(Review By---సూర్య ప్రకాష్ జోశ్యుల) శతాబ్దాల పర్యంతం తల వంచుకుని, తమ చావేదో తాము ఛస్తున్నా ఒప్పుకోని సమాజ పెద్దల చేతిలో మళ్లీ ఛస్తూ..చావు డప్పుల వెనుక, శవాల మోతల ముందు నడిచే పీడిత జనాల గమనాన్ని, గమ్యాన్ని మార్చటం అంత తేలికైన విషయం కాదు. అయితే అప్పడప్పుడూ గడ్డి పరికలూ...గొడ్డళ్లుగా మొలకెత్తుతూంటాయి. అలాంటి వారి కథలు, వ్యధలు,ఆత్మ గౌరవ నినాదాలు ఇలాంటి కళల్లో నినదిస్తాయి. వాటిని గుండె ఒగ్గి వినాల్సిందే. అలా చెప్పబడ్డ కథగా నమ్మకం ఇస్తూ "పలాస 1978" మన ముందుకు వచ్చింది. జీవితాల్ని విప్లవీకరిస్తూ, అణచివేతతో అల్లాడిపోతున్న తాడిత పీడిత హృదయాల్లో స్వేచ్ఛ్భావాల్ని అంకురింప చేసే దిసగా ఈ సినిమా సాగిందా? అసలు ఈ పలాస ప్రాంతం కథేంటి...ప్రత్యేకంగా 1978 నాటి వాతావరణం తీసుకోవటానికి కారణం ఏమిటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
దేని గురించీ ఈ కథ..? 1978 లో ...శ్రీకాకుళం జిల్లాలోని పలాసలో ఉన్న పెద్ద కులపోళ్లు, చిన్న కులపోళ్ల మధ్య జరిగే ఓ సామాజిక,రాజకీయ మహా యుద్దం. ఆధిపత్యం కోసం ఓ వర్గం, అణిగారిపోతున్నాం అంటూ మరో వర్గం తలపడే సాధారణ సన్నేవేశం. అక్కడ ఉన్న అంబుసొలి అనే కాలనీలో ఉండే ఇద్దరు అన్నదమ్ములు రంగారావు(తిరువీర్), మోహన్ రావు (రక్షిత్)లు ప్రధాన పాత్ర ధారులు. వాళ్ల నాన్న పద్యాల సుందర్ రావు (సమ్మెట గాంధీ). తండ్రి దగ్గర నేర్చుకున్న పద్యాలు, పాటలతో చుట్టుప్రక్కల గ్రామాల్లో ప్రోగ్రామ్స్ చేస్తూంటారు. బ్రతుకు తెరవు కోసం.. ఆ ఊర్లోని పెద్ద షావుకారు లింగమూర్తి (జనార్దన్), చిన్న షావుకారు గురుమూర్తి (రఘు కుంచె)ల జీడిపప్పు బట్టీల్లో పనికి వెళ్తూంటారు. జీవితం సాదా సీదాగా గడిచిపోతూంటుంది. అయితే పుట్టిననాటి నుంచీ కుల వివక్ష కారణంగా తనలో తానే రగిలిపోయే మోహన్ రావు ... షావుకార్లతో గొడవ పడుతూంటాడు. అయితే కొంతకాలానికి చిన్న షావు కారు గురుమూర్తికి నమ్మిన బంటుగా మారిపోయాడు.
అయితే ఇక్కడో చిన్న ట్విస్ట్.. షావుకారు అన్నదమ్ములు లింగమూర్తి, గురుమూర్తిలకి ఒక్క క్షణం పడదు. ఈలోగా ఎలక్షన్స్ వస్తాయి. దాంతో గొడవలు, హత్యలతో పలాసలో ఓ విధమైన ఫ్యాక్షన్ వాతావరణం ఏర్పడుతుంది. ఆ గొడవల్లో రంగారావు, మోహన్‌రావు జీవితాలు ఇరుక్కుపోతాయి. పెద్దషావుకారు (జనార్ధన్), చిన్న షావుకారు (రఘు కుంచె) ఆధిపత్యం కోసం ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటుంటారు. వీళ్ల రాజకీయ చదరంగానికి అన్నదమ్ములైన మోహన్‌రావు (రక్షిత్), రంగారావు (తిరువీర్) పావులుగా మారుతారు. ఎవరికి వాళ్లు ఎదుటి వర్గం వాళ్లను ఏసెయ్యాలని చూస్తూంటారు. ఈ పరిస్థితుల నుంచి రంగా, మోహన్‌లు బయటపడ గలిగారా?మోహన్ రావు మరదలు లక్షి(నక్షత్ర)పాత్ర ఏమిటి...వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
పలాస పల్స్ ఎలా ఉంది..? సాధారణంగా సినిమా అంటే జీవిత అనుభవాల ఊటలో మండి, మస్తిష్కంలో నుండి ఉబికి భావాల రూపంలో సమాజపు పుడమిపై ప్రవహించడం..! ఆ పని నిజాయితీ గా చేసాడీ దర్శకుడు. ఈ సినిమాతో సామాజిక చైతన్యాన్ని ఆశించినా, అది జరిగే పని అయినా కాదని తెలిసినా,ప్రయత్నం మానలేదు. ఆనాటి సామాజిక రాజకీయ ఆర్థిక దృష్టికోణంతో విశ్లేషించుకుంటూ,క్రమబద్ధమైన వివరణాత్మకమైన వివరణను విజువల్స్ గా అందించే ప్రయత్నం చేసాడు. ఆ ప్రయత్నంలో అక్కడక్కడా తడపడినా ఎంతో కొంత ప్రయత్నం సిద్దించకపోదు.
