Operation Valentine Review: `ఆపరేషన్‌ వాలెంటైన్‌` మూవీ రివ్యూ, రేటింగ్‌..

First Published Mar 1, 2024, 12:46 AM IST

వరుణ్‌ తేజ్‌ ప్రస్తుతం `ఆపరేషన్‌ వాలెంటైన్‌` చిత్రంతో వస్తున్నారు. ఈ మూవీ ఈ శుక్రవారం విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

వరుణ్‌ తేజ్‌ నటించిన గత చిత్రాలు డిజప్పాయింట్‌ చేశాయి. అయినా డిఫరెంట్‌ కథలను ఎంచుకుంటున్నాడు. తనవంతు బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. రెండు పరాజయాలు ఉన్నా, మరోసారి రిస్క్ చేస్తూ `ఆపరేషన్‌ వాలెంటైన్‌` అనే సినిమా చేశాడు. ఇది ఎయిర్‌ఫోర్స్ ప్రధానంగా వచ్చిన మూవీ. ఉగ్రవాదులు పుల్వామా దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. భారత్‌ తర్వాత ప్రతీకారం తీర్చుకుంది. ఈ ఘటనల ఆధారంగా `ఆపరేషన్‌ వాలెంటైన్‌` చిత్రాన్ని రూపొందించారు. శక్తి ప్రతాప్‌ సింగ్‌ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. సోనీ పిక్చర్స్, రెనైస్సాన్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించాయి. సందీప్‌ ముద్దా నిర్మాత. ఇందులో వరుణ్‌ తేజ్ కి జోడీగా 2017 మిస్‌ వరల్డ్ విన్నర్ మనుషీ చిల్లర్‌ హీరోయిన్‌గా చేసింది. ఈ మూవీ నేడు మార్చి 1న (శుక్రవారం) విడుదలైంది.మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

కథః 
ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్ లో అర్జున్‌ `రుద్ర` దేవ్‌( వరుణ్‌ తేజ్‌) వింగ్‌ కమాండ్‌ ఆఫీసర్‌గా పనిచేస్తుంటాడు. రాడర్‌ కమాండర్‌ అహ్నగిల్‌(మనుషీ చిల్లర్‌) ఆదేశాలతో తన ప్లెయిన్‌ డ్రైవ్‌ చేస్తుంటాడు. అర్జున్‌ అనేక సాహసాలు చేస్తాడు. దీంతో కెరీర్‌లో చాలా రిమార్క్స్ ఉంటాయి. అయితే గగనతలాన శతృవుల అంతు చూడాలంటే ఆయన నాయకత్వంలోని టీమ్‌ మాత్రమే ఆ సాహసాలు చేయగలదు. అయితే ప్రాజెక్ట్ వజ్రలో భాగంగా భూమి నుంచి 20 మీటర్ల ఎత్తు నుంచే ప్లెయిన్‌ని నడిపించి శత్రు రాడార్‌లకు చిక్కకుండా వారిపై ఎటాక్‌ చేయోచ్చు అనే దానిపై టెస్ట్ చేసి చావు దగ్గరకు వెళ్లొచ్చాడు. కానీ ఈ టెస్ట్ లో తన స్నేహితుడు మరో వింగ్‌ కమాండర్‌ కబీర్‌(నవదీప్‌) ప్రాణాలు కోల్పోతాడు. దీంతో ప్రాజెక్ట్ వజ్రని ఎయిర్‌ఫోర్స్ అధికారులు బ్యాన్‌ చేస్తారు. ఈ క్రమంలో అర్జున్‌ కాశ్మీర్‌లో ఓ అనుమానాస్పద నిర్మాణాన్ని కూల్చేస్తారు. తిరిగి వస్తుండగా, ఫిబ్రవరి 14, 2019లో కాశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రవాదుల దాడి ఘటన చూస్తాడు అర్జున్‌. దీంతో మళ్లీ ఎటాక్ చేయాలనుకుంటాడు. కానీ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అభ్యంతరం చెప్పడంతో వెనుతిరుగాడు. కానీ ఆ పుల్వామ ఘటనలో 40 మంది భారత ఆర్మీ జవానులు వీరమరణం పొందుతారు. దీనికి ప్రతీకారం తీర్చుకోవాలని, ఉగ్రవాదులను కనిపెట్టి అంతం చేసేందుకు రెడీ అవుతుంది. అందుకు బాలకోట్‌ ఎయిర్‌ స్ట్రైక్‌ చేపడతారు. దీన్ని బాధ్యతలను కమాండర్‌ అర్జున్‌ తీసుకుంటారు. మరి దీన్ని ఎలా పూర్తి చేశాడు, పాకిస్థాన్‌ కళ్లు గప్పి ఆ దేశ బార్డర్‌ క్రాస్‌ చేసి ఉగ్రవాదుల స్థావరాలను ఎలా ధ్వంసం చేశారు. అనంతరం `ఆపరేషన్‌ వాలెంటైన్‌` ప్రాజెక్ట్ ని ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది? దీని కారణంగా చోటు చేసుకున్న పరిణామాలేంటి? ఆ తర్వాత ఏం జరిగింది? అనేది మిగిలిన కథ. 
 

