Revanth Reddy: ప‌డిలేచిన కెర‌టంలా.. అనుముల రేవంత్ రెడ్డి..

First Published | Dec 5, 2023, 4:42 PM IST

Anumula Revanth Reddy: రేవంత్ రెడ్డి తెలంగాణ‌లో ఉద్య‌మ పార్టీ కారు గాలి తీసి, కాంగ్రెస్ చ‌క్రం తిప్పిన తీరు తెలుగు రాజ‌కీయాల్లో కొత్త వ‌ర‌వ‌డిని తీసుకువ‌చ్చింద‌నే చెప్పాలి. గ‌త ఎన్నిక‌ల్లో పరాజయాలు ఎదురైనా, పార్టీలోనే, సొంత నేత‌ల నుంచి తన నాయకత్వానికి తీవ్రమైన సవాల్‌ విసిరినా, కాంగ్రెస్‌ను ముందుండి నడిపించారు.

Anumula Revanth Reddy: తెలంగాణలో కారు గాలితీసి, కాంగ్రెస్ చక్రం తిప్పిన నాయ‌కుడు అనుముల‌ రేవంత్ రెడ్డి. నాయ‌క‌త్వ‌లేమితో.. అంత‌ర్గ‌త పోట్లాట‌ల‌తో ఇబ్బందులు ప‌డుతున్న స‌మ‌యంలో కాంగ్రెస్ నాయ‌క‌త్వ బాధ్య‌తలు చేప‌ట్టి, తెలంగాణ‌లో హస్తం పార్టీనికి అధికారంలోకి తీసుకువ‌చ్చిన నాయ‌కుడు. రేవంత్ రెడ్డి రాజ‌కీయ జీవితం గమ‌నిస్తే తెలుగు రాజకీయాలలో మొదటి నంచి సంచలనాలకు కేంద్రంగా ఉండ‌టంతో పాటు ఇదే స‌మ‌యంలో ఆయ‌న ప‌లు వివాదాలకు స్థానంగానూ ఉన్నారు. ఎంతో మంది సీనియర్లు ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ నమ్మి బాధ్యతలు అప్పగించడం, దానిని ముందుకు తీసుకెళ్తూ.. ఎన్నిక‌ల వేళ‌ కాంగ్రెస్ లో కొంత‌వ‌ర‌కు ఐక్య‌త‌ను సాధించి, నేడు అధికారంలోకి తీసుకువ‌చ్చారు రేవంత్. 

రేవంత్ రెడ్డి తెలంగాణ‌లో ఉద్య‌మ పార్టీ కారు గాలి తీసి, కాంగ్రెస్ చ‌క్రం తిప్పిన తీరు తెలుగు రాజ‌కీయాల్లో కొత్త వ‌ర‌వ‌డిని తీసుకువ‌చ్చింద‌నే చెప్పాలి. ఉపఎన్నికల్లో అవమానకర పరాజయాలు ఎదురైనా, పార్టీలోనే, సొంత నేత‌ల నుంచి తన నాయకత్వానికి తీవ్రమైన సవాల్‌ విసిరినా, కాంగ్రెస్‌ను ముందుండి నడిపించారు. హైకమాండ్ పూర్తి మద్దతు, సమర్థవంతమైన వ్యూహంతో, రేవంత్ రెడ్డి గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కీల‌క‌మైన, చాలా అవసరమైన స‌మ‌యంలో విజయాన్ని అందించారు. రాబోయే లోక్ స‌భ ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో కాంగ్రెస్ గెలుపు ప్ర‌భావం స్ప‌ష్టంగా ఉంటుంద‌ని చెప్ప‌డంలో సందేహం లేదు.

కొన్ని నెలల క్రితం వరకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దిగజారి కనిపించింది. అయితే, పొరుగున ఉన్న కర్ణాటకలో విజయం పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)కి హ్యాట్రిక్ అడ్డుకోవ‌డంలో.. తెలంగాణ కాంగ్రెస్ ఒంట‌రిగానే అధికార పీఠం ద‌క్కించుకునే విధంగా ముందుకు సాగ‌డంతో కొంత ప్ర‌భావం చూపింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌కి సవాల్‌ విసిరిన తన సొంత నియోజకవర్గం కొడంగల్‌, కామారెడ్డిలలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల సభల్లో ప్రసంగించిన ఏకైక నాయకుడు రేవంత్‌రెడ్డి. త‌న పార్టీ నాయ‌కుల గెలుపు కోసం నిరంత‌రం ప్ర‌య‌త్నించిన తీరు ఒక పార్టీ నాయ‌కుడిగా ఉండాల్సి ల‌క్ష‌ణాన్ని నొక్కి చెబుతుంది. 

