మాస్ మహారాజా రవితేజ.. నిర్మాతగా మారి కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలను చేస్తున్నారు. ఇప్పటికే ఆయన `మట్టికుస్తీ` చిత్రాన్ని నిర్మించారు. అది వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత తనే హీరోగా వచ్చిన `రావణాసుర` చిత్రాన్ని నిర్మించారు. అది డిజాస్టర్ అయ్యింది. ఇప్పుడు మరో సినిమాతో వస్తున్నారు. తన ఆర్‌టీ టీమ్ వర్క్స్ పై ఓ నిర్మాతగా వ్యవహరిస్తూ ఫ్రేమ్ బై ఫ్రేమ్ పిక్చర్స్ తో కలిసి `ఛాంగురే బంగారు రాజా` చిత్రాన్ని నిర్మించారు. కార్తీక్ రత్నం, గోల్డీ నిస్సీ హీరోహీరోయిన్లుగా నటించారు. రవిబాబు, సత్య, ఎస్తేర్ కీలక పాత్రలు పోషించారు. సతీష్ వర్మ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నేడు శుక్రవారం(సెప్టెంబర్ 15)ని విడుదలైంది. మరి సినిమా ఎలా ఉంది, రవితేజ నిర్మాతగా మారేంత స్టఫ్ సినిమాలో ఉందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
కథః
ఓ పల్లెటూరులో రంగురాళ్లకి ఫేమస్. వర్షం పడిందంటే ఆ ఊరు జనాలంతా రంగురాళ్ల కోసం వెతుకుతుంటారు. ఆ గొడవలో బంగార్రాజు(కార్తీక్ రత్నం), సోము నాయుడు(రాజ్ తిరందాసు) రంగు రాయి కోసం గొడవపడతారు. ఆ గొడవలో సోము నాయుడిని చంపేస్తా అంటూ బెదిరిస్తాడు బంగార్రాజు. కట్ చేస్తే సోము నాయుడు కల్వర్ట్ వద్ద హత్యకు గురవుతాడు. బంగార్రాజు బెదిరించడంతో అతనే హత్య చేశాడని అంతా భావిస్తారు. పోలీసులు కూడా అతన్ని అరెస్ట్ చేస్తారు. బెయిల్ మీద బయటకు వచ్చిన బంగార్రాజు.. ఆ హత్య చేసిందెవరో కనిపెట్టి, తాను ఈ కేసు నుంచి బయటపడాలనుకుంటాడు. హత్య జరిగిన స్థలంలో ఓ బైక్ గుర్తులు చూసిన బంగార్రాజు ఆ బైక్‌ని కొట్టేసిన సత్య(కమెడియన్) నే ఆ మర్డర్ చేశాడని భావిస్తాడు. కానీ అతన్ని పట్టుకుని నిలదీయగా, తాను కొట్టుకొచ్చానని, తనకు తెలియదని చెబుతాడు. సత్య కొట్టుకొచ్చిన బైక్‌పై జాకెట్ ఉంటుంది. అందులో బంగార్రాజు ఫోటో ఉంటుంది. వెనకాల `కిల్ హిమ్` అని ఉంటుంది. దీంతో అతడెవరో కనిపెట్టేందుకు మళ్లీ ప్రయత్నం జరుగుతుంది. సోము నాయుడుని ఎందుకు చంపారు? ఆ చంపింది ఎవరు? బంగార్రాజుని ఎవరు చంపాలనుకుంటున్నారు? ఆ మర్డర్ వెనకాల దాగున్న కుట్ర ఏంటి? అనేది మిగిలిన కథ.
విశ్లేషణః
రవితేజ ఈ సినిమాకి నిర్మాతగా జాయిన్ అయ్యాడంటే ఏదో విషయం ఉంటుందనే నమ్మకం క్రియేట్ అయ్యింది. రంగురాళ్ల నేపథ్యంలో క్రైమ్ కామెడీగా `ఛాంగురే బంగారురాజా` చిత్రాన్ని తెరకెక్కించారు. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ వేలో, సీరియస్ గా కాకుండా కామెడీ వేలో చూపించారు. ఫన్ ని నమ్ముకుని తెరకెక్కించిన చిత్రమిది. కానీ ఆ ఫన్ మిస్ ఫైర్ అయ్యింది. ఫన్ ఒకటి రెండు చోట్ల తప్ప చాలా చోట్ల బెడిసికొట్టింది. దీంతో సినిమా కన్‌ఫ్యూజన్‌గా మారిపోయింది. థియేటర్లో ఆడియెన్స్ కి చిరాకు తెప్పించేలా మారిపోయింది. ఫన్ వేలోనే సినిమాని నడిపించే ప్రయత్నం చేసినా, అది తెరపై పండకపోవడం సినిమాకి పెద్ద మైనస్.
