Sarkaru Noukari Review: `సర్కారు నౌకరి` మూవీ రివ్యూ, రేటింగ్‌..

First Published | Dec 31, 2023, 8:24 PM IST

సింగర్‌ సునీత కొడుకు ఆకాష్‌ హీరోగా పరిచయం అవుతూ `సర్కారు నౌకరి` చిత్రంలో నటించాడు. ఈ మూవీ కొత్త ఏడాది సందర్భంగా విడుదల అవుతుంది. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

ఇటీవల టాలీవుడ్‌లో వారసుల ఎంట్రీ నడుస్తుంది. మొన్ననే యాంకర్ సుమ కొడుకు రోషన్‌ హీరోగా `బబుల్‌ గమ్‌` చిత్రంతో ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా డిజప్పాయింట్‌ చేసింది.ఇప్పుడు మరో స్టార్‌ వారసుడు ఎంట్రీ ఇస్తున్నారు. సింగర్‌ సునీత కొడుకు  ఆకాష్‌.. హీరోగా పరిచయం అవుతూ `సర్కారు నౌకరి` చిత్రంతో నటించాడు. భావన హీరోయిన్‌గా పరిచయం అవుతుంది. గంగనమోని శేఖర్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ మూవీని కె రాఘవేంద్రరావు నిర్మించడం విశేషం. ఆర్కే టెలి ఫిల్మ్ ద్వారా ఆయన సినిమా ప్రొడక్షన్‌లోకి అడుగుపెడుతున్నారు. ఈ మూవీ కొత్త సంవత్సరం కానుకగా(1.1.24)  విడుదల కానుంది. ముందుగా ప్రీమియర్‌ ప్రదర్శించారు. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 
 

కథః 

గోపాల్‌(ఆకాష్‌ గోపరాజు)కి తల్లిదండ్రులు లేరు. కష్టపడి ప్రభుత్వ ఉద్యోగం(సర్కారు నౌకరి) సాధిస్తాడు. మహబూబ్‌ నగర్‌ జిల్లా కొల్లాపూర్‌కి హెల్త్ ప్రమోటర్‌గా వస్తాడు. ఎయిడ్స్(పెద్ద రోగం) పై అవగాహన కల్పించడం, పెద్దరోగం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమం చేస్తుంటాడు. సత్య(భవన)ని పెళ్లి చేసుకుంటాడు. సర్కారు నౌకరి కావడంతో ఊర్లో అంతా గౌరవిస్తారు. అంతా ఉచితంగా దొరుకుతుంటాయి. చాలా సౌకర్యాలు లభిస్తుంటాయి. అది చూసిన గోపాల్‌ భార్య సత్య చాలా సంతోషిస్తుంది. కానీ గోపాల్‌ జనాలకు కండోమ్‌లు పంచుతూ కనిపిస్తాడు. అక్రమ సంబంధాలు పెట్టుకునే వారికి, వేశ్యలుగా ఉన్న వారికి కండోమ్‌ ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంటాడు. కానీ అవేంటో తెలియక పిల్లలు బుగ్గలు చేసి ఆడుకుంటారు. పెద్దవాళ్లు హేళన చేసి వెళ్లిపోతుంటారు. రాను రాను గోపాల్‌ని చాలా చులకనగా చూస్తారు. వీరిని ఊరి జనం అంటరాని వాళ్లుగా పరిగణిస్తుంటారు. ఇది తట్టుకోలేక భార్య గోపాల్‌ ని వదిలి పుట్టింటికి వెళ్లిపోతుంది. మరోవైపు ఊర్లో ఎయిడ్స్ వచ్చి వరుసగా చనిపోతుంటారు. అందులో గోపాల్‌ ఫ్రెండ్‌ శివ కూడా ఉంటాడు. ఇలా వరుసగా ఎయిడ్స్ తో మరణిస్తుండటం, మరోవైపు ఊర్లో అందరు తనని అవమానించడం జరుగుతుంది. మరి దాన్ని గోపాల్‌ ఎలా ఎదుర్కొన్నాడు, వారిలో అవగాహన పెంచేందుకు ఏం చేశాడు? తనని వదిలిపెట్టిన భార్య తిరిగి వచ్చిందా? గోపాల్‌ అసలు ఇలా ఎయిడ్స్ పై అవగాహన కల్పించే జాబ్‌ ఎందుకు చేస్తున్నాడు? తన గతం ఏంటి? అనేది `సర్కారు నౌకరి` మిగిలిన కథ. 
 


