పెళ్లాం ముఖం చూడకుండా 90 గంటలు పనిచేస్తే మనదగ్గరా 'కరోషి'.. అంటే ఏమిటో తెలుసా?

First Published | Jan 10, 2025, 9:35 PM IST

బ్రతికేందుకు పని కావాలి...అంతేకాని పనే బ్రతుకు కాకూడదు. అలాగైతే యంత్రాలకు మనిషికి తేడా ఏముంటుంది. మన కార్పోరేట్ బాస్ లు చెబుతున్నట్లు విశ్రాంతి లేకుండా పనిచేస్తే మనదేశం మరో జపాన్ లా మారుతుంది. ఇప్పుడు జపాన్ లో పరిస్థితి ఎలా వుందో తెలుసా? అక్కడ 'కరోషి' అంటే ఏంటో తెలుసా? 

Work-Life Balance

Work Life : మనిషి జీవితంలో పని ఎంత ముఖ్యమో ఫ్యామిలీ, వ్యక్తిగత జీవితం కూడా అంతే ముఖ్యం. అందుకే చాలామంది రోజును మూడు భాగాలుగా విభజించుకుంటారు...  8 గంటలు పని, 8 గంటలు ఫ్యామిలి, వ్యక్తిగత జీవితం, మిగతా 8 గంటలు నిద్ర. ఇవన్నీ బ్యాలెన్స్ గా వుంటేనే జీవిత సాఫీగా సాగేది. ఇందులో ఏ ఒక్కటి మారినా జీవితమే మారిపోతుంది.సొంత వ్యాపారాలు, స్వయంఉపాధి పొందేవారికి ఈ 8+8+8=24 సూత్రం పనిచేయకపోవచ్చు... కానీ ఉద్యోగులకు మాత్రం ఇదే తారకమంత్రం లాంటిది. జీవితాన్ని బ్యాలన్స్ చేసుకుంటూ హాయిగా జీవింతాలంటే సగటు వేతన జీవులకు ఇలా రోజును విభజించుకోక తప్పదు.  

అయితే కార్పోరేట్ సంస్థల ఎంట్రీతో వర్క్ కల్చర్ మొత్తం మారిపోయింది. పరుగెత్తితేనే పోటీ ప్రపంచంలో నిలబడగలమని ఈ కంపనీలు నమ్మే సిద్దాంతం... అందుకోసం ఉద్యోగులకు పరిగెత్తించడం ప్రారంభించాయి. టార్గెట్ల పేరిట ఉద్యోగులను అధిక గంటలు పని చేయించడం ప్రారంభించాయి. ఇలా ఉద్యోగుల వ్యక్తిగత జీవితంలోని సమయాన్ని కూడా లాగేసుకుని పని చేయించే కంపనీలు అనేకం వున్నాయి. ఉద్యోగాలకు పోటీ కూడా ఎక్కువగా వుండటంతో అధిక పని గంటలకు ఉద్యోగులు కూడా అలవాటుపడిపోయారు.

తాజాగా కార్పోరేట్ సంస్థలు కొత్త విధానాన్ని ఉద్యోగులపై రుద్దే ప్రయత్నం చేస్తున్నాయి. వ్యక్తిగత జీవితాన్ని పక్కనబెట్టి పనే ప్రపంచంగా బ్రతకాలని హితబోధ చేస్తున్నాయి. పనిచేసే కంపనీకోసం ఫ్యామిలీనే దూరం పెట్టాలని ఉచిత సలహా ఇస్తున్నారు కొందరు కార్పోరేట్ బాసులు.

ఇలా ఉద్యోగులను బానిసల్లా పనిచేయాలంటూ ఉద్యోగుపై ఒత్తిడి తెస్తున్నారు. ఇలాంటి వర్క్ కల్చర్ ఎంత ప్రమాదకరమో సదరు బాస్ లు గుర్తించలేకపోతున్నారు. ప్రస్తుత జపాన్ పరిస్థితిని చూస్తే వారికి తత్వం బోధపడుతుంది. 
 

Work-Life Balance

L&T ఛైర్మన్ వ్యాఖ్యలపై దుమారం :

భారతదేశంలోనే కాదు విదేశాల్లో కూడా వ్యాపారాలు నిర్వహిస్తుంటుంది లారెన్స్ ఆండ్ టుబ్రో (L&T). దేశంలో అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను ఈ సంస్థ చేపట్టింది.  కన్స్ట్రక్షన్ తో పాటు వివిధ రంగాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ సంస్థ. వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని కలిగిన ఈ సంస్థ భారత వ్యాపార రంగంలో చాలా కీలకపాత్ర పోషిస్తోంది. 

అయితే ఇలాంటి ప్రతిష్టాత్మక సంస్థ ఛైర్మన్ సుబ్రహ్మణ్యన్ ఉద్యోగుల గురించి చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. ఉద్యోగులపై వర్క్ ప్రెషర్ పెంచేలా ఆయన కామెంట్స్ వున్నాయి. ఉద్యోగులు ఇంట్లో తక్కువ సమయం ఆఫీసులో ఎక్కువ సమయం గడపాలని ఆయన సూచించారు. అయినా ఇంట్లో కూర్చుని భార్య ముఖం ఎంతసేపు చూస్తారు? ఆదివారాలు కూడా పనిచేయాలంటూ కాస్త వ్యంగంగా మాట్లాడారు. వారంలో 90 గంటలు పనిచేయాలంటూ ఉద్యోగులకు ఉచిత సలహా ఇచ్చిన సుబ్రహ్మణ్యన్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

L&T ఛైర్మన్ వ్యాఖ్యలపై తీవ్ర చర్చ సాగుతోంది. ఆయన కోట్ల జీతం తీసుకుంటున్నాడు కాబట్టి 90 కాదు అంతకంటే ఎక్కువ గంటలు పనిచేస్తాడు... కానీ సామాన్య ఉద్యోగులు చాలిచాలని జీతం తీసుకుని తనలా పనిచేయమంటే ఎలాగంటూ సుబ్రహ్మణ్యన్ పై ట్రోల్ చేస్తున్నారు.

