`సత్య` మూవీ రివ్యూ, రేటింగ్‌

First Published | May 10, 2024, 8:03 AM IST

తమిళ సినిమాలు తెలుగు ఆడియెన్న్ ని అలరిస్తూనే ఉంటాయి. తాజాగా అక్కడ సక్సెస్‌ అయిన `రంగోలి` మూవీ `సత్య`గా ఈ శుక్రవారం వచ్చింది. ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

ప్రస్తుతం పరభాషా చిత్రాల జోరు సాగుతుంది. ఇటీవల వరుసగా మలయాళ చిత్రాలు బ్లాక్‌ బస్టర్స్ అవుతూ తెలుగు ఆడియెన్స్ ని అలరిస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు తమిళ చిత్రం వచ్చింది. అక్కడ మంచి ఆదరణ పొందిన `రంగోలీ` మూవీని తెలుగులో రిలీజ్‌ చేస్తున్నారు శివ మల్లాల. జర్నలిస్ట్ నుంచి నిర్మాతగా మారిన ఆయన తన శివ మీడియాపై  తొలి ప్రయత్నంగా `రంగోలీ` మూవీని తెలుగులో `సత్య` పేరుతో డబ్‌ చేసి విడుదల చేస్తున్నారు. ఇందులో హమరేష్‌, ప్రార్థన జంటగా నటించారు. వాలి మోహన్‌ దాస్‌ అనే కొత్త కుర్రాడు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ శుక్రవారం(మే 10)న విడుదలయ్యింది. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 
 

కథః
సత్య(హమరేష్‌) ప్రభుత్వ స్కూల్‌లో చదువుకుంటాడు. స్టడీస్‌లో ఫస్ట్ ఉంటాడు. ఫ్రెండ్స్ తో ఆటల్లోనూ ముందే ఉంటాడు. వాళ్ల నాన్న గాంధీ(ఆడుకాలం మురుగదాస్‌) హోటల్స్ లో కాంట్రాక్ట్ తీసుకుని లాండ్రి వర్క్ చేస్తుంటారు. ఆయనకు కూతురు లక్ష్మి(అక్షయ హరిహరణ్‌) సపోర్ట్ గా ఉంటుంది. భార్య కళా(సాయి శ్రీ ప్రభాకరణ్‌) ఇంటికే పరిమితమవుతుంది. సత్య స్కూల్లో క్లాస్‌ మేట్స్ తో తరచూ గొడవలు పడుతుంటాడు.  ఈ క్రమంలో పోలీస్‌ స్టేషన్‌కి వెళ్లాల్సి వస్తుంది. ఇలా అయితే చదవు డిస్టర్బ్ అవుతుందని, చెడు సావాసం కారణంగా చెడిపోతాడని భావించిన తండ్రి అతన్ని పెద్ద ప్రైవేట్‌ స్కూల్‌లో చేర్పిస్తాడు. అందుకోసం తలకు మించిన అప్పులు చేయాల్సి వస్తుంది. కానీ ప్రైవేట్‌ స్కూల్‌లో చదువుకోవడం సత్యకి ఇష్టం లేదు. అయినా బలవంతంగా వెళ్తాడు, అక్కడ కూడా గొడవలు అవుతాయి. తన క్లాస్‌ మేట్‌ గౌతమ్‌ ఇతన్నీ టార్గెట్‌ చేస్తుంటాడు. తాను ఇష్టపడే పార్వతి.. సత్యని ఇష్టపడుతుండటంతో ఓ రోజు టాయిలెట్‌ రూమ్‌ వద్ద సత్య పేరుతో పార్వతికి ఐ లవ్‌ యూ అని గోడల మీద రాస్తాడు. స్కూల్‌లో పెద్ద గొడవ అవుతుంది. ఇలా చేసినందుకు పార్వతి కూడా సత్యని కొడుతుంది. పేరెంట్స్ ని పిలిపించి ప్రిన్సిపల్‌ గట్టిగా వార్నింగ్‌ ఇస్తుంది. కానీ అప్పులు ఇచ్చిన వ్యక్తి మనకు ఎందుకు అంత పెద్ద స్కూళ్లు, చదువులు అంటూ డిస్కరేజ్‌ చేస్తాడు. మరోవైపు ఇంగ్లీష్‌ అర్థం కాక సత్య ఇబ్బంది పడుతుంటాడు. ప్రేమని పక్కన పెట్టి చదువుపై దృష్టి పెట్టాలనుకుంటాడు. ఇంతలో మరో ట్విస్ట్.. మరి ఆ ట్విస్ట్ ఏంటి? తన కోసం అమ్మానాన్న, అక్క అంతగా కష్టపడుతుండటం చూసి సత్యలో వచ్చిన మార్పేంటి? గాంధీకి ఓ పెద్దాయన చెప్పిన మాటేంటి? పార్వతితో సత్య ప్రేమ ఎటు టర్న్ తీసుకుంది? అనే విషయాలకు సమాధానమే మిగిలిన కథ. 
 