విశ్లేషణః 
2019 ఫిబ్రవరి 14న ఉగ్రవాదులు చేసిన పుల్వామా ఘటన దేశాన్ని కుదిపేసింది. ఇందులో 40 మంది జవాన్లు వీర మరణం పొందారు. దీనికి భారత ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకోవాలని ఫిబ్రవరి 26న బాల్‌కోట్‌ స్ట్రైక్‌ నిర్వహించింది. సక్సెస్ అయ్యింది. ఈ సంఘటనలను ఆధారంగా చేసుకుని దర్శకుడు శక్తి ప్రతాప్‌ సింగ్ ఈ మూవీని రూపొందించారు. దేశభక్తిని, ఉగ్రదాడులను, భారత ఎయిర్‌ ఫోర్స్ పాత్రని ప్రధానంగా చేసుకుని `ఆపరేషన్‌ వాలెంటైన్‌` ని రూపొందించారు. తెలుగులో ఇలా ఎయిర్‌ ఫోర్స్ బెస్డ్ సినిమాలు ఇప్పటి వరకు రాలేదు. హిందీలో అడపాదడపా వస్తూనే ఉన్నాయి. మొన్ననే `ఫైటర్‌` వచ్చింది. అది డిజప్పాయింట్‌ చేసింది. ఆల్మోస్ట్ అదే కంటెంట్ తో `ఆపరేషన్‌ వాలెంటైన్‌` చిత్రం వచ్చింది. మరి దానికంటే బెటర్‌గా ఉందా అంటే లేదనే చెప్పాలి. యాక్షన్‌ సీన్ల పరంగానూ, వీఎఫ్‌ఎక్స్ పరంగానూ, విజువల్‌గానూ, ఎమోషన్స్ పరంగానూ ఈ మూవీ దానికి సరితూగలేకపోయింది. కానీ తెలుగులో ఇలాంటి సినిమా ఇప్పటి వరకు రాకపోవడంతో అభినందించాల్సిన మూవీ అనే చెప్పొచ్చు. 
 

ఇలాంటి యాక్షన్‌ బేస్డ్ చిత్రాలకు ఎమెషన్స్ చాలా ముఖ్యం. ఎందుకుంటే కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు ఇందులో ఉండవు. ప్రతికారం ఉంటుంది. దాడికి ఎదురు దాడి మాత్రమే ఉంటుంది. దేశాల మధ్య జరిగే వార్‌ లాంటిది. దాన్ని అంతే సెన్సిటివ్‌గా డీల్‌ చేయాలి. సినిమాగా తీస్తున్నప్పుడు మరింత కేర్‌ తీసుకోవాలి. ఎందుకంటే ఫ్లైట్ నడపడం, వార్‌ లాంటి సీన్లతో చాలా వీడియో గేములు వస్తున్నాయి. పిల్లలు వాటిని ఎంజాయ్‌ చేస్తున్నారు. మరి వాళ్లని, ఆకట్టుకోవాలంటే అంతకు మించి ఏదో కావాలి. వీడియో గేమ్స్ లో లేనిది, సినిమాల్లో ఉన్నది హ్యూమన్‌ ఎమోషన్స్. సినిమాల్లోనే ఆ భావోద్వేగాలు సాధ్యమవుతున్నాయి. కానీ ఈ సినిమాలో మెయిన్‌గా అవే మిస్‌ అయ్యాడు దర్శకుడు. దేశ భక్తి రగిల్చే అంశాలను పెద్దగా చూపించలేదు. పుల్వామా ఘటన తర్వాత దేశం ఎలా రియాక్ట్ అయ్యింది. వారి కుటుంబాలు ఎంతగా క్షోభని అనుభవించాయి. వారి బాధ ఎలా ఉంది. ఎందుకు ప్రతీకారం తీర్చుకోవాలి అనే అంశాలను సినిమాలో చూపించలేకపోయాడు. టెర్రరిస్ట్ లు ఎటాక్‌ చేశారు,దానికి మనం రివేంజ్‌ తీర్చుకోవాలి అనేదే పాయింట్‌ తప్ప, ఆ పెయిన్‌ తెలియజేసేలా ఒక్క సీన్‌ కూడా పెట్టలేదు. కానీ కథకి అవసరం లేని, సంబంధం లేని హీరోహీరోయిన్ల మధ్య సంఘర్షణని టచ్‌ చేసే ప్రయత్నం చేశాడు. అది కూడా అతకలేదు. మధ్యలో బలవంతంగా ఇరికించినట్టు ఉంటుంది. అసలు సినిమా ఎయిమ్‌కి, ఈ సీన్లకి సంబంధమే లేదు. 
 

