Digital Arrest
Digital Arrest : టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక మనిషి జీవనవిధానం మొత్తం మారిపోయింది. ఆకలేస్తే వంటింటివైపు చూసేరోజులు పోయాయి... పండగలు పబ్బాలకు కొత్త వస్త్రాల కోసం షాపింగ్ మాల్స్ కు వెళ్లేరోజులు పోయాయి... చివరికి ఆర్థిక లావాదేవీల కోసం బ్యాంకులకు వెళ్లే రోజులు కూడా పోయాయి.. చేతిలో స్మార్ట్ ఫోన్ వుంటే చాలు ఈ సేవలన్ని మన ఇంటివద్దకే వస్తాయి. ఇలా ఈ అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి హోమ్ డెలివరీలే కాదు మనుషులకు ఆపరేషన్లు కూడా చేస్తున్నారు. చరిత్రలో రాతియుగం, కాంస్యయుగం లాగ ఇప్పుడు డిజిటల్ యుగం నడుస్తోంది.
ఇప్పుడు ప్రతిదీ డిజిటల్ మయం అయిపోయింది...దీనివల్ల మనిషి జీవనవిధానం ఈజీ అయ్యింది. అయితే ఈ టెక్నాలజీ వల్ల లాభాలే కాదు నష్టాలు కూడా వున్నాయి. ఏ టెక్నాలజీని ఉపయోగించయితే మనం జీవితాన్ని ఈజీ చేసుకున్నామో అదే టెక్నాలజీ మన దుంప తెంచేస్తోంది. కొందరు కేటుగాళ్లు ఈ టెక్నాలజీ సాయంతోనే మోసాలకు తెరతీసారు. మొదట్లో బ్యాంక్ సిబ్బంది పేరిట అకౌంట్ లేదా డెబిట్, క్రెడిట్ కార్డుల వివరాలు సేకరించి మోసాలకు పాల్పడేవారు. ఇలాంటి సైబర్ నేరాలపట్ల ప్రజల్లో అవగాహన రావడంతో సైబర్ నేరగాళ్లు కూడా రూట్ మార్చారు.
సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించే పోలీసుల పేరిట కొత్త తరహా మోసాలకు తెరలేపారు. ఈ క్రమంలోనే 'డిజిటల్ అరెస్ట్' అనే పదం బాగా ప్రచారంలోకి వచ్చింది. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఈ డిజిటల్ అరెస్ట్ విషయంలో జాగ్రత్తగా వుండాలని దేశ ప్రజలకు సూచించారంటేనే ఇది ఏ స్థాయి మోసమో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల కాలంలో డిజిటల్ అరెస్ట్ పేరిట కోట్లాది రూపాయల మోసాలు జరుగుతున్నాయి. కాబట్టి అసలు ఈ డిజిటల్ అరెస్ట్ అంటే ఏమిటి? ఎలా చేస్తారో? తెలుసుకుందాం.
Digital Arrest
ఏమిటీ డిజిటల్ అరెస్ట్?
డిజిటల్ అరెస్ట్ అనేది ఒక రకమైన ఆన్‌లైన్ మోసం. అమాయక ప్రజలు ఎంతో కష్టపడి సంపాదించిన సొమ్మును ఈ డిజిటల్ అరెస్ట్ పేరిట భయపెట్టి కాజేస్తుంటారు కేటుగాళ్లు. పోలీసులు లేదంటే ఐటీ, ఈడి, సిబిఐ అధికారుల పేరిట భయపెట్టి ఈ మోసానికి పాల్పడుతుంటారు.
చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ముందుగా బయపెడతారు... ఆ తర్వాత శిక్ష నుండి తప్పించుకోవడానికి డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేస్తారు. అప్పటివరకు కదలకుండా డిజిటల్ అరెస్ట్ అనే పదాన్ని ప్రయోగిస్తారు. డిజిటల్ అరెస్ట్ నుండి బయటపడాలనే కంగారులో చాలామంది సైబర్ నేరగాళ్లు పన్నిన వలలో పడతారు. చేజేతులా డబ్బులు సమర్పించి మోసపోతారు.
Digital Arrest
డిజిటల్ అరెస్ట్ స్కామ్ ఎలా చేస్తారు?
