దాంపత్య జీవితానికి అర్థాన్ని, అందాన్ని, నిండుదనాన్ని ఇచ్చేది పిల్లలే. దంపతుల జీవితంలో పిల్లలు ఓ అపురూపమైన కానుక. సంసారంలో వచ్చే ఎన్నో ఒడిదుడుకులు, దంపతుల మధ్య వచ్చే చిన్న చిన్న గొడవలు పెరిగి పెద్దగా మారకుండా ఉండడానికి పిల్లలే కారణమవుతుంటారు చాలాసార్లు.
అయితే దంపతులకు పిల్లలు లేకపోవడం అనేది.. చాలాసార్లు మహిళల తప్పుగానే భావిస్తుంటారు.
ఇంట్లో, బయట మహిళనే ఇంకా పిల్లలు కాలేదా? ఏదైనా సమస్యా? డాక్టర్ కు చూపించుకున్నారా? లాంటి ప్రశ్నలతో పాటు అనేక రకాలుగా వేధిస్తుంటారు. అయితే ఇది కేవలం మహిళల సమస్య మాత్రమేనా..? పురుషులకు సంబంధం లేదా?
నిజానికి చెప్పాలంటే ఇది ఇద్దరి సమస్య. ఆరోగ్యకరమైన అండాలు లేకపోయినా, పురుషుల వీర్యంలో సరైన స్థాయిలో వీర్యకణాలు లేకపోయినా ఈ సమస్య ఉత్పన్నం అవుతుంది.
మారుతున్న సమాజంతో పాటు ఈ విషయంలోనూ అవగాహన పెరుగుతోంది. పురుషుల్నీ పిల్లలు లేని సమస్యలు వేధిస్తున్నాయి.
సంతానలేమి సమస్యను అధిగమించాలంటే స్త్రీలే కాదు.. పురుషులూ అనేక జాగ్రత్తలు తీసుకోవాలి.
సరైన మోతాదులో వీర్య కణాలు లేకపోయినా, వీర్యకణాల్లో చురుకుదనం లోపించినా అది సంతానలేమికి దారి తీస్తుంది. ఇది జన్యుపరంగా ఉండే సమస్య కావచ్చు.. లేదా దీర్ఘ కాలిక వ్యాధుల వల్ల కావచ్చు.. మీరు వాడే వేరే మందుల సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా కావచ్చు.
మహిళలలో ఈ సమస్య ఎక్కువగ గర్భసంచి సమస్యలు, మధుమేహం, కిడ్నీ సమస్యలు, క్యాన్సర్ లాంటి వాటివల్ల వచ్చే అవకాశాలున్నాయి.
ఏదేమైనా పిల్లలు లేని సంసారం ఓటి పోయిన కుండలా ఉంటుంది. కాపురానికి గొడ్డలిపెట్టులా మారుతుంది.
అందుకే ముందునుంచే అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవాలి. చెడ అలవాట్లకు దూరంగా ఉండాలి. సమస్య అనిపిస్తే డాక్టర్లను సంప్రదించడానికి మొహమాటపడకూడదు.