Thangalaan
హీరో విక్రమ్ ప్రయోగాలకు కేరాఫ్. ఆయన ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు, అలాంటి పాత్రలు పోషించి మెప్పించారు. ఈ మధ్య కూడా అలాంటి ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఆయన `తంగలాన్`తో మరో ప్రయోగం చేశాడు. కోలార్ గోల్డ్ ఫీల్డ్ పుట్టుకకి పూర్వం నాటి కథతో దర్శకుడు పా. రంజిత్ రూపొందించిన చిత్రమిది. స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. మాళవిక మోహనన్, పార్వతి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నేడు శుక్రవారం(ఆగస్ట్ 15)న విడుదలైంది. పాన్ ఇండియా స్థాయిలో దీన్ని రిలీజ్ చేశారు. తెలుగులోనూ అదే టైటిల్‌తో వచ్చింది. మరి తమిళంలో రూపొందిన ఈ మూవీ తెలుగు ఆడియెన్స్ ని ఆకట్టుకుందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
కథః
ఇది 1820లో జరిగే కథ. ఒక ట్రైబల్ ప్రాంతంలో ప్రజలు జమీందార్ల పెత్తనంలో మగ్గుతుంటారు. అక్కడ తంగలాన్(విక్రమ్), తన భార్య గంగమ్మ(పార్వతి) ఐదుగురు పిల్లలతో జీవిస్తుంటారు. వీరికి కొంత భూమి ఉంటుంది. అందులో వరి పంట పండిస్తుంటారు. పంట చేతికొచ్చాక కోసి పడుగు పెట్టి వడ్లు తీస్తుంటారు. ఆ రోజు రాత్రి ఆ పంటనంత దుండగులు తగలపెట్టేస్తారు. చూస్తుండగానే పంట అంతా తగలబడిపోవడంతో అంతా కన్నీటి పర్యంతమవుతుంటారు. ఇంతలోనే అక్కడికి వచ్చిన జమీందారు తనకు శిస్తు కట్టనందుకు, వడ్డీ కట్టలేదని చెప్పి జరిమానా వేస్తాడు. పొలం లాక్కుంటారు. అప్పు తీర్చే వరకు తనపొలంలోనే బానిసలుగా పనిచేయాలని నిబంధన పెడతాడు. ఏం చేసేది లేక దొరకు బానిసలుగా మారిన పరిస్థితుల్లో బ్రిటీష్ అధికారులు వస్తారు. తమతో గోల్డ్ వెతికేందుకు వస్తే ఎక్కువ డబ్బులు ఇస్తామని చెబుతారు. జమీందార్ వద్ద ఈ బతుకు బతికే కంటే అక్కడికి వెళ్లడం బెటర్ అని భావించిన తంగలాన్.. ఎట్టకేలకు తనతో వచ్చిన వారిని తీసుకుని బ్రిటీష్ అధికారితో కలిసి వెళ్తారు. ఈ గోల్డ్ వెతికే క్రమంలో అనేక అవాంతరాలు ఎదురవుతుంటాయి. తరచూ వీరికి ఆరతి(మాళవిక మోహనన్) అడ్డుపడుతుంది. గోల్డ్ మాయ చూపిస్తూ వీరిపై దాడి చేస్తుంటుంది. ఈ క్రమంలో ఆ ఆరతిని తంగలాన్ ఎలా ఎదుర్కొన్నాడు?. ఇంతక ఆ ఆరతి ఎవరు? ఆమెకి తంగలాన్‌కి ఉన్న సంబంధం ఏంటి? గోల్డ్ దొరక్కుండా ఎందుకు అడ్గుకుంటుంది? ఇందులో అరణ్య(విక్రమ్) ఎవరు? బంగారం వెనుకున్న కథేంటి అనేది మిగిలిన సినిమా.