నిజానికి పుల్వామా ఘటనకు భారత ఎయిర్‌ ఫోర్స్ ప్రతీకారం తీర్చుకుంది. ఉగ్ర స్థావరాలను పాకిస్థాన్‌కి వెళ్లి కూల్చేసింది. దాన్నుంచి సేఫ్‌గా బయటపడింది. అంతటితో అసలు కథ పూర్తయ్యింది. కానీ దానికి ఎక్స్ టెన్షన్‌ చూపించారు. తదనాంతర పరిణామాలను చూపించారు. అప్పుడే అసలు `ఆపరేషన్‌ వాలెంటైన్‌` అనే ఆపరేషన్‌ని చేపట్టినట్టు చూపించారు. అది ఏమాత్రం అతకలేదు. కన్విన్సింగ్‌గా లేదు. ఆయా ఎపిసోడ్‌ ఇరికించినట్టుగానే ఉంది. పైగా ఆ ఆపరేషన్‌  అని హడావుడి చేశారు, ఓ రేంజ్‌లో ఉంటుందన్నట్టుగా చూపించి చివరికి తేలేశారు. అందులో  ఉత్కంఠ భరిత సన్నివేశాలు, ఎమోషనల్ కనెక్టివిటీ కొంత వరకు ఓకే అనిపిస్తుంది. కానీ అంతకు ముందు బిల్డప్‌ ఇచ్చిన సీన్‌ స్థాయిలో లేదు. పైగా ఆ సీన్లు పండలేదు. ఏమాత్రం ఫినిషింగ్‌ టచ్‌ అనిపించలేకపోయింది. ఏదో ముగింపు ఇవ్వాలి కదా అన్నట్టుగానే ఉంది. కానీ పుల్వామా ఘటనలో ఓ చిన్నారి రోజా పువ్వు ఇచ్చే సీన్‌, ఆ తర్వాత పరిణామాలు, క్లైమాక్స్ లో కొంత ఎమోషన్స్ ఫర్వాలేదనిపించాయి. సినిమాలో మెయిన్‌గా బలమైన ఎమోషన్స్, సోల్‌ మిస్ అయ్యింది. దీంతో కొన్ని సీన్లు పక్కన పెడితే మిగతాదంతా వీడియో గేమ్‌ ని తలపిస్తుందని, ఇంకా చెప్పాలంటే కాస్ట్లీ వీడియో గేమ్‌గా నిలుస్తుందని చెప్పొచ్చు. 
 

