ప్రేమ ఎంత అందమైన పదమో.. దానితో ఏర్పడే అనుబంధం అంతకంటే అపూర్వమైనది. దాన్ని కలకాలం నిలబెట్టకోవడానికి ఆ జంట తమ శాయశక్తులా ప్రయత్నిస్తుంటారు. తమది ప్రేమో, ఆకర్షణో తెలుసుకోవడానికి రకరకాలుగా తమ బంధాన్ని పరీక్షించుకుంటారు. దీనికోసం పెళ్లికిముందు సహజీవనం కూడా ఓ పద్ధతిగా ఎంచుకుంటారు.
కలిసి జీవించినప్పుడు ఇద్దరి మధ్య వైరుధ్యాలు బయటపడతాయి, వారు వాటిని ఎలా అధిగమిస్తారో తెలిసివస్తుంది. ఆ బంధం కలకలం నిలబడుతుందా? లేదా.. అర్థమవుతుంది.
కలిసి జీవించే క్రమంలో వారిలోని చెడులక్షణాలు మీకు కనిపించడం మొదలుపెడతాయి. అంతకుముందు అవి మీకు తెలిసినా.. అంతగా ఫోకస్ చేయకపోవడం వల్ల పట్టించుకోకపోయి ఉండవచ్చు.
ఇప్పుడు ఇద్దరే కలిసి ఉంటున్నప్పుడు అది మరింత ప్రాధాన్యత సంతరించుకుంటుంది. ఎక్కువగా గమనిస్తుంటారు. అలాంటప్పుడే మీకు తను సరైన వాడేనా? కాదా? అనే అనుమానం వస్తుంది.
మీకు ఎంతవరకు అటెన్షన్ ఇస్తున్నారో అర్థమవుతుంది. ఒక వ్యక్తితో జీవితాన్ని పంచుకోవాలని కలిసి చేస్తున్న ప్రయాణంలో మీ వైపు నుంచి మాత్రమే ఆ బంధాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నం సాగుతుందంటే... అది సరికాదు. ఇంట్లో మీరు ఉన్నారంటే ఉన్నారు.. అన్నట్టుగా ప్రవర్తించినా, మీకు ప్రాముఖ్యత ఇవ్వకపోయినా ఆ బంధం ఓన్లీ వన్ సైడెడ్ అని అర్థం చేసుకోవాలి.
రొమాంటిక్ కపుల్ గా ఉండడం బాగుంటుంది. అయితే ఇద్దరూ ఉద్యోగాలు చేస్తూ ఖర్చులు కలిసి పంచుకుంటున్నప్పుడు కొన్ని రకాల సమస్యలు వస్తాయి. ఆ సమస్యలు వచ్చినప్పుడు వాటిని పరిష్కరించడంలో అతనెలా వ్యవహరిస్తున్నాడో గమనించాలి. మీరు ఉద్యోగం కోసం వెతుకుతుంటే.. తను వీడియో గేమ్స్ ఆడుతూ టైం వేస్ట్ చేస్తున్నట్టైతే.. ఆ బంధానికి అక్కడితో టాటా, బైబై చెప్పడం బెటర్.
పెళ్లి వేరు, సహజీవనం వేరు. సహజీవనంలో ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించేటప్పుడు అన్ని బాధ్యతలూ తప్పనిసరిగా సగం సగం పంచుకోవాల్సిందే. ఇంటిపనులు, వంటపనుల్లో అతనెంత సాయం చేస్తున్నాడో గమనించండి.
పూర్తి సమానత్వం సాధ్యమయ్యే పని కాదు కానీ.. వీలైనంత వరకు తనవైపు నుంచి మీకు సాయపడడంలో ఎలా స్పందిస్తున్నాడో గమనించాలి.
మనసిచ్చినవాడితో ఒకే ఇంట్లో కలిసి ఉండడం చాలా రొమాంటిక్ గా ఉంటుంది. అప్పుడప్పుడూ వీకెండ్స్ లో కలుసుకోవడంతో పోల్చితే ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది. అయితే కొద్దిరోజుల్లోనే ఈ బంధం మిమ్మల్ని ఒత్తిడికి గురిచేస్తున్నట్లైతే అది మీకు జీవితకాల అనుబంధం కాలేదనేది గుర్తించాలి.
సింగిల్ గా ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉన్నారో.. మీరు రిలేషన్ షిప్ లోకి అడుగుపెట్టాక.. అది కోల్పోతే ఆ బంధం మీకు సూట్ కాదని అర్థం. లేదా మీరింకా ఆ రిలేషన్ షిప్ కు సిద్ధం కాలేదని అర్థం. అప్పుడు మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
కొన్నిసార్లు మానసిక ఒత్తిడి పెరిగిపోతుంది. ఇంట్లో, ఆఫీసులో టెన్షన్లు మిమ్మల్ని బ్రేక్ డౌన్ చేస్తాయి. అలాంటి సందర్భాల్లో మీ భాగస్వామి మిమ్మల్ని ఎంతగా సపోర్ట్ చేస్తాడు, దాన్నుంచి బయటపడడానికి ఎలా సహకారం అందిస్తాడనేది ముఖ్యం. అది గమనించాలి.