“హాట్ స్పాట్” ఓటిటి సినిమా రివ్యూ

First Published | Jul 17, 2024, 2:26 PM IST


కొన్ని క‌థ‌లు క‌లిపి ఒకే కథగా ముడిపెట్టి సినిమాగా విడుద‌ల చేయొచ్చు. హిందీలో ఇలాంటి ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. ఇప్పుడు తెలుగులోనూ ఓ ఆంథాల‌జీ వ‌చ్చింది.  
 

Hot Spot

తమిళంలో మంచి విజయం సాధించి, విమర్శకుల ప్రశంసలు అందుకున్న  మూవీ హాట్‍స్పాట్  ఈ ఆంథాలజీ చిత్రం మార్చి 29న థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ మూవీలో నాలుగు కథలను దర్శకుడు విఘ్నేశ్ కార్తీక్ తెరకెక్కించారు.   ఇప్పుడు, ఈ హాట్‍స్పాట్ చిత్రం తెలుగులో ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉంది. ఈ సినిమాలో కంటెంట్ ఎలా ఉంది, చూడదగినదేనా, మన తెలుగు వాళ్లకు నచ్చుతుందా , ఇంత‌కీ ఈ క‌థ‌ల్లో ఏముంది? ఆ క‌థ‌ల్ని చెప్పిన విధాన‌ం ఏమిటి?

Hot Spot

కథేంటి

నిజానికి ఇది ఒక కథకాదు. నాలుగు కథల సమాహారం . సినిమా డైరక్టర్ అవ్వాలనుకునే  మహమ్మద్ షఫీ(విగ్నేష్ కార్తీక్) ఓ నిర్మాత(బాల మణిమర్బన్) ను కలుస్తాడు. అతను చాలా చిరాగ్గా మొహం పెట్టి,  అసలు రొటీన్ కథలు చెప్పద్దు అంటాడు. అంతేకాదు దాదాపు అందరి ప్రొడ్యూసర్స్ లాగే కథ పది నిముషాల్లో తేల్చేయమంటాడు. తనకున్న పది నిముషాల సమయంలో తాను కథను చెప్పకపోతే లేచి వెళ్లిపోతాడని, అతన్ని తన కథన విధానంతోనే కట్టి పారేయాలనుకుని ఇంట్రస్టింగ్ గా మొదలెడతాడు. ఈ క్రమంలో తన దగ్గరున్న నాలుగు చిన్న కథలు చెప్తాడు.  అవి  హ్యాపీ మేరీడ్ లైఫ్, గోల్డెన్ రూల్స్,టమోటా చట్నీ, ఫేస్ గేమ్. ఆ నాలుగు కథలు సమాజంలో నిత్యం ఎదుర్కొంటున్న వాటిని తీసుకుని చాలా హార్డ్ హిట్టింగ్ గా చెప్తాడు. ఆ కథలు ఏమిటి... ఆ కథలు ఆ నిర్మాతకి  నచ్చాయా, అలాగే ఈ నాలుగు కథలను ముగింపులా...సినిమా ఫైనల్ క్లైమాక్స్ ట్విస్ట్ ఏమిటి తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 
 


ఎలా ఉంది..

ఓటీటీలు వచ్చాక కథ చెప్పే విధానం మారిపోయింది. విభిన్నమైన కథ చెప్పాలనుకునే వాళ్లకు  చాలా సౌల‌భ్యాలు వ‌చ్చాయి. ముఖ్యంగా కొత్తగా ఆలోచించే వాళ్ల‌కు కొత్త దారులు ,కొత్త నిర్మాతలు కనపడుతున్నారు.  చిన్న చిన్న క‌థ‌ల‌ని ఒక కథగా చెప్తే వాటిని ఆదరించేందుకు వేదిక‌లు ఏర్ప‌డ్డాయి.  సినిమా ఇలాగే ఉండాలనే చాలా  సూత్రాలు ఎగిరిపోయాయి. తమ ఐడియా ఎంత చిన్నదైనా కావచ్చు, ఎంత చిన్న క‌థైనా చెప్పొచ్చు. హిందీలో ఇలాంటి ప్ర‌య‌త్నాలు చాలా  జ‌రిగాయి. ఇప్పుడు సౌత్ లోనూ ఓ ఆంథాల‌జీ వ‌చ్చింది. అదే `హాట్ స్పాట్`.   ఆంథాల‌జీ తో ఓ సుఖం ఉంది. ఏ కథ కావాలంటే ఆ కథ చూసి బ్రేక్ ఇచ్చి మరో కథ చూడవచ్చు. అయితే ఇక్కడే ఓ సమస్య కూడా ఉంది. మొదటి కథే నాశిరకంగా ఉంటే మిగతావి చూడటానికి పెద్దగా ఆసక్తి చూపరు. అయితే హాట్ స్పాట్ డైరక్టర్ తెలివైన వాడు. తన డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో , నేరేషన్ తో ఇంట్రస్టింగ్ గా మామూలు కథలు కూడా ఆసక్తిగా చూసేలా చేసాడు.   

