జమైకన్ అథ్లెట్ ఉసేన్ బోల్ట్‌కు ఝలక్.. ఖాతా నుంచి వంద కోట్లు మాయం..

First Published | Jan 19, 2023, 3:34 PM IST

Usain Bolt: పరుగుల వీరుడు, జమైకన్ చిరుత   ఉసేన్ బోల్ట్ ఆర్థిక మోసం బారినపడ్డాడు.   ఓ ప్రైవేట్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన  బోల్ట్ ఖాతా నుంచి సుమారు రూ. 100 కోట్లకు పైగా  మాయమయ్యాయి. 

ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరిగెత్తగల పరుగుల వీరుడు, జమైకన్ చిరుతగా ప్రఖ్యాతిగాంచిన  ఉసేన్ బోల్ట్  కు  ఊహించని షాక్ తాకింది. జమైకాకు చెందిన   స్టాక్స్ అండ్ సెక్యూరిటీస్ లిమిటెడ్ (ఎస్ఎస్ఎల్) సంస్థలో పెట్టుబడులు పెట్టిన  బోల్ట్ కు ఆ సంస్థే షాక్ ఇచ్చింది. 

ఎస్ఎస్ఎల్ లో రిటైర్మెంట్ అండ్ లైఫ్ టైమ్ సేవింగ్స్ ఖాతాను బోల్ట్ కొనసాగిస్తున్నాడు.  అయితే  కొద్దిరోజుల క్రితం ఇందులో  బోల్ట్ కు రూ. 12.8 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో  సుమారు 104 కోట్లు)   నిల్వ ఉండగా.. జనవరి రెండో వారంలో  అందులో 12.7 మిలియన్ డాలర్లు మాయమయ్యాయి.  అంటే భారత కరెన్సీలో  దాదాపు రూ. 103 కోట్లకు పైనే ఉంటుంది. 


అయితే ఇది బయటివారు చేసిన పని కాదని,  సంస్థలోని  ఓ వ్యక్తే  ఆర్థిక నేరానికి పాల్పడ్డాడని  తెలుస్తున్నది.   అయితే   బోల్ట్ మోసపోయిన ఈ డబ్బును   పది రోజుల్లో తిరిగి  అతడి ఖాతాలోకి మళ్లించాలని లేకుంటే న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని అతడి తరఫున న్యాయవాదులు ఎస్ఎస్ఎల్ ను హెచ్చరించారు. 

ఇదిలాఉండగా  ఈ మోసాన్ని  జనవరి ఆరంభంలోనే గుర్తించామని   ఎస్ఎస్ఎల్ తెలిపింది.  తమ సంస్థకే చెందిన ఓ ఉద్యోగి  వల్లే  తమ క్లయింట్స్ ఖాతాలల నగదు మాయమైందని  ఈనెల 12న ఓ ప్రకటన విడుదల చేసింది.  బోల్ట్ ఒక్కడివే కాదు.. మరో 30 మంది ఖాతాదారుల నగదు కూడా మాయమైనట్టు  వివరించింది. 

తమ ఉద్యోగి చేసిన పనిపై   ప్రస్తుతం దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేశామని, వాళ్ల విచారణ సాగుతున్నదని  ఇటీవలే ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇదిలాఉండగా  ఈ విషయంలో  జమైకా ఆర్థిక మంత్రి నిగెల్ క్లార్క్ స్పందించాడు.  ఇది  చాలా తీవ్రమైన నేరమని.. ఇందులో  ఉన్న బాధ్యులను కఠినంగా శిక్షించాలని అధికారులకు  సూచించారు. 

Latest Videos

click me!