Cyber Fraud : మీ మొబైల్ లో ఒకటి నొక్కినా అకౌంట్ ఖాళీ : సరికొత్తగా సైబర్ మోసాలు, జాగ్రత్త

First Published | Dec 3, 2024, 12:22 PM IST

సైబర్ మోసగాళ్లు రోజురోజుకు మితిమీరిపోతున్నారు. ప్రజలు ఎంత జాగ్రత్తగా వున్నా రోజుకో రకం సైబర్ నేరాలు బయటపడుతున్నాయి. తాజాగా ఓ టెకీని కేటుగాళ్లు ఎలా బురిడీకొట్టించారంటే... 

Cyber Fraud

Cyber Fraud : ఈ టెక్నాలజీ జమానాలో ప్రతిదీ ఆన్ లైన్ మయం అయిపోయింది. మనం తినే ఫుడ్ నుండి వేసుకునే దుస్తులు వంటి నిత్యావసర వస్తువులే కాదు ప్రతిదీ ఆన్ లైన్ లో దొరుకుతున్నారు. చివరకు డబ్బుల కోసం బ్యాంకులకు వెళ్లే అవసరం కూడా లేదు... అంతా స్మార్ట్ ఫోన్ లోనే జరిగిపోతోంది. ఇలా టెక్నాలజీ మనిషి జీవితాన్ని చాలా సులభం చేసింది. అయితే ఇదే టెక్నాలజీ కేటుగాళ్లకు అస్త్రంగా మారింది. 

టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయి. ఇంతకాలం కేవలం ఫోన్ చేసి బ్యాంకు నుండి మాట్లాడుతున్నామని చెప్పి అకౌంట్ లేదంటే డెబిట్,క్రెడిట్ కార్డు వివరాలను సేకరించి డబ్బులు కొట్టేసేవారు కేటుగాళ్ళు. కానీ ఇలాంటి ఫేక్ కాల్స్ పై ప్రజల్లో అవగాహన రావడంతో సైబర్ నేరగాళ్లు కూడా రూటు మార్చారు. ఇప్పుడు పోలీసులమంటూ ఫోన్ చేసి డిజిటల్ అరెస్ట్ పేరిట బయపెట్టి మనం తేరుకునేలోపే అకౌంట్ ను ఊడ్చేస్తున్నారు. ఇలాంటి ఘరానా మోసమే గుజరాత్ లో వెలుగుచూసింది. 

Cyber Fraud

టెకీని బోల్తా కొట్టించిన సైబర్ కేటుగాళ్లు :

గుజరాత్ లోని అహ్మదాబాద్ నగరంలో 26 ఏళ్ల యువకుడు సాప్ట్ వేర్ డెవలపర్ గా పనిచేస్తున్నాడు. ఘట్లోడియా ప్రాంతంలో నివాసముండే ఇతడు సింధు భవన్ రోడ్డులోని ఓ ప్రైవేట్ కంపనీలో పనిచేస్తున్నాడు. ఇటీవల అతడిని సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేసారు... ఓ పథకం ప్రకారం టెకీని బోల్తా కొట్టించి లక్ష రూపాయలను కాజేసారు. 

ఈ యువ టెకీకి ఇటీవల ఓ ఐవిఆర్ కాల్ వచ్చింది... 'మీ కొరియర్ డెలివరీ కాలేదు' ఇందుకు కారణమేంటో తెలుసుకోవాలంటే 1 నొక్కండి అని సూచించారు. ఈ కాల్ నిజమని నమ్మిన అతడు చెప్పినట్లుగా తన ఫోన్ లో 1 పై క్లిక్ చేసాడు. దీంతో వెంటనే ఓ వ్యక్తికి కాల్ కనెక్ట్ అయ్యింది. అటువైపు మాట్లాడే వ్యక్తి టెకీ ఆధార్ కార్డు నెంబర్ చెప్పడంతో ఈ కాల్ నిజమేనని నమ్మాడు. 

అయితే ఇలా టెకీని నమ్మించి కొన్ని వివరాలను సేకరించి కాల్ ను మరొకరికి ట్రాన్స్ ఫర్ చేసారు సైబర్ నేరగాళ్ళు. ఇప్పటినుండే అసలు డ్రామా షురూ చేసారు. మీ పేరు, ఆధార్ వివరాలతో చెన్నై నుండి ముంబైకి ఓ పార్సిల్ వెళుతోందని... అందులో ఆరు బ్యాంక్ కార్డ్స్ వున్నాయని తెలిపాడు. ఈ పార్సిల్ ఇప్పుడు తమవద్ద వుందని... ఈ కార్డుల ద్వారా ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న నిన్ను డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామంటూ ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసుల పేరుచెప్పి భయపెట్టారు. 