విశ్లేషణః
ప్రతి ఒక్కరి జీవితంలో స్కూల్‌ డేస్‌ని గుర్తు చేసే చిత్రమిది. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాల్లో ఫేస్‌ చేసే పరిస్థితిని ఈ చిత్రంలో ఆవిష్కరించారు. తమ పిల్లలను ప్రభుత్వ స్కూల్లో చదివించలేక, ప్రైవేట్‌ స్కూల్లో చదివించేందుకు డబ్బులు లేక అప్పులు చేయడం, తలకు మించిన భారం మోయడం జరుగుతుంటుంది. ఇప్పుడూ ఎన్నో కుటుంబాల్లో ఇలాంటి పరిస్థితి ఉంది. దాన్ని కళ్లకి కట్టినట్టు ఆవిష్కరించారు. అదే సమయంలో ప్రభుత్వ స్కూల్లో మన ఫ్రెండ్స్ ని వదిలేసి దూరంగా ఎవరూ తెలియని స్కూల్లో, మార్కులు, చదువులు అంటూ పరిగెత్తే ప్రైవేట్‌ స్కూల్లో చేరితే ఉండే బాధ, తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్‌ మీడియంకి మారితే వచ్చే ఇబ్బందులు, ఈ రెండింటి మధ్య విద్యార్థులు ఫేస్‌ చేసే స్ట్రగుల్‌, స్కూల్‌ డేస్‌ టీనేజ్‌ లవ్‌ని ఆవిష్కరించిన చిత్రం `సత్య`. సినిమా మన స్కూల్‌ డేస్‌ని గుర్తు చేస్తుంది, ఆ అమాయకపు ప్రేమని గుర్తు చేస్తుంది. స్కూల్లో జరిగే ఫన్నీ సన్నివేశాలను గుర్తు చేస్తుంది, తోటి స్కూడెంట్స్ తో గొడవలను గుర్తు చేస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఆల్మోస్ట్ ప్రతి వ్యక్తికి సంబంధించిన టీనేజ్‌ బయోపిక్‌. 

ఇక సినిమాగా చూసినప్పుడు ప్రారంభంలో సత్య పాత్ర, వారి ఫ్యామిలీ పరిస్థితులను చూపించారు. ప్రభుత్వ స్కూల్లో తన గొడవలు, పోలీస్‌ స్టేషన్‌కి వెళ్లడం వంటి సన్నివేశాలుంటాయి. దీంతో కొడుకు చెడిపోతున్నాడని, ప్రైవేట్‌ స్కూల్‌లో అయితే బాగా చదువుకుంటారు, పద్ధతిగా పెరుగుతారు, స్టయిల్‌గా ఉంటారని తండ్రి కనే కలలను చూపించారు. తనలాగా కొడుకు కాకూడదని, తనలా కష్టాలు పడకూడదని, అప్పు చేసైనా కొడుకుని ప్రైవేట్‌ స్కూల్లో చదివించాలని తండ్రి కలలకు ప్రయారిటీ ఇచ్చాడు. అయా సన్నివేశాలను అంతే సహజంగా తెరకెక్కించాడు. ఇక్కడ రియాలిటికి ఎక్కువ స్కోప్‌ ఇవ్వడంతో సినిమాలో ఎమోషన్‌, డ్రామా రక్తికట్టింది. అయా సీన్లతో మనం ట్రావెల్‌ అయ్యేలా చేస్తుంది. మరోవైపు ప్రైవేట్‌ స్కూల్‌కి వెళ్లాక అక్కడ మొదటి రోజు నుంచే తన క్లాస్‌ మేట్‌తో గొడవలను, దీంతోపాటు పార్వతి అనే అమ్మాయితో ప్రేమని చూపించారు. అమ్మాయితో తొలి చూపులు, మాట్లాడేందుకు భయం, లోపల టెన్షన్‌, క్లాస్‌ రూమ్‌లో దొంగ చూపులు మనసుని హత్తుకునేలా ఉంటాయి. ఒక అపార్థంతో దూరం కావడం, నిజం తెలిసి మళ్లీ అమ్మాయి.. సత్య వెంటపడటం వంటి సీన్లు అలరిస్తాయి. అదే సమయంలో ప్రైవేట్‌ స్కూల్లో ఉండే హడావాడుని ఇందులో చూపించారు. తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్‌ మీడియంకి మారినప్పుడు వచ్చే ఇబ్బందులను. ఒక్క కొడుకు కోసం ఫ్యామిలీ మొత్తం కష్టపడటం, అప్పుడు చేయడం వంటి సన్నివేశాలతో ప్రైవేట్‌ స్కూళ్ల ఫీజు దోపిడిని, అంత పెద్ద ఫీజులు కట్టేందుకు వీరు పడే బాధలను కళ్లముందు ఆవిష్కరించారు. ఇలా చిన్న చిన్న ఎమోషన్స్ ని, డ్రామాని రక్తికట్టించడంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడు. 
 