ఈ కథల్లో షాకింగ్ మూమెంట్ బాగా వర్కవుట్ అయ్యింది. మన మైండ్ కూడా బ్లాంక్ అవుతుంది. ఇదేంటిది అనిపిస్తుంది. తర్వాత ఆ పాత్ర లాజిక్ కు, పరిస్దితిలకు అవును కదా అనిపిస్తుంది. అలాగే   కొన్ని కథల్లో డీల్ చేసిన  పాయింట్స్ ని జీర్ణం చేసుకోవ‌డం తెలుగు ప్రేక్ష‌కుల‌కు కాస్త క‌ష్ట‌మే.  అయితే  కొత్త పాయింట్, తెరపై చెప్పాల్సిన పాయింట్ అని డైరక్టర్ భావించి ఉంటాడు. కాక‌పోతే.. దాన్ని అర్థం అయ్యేలా, ఆ పాయింట్ కి ఆడియ‌న్స్ క‌నెక్ట్ అయ్యేలా చూపించ‌టమే కలిసొచ్చింది. ఒకే  స్టోరీతో ముడిపెడుతూ  వ‌చ్చిన ఈ నాలుగు క‌థ‌ల నేప‌థ్యాలు మాత్రం వేర్వేరు. న‌లుగురు సామాన్యుల జీవితాలను క‌థ‌లు చెబుతారు. ఏదో మైండ్ బ్లోయింగ్ కాన్సెప్టులు కాదు కానీ ఆలోచించిప చేసేవే.  అలాగే టైటిల్ చూసి హాట్ హాట్ దృశ్యాలు ఉండాయని,  ఇదేదో.. ఓవ‌ర్ ది బోర్డ్ క‌థ‌ల‌నో, బోల్డ్ క‌థ‌ల‌నో భావిస్తే మాత్రం బోల్తా పడతారు. నాలుగు కథల్లో చివరకి బాగా ఎమోషనల్ గా ఉంటూ మనందరం రెగ్యులర్ గా చేస్తున్న తప్పుని చూపిస్తుంది. ఇలాంటి ఆలోచింప చేసేకథలు అయితే రావాల్సి ఉంది.

టెక్నికల్ గా...

ఈ సినిమాకు స్క్రిప్టే ప్రధానం. దాన్ని మరీ సీరియస్ గా కాకుండా ఫన్ తో ముడిపెట్టి తెరకెక్కించిన విధానం బాగుంది. స్క్రిప్టు ని అంతే సులువుగా,కన్ఫూజ్ చేయకుండా  డైరక్టర్ తెరకెక్కించారు.  అయితే ఇంకాస్త బాగా చేసి ఉండవచ్చని అనిపిస్తుంది. మిగతా డిపార్టమెంట్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. డబ్బింగ్, సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. డైలాగులు అయితే అచ్చ తెలుగు సినిమా చూస్తున్నట్లు అనిపించాయి.  ఎడిటింగ్ సెకండాఫ్ లో  లాగినట్లు అనిపించింది. తమిళంకు మనకు తేడా ఉంటుంది కాబట్టి కాస్త ఇక్కడ రీ ఎడిట్ చేసి కొంచెం బెటర్ గా చేయాల్సింది. సినిమాటోగ్రఫీ  బాగుంది. నటీనటులంతా తమిళం వాళ్లే , పెద్ద ఫెమిలయర్ ఫేసెస్ కాదు కానీ బాగా చేసారు. ప్రత్యేకమైన ఇమేజ్ లేని ఆర్టిస్ట్ లు కాబట్టి వాళ్లు కథలకు సూట్ అయ్యారనిపించింది.

ఫైనల్ థాట్

సినిమాలో కనిపించే అడల్ట్ ఫ్యాక్టర్ సీన్స్  ఫ్యామిలీలతో చూస్తే ఇబ్బంది పడతారు. అలాగే పిల్లలను దూరంగా ఉంచాల్సిన సినిమా. పెద్దలు ఖచ్చితంగా చూడాల్సిన సినిమా.ఓటిటిలోనే కాబట్టి ఓ లుక్కేయవచ్చు.

----సూర్య ప్రకాష్ జోశ్యుల

Rating: 2.75


ఎక్కడ చూడచ్చు 

OTT: ఆహా లో తెలుగులో ఉంది

నటీనటులు: కలైయరసన్, సోఫియా, శాండీ, అమ్ము అభిరామి, జననీ లైయర్, గౌరీ జి కిషన్, ఆదిహ్య భాస్కర్, విఘ్నేష్ కార్తీక్ మరియు ఇతరులు.

దర్శకులు: విఘ్నేష్ కార్తీక్

నిర్మాతలు : అనీల్ కె రెడ్డి, ముని చంద్రారెడ్డి, ఇందు కుమార్ రెడ్డి

సంగీత దర్శకులు: సతీష్ రఘునాథన్ మరియు వాన్

సినిమాటోగ్రఫీ: గోకుల్ బెనోయ్

ఎడిట‌ర్ : ముత్తయన్ యు

Latest Videos

click me!