విశ్లేషణః
1996లో కొల్లాపూర్‌లో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా ఈ మూవీని రూపొందించారు దర్శకుడు గంగనమోని శేఖర్‌. అప్పట్లో ఎయిడ్స్ ప్రభావం చాలా ఉంది. విదేశాలకు వెళ్లినవాళ్లు, ఇతర సీటీలకు బతుకు దెరువు కోసం వెళ్లిన వాళ్లు ఇలా తెలియక, ఎయిడ్స్ పై అవగాహన లేక ఎయిడ్స్ బారిన పడ్డారు. చాలా మంది మృత్యువాత పడ్డారు. అప్పట్లో ఎయిడ్స్ దేశాన్ని వణికించింది. ఈ నేపథ్యంలో కొల్లాపూర్‌లో జరిగిన సంఘటనలను `సర్కారు నౌకరి` చిత్రంలో ఆవిష్కరించాడు దర్శకుడు. పెద్ద రోగం కారణంగా ఫ్యామిలీలు ఎలా చెల్లాచెదారుగా మారిపోయాయి. అలాంటి వారిని ఊరు నుంచి వెలేయడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. అలాంటి ఘటనలను ఫన్నీగా, ఎమోషనల్‌గా తెరకెక్కించాడు దర్శకుడు. ఫన్నీగా చెబుతూ, ఎమోషనల్‌గా కనెక్ట్ చేశాడు. గుండెల్ని బరువెక్కించాడు. 
 

ఇలాంటి సందేశాత్మక చిత్రాలను సందేశంతో తెరకెక్కిస్తే ఆర్ట్ ఫిల్మ్ అవుతుంది. కమర్షియల్‌ అంశాలు జోడితే చెప్పాలనుకున్న విషయం పక్కదాని పడుతుంది. దాన్ని చాలా బ్యాలెన్స్ గా, అంతే సహజంగా తెరకెక్కించడం కత్తిమీద సాములాంటిది. ఏమాత్రం తేడా వచ్చినా విమర్శలు తప్పవు. ఆ విషయంలో దర్శకుడు చాలా కష్టపడ్డాడని చెప్పొచ్చు. కొంత తడబాటుకి గురయ్యాడని చెప్పొచ్చు. అయితే సందేశాన్ని ఫన్నీగా చెప్పడంలో కాస్త తడబాటు కనిపిస్తుంది. అనుకున్న స్థాయిలో దాన్ని ప్రొజెక్ట్ చేయడంలో సక్సెస్‌ కాలేకపోయాడు. అయితే వాస్తవ సంఘటనలను మాత్రం వెండితెరపై ఆవిష్కరించడంలో సక్సెస్‌ అయ్యాడు. అప్పట్లో కండోమ్‌లు తెలియక చిన్న పిల్లలు వాటిని బుగ్గలుగా ఆడుకోవడం, తెలియక రకరకాలుగా మాట్లాడుకోవడం నవ్వులు పూయిస్తాయి. చాలా ఫన్నీగా సాగాయి. ఫస్టాఫ్‌ మొత్తం కామెడీగా సాగుతుంది. సత్యతో పెళ్ళి చూపులు, పెళ్లిలోని ఫీల్‌ని, రొమాన్స్ ని చాలా సహజంగా చూపించారు. అదే సమయంలో అప్పట్లో ఊర్లలో ఉండే పరిస్థితులు, మనుషులు, వాటి మాట, వ్యవహరాలు కాస్త సరదాగా అనిపిస్తాయి. అప్పట్లో రోజులను గుర్తు చేస్తాయి. 
 

సెకండాఫ్‌ నుంచి ఎమోషనల్ గా టర్న్ తీసుకుంటుంది. ఎయిడ్స్ ప్రభావం పెరగడం, వరుసగా మరణాలు సంభవించడం, మరోవైపు ఆ ఉద్యోగం మానేయాలని గోపాల్‌ భర్య సత్య ఒత్తిడి చేయడం, తన గర్భం తీయించుకుంటానని చెప్పడం, తీరా ఆయన్ని వదిలి పుట్టింటికి వెళ్లిపోవడం వంటివి చాలా ఎమోషనల్‌గా అనిపిస్తాయి. మరోవైపు ఊర్లో అవమానాలు సైతం హృదయాన్ని కదిలిస్తాయి. క్లైమాక్స్ మరింత ఎమోషనల్‌గా తీసుకెళ్లారు. ఓ వైపు ఫ్రెండ్‌ మరణం, మరోవైపు తన గత జీవితం రివీల్‌ కావడం వంటివి కన్నీళ్లు పెట్టించేలా ఉంటాయి. చివర్లో ఇచ్చే ట్విస్ట్ గుండెని పిండేస్తుంది. అయితే సినిమా ఎమోషనల్‌గా ఉన్నా, దాన్ని క్యారీ చేయలేకపోయారు. సినిమా స్లోగా సాగుతుంది. దీంతో ఆర్ట్ ఫిల్మ్ ని తలపిస్తుంది. ఫస్టాఫ్‌లో మరింత ఫన్నీగా తీస్తే బాగుండేది. సీన్ల పరంగా సహజత్వం కూడా మిస్‌ కావడంతో ఎమోషన్స్ క్యారీ కాలేదు. ఆ విషయాల్లో జాగ్రత్త తీసుకుంటే బాగుండేది. దీనికితోడు కొత్త నటీనటులు కూడా పాత్రలకు సరిగా న్యాయం చేయలేకపోయారు. కానీ `సర్కారు నౌకరి` అప్పటి రోజులను గుర్తు చేస్తుంది. నెటివిటీని కనెక్ట్ చేస్తుంది. ఇటీవల గ్రామీణ నేపథ్యంలో సాగే కంటెంట్‌ బేస్డ్ చిత్రాలు మంచి ఆదరణ పొందుతున్నాయి. ఆ కోవలోకి ఈ మూవీ చేరుతుందా అనేది చూడాలి. 

