ఇద్దరు మనుషుల మనసులు కలిసి చేసే జీవనప్రయాణమే దాంపత్యం. జీవితకాలం నడవాల్సిన ఈ దారిలో నిత్యం అనేక సవాళ్లు ఎదురవుతుంటాయి.
కాలక్రమంలో ఏ బంధంలోనైనా మార్పు సహజమే. అయితే దీర్ఘకాల అనుబంధం కోసం కొన్ని దశలను అర్థం చేసుకోవాలి.. ఆయా సమయాల్లో సరిగ్గా స్పందించడం.. ఓపకిగా, అర్థం చేసుకోవడం ముఖ్యం అలాంటి సమయాల్లోనే బంధం విచ్చిన్నం కాకుండా మరింత.. బలపడుతుంది.
అలా వైవాహిక జీవితంలో ప్రతీ జంట కొన్ని ముఖ్యమైన దశలను ఎదుర్కుంటుంది. ఆయా సందర్భాల్లో వారు ఎలా ప్రవర్తించాలి, ఎంత సహనంగా ఉండాలి, ఎలాంటి అడుగు వేయడం వల్ల మీ బంధానికి మేలు కలుగుతుందో చూడండి..
హనీమూన్ స్టేజ్ : పెళ్లైన మొదటి, రెండు సంవత్సరాలు.. ఒకరి మీద ఒకరి ఆకర్షణతో గడిచిపోతుంది. ఎదుటివారికి తగ్గట్టుగా, నచ్చేలా ఉండడానికి ప్రయత్నిస్తారు. అంతేకాదు ఒకరిమీద ఒకరి ఆకర్షణ ఎలాంటి నెగెటివ్ థింకింగ్ నైనా అధిగమించేలా చేస్తుంది.
దీనికి శృంగార జీవితం, రొమాన్స్ తోడవుతుంది. సో ఇదే సరైన సమయం... మీరు మీ భాగస్వామికి సరిగా అర్థమయ్యేలా చేసుకోవడం, వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం.
ఇక రెండోది అత్యంత ముఖ్యమైన దశ.. దంపతులుగా స్థిరపడే దశ. ఇప్పటికే ఒకరిగురించి ఒకరికి పూర్తిగా తెలిసిపోతుంది. అలవాట్లు, అభిరుచులు, ప్రభావాలు ఇలా ప్రతీ ఒక్కదాని విషయంలో క్లారిటీ వచ్చేస్తుంది. దీంతో కొన్నిసార్లు తనకు సరికాదేమో అనే భావన మొదలవుతుంది.
మరికొన్నిసార్లు బయటి వ్యక్తులు, కొన్ని సంఘటనలు వైవాహిక జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. వాస్తవాలు కళ్లముందు సాక్షాత్కారమవుతుంటాయి. దీంతో మీ జీవితభాగస్వామిలోని నెగటివ్స్ ను అంత తేలిగ్గా తీసుకోలేకపోతారు.
వైవాహిక సంబంధం మూడవ దశ భ్రమలు తొలిగిపోయే దశ. ఇది ప్రేమకు శీతాకాలం లాంటిది. మరి కొంతమంది విషయంలో డెడ్ ఎండ్ గా కూడా మారిపోతుంది. ఈ సమయంలో, అప్పటివరకు ముసుగులో గుద్దులాటగా ఉన్న అంశాలు పూర్తిగా క్లియర్ అవుతాయి. ఈ సమయంలోనే చాలా మంది జంటలు జీవితం అంటే ఇదా? ఇన్ని సమస్యలు ఉంటాయా? అని ఆశ్చర్యపడటం ప్రారంభిస్తారు.
ఈ దశలో, భార్యాభర్తలు ఒకరిలో ఒకరు లోపాలు స్పష్టంగా కనిపిస్తుంటాయి. తాము పెళ్లి చేసుకున్నది సకలగుణాభిరాముళ్లను కాదని, సుగుణాల రాశిని కాదని అనుకుంటారు. అందుకే తమను తాను కొత్తగా చూపించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ సమయంలో ఏం చేయాలంటే ఒకరి గురించి మరొకరు మళ్లీ కొత్తగా తెలుసుకునే ప్రయత్నం చేయండి. పాత విషయాలకు స్వస్తి చెప్పండి.
వైవాహిక జీవితం.. అనుబంధం ఎప్పటికీ ఆరోగ్యంగా, అన్యోన్యంగా ఉండాలంటే ఎప్పటికప్పుడు కొత్తగా తమని తాము ఆవిష్కరించుకోవడం, జీవితభాగస్వామికి ఆ అవకాశం ఇవ్వడంతో పాటు, తనను గౌరవించడం, వారి మాటలు, అభిప్రాయాలకు విలువివ్వడం ముఖ్యం.
ప్రపంచంలోని ఏ జంటా వందశాతం పర్ఫెక్ట్ కాదు అనే విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి.