ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. డయాబెటిస్ నేడు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ఈ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా 422 మిలియన్ల మందిని ప్రభావితం చేస్తోందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. మీకు తెలుసా? డయాబెటిస్ తో బాధపడుతున్న స్త్రీ, పురుషులు ఇద్దరూ సంతానోత్పత్తి, లైంగిక ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. డయాబెటీస్ స్పెర్మ్, పిండం నాణ్యత, డిఎన్ఎ సమగ్రతను ప్రభావితం చేస్తుంది.
పురుషుల్లో డయాబెటిస్ వల్ల వీర్యకణాలు తక్కువగా ఏర్పడతాయి. అలాగే వీరిలో లైంగిక వాంఛ కూడా తగ్గుతుంది. ముఖ్యంగా టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గడం మొదలవుతుంది. ఇక మహిళల్లో అయితే డయాబెటిస్ వల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్, అండోత్సర్గం సమస్యలు వస్తాయి. దీంతో వీరు గర్భం దాల్చడం కష్టమవుతుంది.
diabetes
రక్తంలో చక్కెర ఎక్కువగా ఉండటం మంచిది కాదు. ఎందుకంటే ఇది శరీరంలోని అన్ని రక్త నాళాలు, నరాలు, అవయవాలను దెబ్బతీస్తుంది. అందుకే మీకు డయాబెటీస్ ఉంటే బ్లడ్ షుగర్ ను కంట్రోల్ లో ఉంచడానికి ప్రయత్నించండి. డయాబెటీస్ పేషెంట్లు తమ లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి ఎలాంటి చిట్కాలను ఫాలో అవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం..
రక్త స్థాయిలను నియంత్రించడం
టైప్ 2 డయాబెటిస్ ను నిర్వహించడానికి.. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడం చాలా ముఖ్యం. ఇందుకోసం మీరు రెగ్యులర్ గా ఇన్సులిన్ పరీక్షలు చేయించుకోవాలి. అలాగే మందులను వాడాలి. దీంతో గర్భధారణకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి.
diabetes
వ్యాయామం
వ్యాయామం మీ మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అలాగే సంతానోత్పత్తిని మెరుగుపరచడానికి కూడా సహాయపడుతుంది. ఇందుకోసం మీరు సాధారణ వ్యాయామంతో పాటుగా కెగెల్ వ్యాయామాలను కూడా చేయండి. ఈ వ్యాయామాలు మీ మొత్తం శరీరాన్ని ఫిట్ గా ఉంచడంతో పాటు లైంగిక ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి.
diabetes diet
సమతుల్య ఆహారం
డయాబెటిస్ ను నిర్వహించడానికి ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం తృణధాన్యాలు, సీజనల్ పండ్లు, కూరగాయలు, తక్కువ ప్రోటీన్, ఎక్కువ ఫైబర్ ఆహారాలను తినండి. అలాగే తక్కువ కేలరీలు, తక్కువ కొవ్వు పదార్ధాలనే తీసుకోండి.
ఒత్తిడి తగ్గింపు
ఒత్తిడి కూడా లైంగిక సమస్యలకు కారణమవుతుంది. అందుకే ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం వంటి కార్యకలాపాలను మీ దినచర్యలో భాగం చేసుకోండి. ఇది లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
మంచి నిద్ర
మంచి ఆహారంతో పాటుగా కంటి నిండా నిద్రకూడా అవసరమే. మీరు అన్ని విధాలా ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం మీరు ప్రశాంతంగా నిద్రపోవాలి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి 6-8 గంటల మంచి నిద్ర పొందాలి.