అయితే సినిమా రియాలిటీకి ప్రయారిటీ ఇచ్చే క్రమంలో ప్రతి సీన్‌ సహజంగా అవిష్కరించే క్రమంలో కొంత ల్యాగ్‌ అనిపిస్తుంది. ఫస్టాఫ్‌ సరదా సన్నివేశాలతో సాగుతుంది. స్కూల్ గొడవలు, క్లాస్‌ రూమ్‌లో ఫన్నీ విషయాలు, మాట్లాడుకునే మాటలు చాలా ఫన్నీగా ఉంటాయి. నవ్వులు పూయించేలాయి ఉంటాయి. అదే సమయంలో కొన్ని రిపీట్‌ అవుతున్న ఫీలింగ్‌ కలుగుతుంది. సత్య పేరెంట్స్ మధ్య కన్వర్జేషన్‌ ప్రారంభంలో బాగానే ఉన్నా, ఆ తర్వాత బోర్ తెప్పిస్తుంది. ఫ్యామిలీలోని ఎమోషన్స్ కి సంబంధించి ఓవర్‌ డ్రామా అవుతుంది. అలాగే స్కూల్‌లో తెలుగు టీచర్‌ ది ఆకట్టుకున్నా, ఆ తర్వాత ఓవర్‌గా అనిపిస్తుంది. ఈ క్రమంలో కొన్ని అనవసరమైన సీన్లు ఇబ్బంది పెడతాయి. అయితే క్లైమాక్స్ ని మాత్రం చాలా తెలివిగా డిజైన్‌ చేసుకున్నాడు దర్శకుడు. సముద్రంలో నుంచి బావిలో వేయడం, బావి నుంచి మళ్లీ సముద్రంలోకి తేవడంతో అటు తండ్రిలో, ఇటు కొడుకులో కలిగిన ఆనందం అనేది విజువల్‌గా చూపించిన తీరు బాగుంది. ఇక ఫైనల్‌గా ఇచ్చే ట్విస్ట్ అదిరిపోతుంది. కొంత ల్యాగ్‌, మరికొంత ఓవర్‌ డ్రామా పక్కన పెడితే మంచి `సత్య` ఫీల్‌గుడ్‌, ఎమోషనల్‌ మూవీ అని చెప్పొచ్చు. తండ్రి కొడుకుల బాండింగ్‌ని, ఫ్యామిలీ ఎమోషన్స్ ని, టీనేజ్‌ లవ్‌ని అంతే సహజంగా ఆవిష్కరించిన చిత్రంగా నిలుస్తుంది.
 

