మీ పిల్లాడు మొండిగా, మూడీగా ఉంటున్నాడా? ఇలా హ్యాండిల్ చేయండి..

First Published Feb 10, 2024, 2:00 PM IST

పిల్లలు ఎప్పుడూ ఒకేలా ఉండరు. కొన్ని సార్లు కోపంగా, కొన్ని సార్లు సైలెంట్ గా, ఇంకొన్నిసార్లు చిరాకుగా, కొంటెగా ఉంటుంటారు. ఇలాంటి పిల్లలను హ్యాండిల్ చేయడం అంత సులువు కాదు. అయితే కొన్ని సింపుల్ టిప్స్ తో ఇలాంటి పిల్లలను చాలా సులువుగా హ్యాండిల్ చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

పిల్లల పెంపకం చాలా పెద్ద బాధ్యత. మీ పిల్లలకు మీరు ఇచ్చే వాతావరణాన్ని బట్టి వారు దానికి అనుగుణంగా ఉంటారు. కానీ ప్రతిరోజూ ఇంట్లో గొడవలు జరుగుతుంటే, స్కూల్లో టీచర్ ప్రవర్తన పిల్లల పట్ల సరిగా లేకపోతే, ఇరుగుపొరుగులో ప్రతిరోజూ ఏదో ఒక గొడవ జరుగుతుంటే.. ఇది వారి మనస్సుపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. దాని వల్ల వారు మొండిగా, చిరాకుగా ఉంటారు. దీన్ని హ్యాండిల్ చేయడం ఒక ఛాలెంజ్ అనే చెప్పాలి. టీనేజర్లలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ సమయంలో వారి శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. అలాగే దీనికి ఎన్నో కారణాలు కూడా ఉన్నాయి. మరి ఇలాంటి పిల్లలతో ఎలా ప్రవర్తించాలో తెలుసుకుందాం పదండి. 
 

భావాలను వ్యక్తీకరించే స్వేచ్ఛనివ్వండి

మూడీగా ఉండే పిల్లలకు వారి ఆలోచనలను వ్యక్తీకరించడానికి పూర్తి స్వేచ్ఛనివ్వాలి. దీంతో మీ పిల్లలు ఎలాంటి భయం లేకుండా తమ మనస్సులోని ప్రతి ఆలోచనను మీతో పంచుకోగలుగుతారు. దీంతో సగం సమస్య పోతుంది. పిల్లల మానసిక స్థితి క్షణక్షణం మారడం వెనుక ఎన్నో కారణాలు ఉంటాయి. వీటిలో వారి భావోద్వేగాలను అణచివేయడం ఒక్కటి. అందుకే ఇలాంటి పిల్లలతో మీరు ప్రశాంతంగా కూర్చొని వారితో మాట్లాడండి. ఇది వారికి మంచి అనుభూతిని కలిగిస్తుంది. 
 

హైపర్ గా ఉండొద్దు

అలాంటి పిల్లలతో మీరు రూడ్ గా ప్రవర్తించకూడదు. ముఖ్యంగా అతిగా స్పందించకూడదు. వారిపై కోపం అవ్వకూడదు. ఎందుకంటే ఇది వారికి చిరాకు కలిగిస్తుంది. వారిని తిట్టడం, కొట్టడం వల్ల సమస్య పరిష్కారం కాదు. అలాగే ఇది వారిని మరింత దిగజార్చుతుంది. అందుకే వారికి కోపం ఎందుకొస్తుందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. 
 

ఇంటి వాతావరణాన్ని సానుకూలంగా ఉంచండి

చాలాసార్లు పిల్లల మూడీగా ఉండటానికి ఇంటి వాతావరణం కూడా కారణమవుతుంది. ప్రతిరోజూ ఇంట్లో గొడవలు జరుగుతుంటే ఎవరూ ఎవరితోనూ సరిగ్గా మాట్లాడరు. ఇక వేధింపులు కూడా జరుగుతుంటే పిల్లలకు కోపం, చిరాకు కలగడం చాలా సహజం. ఇది పిల్లల మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. అందుకే మీ ఇంటి వాతావరణాన్ని సానుకూలంగా ఉంచడానికి ప్రయత్నించండి. సంబంధాల్లో ప్రేమ, ఆప్యాయతలు, పెద్దలను గౌరవించడం, కలిసి జీవించే అలవాట్లు పిల్లల మంచి పెంపకానికి ఎంతగానో దోహదం చేస్తాయి.

click me!