రాంగ్ నెంబర్ అతని జీవితాన్ని మార్చేసింది. అనుకోకుండా ఓ రాంగ్ నంబర్ ద్వారా ఓ వివాహిత అతని జీవితంలోకి వచ్చింది. పెళ్లైన మహిళ కదా అని దూరం పెట్టకుండా.. పరిచయాన్ని మరికాస్త పెంచుకున్నాడు.
ఆ పరిచయం ప్రేమగా.. అటు నుంచి వివాహేతర సంబంధంగా మారింది. ఆ బంధమే.. చివరకు అతని ప్రాణాలు తీసేసింది. ఈ దారుణ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కర్ణాటక రాష్ట్రం, బెంగుళూరు లోని మాదావరలో నివాసం ఉండే చంద్రశేఖర్ (20)కు చిన్నాదేవి అగ్రహార కు చెందిన ఒక వివాహిత మహిళ మిస్డ్ కాల్ ద్వారా పరిచయం అయ్యింది.
ఈ పరిచయం కాస్తా రోజూ ఫోన్ లో చాటింగ్ చేసుకునే దాకా వెళ్లింది. కొన్నాళ్లకు ఆస్నేహం ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. వారి బంధంతో ఒకరిని విడిచి.. మరొకరు బతకలేని స్థాయికి చేరిపోయారు.
విషయం తెలుసుకున్న వివాహిత మహిళ భర్త, వీరిని వెతికి పట్టుకుని తన భార్యను ఇంటికి తీసుకువెళ్లాడు. ఇంత జరిగి, ఇంటికి వెళ్లినా ఆమె మళ్లీ తన ప్రియుడితో స్నేహం కొనసాగిస్తూనే ఉండేది. కొన్నాళ్లకు మళ్లీ ప్రియుడితో వెళ్లిపోయింది.
భార్య రెండో సారి ప్రియుడితో వెళ్లిపోవటం తట్టుకోలేని భర్త, చంద్రశేఖర్ను చంపాలని నిర్ణయించుకున్నాడు. తన బంధువులతో కలిసి, చంద్రశేఖర్ ఎక్కడున్నాడో తెలుసుకుని అక్కడికెళ్లి అతడిపై దాడి చేశారు.
దాడిలో చంద్రశేఖర్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన చంద్రశేఖర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.