డిజిటల్ అరెస్ట్ స్కామ్ లో ముందుగా సైబర్ నేరగాళ్లు సీబీఐ, ఐటి, కస్టమ్, ఈడి వంటి ప్రభుత్వ సంస్థల పేరును ఉపయోగించుకుంటారు. ఈ విభాగాల అధికారులమంటూ ఫోన్ చేస్తారు. ముందుగానే ఫేక్ ఐడీ కార్డులు, నకిలీ అరెస్ట్ వారెంట్స్ సిద్దం చేసుకుంటారు. టార్గెట్ ను ఎంచుకుని వారికి వాట్సాప్, స్కైప్ వంటి కాలింగ్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా వారిని వీడియో కాల్ చేస్తారు.
ఆర్థిక నేరాలు, పన్ను ఎగవేత, డ్రగ్స్ సరఫరా వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటే భయపెడతారు. వీడియో కాల్ ను కట్ చేయకుండా డిజిటల్ అరెస్ట్ చేసామని భయపెడతారు. కాల్ కట్ చేస్తే ఇంటికి వచ్చి అరెస్ట్ చేస్తామంటారు. ఈ బెదిరింపులకు భయపడితే ఆ తర్వాత వారి మోసాన్ని ప్రారంభిస్తారు.
తమకు లంచంగా డబ్బులు ఇస్తే వదిలిపెడతామని ఆఫర్ చేస్తారు. నిజంగానే వాళ్ళు ప్రభుత్వ అధికారులను నమ్మినవారు డబ్బులు ముట్టజెప్పి ఈ కేసుల నుండి భయటపడదామని చూస్తారు.
నేరగాళ్లు బ్యాంక్ ఖాతాలు లేదా UPI ID లకు డబ్బులు పంపమని బలవంతం చేయగానే అలాగే చేస్తారు.ఇలా డబ్బులు పంపగానే మోసగాళ్ళు మాయమవుతారు. ఆ తర్వాతగాని అర్థంకాదు మోసపోయారని. ఇలా కేవలం డబ్బు పోవడమే కాకుండా వ్యక్తిగత సమాచారం కూడా దొంగిలించబడుతుంది. కాబట్టి ఇలాంటి మోసాల నుండి తప్పించుకోవడానికి అప్రమత్తంగా ఉండాలి.
Digital Arrest
డిజిటల్ అరెస్ట్ నుండి భయటపడటం ఎలా?
మోసం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి అత్యంత ముఖ్యమైన మార్గం అప్రమత్తంగా ఉండటం. మనం ఎంత జాగ్రత్తగా వుంటే అంతలా సైబర్ నేరాలకు దూరంగా వుంటాం.
ప్రభుత్వోద్యోగులం అంటే, ఇబ్బందుల్లో ఉన్నామంటూ ఫోన్ వస్తే నమ్మొద్దు. బ్యాంకులే మన వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ వివరాలు అడగవు... అలాంటిది పోలీసులు, ఇతర అధికారులు అవి అడుగుతున్నారంటే నమ్మవద్దు.. ఎప్పుడూ డబ్బు లేదా బ్యాంకు వివరాలను ఎవరికీ చెప్పకూడదు.
ఫోన్ చేసి మాట్లాడేవారిపై అనుమానం ఉంటే వారు సూచించే సంబంధిత కంపెనీని నేరుగా తనిఖీ చేయండి. అతను మిమ్మల్ని బెదిరించడానికి ప్రయత్నిస్తే, ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి, అస్సలు భయపడకండి.
వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవడం మానుకోండి. బ్యాంక్ ఖాతా వివరాలు, ఆధార్ నంబర్ మొదలైన ముఖ్యమైన వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ ఎప్పుడూ పంచుకోవద్దు.
ప్రభుత్వ సంస్థలు WhatsApp లేదా Skype వంటి వాటిని ఉపయోగించవు. ఈ విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకొండి.
మోసపోయారని అనిపిస్తే వెంటనే పోలీసులకు లేదా సైబర్ క్రైమ్ అధికారులకు ఫిర్యాదు చేయండి. డిజిటల్ అరెస్ట్ మోసానికి గురైతే మీ బ్యాంకుకు ఫిర్యాదు చేసి ఖాతాను బ్లాక్ చేయండి. cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి. కాల్స్, లావాదేవీలు, సందేశాల రికార్డులను భద్రపరుచుకోండి. అవసరమైతే న్యాయవాది సహాయం తీసుకోండి.
ముఖ్యంగా ఓ విషయం గుర్తుంచుకోవాలి... అసలు డిజిటల్ అరెస్ట్ అనేదే లేదు. కాబట్టి ఈ పేరు చెప్పి భయపెడితే అస్సలు భయపడవద్దు. అయినా ఏ తప్పూ చేయకుంటే నిజంగానే పోలీసులు ఫోన్ చేసినా భయపడాల్సిన అవసరం లేదు.