కేవలం ఇలా భయపెట్టడమే కాదు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడి) పేరిట నకిలీ అరెస్ట్ వారెంట్ ను కూడా టెకీకి పంపించారు. దీంతో భయపడిపోయిన అతడు చాలా ఒత్తిడికి గురయ్యాడు. దీంతో అతడు ఏ తప్పూ చేయకున్నా ఎక్కడ అరెస్ట్ చేస్తారోనని ఆందోళనకు గురయ్యాడు. దీన్నుండి తప్పించుకోవాలని ఆలోచించడం ప్రారంభించాడు. 


Cyber Fraud

తప్పు చేయకున్నా అతడే డబ్బులు వేసాాడు :

సరిగ్గా ఇదే సమయంలో మరో కేటుగాడు అడ్వకేట్ పేరిట టెకీకి కాల్ చేసాడు. డిజిటల్ అరెస్ట్ గురించి తనకు తెలిసిందని... ఈ వ్యవహారంనుండి బయటపడేలా న్యాయ సాయం చేస్తానని నమ్మించాడు. ఇందుకోసం ఓ లక్ష రూపాయలు ముందుగానే చెల్లించాలని కోరాడు. నిజంగానే అతడు సాయం చేస్తాడని నమ్మిన టెకీ లక్ష రూపాయలకు పంపించాడు.

ఒక్కసారి డబ్బులు నేరగాళ్ల ఖాతాల్లో జమ కాగానే కాల్ సెంటర్, ముంబై పోలీసులు, అడ్వొకేట్ గా చెప్పుకున్న అందరి ఫోన్లు స్విచ్చాప్ అయ్యాయి. ఇలా డిజిటర్ అరెస్ట్ నాటకమాడి యువ టెకీ బ్యాంక్ అకౌంట్ లోని డబ్బులన్ని ఖాళీ చేసారు కేటుగాళ్లు. 

మోసపోయినట్లు గ్రహించిన టెకి పోలీసులను ఆశ్రయించారు. అతడి నుండి వివరాలను సేకరించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఇలా బాగా చదువుకుని సైబర్ నేరాల పట్ల అవగాహన వున్నవారిని కూడా కేటుగాళ్లు బురిడీ కొట్టించడం ఆందోళనకరమైన విషయం. ఇలాంటి సైబర్ నేరాల నుండి తప్పించుకోవాలంటే మనం చాలా జాగ్రత్తగా వుండాలి. 

Cyber Fraud

సైబర్ నేరాల బారినపడకుండా వుండే జాగ్రత్తలు : 

1. నిజమైన కాల్ ఏదో ఫేక్ కాల్ ఏదో గుర్తించడం చాలా ముఖ్యం. బ్యాంకులు, పోలీసులు మన అకౌంట్, డెబిట్,క్రెడిట్ కార్డుల వివరాలను అడగరు. వీరి పేరుచెప్పి వివరాలు అడిగితే అస్సలు ఇవ్వకండి. ఏదయినా అవసరం వుంటే నేరుగా బ్యాంకుకు లేదంటే పోలీస్ స్టేషన్ కు వెళ్లండి. 

2. మీ ఫోన్ కు గుర్తుతెలియని వ్యక్తులు, సంస్థల పేరిట లింకులు వస్తే ఓపెన్ చేయకండి. వాటిని ఓపెన్ చేయడంవల్ల మన ఫోన్ లోని సమాచారం చేరుతుంది. వీటిని ఉపయోగించిన మోసం చేస్తారు. 

3. మీకు ఎవరైనా ఫోన్ చేసి పోలీసులు,సిబిఐ, ఈడి అంటూ భయపెట్టి డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామంటే నమ్మకండి. అసలు డిజిటల్ అరెస్ట్ అనే కాన్సెప్ట్ లేదని... ఇది సైబర్ నేరగాళ్లు సృష్టించారని స్వయంగా ప్రధాని మోదీ లాంటి వారే చెబుతున్నారు. కాబట్టి డిజిటల్ అరెస్టులను నమ్మకండి. 

4. మీ బ్యాంకు అకౌంట్, డెబిట్, క్రెడిట్ కార్డులు, ఆధార్ వంటి వివరాలను ఎవరికీ ఇవ్వకండి. అలాగే ఫోన్ కు వచ్చే ఓటిపిలను ఎవరికీ షేర్ చేయవద్దు. 

5. సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్తకొత్త పద్దతుల్లో నేరాలకు పాల్పడుతున్నారు. కాబట్టి ఏవయినా అనుమానాస్పద ఫోన్ కాల్స్ వచ్చినా, ఇంకేమైనా అనుమానాలున్నా వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించండి. వారి సూచనలను పాటించి సైబర్ నేరాలకు దూరంగా వుండండి. 

Latest Videos

click me!