వర్క్,  లైఫ్ ను బ్యాలెన్స్ చేసుకునే సగటు జీవిని ఈ సుబ్రహ్మణ్యన్, ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి లాంటివారు చెడుగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం మీ లాభాల కోసం ఉద్యోగులు వ్యక్తిగత జీవితాన్ని లాగేసుకుంటున్నారు... వారికి మానసిక ఆరోగ్యం లేకుండా చేస్తున్నారని మండిపడుతున్నారు. 

గతంలో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసారు. ఆయన వారానికి 70 గంటలు పనిచేయమంటే తాజాగా సుబ్రహ్మణ్యన్ 90 గంటలు అంటున్నారు. ఈయన మరో అడుగు ముందుకేసి భార్య ముఖం చూస్తూ కూర్చుంటారా? ఆదివారం కూడా పనిచేయాలని అంటున్నాడు. అయితే వీరిద్దరు బయటకు చెప్పారు...చాలామంది కార్పోరేట్ బాసులు బయటకు చెప్పకుండా దీన్ని అమలుచేస్తున్నాయని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. వారి స్వార్థం సామాన్య ఉద్యోగి జీవితాన్ని బలితీసుకుంటోందని మండిపడుతున్నారు. 

ఇకనైనా ఇండియన్ కార్పోరేట్ దిగ్గజాలు ఉద్యోగుల జీవితాలతో ఆడుకోవడం ఆపాలని... లేదంటే జపాన్ పరిస్థితే వస్తుందని అంటున్నారు. ప్రస్తుతం జపాన్ లో వర్క్ కల్చర్ మారుతోందని... అక్కడివారు పని ఒత్తిడి నుండి బైటపడుతున్నారు. అక్కడివారికి తత్వం బోధపడింది... మనకు ఇది అర్థం కావాలంటూ జపాన్ పరిస్థితులను ఉదాహరణ చూపిస్తున్నారు. 
 


Work-Life Balance

జపాన్ లో వర్క్ కల్చర్ ఇప్పుడెలా వుంది : 

మనం స్కూల్ రోజుల్లోనో లేదంటే కాలేజీ రోజుల్లోనో పుస్తకాల పురుగులను చూసివుంటాం...  ఇలా ఒకరో ఇద్దరినో చూసుంటాం. కానీ జపాన్ లో మాత్రం పని పరుగులు కనిపిస్తారు...మనదగ్గర పుస్తకాల పురుగుల్లా ఒకరిద్దరు కాదు దేశం దేశమే పని పురుగులతో నిండివుంటుంది. ప్రపంచంలో అత్యధిక పనిగంటలు ఈ  దేశంలో చూస్తుంటాం. 

అయితే ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు జపాన్ లో కూడా మార్పు వస్తోంది. అక్కడి యువత తమ పెద్దల్లా జీవితాన్ని పనికి అంకితం చేయడంలేదు... వ్యక్తిగత జీవితానికి కూడా సమయం కేటాయిస్తున్నారు. ఈ విషయం అక్కడ తగ్గుతున్న పనివేళలను బట్టి అర్థమవుతుంది. 2000 సంవత్సరంలో జపాన్ లో సగటు వార్షిక పనిగంటలు 1,839 గంటలుగా వుంటే 2022 కి వచ్చేసరికి ఇది 1,626 కు తగ్గింది.అంటే 20 ఏళ్లలో 11.6 శాతం పనిగంటలు తగ్గాయి.

ఒకప్పుడు జపనీస్ అత్యధిక పనిగంటల కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురవడం,మానసిక ఒత్తిడితో ఆత్మహత్యలు చేసుకోవడం ఎక్కువగా వుండేది. ఇలా పని ఒత్తిడి కారణంగా చనిపోవడానికి అక్కడ ఓ ప్రత్యేకమైన పేరు వుంది... అదే కరోషి. అయితే జపనీస్ పనితీరు మారాక ఈ కరోషి మరణాలు తగ్గినట్లు నివేదికలు చెబుతున్నాయి.

జపాన్ ప్రజలు పనిగంటలు తగ్గించుకుని ఆరోగ్యాన్నిపెంచుకునే ప్రయత్నంలో వుంటే మనవాళ్లు పనిగంటలు పెరగాలంటున్నారు. ఇలా కార్పోరేట్ బాస్ లు నారాయణమూర్తి, సుబ్రహ్మణ్యన్ చెప్పినట్లు యంత్రాల పనిచేయడం ప్రారంభిస్తే మనదగ్గర 'కరోషి' వంటి పదాలు పుట్టడం ఖాయం. కాబట్టి హార్డ్ వర్క్ కంటే స్మార్ట్ వర్క్ ను నమ్ముకోవాలని...  ప్రొఫెషనల్ జీవితాన్ని,వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలని ఉద్యోగాలకు సూచిస్తున్నారు నిపుణులు. 

Latest Videos

click me!