కృష్ణా జిల్లా విజయవాడలో భారీగా హవాలా డబ్బు పట్టుబడింది. విశ్వసనీయ సమాచారం మేరకు వాహనాల తనిఖీ చేపట్టిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు భవానిపురం ప్రాంతంలో ఓ కారును పట్టుకున్నారు. అందులో తరలిస్తున్న దాదాపు రూ.1.50 కోట్ల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి లెక్కాపత్రం లేని ఈ డబ్బను హవాలా మార్గంలో తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతుండగా పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
రాష్ట్రంలో హవాలా వ్యవహారం నరసాపురం టు హైదరాబాద్ వయా విజయవాడ మీదుగా సాగుతున్నట్లు సమాచారం. ఈ మేరకు తమకు సమాచారం అందడంతో హవాలా ముఠాను పట్టుకున్నట్లు టాస్క్‌ఫోర్స్ ఏడీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. పక్కా సమాచారంతో వాహనాల తనిఖీ జరిపినట్లు... ఓ కారులో రూ.కోటి 40 లక్షల ఇండియన్ కరెన్సీ, రూ. 24 లక్షల విలువ చేసే 30 వేల డాలర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఓ బంగారు వ్యాపారితో పాటు మరో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. హైదరాబాద్కు హవాలా సొమ్మును తరలిస్తున్నట్టు ప్రాథమిక విచారణలో తేలినట్టు టాస్క్‌ఫోర్స్ అధికారులు తెలిపారు.