కల్ట్, రా అండ్ ఇంటెన్స్ కథగా ఈ సినిమాని మలిచే ప్రయత్నం చేసాడీ దర్శకుడు. కులాల మధ్య అంతరాన్ని ఈ చిత్రం ప్రశ్నిస్తూ,ఆత్మగౌరవ పోరాటాన్ని హైలెట్ చేస్తుంది. ఫస్టాఫ్ లో అక్కడక్కడా గూస్ బంప్స్ వచ్చే స్దాయిలో సీన్స్ ఉన్నాయి.అలాగే కథలోకి వేగంగా రావటం, బోర్ కొట్టకుండా సెకండాఫ్ కు సరిపడ కథను సెటప్ చేయటం బాగుంది.
అయితే స్లోగా నడవటమే కాస్త ఇబ్బంది పెట్టింది. ఇక సెకండాఫ్ విషయానికి వస్తే..ఫస్టాఫ్ ఉన్న గొప్పగా లేదు. క్లైమాక్స్ సైతం చాలా ప్రెడిక్టుబుల్ గా ఉండటం జరిగింది.కథకు సరైన ఎండింగ్ ఇవ్వలేదనిపించింది. దానికి తోడు స్క్రీన్ ప్లే కూడా అంత ఎఫెక్టివ్ గా లేదు. అయితే దర్శకుడుకు సబ్జెక్టు మీద పట్టు మాత్రం ముచ్చటేస్తుంది. అదే ఈ సినిమాని ఉన్నంతలో ప్రత్యేకంగా అనిపించేలా చేసింది.
ఏవి హిట్ : డైలాగులు, రస్టిక్ లుక్, ఫెరఫార్మెన్స్ లు, మ్యూజిక్, హీరో ఎలివేషన్ సీన్స్, ఇంటర్వెల్ బ్లాక్
ఏవి ఫట్ : రొటీన్ గా అనిపించే కథ,కథనం.. స్లో పేస్ నడక, క్లైమాక్స్, ఎడిటింగ్
టెక్నికల్ గా .. : సినిమాటోగ్రఫీ కొన్ని సీన్స్ లో తప్పించి బాగుంది. లో బడ్జెట్ లో కథకు నేపధ్యంగా అమిరే రస్టిక్ ఫీల్ ని ఎఫెక్టివ్ గా తీసుకువచ్చారు. అయితే ఊహకు అందే విధంగా సాగిన స్క్రీన్ ప్లే వీక్ గా అనిపిస్తుంది. అలాగే కథ కూడా నేపధ్యం తప్పిస్తే రొటీన్ కమర్షియల్ ఫిల్మ్ లను గుర్తు చేస్తుంది. అయితే దర్శకుడు కరుణ్ కుమార్ మంచి వర్క్ చేసారు. మంచి కథ,కథనం దొరికితే మంచి కమర్షియల్ డైరక్టర్ అవుతారనిపిస్తుంది. అన్ని శాఖల నుంచి మంచి అవుట్ పుట్ తీసుకున్నారు. అయితే డైలాగుల్లో నాచురాలిటీ పేరిట కొన్ని సంభాషణల్ని `రా`గానే పలికించారు. అది మింగుడుపడటం కష్టమే. యాక్షన్ ఎపిసోడ్స్ లో ఆయన ఓ ప్రత్యకమైన ముద్ర వేయగలిగారు కానీ చాలా చోట్ల సినిమాటెక్ లిబర్టీ ఎక్కువ తీసేసుకున్నారు. ఇక ఎడిటింగ్ విషయంలోనే ఆయన పట్టు వదిలేసారు. సంగీతం విషయానికి వస్తే రఘు కుంచె రెండు మంచి పాటలు ఇచ్చారు.బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. ప్రొడక్షన్ విషయంలోనూ సినిమాకు కావాల్సిన మేర బాగానే ఖర్చు పెట్టారు.
నటీనటుల్లో ...రఘు కుంచె మనని ఆశ్చర్యపరుస్తాడు. ప్రొఫెషనల్ యాక్టర్ ఈయనలో ఉన్నారని నమ్మిస్తారు. ఈ సినిమా తర్వాత ఆయన వరస పాత్రలతో బిజీ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.హీరోగా నటించిన రక్షిత్ , జార్జిరెడ్డి ఫేమ్ తిరువీర్ సినిమాని తమ భుజాలపై మోసుకుంటూ వెళ్లారు. లక్ష్మీ (నక్షత్ర), బైరాగి (ఉమా మహేశ్వర రావు), గణపవాసు (షణ్ముకేష్), తారకేశ్ (ప్రవీణ్ యండమూరి), సెబాస్టియన్ (విజయరామ్), ధన్‌దాస్ (లక్ష్మణ్ మీసాలా) కూడా కొత్తవాళ్లైనా బాగా చేసారు.
ఫైనల్ థాట్ : అంబేద్కర్ అయినా భాగ్యరెడ్డి వర్మ అయినా ఈనాటి దళిత మేధావులైనా, పగనూ వర్గ పోరునూ కోరుకోలేదు విద్యను, వికాసాన్ని తద్వారా వచ్చే సమసమాజాన్ని కోరుకున్నారు. అది ఏ కళా రూపం మర్చిపోకూడదు.