1900 ఒలింపిక్ గేమ్స్‌లో మొట్టమొదటిసారి పాల్గొంది భారత్. ఒకే ఒక్క అథ్లెట్ నార్మన్ పిట్రాచార్డ్, పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొని రెండు రజత పతకాలు సాధించాడు. ఒలింపిక్స్ పతకం సాధించిన మొట్టమొదటి ఆసియా ఖండ దేశంగా రికార్డు సృష్టించింది భారత్.
ఈ విజయంతో 1920లో నలుగురు అథ్లెట్లు, ఇద్దరు రెజ్లర్లతో కూడిన బృందాన్ని ఒలింపిక్స్‌కి పంపింది బ్రిటీష్ ప్రభుత్వం. అయితే బెల్జియంలో జరిగిన 1920 ఒలింపిక్స్‌లో భారత్‌కి పతకాలేమీ రాలేదు.
1924లో 12 మంది పురుషులు, ఇద్దరు మహిళా అథ్లెట్లు కలిసి ఫ్రాన్స్‌లో జరిగిన ఒలింపిక్స్‌కి వెళ్లారు. ఇందులో ఏడుగురు అథ్లెట్లు కాగా, మిగిలినవాళ్లు టెన్నిస్ ప్లేయర్లు. పతకాలేమీ సాధించలేకపోయారు.
1928లో భారత్ నుంచి 21 మంది ప్లేయర్లు ఒలింపిక్స్‌కి వెళ్లారు. నెదర్లాండ్స్‌లో జరిగిన ఈ విశ్వక్రీడల్లో మొదటిసారి పాల్గొన్న భారత హాకీ టీమ్, స్వర్ణ పతాకం సాధించి చరిత్ర క్రియేట్ చేసింది...
1932లో 27 మంది ప్లేయర్లు ఒలింపిక్స్‌కి వెళ్లగా, ఈసారి కూడా హాకీలోనే స్వర్ణం వచ్చింది. 1928 నుంచి 1956 వరకూ భారత హాకీ జట్టు వరుసగా ఆరు స్వర్ణాలు సాధించింది.
1952లో భారత హాకీ జట్టు స్వర్ణం సాధించడంతో పాటు భారత రెజ్లర్ కేశబ జాదవ్, కాంస్య పతకాన్ని సాధించాడు. స్వతంత్ర భారతంలో ఒలింపిక్ పతకం సాధించిన మొట్టమొదటి అథ్లెట్‌గా చరిత్ర క్రియేట్ చేశాడు కేశబ జాదవ్...
1956 వరకూ స్వర్ణ పతకాలు సాధించిన హాకీ జట్టు, 1960 ఒలింపిక్స్‌లో ఫైనల్‌లో ఓడి రజతంతో సరిపెట్టుకుంది.
1964 జపాన్‌లోని టోక్యోలో జరిగిన ఒలింపిక్స్‌కి భారత్ 53 అథ్లెట్లను పంపింది. ఇందులో 52 మంది పురుషులు కాగా, ఓ మహిళ ఉంది. ఈ క్రీడల్లోనూ భారత హాకీ జట్టు తిరిగి స్వర్ణం సాధించింది.
1968లో భారత జట్టు కేవలం 25 మందిని పోటీలకు పంపగా, హాకీ జట్టు కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. ఆ తర్వాత 1972లో పోటీల్లో భారత్ నుంచి 41 మంది అథ్లెట్లు పాల్గొనగా, భారత హాకీ జట్టు కాంస్యం గెలిచింది.
1976 ఒలింపిక్స్‌లో తొలిసారి భారత హాకీ జట్టు పతకం సాధించలేకపోయింది. దీంతో 20 మంది అథ్లెట్లు నిరాశగా వెనక్కి తిరిగి వచ్చారు.
1980లో 58 మంది అథ్లెట్లు పాల్గొనగా భారత పురుషుల హాకీ జట్టు స్వర్ణంతో మెరిసింది. ఒలింపిక్స్‌లో హాకీ స్వర్ణ చరిత్ర ముగిసింది ఇక్కడే. ఆ తర్వాత 1984, 1988, 1992 ఒలింపిక్స్‌లో భారత్‌కి ఒక్క పతకం కూడా దక్కలేదు.