విశ్లేషణః
దర్శకుడు పా రంజిత్.. తన ప్రతి సినిమా ద్వారా అణగారిన వర్గాల వెనుకబాటు తనాన్ని, స్ట్రగుల్స్ ని, పాలకుల మోసాలకు గురైన తీరుని చెబుతుంటాడు. బ్యాక్ డ్రాప్ ఏదైనా అందులో ఈ అంశాలను చూపిస్తూ సమాజాన్ని తట్టి లేపే ప్రయత్నం చేస్తుంటారు. అందులో భాగంగా ఇప్పుడు `తంగలాన్` అనే సినిమాతోనూ అదే చేశాడు. సినిమా బ్యాక్ డ్రాప్ బంగారం కోసం వెతుకులాట. బంగారం కోసం ఎంతో మంది రాజులు ప్రయత్నాలు చేశారు. యుద్ధాలు కూడా జరిగాయనేది మనకు తెలుసు. ఇందులో `కేజీఎఫ్`(కోలార్ గోల్డ్ ఫీల్డ్)ని ఎలా కనిపెట్టారనేది చూపించారు. అనాథిగా చాలా మంది ఆ బంగారం కోసం వెతికారు, కానీ దొరకలేదు. చివరికి 1820లో ట్రైబల్స్ తో కలిసి ఓ బ్రిటీష్ దొర వెతకడంలో సక్సెస్ అయ్యాడు. ఆ తర్వాత దాన్ని విస్తరణ జరిగింది. `కేజీఎఫ్` వరకు వచ్చింది. ఇందిరాగాంధీ సమయంలో ఆ గోల్డ్ వెలికి తీత అనంతరం దాన్ని మూసేశారు. గోల్డ్ దొరకడం తగ్గిపోవడంతో దాన్ని ఆపేశారు. కానీ అసలు మూలం ఎప్పుడు స్టార్ట్ అయ్యింది. ఎలా స్టార్ట్ అయ్యిందినేది `తంగలాన్` సినిమాలో చూపించారు. దాని కోసం ట్రైబల్స్ చేసిన పోరాటం ఏంటనేది ఇందులో ప్రధానంగా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు పా రంజిత్.
సినిమా ప్రారంభం.. తంగలాన్, ఆ ఊరు ప్రజలు జమీందార్ల పాలనలో ఎలాంటి ఇబ్బందు పడ్డారో కళ్లకి కట్టినట్టు చూపించారు. ఆనాటి దొరల తీరుని ఆవిష్కరించారు. ప్రజల పేదస్థితిని, తిండి కోసం పోరాడే పరిస్థితిని, తమ భూమిని దొర లాక్కోవడం, ప్రజలను తమ భూమిలోనే భానిసలుగా మారిన స్థితిని, అలాగే ఈ దొర పోతే, మరో దొర మారారు కానీ ప్రజల బతుకు ఎక్కడైనా ఒక్కటే అనేలా ఈ చిత్రంలో ఆవిష్కరించారు పా రంజిత్. సినిమా ఫస్టాఫ్ మొత్తం భూమి, అక్కడి మనుషుల కల్చర్, తీరుతెన్నులను ఎస్టాబ్లిష్ చేశాడు. రిలేషన్స్ ని బిల్డ్ చేశాడు. ఇంటర్వెల్ నాటికి బ్రిటీష్ వారు ఎంట్రీ ఇచ్చి గోల్డ్ వెతుకులాట చూపించాడు. సెకండాఫ్ అంతా ఇక గోల్డ్ కోసం చేసిన పోరాటాన్ని, స్ట్రగుల్స్ ని ఆవిష్కరించారు. దాన్ని ఆరతి సారథ్యంలోని శక్తులు అడ్డుకోవడం, తంగలాన్ వారిని ఎదుర్కోవడంతో సాగుతుంది. సినిమా మొత్తం ఇలానే సాగుతుంది. తంగలాన్ తన పిల్లలకు చెప్పిన కథనే బంగారం వెతికే సమయంలో రియల్‌గా జరుగుతుండటం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మధ్యలో మాళవిక మోహనన్ ఒక డెవిల్ రూపంలో గోల్డ్ ఫీల్డ్ ని కాపాడటం, ఆ శక్తిని తంగలాన్ ఎదుర్కోవడం ఆసక్తికరంగా అనిపిస్తుంది. అయితే బంగారం వెతికే క్రమంలో వాళ్లు పడే బాధలను మెయిన్ హైలైట్ చేశారు. బ్రిటీస్ వాళ్లు పెట్టే బాధలు, మరోవైపు అక్కడి శక్తులు వెంటాడటం గూస్‌బంమ్స్ తెప్పిస్తుంటాయి. ఏక కాలంలో ఈ సినిమా ద్వారా అటు పీరియడ్ కథని, హర్రర్‌ని తలపించే సోషియో పాంటసీ ఎలిమెంట్లని చూపించారు. ఆయా సీన్లు మైండ్ బ్లాక్ చేస్తాయి.
