sri rama navami
శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే
సత్యవాక్కు పరిపాలకుడైన శ్రీరాముని జన్మదినం చైత్రశుద్ధ నవమిని శ్రీరామ నవమిగా జరుపుకుంటారు. చైత్ర నవమి అంటే చైత్ర మాసంలోని తొమ్మిదవ రోజు అని అర్ధం. ఈ రోజు ప్రాముఖ్యత ఏంటంటే.. రాముడి పుట్టినరోజు, శ్రీ సీతారాముల పెళ్లి రోజు కూడా. ఈ శ్రీరామ నవమి హిందువులకు ఎంతో ముఖ్యమైన పండుగ. శ్రీ మహా విష్ణువు దశావతారాల్లో ఏడోది రామావతారం. దుష్ట శిక్షణ కోసం శ్రీ హరి.. రాముడిగా మానవ రూపంలో భూమిపై అవతరించి ధర్మ సంస్థాపన చేసాడు.
శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పవిత్రమైన పండుగగా జరుపుకుంటారు. పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసము ఉండి, రావణ సంహారము చేసిన తరువాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని విశ్వాసము.
చరిత్ర:- రామాయణంలో అయోధ్యకు రాజైన దశరథుడికి ముగ్గురు భార్యలున్నారు. కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఆయనకు ఉన్న బాధ అంతా సంతానం గురించే. సంతానం లేక పోతే రాజ్యానికి వారసులు ఉండరని ఎప్పుడూ బాధపడేవారు. అప్పుడు వశిష్ట మహాముని దశరథ రాజుకు పుత్ర కామేష్టి యాగం చేయమని సలహా ఇచ్చాడు. రుష్య శృంగ మహామునికి యజ్ఞాన్నినిర్వహించే బాధ్యతను అప్పజెప్పమన్నాడు. వెంటనే దశరథుడు ఆయన ఆశ్రమానికి వెళ్లి ఆయనను తన వెంట అయోధ్యకు తీసుకుని వచ్చాడు. ఆ యజ్ఞానికి తృప్తి చెందిన అగ్ని దేవుడు పాయసంతో నిండిన ఒక పాత్రను దశరథుడికిచ్చి భార్యలకు ఇవ్వమన్నాడు. దశరథుడు అందులో సగ భాగం మొదటి భార్య కౌసల్యకూ, రెండో సగ భాగం చిన్న భార్య యైన కైకేయికి ఇచ్చాడు. వారిద్దరూ వారి వాటాల్లో సగం మిగిల్చి రెండో భార్యయైన సుమిత్రకు ఇచ్చారు. కొద్దికాలానికే వారు ముగ్గురూ గర్భం దాల్చారు. చైత్ర మాసం తొమ్మిదవ రోజైన నవమి నాడు, మధ్యాహ్నం కౌసల్య రామునికి జన్మనిచ్చింది. అలాగే కైకేయి భరతుడికీ, సుమిత్ర లక్ష్మణ శతృఘ్నూలకు జన్మనిచ్చారు. శ్రీరాముడు ధర్మ సంస్థాపనార్థం అవతరించిన శ్రీ మహా విష్ణువు యొక్క ఏడవ అవతారం. రావణుని అంతమొందించడానికి అవతరించిన వాడు.
ఉత్సవం :- ఈ పండగ సందర్భంగా హిందువులు సాధారణంగా తమ ఇళ్ళలో చిన్న సీతా రాముల విగ్రహాలకు కళ్యాణోత్సవం నిర్వహిస్తుంటారు. చివరగా విగ్రహాలను వీధుల్లో ఊరేగిస్తారు. చైత్ర నవరాత్రి (మహారాష్ట్రలో), లేదా వసంతోత్సవం (ఆంధ్రప్రదేశ్ లో) తో తొమ్మిది రోజులు పాటు సాగే ఈ ఉత్సవాలను ముగిస్తారు. ఇటీవల జరిపిన జ్యోతిష శాస్త్ర పరిశోధనల ఆధారంగా శ్రీరాముడు క్రీ.పూ శాలివాహన శకం 5114, జనవరి 10 న జన్మించినాడని పరిశోధన ద్వారా తెలియజేశారు.
ఉత్సవంలో విశేషాలు :- ఆలయ పండితులచే నిర్వహించబడే సీతారాముల కల్యాణ ఉత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. బెల్లం, మిరియాలు కలిపి తయారు చేసే పానకం చాలా మందికి ప్రీతిపాత్రమైనది. ఉత్సవ మూర్తుల ఊరేగింపు. రంగు నీళ్ళు చల్లుకుంటూ ఉల్లాసంగా వసంతోత్సవం సాగుతుంది. ఈ సందర్భంగా హిందువులు ఉపవాస దీక్షను పాటిస్తారు. లేదా పరిమితమైన ఆహారం స్వీకరిస్తారు. దేవాలయాలను అందంగా విద్యుద్దీపపు కాంతులతో అలంకరిస్తారు. రామాయణాన్ని పారాయణం చేస్తారు. శ్రీరామునితో బాటు సీతాదేవిని, లక్ష్మణుని, ఆంజనేయుని కూడా ఆరాధిస్తారు.
భద్రాచలంలో రామదాసుచే కట్టబడిన రామాలయంలో ప్రతి సంవత్సరం ఈ ఉత్సవం అంగరంగ వైభవంగా చేస్తారు. ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి తన తలమీద సీతారామ కళ్యాణ సందర్భంగా తలంబ్రాలకు వాడే ముత్యాలను తీసుకుని వస్తాడు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా శ్రీరామ కళ్యాణం ఎంతో ఘనంగా జరుగుతుంది. రామ నవమి నాడు ప్రత్యేక పూజలు చేయడం, కళ్యాణం నిర్వహించడం, రామ మంత్రాలు జపించడం వల్ల వెయ్యి రెట్ల శుభ ఫలితం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడు. ఈ చైత్ర శుద్ధ నవమి నాడు తెలంగాణాలోని భద్రాచలంలో సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు. దేశములో రాముడి గుడి లేని వీధి ఉండదు అంటే అతిశయోక్తి కాదేమో. శ్రీరామ నవమి వస్తుందంటే చాలు ఊరువాడా సందడే సందడి. శ్రీరామ నవమి రోజున వేకువజామునే నిద్ర లేచి శుచిగా స్నానమాచరిస్తారు. దేవుడి మందిరం శుభ్రం చేసుకున్నాక దీపారాధన చేస్తారు. అలానే శ్రీ రామునికి పండ్లు, తులసి ఆకులని, పూలని, ప్రసాదాన్ని సమర్పిస్తారు. ఈ శ్రీరామ నవమి రోజున దేశంలో రామాలయం ఉన్న ప్రాంతాల్లోనే కాదు.. ఊరువాడా కూడా రాములోరి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపిస్తారు. వడపప్పు, పానకం రాములవారి కళ్యాణానికి ప్రసాదంగా పెట్టి అందరికీ నైవేద్యంగా పంచిపెడతారు. ఈ పానకం, వడపప్పు సేవించండం వలన శరీరంలోని అధిక ఉష్ణోగ్రతలు నియంత్రణలో ఉంటుంది. అంతేకాదు " చలువ" కూడా చేస్తుంది.
డా. యం. ఎన్. ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151