1996 ఒలింపిక్స్‌లో భారత టెన్నిస్ ప్లేయర్ లియండర్ పేస్, కాంస్య పతకం గెలిచాడు. కేదార్ తర్వాత 44 ఏళ్లకు భారత్‌కి దక్కిన తొలి ఒలింపిక్ వ్యక్తిగత పతకం ఇదే...
ఆస్ట్రేలియాలోని సిడ్నీ వేదికగా జరిగిన 2000 ఒలింపిక్స్‌లో భారత వెయిట్ లిఫ్టర్, తెలుగు మహిళ కరణం మల్లీశ్వరి కాంస్య పతకం సాధించింది...
గ్రీస్‌లోని ఏథెన్స్‌లో జరిగిన 2004 ఒలింపిక్స్‌లో భారత షూటర్ రాజవర్థన్ సింగ్ రాథోడ్, షూటింగ్‌లో రజతం సాధించాడు. వ్యక్తిగత విభాగాల్లో రజతం సాధించిన మొదటి భారత అథ్లెట్ రాజవర్థన్ సింగ్ రాథోడే...
2008 బీజింగ్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో భారత జట్టుకి మూడు పతకాలు దక్కాయి. షూటింగ్‌లో అభినవ్ బింద్రా స్వర్ణం పతకం సాధించగా, బాక్సింగ్‌లో విజేందర్ సింగ్, రెజ్లింగ్‌లో సుశీల్ కుమార్ కాంస్య పతకాలు సాధించారు.
2012 లండన్ ఒలింపిక్స్‌లో భారత జట్టు ఆరు పతకాలు సాధించింది. షూటింగ్‌లో విజయ్ కుమార్, రెజ్లింగ్‌లో సుశీల్ కుమార్ రజత పతకాలు సాధించారు.
షూటింగ్‌లో గగన్ నారంగ్, బ్యాడ్మింటన్‌లో సైనా నెహ్వాగ్, బాక్సింగ్‌లో మేరీ కోమ్, రెజ్లింగ్‌లో యోగేశ్వర్ దత్ కాంస్య పతకాలు సాధించారు. ఇప్పటిదాకా ఒలింపిక్స్‌లో భారత్ ఇచ్చిన మెరుగైన ప్రదర్శన ఇదే.
2016 రియో ఒలింపిక్స్‌లో భారత్ నుంచి ఏకంగా 117 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. అయితే భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు రజతం, రెజ్లింగ్ సాక్షి మాలిక్ కాంస్య పతకం తప్ప మిగిలిన అథ్లెట్లు పతకాలు సాధించలేకపోయారు.
ఇప్పటిదాకా భారత జట్టు ఒలింపిక్ పతకాల సంఖ్యలో డబుల్ డిజిట్ ఫిగర్‌ను కూడా అందుకోలేకపోయారు. విశ్వక్రీడల వేదికపై చిన్నచిన్న దేశాలు, పదుల సంఖ్యలో పతకాలు గెలుస్తూ అద్భుతాలు చేస్తుంటే, భారత జట్టు మాత్రం ఒక్క పతకం రాకపోతుందా? అని ఎదురుచూడాల్సిన పరిస్థితి.
కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాల పంట పండించే మన ప్లేయర్లు, ఒలింపిక్స్‌లో మాత్రం ఆ రేంజ్ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోతున్నారు.
స్వాతంత్రానంతరం ఒలింపిక్స్‌లో భారత పతకాల ర్యాంకింగ్ కూడా టాప్ 20 దాటలేకపోయింది. 1996 నుంచి అయితే టాప్ 50 ర్యాంకులోకి వచ్చేది కూడా ఒకేసారి. 2008లో టాప్ 50లో నిలిచింది భారత్. ఈసారి ఆ ర్యాంకు మెరుగైతే చాలు, అదే పది వేలు.
రియో ఒలింపిక్స్‌లాగే ఈసారి కూడా ఒలింపిక్స్ బరిలో భారీ అంచనాలతో చాలామంది అథ్లెట్లు బరిలో దిగుతున్నారు. ఈసారి ఒలింపిక్స్‌లో పాల్గొనేవారి సంఖ్య కూడా పెరిగింది. టోక్యోలో అయినా మన రాత మారాలని కోరుకుందాం.