కాకుల పగ
మనుషుల్లో స్వార్థం ఉంటుంది. అందుకే.. ఒకరిపై మరొకరు పగ, ప్రతికారాలు అంటూ తిరుగుతూ ఉంటారు. మనుషుల తర్వాత పాములు పగ పడతాయి అని చెబుతూ ఉండటం మీరు వినే ఉంటారు. కానీ... పక్షులు ముఖ్యంగా కాకి కూడా పగ పడుతుందా? కాకుల్లో పగ తీర్చుకునే గుణం ఉంటుందా? అంటే అవును అనే నిపుణులు చెబుతున్నారు.
ఓ పరిశోధనలో తేలిన విషయం ఏమిటంటే.... కాకులు కూడా పగ పడతాయట. ఒకవేళ కాకులు మనుషులపై పగ పెట్టుకుంటే దాదాపు 17 ఏళ్ల పాటు దానిని గుర్తుంచుకొని, పగ తీర్చుకోవడానికే ప్రయత్నిస్తాయట.
వాషింగ్టన్ విశ్వవిద్యాలయ పర్యావరణ శాస్త్రవేత్త, ప్రొఫెసర్ జాన్ మార్స్లఫ్ చేసిన పరిశోధనలో రుజువు అవ్వడం గమనార్హం. 2006లో, కాకులు పగ తీర్చుకుంటాయా అని పరీక్షించడానికి ఆయన ఒక ప్రయోగం చేశారు. దెయ్యం ముసుగు ధరించి, వెబ్‌లో చిక్కుకున్న ఏడు కాకుల్ని పట్టుకున్నారు.
వాటి రెక్కలపై కొన్ని గుర్తులు గీసి, గాయాలు లేకుండా వదిలేశారు. అయినా, వదిలిపెట్టిన తర్వాత కూడా, కాకులు ఆయన్ని వెంబడించాయి. ప్రతిసారి ఆయన క్యాంపస్‌లో ముసుగు ధరించి వెళ్ళినప్పుడల్లా కాకులు ఆయనపై దాడి చేసేవట.
కాకుల పగ
ఇంకా ఆశ్చర్యకరంగా, ఇతర కాకులు కూడా దాడిలో చేరాయి. ఈ దాడులు ఏడేళ్ల పాటు కొనసాగాయి. 2013 తర్వాత, కాకుల దాడి తగ్గడం మొదలైంది. 17 ఏళ్ల తర్వాత, గత సంవత్సరం సెప్టెంబరులో, మార్స్లఫ్ ముసుగు ధరించి బయటకు వెళ్ళినప్పుడు, మొదటిసారిగా, కాకులు ఆయనపై దాడి చేయలేదు, అరవలేదు కూడా. ప్రొఫెసర్ మార్స్లఫ్ ఇప్పుడు ఈ అనుభవం గురించి తన పరిశోధనను ప్రచురించాలనుకుంటున్నారు.
మార్స్లఫ్ తన పరిశోధన ద్వారా, క్షీరదాల్లో ఉండే అమిగ్డాలా లాంటి మెదడు భాగం కాకులకు కూడా ఉందని కనుగొన్నారు. ఇది భావోద్వేగాలను నియంత్రించే మెదడు భాగం. కాకులు మానవ ప్రవర్తనను గమనించడమే కాకుండా, ముఖాలను కూడా గుర్తుపట్టగలవని ఆయన ఆశ్చర్యపోయారు.
కాకుల పగ
ఒక మనిషి నుండి బెదిరింపును ఎదుర్కొన్న కాకులు దాన్ని గుర్తుంచుకుని, పగ తీర్చుకునే కోరికను కలిగిస్తాయి. కొన్నిసార్లు దాన్ని తమ సమూహంలోని ఇతర కాకులకు కూడా తెలియజేస్తాయి. కోపంతో ఉన్న కాకులను ఎదుర్కోవడం ఒక భయానక సినిమా సన్నివేశంలా ఉంటుంది. ఎందుకు కొన్ని కాకులు కొంతమందిని మాత్రమే దాడి చేస్తాయో ఈ పరిశోధన ఫలితాలు వివరిస్తున్నాయి.