రేవంత్ రెడ్డి వివిధ నియోజకవర్గాల్లో 55 బహిరంగ సభల్లో పాల్గొని కాంగ్రెస్ గెలుపు అవకాశాలను పెంచ‌డంలో కీల‌క పాత్ర పోషించారు. బీఆర్‌ఎస్, బీజేపీలోని అసంతృప్త నేతల వద్దకు చేరుకుని కాంగ్రెస్ పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానించ‌డం, సొంత‌ పార్టీలోనే కొంత వ్యతిరేకత ఎదురైనా కేంద్ర నాయకత్వాన్ని ఒప్పించి వారికి టిక్కెట్లు ఇప్పించడంలో సఫలమయ్యారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు రేవంత్ రెడ్డిని బయటి వ్యక్తిగా పరిగణించినప్పటికీ, పార్టీ గెలుపులో ఆయన కృషి కీలక పాత్ర పోషించిందని పార్టీలోని ఆయన విమర్శకులు కూడా అంగీకరిస్తున్న ప‌రిస్థితుల‌ను క‌ల్పించారు. కేసీఆర్, అతని కుటుంబంపై తీవ్ర విమర్శకుడు, రేవంత్ రెడ్డి రాజకీయాల దూకుడు ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, అత్యంత ప్ర‌జాద‌ర‌ణ పొందిన నాయ‌కుల్లో ఒక‌రైన దివంగ‌త నేత వైఎస్ రాజశేఖర రెడ్డిని గుర్తు చేస్తుంది.
 


తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు త‌ర్వాత, పార్టీ ఇచ్చింది తామేన‌ని చెప్పుకున్న‌ప్ప‌టికీ 2014, 2018 లో అధికారంలోకి రాలేక‌పోయింది. ఒకానోక స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ‌లో ఉంటుందా? అనే ప్ర‌శ్న‌లు క‌నిపించాయి. కాంగ్రెస్ పార్టీ తన సాంప్రదాయక కోటలో పార్టీని పునరుజ్జీవింపజేసే నాయకుడి కోసం వెతుకుతుండ‌గా, రేవంత్ రెడ్డికి ప‌గ్గాలు అప్ప‌గించారు. కేంద్ర నాయకత్వం అంచనాలకు తగ్గట్టుగా రేవంత్ రెడ్డి అన్ని అడ్డంకులను అధిగమించి రాష్ట్రంలో కాంగ్రెస్ పూర్వ‌వైభ‌వాన్ని తీసుకువ‌చ్చారు. 2021లో తెలంగాణలో పార్టీని నడిపించడానికి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసినప్పుడు, 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నుండి వ‌చ్చిన ఆయ‌న ప‌ట్ల కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌లు విభేదించారు. పార్టీలో పదవి కోసం చూస్తున్న‌ చాలా మంది సీనియర్ పోటీదారులు షాక్ అయ్యారు.

ఆయన నియామకం దాదాపు పార్టీలో తిరుగుబాటుకు దారితీసింది. పార్టీలోని ఓ కేంద్ర నాయకుడు రేవంత్ రెడ్డిని ఆ పదవిలో నియమించడానికి లంచం తీసుకున్నారని కూడా ఒక సీనియర్ నాయకుడు ఆరోపిస్తూ సంచ‌ల‌నల‌కు తెర‌లేపిన సంగ‌తి తెలిసిందే. అయినా కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం రేవంత్ విష‌యంలో గట్టిగానే ఉంటూ తెలంగాణ కాంగ్రెస్ బాధ్య‌త‌లు అప్ప‌గించింది. రేవంత్ దూకుడు విధానం, మాస్ అప్పీల్ కు బ్రాండ్ గా ఉండ‌టం, ప్ర‌జ‌ల‌ను త‌న మాట‌ల‌తో అధికంగా ప్ర‌భావితం చేయ‌డం, ఇత‌ర పార్టీల ఆరోప‌ణ‌ల‌ను తిప్పికొట్ట‌డంలో అందేవేసిన  వ్య‌క్తిగా ఉంట‌డంతో కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ వైపే మొగ్గు చూపింద‌ని చెప్ప‌డంలో సందేహం లేదు. తెలంగాణలోని కాంగ్రెస్‌లోని ఒక వర్గం నేతలు ఇప్పటికీ రేవంత్‌రెడ్డి వ్య‌తిరేకంగానే చూస్తున్నారు. కానీ పార్టీని ముందుండి న‌డిపించిన తీరు,  హైకమాండ్ ఎంపికను అంగీకరించడం తప్ప వారికి వేరే మార్గం లేదు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తన సొంతగడ్డ అయిన కొడంగల్ నుంచి కాంగ్రెస్ టిక్కెట్‌పై పోటీ చేసి ఓడిపోయిన రేవంత్, అయితే, 2019లో మల్కాజిగిరి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు.

