ఐసీయూలో భార‌త మాజీ స్టార్ క్రికెట‌ర్.. స‌చిన్ ఫ్రెండ్ వినోద్ కాంబ్లీకి ఏమైంది?

First Published | Dec 24, 2024, 11:03 PM IST

Former Indian star cricketer in ICU: మాస్టర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ చిన్ననాటి స్నేహితుడు వినోద్ కాంబ్లీ ఆస్పత్రిలో చేరారు. ఈ భారత మాజీ స్టార్ క్రికెటర్ ప్ర‌స్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు.
 

Vinod Kambli

లెజెండ‌రీ ప్లేయ‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ స్నేహితుడు, భారత జట్టు మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో చేరారు. కాంబ్లీని మహారాష్ట్రలోని థానేలో ఉన్న ఆకృతి హాస్పిటల్ అనే ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. ఆయ‌న ఆరోగ్యం తీవ్రంగా దెబ్బ‌తిన‌డంతో ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. 52 ఏళ్ల కాంబ్లీని అతని అభిమాని ఒకరు ఆసుపత్రిలో చేర్చార‌ని మీడియా నివేదిక‌లు పేర్కొంటున్నాయి. 

వినోద్ కాంబ్లీకి ఏమైంది, హాస్పిటల్ ఏం చెప్పింది?

కాంబ్లీని ఆసుపత్రిలో చేర్చిన అభిమాని థానే జిల్లాలోని భివాండిలోని కల్హేర్ ప్రాంతంలో ఉన్న ఈ ఆసుపత్రి యజమాని అని మీడియా నివేదిక‌లు తెలిపాయి. సచిన్ టెండూల్కర్ స్నేహితుడు కాంబ్లీ ఆరోగ్య‌ పరిస్థితి ఆస్ప‌త్రిలో చేరిన త‌ర్వాత కాస్త‌ నిలకడగా ఉన్నట్లు సమాచారం. అయితే ఆయన ఆసుపత్రిలో చేరడానికి గల ఖచ్చితమైన కారణాలు ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి. కాంబ్లీ చికిత్సకు తామే బాధ్యత తీసుకున్నామని, అతనికి ఆర్థిక సహాయం చేస్తామని హామీ ఇచ్చామని ఆసుపత్రి తెలిపింది.


ఇటీవల సచిన్ టెండూల్కర్‌ను కలిసిన కాంబ్లీ 

ఇటీవల ముంబైలోని శివాజీ పార్కులో రమాకాంత్ అచ్రేకర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి కాంబ్లీ హాజరయ్యారు. చిన్ననాటి స్నేహితుడు సచిన్ టెండూల్కర్‌ను కలిశాడు. అక్క‌డ కాంబ్లీ ఎమోష‌న‌ల్ అయ్యారు. వీరు క‌లుసుకున్న వీడియో వైర‌ల్ అయింది. తీవ్ర అనారోగ్యంతో ఉన్న వినోద్ కాంబ్లీకి చాలా మంది మాజీ ప్లేయ‌ర్లు అండ‌గా ఉంటామ‌ని చెప్పారు. అనారోగ్యంతో ఉన్న కాంబ్లీకి మద్దతుగా తమ మౌనాన్ని వీడారు. ప్రపంచ ఛాంపియన్లు కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్ అతనికి ఆర్థిక సహాయం చేస్తామ‌ని చెప్పారు. 

గ‌తంలో కాంబ్లీకి గుండె ఆప‌రేష‌న్ 

వినోద్ కాంబ్లీ ప్ర‌స్తుతం ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. క్రికెట్ గాడ్ స‌చిన్ టెండూల్క‌ర్ ఆర్థిక సాయంతో గ‌తంలో వినోద్ కాంబ్లీ రెండు సార్లు గుండె ఆప‌రేష‌న్ చేయించుకున్న‌ట్టు అత‌ను తెలిపాడు. కాంబ్లీ తొమ్మిదేళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో భారత్ తరఫున 17 టెస్టులు, 104 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. రెండు డబుల్ సెంచరీలతో సహా నాలుగు టెస్ట్ సెంచరీలు సాధించాడు. టెస్టుల్లో వరుసగా డబుల్ సెంచరీలు సాధించిన మొదటి భారతీయ ప్లేయ‌ర్ గా రికార్డు సాధించాడు. అయితే, కొన్ని వివాదాలు, క్ర‌మ శిక్ష‌ణ లోపంతో కెరీర్ ను పాడు చేసుకున్నాడ‌ని అత‌నితో క‌లిసి క్రికెట్ ఆడిన ప్లేయ‌ర్లు చాలా సార్లు కాంబ్లీ గురించి చెప్పారు.

vinod kambli

కాంబ్లీ ఆరోగ్యంపై డాక్ట‌ర్లు ఏం చెప్పారంటే? 

డాక్టర్ వివేక్ మాట్లాడుతూ.. 'శనివారం సాయంత్రం అతన్ని ఆస్ప‌త్రిలో చేర్చుకున్నాం. ఇంట్లో అతనికి కండరాలు తిమ్మిర్లు, కళ్లు తిరగడం వంటివి ఉన్నాయి. మేము అతనిని ఆసుపత్రికి తీసుకువచ్చినప్పుడు తీవ్రమైన జ్వరం, కండరాల నొప్పులు కారణంగా నడవడానికి కూడా ఇబ్బంది ప‌డుతున్నాడు. సోడియం, పొటాషియం లోపం వల్ల అతనికి యూరినరీ ఇన్‌ఫెక్షన్ ఉంది. కండరాలు తిమ్మిర్లు వస్తున్నాయని విచారణలో తేలింది. ఇటీవల పక్షవాతం వచ్చినందున మెదడును పరిశీలించగా అక్క‌డ‌క్క‌డ‌ గడ్డలు ఏర్పడినట్లు తేలిందని' తెలిపారు. అయితే, త్వ‌ర‌లోనే అత‌ను కోలుకుంటార‌ని చెప్పారు.

Sachin meets Vinod Kambli

కాంబ్లీ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని..

వినోద్ కాంబ్లీ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని క్రికెట‌ర్లు, అత‌నితో కలిసి ఆడిన ప్లేయ‌ర్లు ఆశిస్తున్నారు. భార‌త ప్లేయ‌ర్ల‌తో పాటు విదేశీ ప్ర‌ముఖులు కూడా కాంబ్లీ కోసం ప్రార్థ‌న‌లు చేస్తున్న‌ట్టు తెలిపారు. వీరిలో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ కూడా ఉన్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్న భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీతో తాను వీడియో చాట్ చేశాననీ, అతను త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని మాజీ బ్యాట్స్‌మెన్ బాసిత్ అలీ తెలిపారు.

Latest Videos

click me!