ఆ తల్లిదండ్రులు ఇలా..
పిల్లల పెంపకం విషయంలో ఒకప్పుటి తల్లిదండ్రులు పిల్లలతో చాలా కఠినంగా వ్యవహరించేవారు. పిల్లలు అల్లరి చేసినా, ఏదైనా తప్పు చేసినా మామూలుగా ఉండేది కాదు. ఊరంతా పరుగులు పెట్టించి మరీ చితక్కొట్టేవారు. ఈ విషయం 1970, 1980, 1990 వాళ్లకు బాగా తెలుసు. అయితే ప్రస్తుత జనరేషన్ తల్లిదండ్రుల పంథా వేరు. పిల్లలకు ఏ విషయాన్నైనా ఓపిగ్గా వివరిస్తున్నారు. అర్థమయ్యేలా చెబుతున్నారు. తప్పులు చేసినా క్షమించి తిరిగి చేయకుండా సూచనలు చేస్తున్నారు. మారుతున్న కాలానికి, సాంకేతికతకు అనుగుణంగా ఇటు తల్లిదండ్రుల్లోనూ, అటు పిల్లల్లోనూ మంచి సామాజిక మార్పులు వస్తున్నాయి.
పిల్లలపై కోపాలు లేవు..
సుమారు 30, 40 ఏళ్ల క్రితం తల్లిదండ్రులు తమ పిల్లల పెంపకంలో కఠినంగా వ్యవహరించేవారు. ఎందుకంటే పిల్లలకు చక్కటి నడవడిక, ఆరోగ్యం కలగాలని అంత స్ట్రిట్‌గా ఉండేవారు. అయితే మంచి ప్రవర్తన, ఆరోగ్యం కోసం ఓపికతో విషయం చెప్పినా అర్థమవుతుందని ఈ తరం తల్లిదండ్రులు గుర్తించారు. అందుకే తమ పిల్లలు అల్లరి చేసినా, తప్పులు చేసినా ఈజీగా క్షమించేస్తున్నారు.
స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం..
`1970,1980లలో పిల్లలకు ఏదైనా కావాలని అనిపిస్తే తల్లిదండ్రులను స్వేచ్ఛగా అడగలేని పరిస్థితి ఉండేది. ఇప్పటి తల్లిదండ్రులు తమ పిల్లలతో చాలా ఫ్రీగా మాట్లాడుతున్నారు. పిల్లల మాటలను వినడానికి ఆసక్తి చూపుతున్నారు. వారి భావాలను అర్థం చేసుకుంటున్నారు. వారి ఏం కావాలో వారే చెప్పేలా ప్రోత్సాహం, స్వేచ్ఛ ఇస్తున్నారు.
ఆడ, మగ తేడా పోయింది..
పూర్వం ఆడ పిల్లలను ఇల్లు దాటనిచ్చేవారు కాదు. కాని ఇప్పుడు పరిస్థితి మారింది. ఈ తరం తల్లిదండ్రులు వారికి చదువుకొనేందుకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నారు. ఆడపిల్ల, మగ పిల్లాడు అని తేడా చూడకుండా టాలెంట్ ఉన్నా లేకున్నా వారిని చదివించేందుకు సాయశక్తులా కష్టపడుతున్నారు. వారికి ఇష్టమైన రంగాల్లో రాణించేలా ప్రోత్సాహం అందిస్తున్నారు. అంతేకాకుండా ఉద్యోగాల్లోనూ లింగ వివక్ష చూపకుండా కంపెనీలు సైతం ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. ఇప్పటి తల్లిదండ్రులు కూడా ఆడపిల్లలను ప్రోత్సహిస్తూ ఉద్యోగాలు చేయిస్తున్నారు.
మానసిక ఆరోగ్యంపై దృష్టి..
ఈ తరం తల్లిదండ్రులు పిల్లల మానసిక ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధన్యమిస్తున్నారు. అంటే పిల్లలు మానసికంగా స్ట్రాంగ్‌గా ఉండాలని, వారిలో వ్యక్తిత్వ వికాసానికి కృషి చేస్తున్నారు. సాధారణంగా పిల్లలకు ఎన్నో డౌంట్స్ వస్తాయి. వాటి గురించి తెలుసుకోవాలని ఆసక్తిగా ప్రశ్నలు వేస్తుంటారు. అవి తీర్చకపోతే అసనంగా, డల్‌గా మారిపోతారు. ఇలాంటి సమయంలోనే ఈ తరం తల్లిదండ్రులు పిల్లల భావోద్వేగాలకు ప్రాధాన్యమిస్తూ చాలా ఓపిగ్గా పిల్లలకు మానసిక పరిపక్వత కలిగేలా ప్రవర్తిస్తున్నారు.