నటీనటులుః 

అర్జున్‌ రుద్ర దేవ్‌ పాత్రలో వరుణ్‌ తేజ్‌ మెరిశాడు. ఎయిర్‌ఫోర్స్ కమాండర్‌గా బాగాసూట్‌ అయ్యాడు. పాత్రపరిధి మేరకు బాగానే చేశాడు. కానీ సినిమాలో ఆయన పాత్రకి పెద్దగా ప్రయారిటీ లేదు. ఎయిర్‌ బేస్‌లో డిస్కషన్‌ సీన్లలో కాసేపు ఆర్గ్యూమెంట్‌, తన లవర్‌తో ఆర్గ్యూమెంట్‌ వరకు ఉంటుంది. మిగిలినదంతా ఫ్లైట్‌లోనే ఉంటాడు. అది పెద్దగా కిక్‌ ఇవ్వదు. వరుణ్‌ తేజ్‌ పాత్రలో మరే ఇతర హీరో ఉన్న, ఆయన ఉన్న పెద్దగా తేడా లేదు. వరుణ్‌ తేజ్‌ ప్రత్యేకతని చాటుకునే సన్నివేశాలు ఒక్కటి కూడా లేదు. ఎందుకంటే ఎక్కువగా సినిమా ఫ్లైట్లో మాస్క్ ధరించే కనిపిస్తాడు. కాకపోతే హీరోయిన్ తో వచ్చే సన్నివేశాలు మాత్రం ఫర్వాలేదు. ఇక హీరోయిన్‌గా రాడార్‌ కమాండర్‌గా మనుషీ చిల్లర్‌ అద్భుతంగా చేసింది. వరుణ్‌ తేజ్‌ని డామినేట్‌ చేసింది. ఫేస్‌లో ఎక్స్ ప్రెషన్స్ తోనూ అదరగొట్టింది. నవదీప్‌ జస్ట్ కాసేపు గెస్ట్ రోల్ లా కనిపిస్తాడు. రుహానీ శర్మ ట్రాక్‌ బాగుంది. సంపత్‌ రాజ్‌, షతాప్‌ ఫిగర్‌, అభినవ్‌ గోమటం, అలీ రెజా, బిగ్‌ బాస్‌ భామలు శుభశ్రీ, లహర షరి, స్వేత కామాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో మధ్య మధ్యలో మెరిశారు. మిగిలిన ఆర్టిస్టులు ఓకే అనిపించారు. 
 

టెక్నీకల్‌గాః 
సినిమాకి బీజీఎం బలం. మిక్కీ జే మేయర్‌ మంచి బీజీఎం అందించారు. దానికి తగ్గ సన్నివేశాలు లేకపోవడంతో అది పెద్దగా ఎలివేట్‌ కాలేదు. బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌లో వచ్చే పాట ఆకట్టుకుంటుంది. కెమెరా వర్క్ బాగుంది. హరి కే వేదాంతం సినిమాని రిచ్‌గా చూపించాడు. ఎడిటర్‌ మరింత క్లారిటీగా కట్‌ చేయాల్సింది. చాలా సీన్లకి లింక్ మిస్ అయినట్టుగా ఉంటుంది. ఇక దర్శకుడు శక్తి ప్రతాప్‌ సింగ్‌కి తెలుగు ఆడియెన్స్ ఫల్స్ తెలియదని సినిమా చూస్తుంటే అర్థమవుతుంది. అలాగే దేశ భక్తిని చూపించడంలోనూ సక్సెస్‌ కాలేదు. నేల విడిచి సాము చేసినట్టు ఆయన అసలైన ఎమోషన్స్ ని వదిలేసి సినిమా తీశాడు. అదే సినిమాకి పెద్ద మైనస్‌. బలమైన సంఘర్షణ, బలమైన ఎమోషన్స్, బలమైన పెయిన్‌ని చూపిస్తూ, దేశభక్తి రగిల్చే ఎమోషన్స్ చూపిస్తూ ఈ ఎయిర్‌ ఫోర్స్ యాక్షన్‌ సీన్లు చూపిస్తే బాగుండేది. అవి లేకపోవడంతో మూవీ తేలిపోయింది. నిర్మాణ విలువలు మాత్రం బాగున్నాయి. 
 

ఫైనల్‌గాః `ఆపరేషన్‌ వాలెంటైన్‌` నేల(ఎమోషన్స్) విడిచి సాము. కానీ తెలుగులో ఈ బ్యాక్‌ డ్రాప్‌లో ఒక ప్రయత్నంగానే మిగిలుతుంది. 

రేటింగ్‌ః 2.25

నటీనటులుః వరుణ్‌ తేజ్‌, మనుషీ చిల్లర్‌, రుహానీ శర్మ, అభినవ్‌ గోమటం, అలీ రెజా, సంపత్ రాజ్‌, షతాప్‌ ఫిగర్‌, శుభశ్రీ, లహరి, స్వేత తదితరులు. 

సాంకేతిక వర్గంః
దర్శకుడుః శక్తి ప్రతాప్‌ సింగ్‌
నిర్మాతః సందీప్‌ ముద్దా
కెమెరాః హరి కే వేదాంతం
సంగీతంః మిక్కీ జే మేయర్‌
 

click me!