Congress, Revanth Reddy

ఎన్నో వివాదాలు చుట్టుముట్టినప్పటికీ ఫైర్‌బ్రాండ్ నాయ‌కుడిగా, కేసీఆర్, ఆయ‌న కుటుంబాన్ని ఎదుర్కోగల ఏకైక నాయకుడిగా చాలా మంది రేవంత్ నే చూస్తారు. పార్టీని గెలిపించిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కుతుందనడంలో సందేహం లేదు. ఆయన నాయకత్వంలో పార్టీ ఊపందుకొని కేసీఆర్‌పై దూకుడును ప్ర‌ద‌ర్శించింది. ముఖ్యంగా తన వాక్ చాతుర్యంతో బీఆర్ఎస్ ప్ర‌భుత్వ స్కామ్ లు, వివిధ రంగాల్లో వైఫ‌ల్యాలు ఎత్తిచూపుతూనే, ప్ర‌జ‌ల్లోకి కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్లారు. యూత్‌లోనూ ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఎన్నిక‌ల ప్రచారం జరుగుతున్న సమయంలో ఇత‌ర పార్టీల నాయ‌కులు రేవంత్ రెడ్డిపై దాడి చేస్తూనే ఆయ‌న‌కు ఆర్ఎస్ఎస్ ముద్ర వేయడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే విద్యార్థి దశలోనే తాను ఏబీవీపీలో ఉన్నారు. అది అప్ప‌టితోనే పూర్త‌యింద‌నీ, ఆర్‌ఎస్‌ఎస్‌తో తనకు ఇప్పుడు సంబంధం లేదని కొట్టిపారేయ‌డంలో పైచేయి సాధించారు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ నాయకులలో ఒక‌రిగా ఉన్న రేవంత్ రెడ్డి.. మొద‌ట మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ లో 2003లో టీఆర్‌ఎస్ (ప్రస్తుతం బీఆర్‌ఎస్)లో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. రెండేళ్ల తర్వాత పోటీ చేసే అవకాశం రాకపోవడంతో ఆ పార్టీని వ‌దిలిపెట్టారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, 2006లో జిల్లా పరిషత్ టెరిటోరియల్ కమిటీ (ZPTC) సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2008లో స్వతంత్ర అభ్యర్థిగా ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి ఎన్నికయ్యారు. అదే సంవత్సరం ఆయన తెలుగుదేశం పార్టీలో (టీడీపీ) చేరారు. 2009లో కొడంగల్ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు సాధించారు. టీడీపీ కీల‌క నేత‌ల్లో ఒక‌రిగా వెలుగొందుతున్న ఆయ‌న అసెంబ్లీలోనూ, ఇటు బ‌య‌ట రాజ‌కీయంగానే కాకుండా ప్ర‌జ‌ల్లో మంచి గుర్తింపును సాధించారు. 

2014లో కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి మళ్లీ ఎన్నికయ్యారు. అయితే, ఆంధ్రప్రదేశ్ విభజనతో తెలంగాణలో టీడీపీ బలహీనపడింది.  2015లో శాసన మండలి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేయడానికి నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్‌సన్‌కు లంచం ఇవ్వడానికి ప్రయత్నిస్తుండగా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అతడిని పట్టుకుంది. స్టీఫెన్‌సన్‌ ఫిర్యాదుతో ఏసీబీ ట్రాప్‌ చేయగా, రేవంత్‌రెడ్డి మరో ముగ్గురితో కలిసి రూ.50 లక్షల నగదుతో ఎమ్మెల్యే ఇంటికి రాగా.. వారిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆ ఎపిసోడ్ అంతాకూడా కెమెరాలో రికార్డైంది. బెయిల్ మంజూరు కాకముందే రేవంత్ రెడ్డి ఆరు నెలలకు పైగా జైలులో ఉన్నారు. అప్పటి నుంచి తక్కువ ప్రొఫైల్‌ను మెయింటెన్ చేస్తూ వస్తున్నాడు. 2017 అక్టోబర్‌లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీడీపీకి కూడా రాజీనామా చేశారు. 'కేసీఆర్ నిరంకుశ పాలన నుంచి తెలంగాణకు విముక్తి' కోసం పోరాడుతానని ప్రతిజ్ఞ చేసి, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు.
 

revanth reddy

అప్ప‌ట్లో రేవంత్ రాక‌ను వ్య‌తిరేకించిన కాంగ్రెస్ నాయ‌కులు చాలా మందే ఉన్నారు. అయితే, కాంగ్రెస్‌లో బలమైన నెట్‌వర్క్‌ని నిర్మించుకున్న ఆయన అనతికాలంలోనే అగ్ర నాయకత్వానికి దగ్గరయ్యారు. ఆయనకు టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవి దక్కింది. 2018 ఎన్నికల ప్రచారంలో తనను తాను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకుని దుమారం రేపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ, కొన్ని నెలల తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఆయనను పోటీకి దింపింది. ఆయన విజయంతో పార్టీలో తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. కేసీఆర్ నిరంకుశ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కోసం పోరాడుతానని ప్రతిజ్ఞ చేసిన మాట‌ను ఇప్పుడు గుర్తుచేసుకునే ప‌రిస్థితిని క‌ల్పించారు. తెలంగాణ‌లో కాంగ్రెస్ కు పూర్వ వైభ‌వం తీసుకువ‌చ్చారు. రాష్ట్రంలో హస్తం పార్టీకి అధికారం దక్కించారు.  నిజంగానే రేవంత్ రెడ్డి ఒక ప‌డిలేచిన కేర‌టంలా స్ఫూర్తిని నింపే వ్య‌క్తిగా నిలిచారు... !   
 

Latest Videos

click me!