టెక్నాలజీ బాలెన్సింగ్..
ప్రస్తుతం అందరి సమస్య సెల్‌ఫోన్. ఒకసారి ఫోన్ తెరిచామంటే ఎప్పుడు ఆపుతామో మనకే తెలియని పరిస్థితులున్నాయి. ఇక పిల్లల విషయం చెప్పనక్కరలేదు. వారిని అల్లరి చేయకుండా చేయడానికి ఎక్కువ శాతం పిల్లలు సెల్‌ఫోన్ ఇచ్చి ఊరుకోబెడుతున్నారు. అయితే చాలా మంది తల్లిదండ్రులు పిల్లల స్క్రీన్ సమయాన్ని చెక్ చేసుకుంటున్నారు. ఎక్కువ సమయం పిల్లలు సెల్‌ఫోన్లలోనే మునిగిపోకుండా పర్యవేక్షిస్తున్నారు. పిల్లలకు స్కూళ్లలో ఇచ్చే ప్రాజెక్టుల విషయంలోనూ తల్లిదండ్రులు సహకారం ఇస్తున్నారు.
బాలెన్స్‌డ్‌గా ఆఫీస్, ఇల్లు
ఈ కాలంలో తల్లిదండ్రులు మాక్సిమం ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. అందువల్ల ఇల్లు, ఆఫీస్ బాలెన్స్ చేయడంలో వారు చాలా ఇబ్బందులు పడుతుంటారు. అయితే చాలా మంది ఈ విషయాన్ని బాలెన్స్ చేసుకోగలుగుతున్నారు. పిల్లల ఇష్టాయిస్టాలకు ప్రాధాన్యం ఇస్తూ ఆఫీస్ తర్వాత పిల్లలతో గడిపేందుకు టైమ్ స్పెండ్ చేస్తున్నారు. ఈ విధంగా ఈ తరం తల్లిదండ్రులు పేరెంటింగ్‌లో చక్కటి విధానాలు పాటిస్తూ పిల్లల అభివృద్ధికి సహకారం ఇస్తున్నారు.
భావోద్వేగాలకు ప్రాధాన్యం..
ఒకప్పుడు పిల్లలు ఎంత మారాం చేసినా తల్లిదండ్రులు పట్టించుకొనే పరిస్థితి ఉండేది కాదు. అప్పట్లో ఆర్థిక పరిస్థితులు కూడా అలానే ఉండేవి. పిల్లలు బాధపడినా ఓదార్చే వారు ఉండేవారు కాదు. దీంతో వారు కఠినంగా మారిపోయేవారు. ఇప్పటి తరం తల్లిదండ్రులు పిల్లల భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. వారి బాధలను తెలుసుకొని పరిష్కరిస్తున్నారు. తద్వారా పిల్లలకు మంచి నడవడిక అలవడేలా చేస్తున్నారు.
శారీరక బలం కోసం ప్రోత్సాహం..
ఇప్పటి తల్లిదండ్రులు తమ పిల్లల ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహిస్తున్నారు. వారికి నాణ్యమైన, బలమైన ఫుడ్ ఇస్తున్నారు. పిల్లలు శారీరకంగా బలంగా ఉంటేనే జీవితంలో కష్టనష్టాలను బాలెన్స్ చేయగలరని ఇప్పటి తరం తల్లిదండ్రులు బాగా నమ్ముతారు.
క్రీడలకు ప్రోత్సాహం..
ఒకప్పుడు చదువుకుంటామన్నా పిల్లలను బడికి పంపేవారు కాదు. ఇళ్ల వద్ద పనులు చేసే వారు లేక సక్రమంగా బడికి కూడా పిల్లలను పంపేవారు కాదట. అయితే చదువు, ఆటలపై ఈ తరం తల్లిదండ్రులకు చక్కటి అవగాహన ఉంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కేవలం పాఠశాల చదువుపైనే కాకుండా, పిల్లలకు ఇష్టమైన ఆటల్లోనూ వారిని ప్రోత్సహిస్తున్నారు. క్రీడల ద్వారా శారీరక బలాన్ని ఇవ్వడంతో పాటు గెలుపు, ఓటములను రుచి చూపించి వారిని స్ట్రాంగ్‌గా చేస్తున్నారు.