నటీనటులుః
సత్యగా హమరేష్‌ చాలా నేచురల్‌గా నటించాడు. చిన్న కుర్రాడు అయినా అద్భుతంగా చేశాడు. పాత్రలో జీవించాడు. ఇన్నోసెంట్‌గా, రెబల్‌గా, లవర్‌గా, ఫ్యామిలీ పరిస్థితులు అర్థం చేసుకున్న కొడుకుగా విభిన్నమైన ఎమోషన్స్ ని అద్భుతంగా పలికించాడు. నటుడిగా మంచి ఫ్యూచర్‌ ఉంది. ఇక పార్వతి పాత్రలో ప్రార్థన కూడా చాలా బాగా చేసింది. తన ఫేస్‌ ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకుంది. ఇంకా చెప్పాలంటే కళ్లతో, స్మైల్‌తో నటించిందని చెప్పొచ్చు.  ఫ్రెండ్‌ పూజగా నటించిన క్రితింగ కూడా ఆకట్టుకుంది. సత్య తండ్రి గాంధీ పాత్రలో ఆడుకాలం మురుగదాస్‌ మరో హైలైట్‌గా నిలిచారు. ఆయన మిడిల్‌ క్లాస్‌ తండ్రిగా ఈజీగా చేశాడు. పాత్రలో జీవించాడు. ఆయన పాత్ర కళా పాత్రలో సాయి శ్రీ ప్రభాకరణ్‌ బాగా చేసింది. కానీ వాయిస్‌ లౌడ్‌ కాస్త చిరాకు అనిపిస్తుంది. అక్క పాత్రలో అక్షయ సెటిల్డ్ గా కనిపించి ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. తెలుగు టీచర్‌గా అమిత్‌ భార్గవ్‌ మరో ఇంప్రెసివింగ్‌ రోల్‌ అని చెప్పొచ్చు. గౌతమ్‌గా రాహుల్‌, ఇతర ఆర్టిస్టులంతా చాలా సహజంగా నటించి మెప్పించారు.
 

టెక్నీషియన్లుః 
సినిమాకి సంగీతం మరో బలం. సుందరమూర్తి కే ఎస్‌ మంచి పాటలతోపాటు ఆర్‌ఆర్‌ ఇచ్చాడు. వినసొంపుగా ఉంటాయి. ఆర్‌ఆర్‌ డీసెంట్‌గా ఉంటుంది. మరుదనాయగం కెమెరా వర్క్ బాగుంది. ప్రతి ఫ్రేమ్‌ చాలా సహజంగా కనిపించేలా ఉంది. అప్పటి జ్ఞాపకాలను తట్టిలేపేలా ఉంది. తెలుగులో విజయ్‌ కుమార్‌ డైలాగులు బాగా సెట్‌ అయ్యాయి. సహజంగా అనిపిస్తాయి. రాంబాబు గోసాల పాటలుసైతంఅలానే ఉన్నాయి. శివ మల్లాల తెలుగు అనువాదం పరంగా రాజీపడలేదని అర్థమవుతుంది. ఇక దర్శకుడు వాలీమోహన్‌ దాస్‌ లో మంచి కంటెంట్ ఉందని ఈ చిత్రంతో నిరూపించుకున్నాడు. చాలా సెన్సిబులిటీస్‌ని అద్భుతంగా తెరపై ఆవిష్కరించారు. చాలా సీన్లని విజువల్‌గా చెప్పే ప్రయత్నం అభినందనీయం. తమిళం మూవీ కావడంతో తెలుగుకి వచ్చేసరికి కొన్ని సీన్లు ఓవర్‌ డ్రామాగా అనిపిస్తాయి. ఈ క్రమంలో కొంత స్లో నెరేషన్‌ కూడా తెలుగు ఆడియెన్స్ కి ఇబ్బంది పెట్టే అంశం. అవి పక్కన పెడితే సినిమాని చాలా నీట్‌గా తెరకెక్కించాడు. స్క్రీన్‌పై చాలా బాగుంది. రియలిస్టిక్ అప్రోచ్‌ సినిమాకి పెద్ద హైలైట్‌గా చెప్పొచ్చు. 
 

ఫైనల్‌గాః టీనేజ్‌ ప్రేమ, స్కూల్‌ డేస్‌, తండ్రీకొడుకు, ఫ్యామిలీ ఎమోషన్స్ ని ఆవిష్కరించే చిత్రమిది. 
రేటింగ్‌ః 2.75

నటీనటులుః హమరేష్‌, ప్రార్థన, ఆడుకాలం మురుగదాస్‌, అమిత్‌ భార్గవ్‌, అక్షయయ హరిహరణ్‌, సాయి శ్రీ ప్రభాకరణ్‌, రాహుల్‌, క్రితింగా తదితరులు. 
టెక్నీషియన్లుః
సంగీతం– సుందరమూర్తి కె.యస్, 
ఎడిటింగ్‌– ఆర్‌.సత్యనారాయణ, 
కెమెరా– ఐ. మరుదనాయగం, 
మాటలు– విజయ్‌కుమార్‌ 
పాటలు– రాంబాబు గోసాల, 
పీఆర్‌వో–వి.ఆర్‌ మధు, మూర్తి మల్లాల, 
లైన్‌ ప్రొడ్యూసర్‌– పవన్‌ తాత,  
నిర్మాత– శివమల్లాల, 
రచన–దర్శకత్వం– వాలీ మోహన్‌దాస్
 

Latest Videos

click me!