మందు తాగడం మానేయండి. ఆరోగ్యకరమైన ఆహారం తింటూ, పుష్కలంగా నీళ్లను తాగితే కూడా తలనొప్పి వచ్చే ప్రమాదం తగ్గుతుంది. తలనొప్పి రావొద్దంటే ఉదయాన్నే మీరు లేచిన వెంటనే పరిగడుపున ఒక పెద్ద గ్లాసు మంచి నీళ్లను తాగండి. మీరు అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా తలనొప్పి వస్తే వెంటనే హాస్పటల్ కు వెళ్లడం మంచిది. 

తలనొప్పి వెంటనే తగ్గాలంటే ఏం చేయాలి? 

కోల్డ్ ప్యాక్

మైగ్రేన్ లేదా విపరీతమైన తలనొప్పిని తగ్గించడంలో కోల్డ్ ప్యాక్ చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం ఐస్ క్యూబ్స్ ను ఒక టవల్ లో చుట్టి నుదిటిపై పెట్టండి. ఇది వెంటనే తలనొప్పిని చాలా వరకు తగ్గిస్తుంది. ఈ కోల్డ్ కంప్రెస్ ను మీ తలపై 15 నిమిషాల పాటు ఉంచండి. మళ్లీ 15 నిమిషాలు బ్రేక్ తీసుకుని మళ్లీ పెట్టండి. ఇలా చేస్తే తలనొప్పి కొద్ది సేపటికి తగ్గిపోతుంది. 

హీటింగ్ ప్యాడ్ లేదా హాట్ కంప్రెస్ 

టెన్షన్ వల్ల కూడా చాలా మందికి తలనొప్పి వస్తుంటుంది. అందుకే మీకు టెన్షన్ తో కూడిన తలనొప్పి వస్తే తల వెనుక భాగం లేదా మెడపై హీటింగ్ ప్యాడ్ ను ఉంచండి. అయితే మీరు సైనస్ తలనొప్పితో బాధపడుతుంటే నొప్పి ఉన్న దగ్గర  వెచ్చని గుడ్డను పెట్టండి. లేదా గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయండి. తలనొప్పి వెంటనే తగ్గిపోతుంది. 

ఒత్తిడిని తగ్గించండి

పోనీటైల్ ను చాలా టైట్ గా వేసుకున్నా కూడా తలనొప్పి ఎక్కువగా వస్తుంటుంది. ఇది మీ నుదిటిపై తలనొప్పిని ఎక్కువగా కలిగిస్తుంది. అలాగే టోపీ, హెడ్బ్యాండ్ లేదా చాలా టైట్ గా ఉన్న స్విమ్మింగ్ గాగుల్స్ ధరించడం వల్ల కూడా తలనొప్పి వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఇలాంటి తలనొప్పి తొందరగా తగ్గాలంటే ఒత్తిడిని తగ్గించాలి.

డిమ్ లైట్లు 

కంప్యూటర్, ల్యాప్ టాప్ స్క్రీన్ ల ప్రకాశవంతమైన స్క్రీన్, లేదా ఇంట్లో ఉండే లైట్లు కూడా మైగ్రేన్ తో పాటుగా తలనొప్పిని కలిగిస్తుంది. అందుకే ఇలాంటి తలనొప్పి రావొద్దంటే పగటిపూట మీ ఇంటి కిటికీలను బ్లాక్ అవుట్ కర్టెన్లతో మూయండి. అలాగే ఆరు బయటకు వెళ్లినప్పుడు సన్ గ్లాసెస్ ను ఖచ్చితంగా పెట్టుకోండి. అలాగే మీ ల్యాప్ టాప్, కంప్యూటర్ కు యాంటీ-గ్లేర్ స్క్రీన్ ను జోడించొచ్చు. 

చూయింగ్ గమ్ నమలొద్దు

చూయింగ్ గమ్ ను నమిలే అలవాటు చాలా మందికి ఉంటుంది. అయితే ఈ చూయింగ్ గమ్ నమిలితే మీ దవడ మాత్రమే కాదు మీ తలను కూడా గాయపరుస్తుంది. అంతేకాదు పెదవులను, గోర్లను, బుగ్గల లోపలి భాగాన్ని లేదా పెన్నులను నమలడం కూడా మంచిది కాదు. తలనొప్పి రావొద్దంటే క్రంచీ, ఆయిలీ ఫుడ్స్ ను తినడం మానుకోండి. అలాగే మీరు రాత్రిపూట దంతాలను కొరకడం వల్ల కూడా ఉదయం తలనొప్పి వచ్చే అవకాశం ఉంది. అందుకే దీన్ని ఆపడానికి దంత వైధ్యుడిని సంప్రదించండి. 

హైడ్రేట్ గా ఉండండి 

తలనొప్పి రావొద్దన్నా, వెంటనే తగ్గాలన్నా మీరు వాటర్ ను పుష్కలంగా తాగాలి. మీకు తెలుసా? మన శరీరలో వాటర్ కంటెంటే ఎక్కువగా ఉంటుంది. అలాగే మీరు తాగే వాటర్ కంటే ఎక్కువ ద్రవాలు మూత్రం, చెమట ద్వారా శరీరం నుంచి బయటకు వెళ్లిపోతాయి. దీనివల్ల మీరు డీహైడ్రేషన్ కు గురవుతారు. ఇది మీ శరీర కణజాలాలు కుంచించుకుపోయేలా చేస్తుంది. అలాగే ఇది నరాలపై ఒత్తిడిని కలిగిస్తుంది. తలనొప్పికి కారణమవుతుంది. 
 

PREV
click me!

Recommended Stories

Health: చాయ్‌తో వీటిని క‌లిపి తింటున్నారా.? తీవ్ర స‌మ‌స్య‌లు త‌ప్ప‌వు
Mineral Water: మినరల్ వాటర్‌ను వేడిచేసి తాగడం మంచిదా? కాదా? తాగితే ఏమవుతుంది?