Thangalaan movie
సినిమా చూస్తున్నంత సేపు కంప్లీట్‌గా ఓ కొత్త ప్రపంచంలోకి వెళ్లిపోతాం. 18వ శతకంలో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. ఆ బ్యాక్ డ్రాప్‌ని ఎస్టాబ్లిష్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. యాక్షన్ ఎలిమెంట్లు కూడా సహజంగా కొత్తగా ఉన్నాయి. మరోవైపు రా అండ్ రస్టిక్ టేకింగ్ బాగుంది. బీజీఎం సైతం ఆకట్టుకునేలా ఉంది. అయితే స్క్రీన్‌ప్లేని నడిపించిన తీరు సినిమాకి మైనస్. తంగలాన్ ఎవరు అనేది పెద్ద సస్పెన్స్ నడుస్తూనే ఉంటుంది. క్లైమాక్స్ లో క్లారిటీ ఇచ్చినా, ఆడియెన్స్ అప్పటి వరకు ఆ సస్పెన్స్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది. మరోవైపు సాగదీతగా ఉంది. సీన్లని ఎలివేట్ చేసే క్రమంలో, డెప్త్ గా చూపించే క్రమంలో స్లోగా మారింది. అది బోరింగ్‌గా మారింది. ఏ పాత్ర ఎందుకు వస్తుందో అర్థం కాదు. అప్పటి రాజులకు సంబంధించిన ఎపిసోడ్లు పెట్టినా, అవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఎందుకు వచ్చాయనే అర్థమయ్యేలా లేదు. దీనికితోడు అరవ ఛాయలు ఎక్కువగా ఉన్నాయి. సినిమా ప్రారంభం నుంచే అదే డామినేట్ చేస్తుంది. దీంతో ఆయా సీన్లు మన తెలుగు ఆడియెన్స్ కి పెద్దగా ఎక్కవు. ఈ సినిమా విషయంలో పెద్ద మైనస్ అది. చాలా సన్నివేశాలు క్లారిటీగా అనిపించవు. ఎందుకు ఆయా సీన్లు పెట్టాల్సి వచ్చిందో క్లారిటీ లేదు. మరోవైపు అక్కడి ప్రజల పెయిన్‌ని బలంగా చూపించాల్సి ఉంది. కాకపోతే తంగలాన్ కూతురు చనిపోయినప్పుడు ఎమోషనల్‌గా బాగా అనిపించింది. అలాంటి ఎమోషన్స్ మరింత బలంగా చూపించాల్సింది. క్లైమాక్స్ లో అసలు అరణ్య ఎవరు? తంగలాన్ ఎవరు అనేది క్లారిటీ కొంత ఉపశమనం కలిగిస్తుంది. ఓవరాల్‌గా సినిమా ఓ విభిన్నమైన ప్రయత్నం. ప్రశంసించదగ్గ ప్రయత్నం. ఓ కొత్త అనుభూతిని అందించే ప్రయత్నం. దాన్ని మరింత క్లారిటీగా, సాధారణ ఆడియెన్స్ కి కూడా అర్థమయ్యేలా చేస్తే సినిమా రేంజ్ వేరే లెవల్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
నటీనటులుః
