నవరాత్రుల్లో తొమ్మిదోవ రోజు అమ్మవారు శ్రీ రాజ రాజేశ్వరిగా దేవిగా మనకు దర్శనమిస్తారు. భువన బ్రహ్మాండాలకు అమ్మ ఆరాధ్య దేవత. విజయ దశమి గురించి, శ్రీ రాజరాజేశ్వరి దేవి గురించి కొన్ని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ అమ్మవారు అపరంజి దేవిగా కీర్తించబడింది. అపరంజి అనగా ఓడించడానికి వీలు లేనటువంటిది. ఎక్కడికి వెళ్లిన విజయం తప్పక వరిస్తుంది అని అర్ధం. అంబా, శాంభవి, ఉమా, పార్వతీ, చంద్రమౌళి రవ్వల అపర్ణ అనే పేర్లతో కూడా అమ్మవారిని పిలుస్తారు.
ఈమె విలాసంగా వీరాసనంతో అంటే ఒక కాలు పైకి మడిచి మరొక కాలు పాదపీఠం మీద పెట్టి చక్కగా కూర్చుంటుంది. ఓ పక్కన ఒక చిలుక భుజం మీద ఉండగా చెరకుగడను చేతిలో పట్టుకుంటుంది. చిరునవ్వుతో విలాసంగా కూర్చుని పద్మాసనంలో దర్శనమిస్తుంది.
దేవదానవులు పాలసముద్రములో అమృతం జనించిన శుభ సమయమునే విజయదశమి రోజని అన్నారు. 'శ్రవణా' నక్షత్రంతో కలసిన ఆశ్వీయుజ దశమికి 'విజయ' అనే సంకేతమున్నది. అందుకనే 'విజయదశమి' అనే పేరు వచ్చింది.
తొమ్మిది రోజులపాటు యుద్ధం చేసి రాక్షసులను అంతం చేసిన తర్వాత విజయోత్సవంగా జరుపుకునేటటువంటి దశమి రోజు అమ్మవారి యొక్క సహస్ర విశాలమైన, రాజసంగా కనిపించే అమ్మవారి స్వరూపాన్ని శ్రీ రాజరాజేశ్వరి దేవి స్వరూపం అంటారు.
అమ్మను అపరాజితాదే “అంబా శాంభవి చంద్రమౌళి రబలా వర్ణా ఉమా పార్వతీ కాళీ హైమవతీ శివా త్రిణయనీ కాత్యాయనీ భైరవీ సావిత్రీ నవయౌవనా శుభకరీ సామ్రాజ్యలక్ష్మి ప్రదా చిద్రూపీ పరదేవతా భగవతీ ! శ్రీ రాజరాజేశ్వరి.” అనే శ్లోకంతో పూజిస్తారు.
అజ్ఞాతవాసమందున్న పాండవులు వారివారి ఆయుధములను, వస్త్రములను శమీవృక్షముపై దాచిపెట్టగా.. అజ్ఞాతవాసము పూర్తి అవగానే ఆ వృక్ష రూపమును పూజించి ప్రార్ధించి, తిరిగి ఆయుధాలను వస్త్రములను పొంది, శమీవృక్ష రుపమున ఉన్న 'అపరాజితా' దేవి ఆశీస్సులు పొంది, కౌరవులపై విజయము సాధించారు.
శ్రీ రాముడు ఈ విజయదశమి రోజున ఈ 'అపరాజితా' దేవిని పూజించి, రావణుని సహరించి, విజయము సొంతం చేసుకున్నాడు. అందరూ నవరాత్రులు జరుపుకుని, విజయదశమిరోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన శమీవృక్షం (జమ్మిచెట్టు) వద్దగల అపరాజితాదేవిని పూజిస్తారు.
ఇఛ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులను ఈ మూర్తి తన భక్తులకు వరములుగా అనుగ్రహిస్తుంది. అమ్మ యోగమూర్తి. మాయా మోహిత మానవ మనోచైతన్యాన్ని రాజరాజేశ్వరీ దేవి ఉద్దేపితం చేస్తుంది. అనంత శక్తిస్వరూపమైన శ్రీచక్రమునకు అమ్మ అధిష్టాన దేవత. ఈ పర్వదినాన అమ్మవారికి చక్కెర పొంగలి నైవేద్యంగా సమర్పించి పూజిస్తారు.