నటీనటులుః
గోపాల్‌ పాత్రలో ఆకాష్‌ ఫర్వాలేదనిపించాడు. లుక్‌ వైజ్‌గా చాలా మెచ్యూర్డ్ గా కనిపించాడు. సహజంగా కనిపించి చివర్లో పిండేశాడు. నటుడిగా ఫస్ట్ మూవీ కావడంతో ఆ లోటు కనిపిస్తుంది. కానీ మున్ముందు మంచి నటుడిగా మెప్పిస్తాడని చెప్పొచ్చు. కంటెంట్‌ ఓరియెంటెడ్‌ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తాడని చెప్పొచ్చు. సత్య పాత్రలో భవన బాగా చేసింది. సహజంగా కనిపించింది. గోపాల్‌ స్నేహితుడిగా శివ పాత్ర మహదేవ్‌ మెప్పించాడు. చివరికి కన్నీళ్లు పెట్టించాడు. ఆయన మరదలిగా గంగ పాత్రలో మధు లత అలరించింది. అందంగానూ ఉంది. సర్పంచ్‌ పాత్రలో తనికెళ్ల భరణి న్యాయం చేశాడు. పెళ్లి పెద్దగా సుధాకర్‌ రెడ్డి కాసేపు మెప్పించాడు. సుజాతగా సాహితి దాసరి అలరించింది. మంచి పాత్ర పడింది. ఇతర పాత్ర దారులు ఫర్వాలేదనిపించారు. 
 

టెక్నీకల్‌గాః
సినిమాకి దర్శకత్వం మెయిన్‌. అయితే కొత్త దర్శకుడు గంగనమోని శేఖర్‌ పూర్తి స్థాయిలో సక్సెస్‌ కాలేకపోయాడు. సినిమాని సహజంగా తెరకెక్కించాడు. కానీ ఆ ఫన్‌ని, ఎమోషన్‌ని బలంగా చెప్పలేకపోయాడు. ఇలాంటి సందేశాత్మక చిత్రాలను ఫన్నీవేలో చెప్పి, చివరికి ఎమోషనల్‌ టచ్‌ ఇస్తే బాగుంటుంది. అదే సమయంలో ఎమోషన్‌ అనేది అంతర్లీనంగా క్యారీ అవుతూ ఉండాలి. అప్పుడే ఆడియెన్స్ సినిమాకి కనెక్ట్ అవుతాడు. ఆ విషయంలో ఇంకా కేర్‌ తీసుకుంటే బాగుండేది. ఇక కెమెరా వర్క్ బాగుంది. అప్పటి పీరియడ్‌ లుక్‌ని తలపించేలా ఉంది. గతంలోకి తీసుకెళ్లేలా ఉంది. సంగీతం కూడా సినిమాకి ప్లస్ అయ్యింది. సురేష్‌ బొబ్బిలి మంచి మ్యూజిక్‌ అందించాడు. పాటలు, బీజీఎం ఆకట్టుకుంది. సినిమాకి బ్యాక్‌ బోన్‌లా నిలిచింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. రాఘవేంద్రరావు ప్రొడక్షన్‌ కావడంతో ఆ విషయంలో రాజీ పడలేదని తెలుస్తుంది. 

ఫైనల్‌గాః `సర్కారు నౌకరి` 90కి తీసుకెళ్లే చిత్రం. అప్పటి జనరేషన్‌కి బాగా కనెక్ట్ అవుతుంది. 

రేటింగ్‌ః 2.5

Latest Videos

click me!