తంగలాన్ పాత్రలో విక్రమ్ జీవించాడు. ఆయన ఎన్నో ప్రయోగాత్మక పాత్రలు చేశాడు. వాటి జాబితాలో ఇది చేరిపోతుంది. నిలిచిపోతుంది. ఆదివాసి నాయకుడిగా అదరగొట్టాడు. గెటప్, హవభావాలు అదిరిపోయాయి. విక్రమ్ ఎక్కడా కనిపించడు, తంగలాన్‌నే చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఆయన కెరీర్‌లో ఇదొక బెస్ట్ రోల్ అవుతుంది. ఇక గంగమ్మ పాత్రలో పార్వతి అదరగొట్టింది. చాలాసహజంగా చేసింది. ట్రైబల్ లేడీ గెటప్‌లో ఆకట్టుకుంది. ఆమెచేసే రచ్చ వేరే లెవల్ అని చెప్పొచ్చు. విక్రమ్‌ని కూడా డామినేట్ చేసింది. మరోవైపు ఆరతి పాత్రలో మాళవిక మోహనన్ వాహ్ అనిపించింది. గ్లామర్ బ్యూటీని ఇలా చూడటం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కానీ సర్‌ప్రైజ్ చేసింది. ఇక మిగిలిన పాత్రలన్నీ చాలా సహజంగా కనిపించాయి. సహజంగానే నటించి మెప్పించారు.
టెక్నీషియన్లుః
కెమెరా వర్క్ బాగుంది. అప్పటి కాలాన్ని అంతే సహజంగా వెండితెరపై ఆవిష్కరించడంలో కెమెరా వర్క్ కీలకమని చెప్పొచ్చు. అది సినిమాకి పెద్ద ప్లస్. అలాగే మ్యూజిక్ బాగుంది. జీవీ ప్రకాష్ సంగీతం, బీజీఎం బాగా కుదిరింది. ఎక్కడా అతి లేదు, తక్కువ లేదు. ఎంత కావాలో ఆ డోస్‌లోనే బీజీఎం ఉంటుంది. పాటలు మన వాళ్లకి పెద్దగా ఎక్కవు. ఇక ఎడిటింగ్ పరంగా మాత్రం సెల్వ ఆర్ కే మరింతగా తన కత్తెరకి పనిచెప్పాల్సింది. చాలా సాగదీత సీన్లు లేపేస్తే సినిమా వేగంగా సాగేది. బాగుండేది. ఇక దర్శకుడు పా రంజిత్ ఎంచుకున్న కథ బాగుంది. దాన్ని అంతే క్లారిటీగా తెరపై ఆవిష్కరిస్తే బాగుండేది. కానీ ఓ సంక్లీష్టమైన స్క్రీన్‌ప్లేని డీల్ చేయడం పెద్ద విషయమే. ఆయన కష్టం తెరపై కనిపిస్తుంది. ఆర్ట్ వర్క్ నుంచి, ఆర్టిస్ట్ ల గెటప్‌లు, లొకేషన్లు ఇలా ప్రతిదీ చాలా కేర్ తీసుకున్నాడు. ఎంతో శ్రమించాడు. ఓ కొత్తరకమైన కథని చెప్పే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో తన మార్క్ ని జోడించి స్పెషాలిటీని చాటుకున్నారు.
ఫైనల్‌గాః `తంగలాన్` ఓ కొత్త ప్రపంచాన్ని చూపిస్తూ, కొత్త ఫీలింగ్ కలిగించే మూవీ.
రేటింగ్‌ః 2.75