సినిమా మొత్తం మర్డర్ మిస్టరీ చుట్టూ తిప్పారు. దానికి రంగురాళ్లు అనేది బ్యాక్ డ్రాప్‌గా పెట్టుకున్నారు. అయితే ఆ మర్డర్ మిస్టరీని సినిమాలోని ప్రధాన పాత్రల కోణంలో చెప్పారు. ఒకే సంఘటనని హీరో కార్తిక్ రత్నం కోణంలో, కమెడియన్ సత్య కోణంలో, మధ్యలో ఎంటరైన రవిబాబు కోణంలో చూపించారు. ఈ రకంగా ఒకే సంఘటనని మూడుసార్లు చూపించారు. అంతేకాదు చూపించిన సీన్లనే మళ్లీ మళ్లీ రిపీట్ చేయడం పెద్ద మైనస్. అది బోరింగ్‌గా, విసుగు పుట్టించేలా మారిపోయింది. మర్డర్ మిస్టరీని ఛేదించేందుకు హీరో వెళ్లే జర్నీ సైతం బోరింగ్ గా సాగుతుంది. చాలా కన్‌ఫ్యూజన్‌గా మారిపోయింది. అదే సమయంలో చాలా లాజిక్స్ ని వదిలేశారు. ఆ లాజిక్స్ చాలా సిల్లీగా ఉండటం మరింత బాధాకరం. ఇందులో హీరోహీరోయిన్ల లవ్ ట్రాక్ పరమ రొటీన్‌గా, బోరింగ్‌గా మారుతుంది. ఏమాత్రం ఆకట్టుకునేలా లేదు. వీరి కంటే సత్య, నిత్య శ్రీ గోరుల లవ్ ట్రాక్ అంతో ఇంతో ఆకట్టుకుంటుంది. మరోవైపు రవిబాబు లవ్ ట్రాక్ మరింత పడకలో పుడకలా మారింది. సినిమాల్లో అతని పాత్ర కన్‌ఫ్యూజ్ అయినట్టుగానే ఆయా సీన్లు కూడా కన్‌ఫ్యూజన్‌గా సాగుతుంటాయి. ఇది పరీక్ష పెట్టేలా మారిపోయాయి.
రవిబాబు పాత్ర ద్వారా అంతో ఇంతో ఫన్ వర్కౌట్ అయ్యింది. కానీ దానికి అడ్డుపడే సన్నివేశాలే ఎక్కువగా వస్తుంటాయి. మధ్యలో ఆయన మతిమరుపు, ఇంకోవైపు లవర్ ఎస్తేర్ ఫోన్ చేయడాలు, మరోవైపు హీరో కోసం విలన్లు వెంటపడటం, ఇంకోవైపు పోలీసులు వెంటపడటం, మరోవైపు రవిబాబు వెంటపడటం వంటి సీన్లు విసుగెత్తేలా, ఆడియెన్స్ ఓపికని పరీక్షించేలా ఉన్నాయి. కొత్త కొత్త క్యారెక్టర్లు ఎంటరవ్వడం, చూపించిన దాన్నే మళ్లీ మళ్లీ చూపించడం వంటి సీన్లు సినిమాని గందరగోళంగా మార్చేశాయి. దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడో క్లారిటీ లేదు. ఎలా చెప్పాలనుకున్నాడో అసలే క్లారిటీ లేనట్టుగా సినిమా చూస్తే అర్థమవుతుంది. పైగా క్లైమాక్స్ ని కూడా లాగి లాగి వదిలేయడం సహనానికి పెద్ద పరీక్షే అని చెప్పాలి.
నటీనటులుః
యాక్టింగ్ పరంగా చాలా వరకు అందరు బాగానే చేశారు. బంగార్రాజుగా కార్తీక్ రత్నం చాలా బాగా చేశాడు. అయితే సినిమాలో తను హీరో అనుకుంటాం, కానీ సినిమా సాగిన తీరు మాత్రం జస్ట్ అతనిది కూడా ఓ పాత్ర లానే అనిపిస్తుంది. అంతో ఇంతో సత్య పాత్ర హైలైట్ అవుతుంది. ఎప్పటిలాగే సత్య ఇరగదీశాడు. మరోవైపు ఆయన లవర్‌గా నిత్య శ్రీ బాగా చేసింది. అసలు హీరోయిన్ గోల్డీ నిస్సీ జస్ట్ ఓకే అనిపించింది. రవిబాబు పాత్ర కామెడీ పండిస్తుంది. అదే సమయంలో విసుగు తెప్పిస్తుంది. ఎస్‌ఐగా అజయ్ ఎప్పటిలాగే చేసేశాడు. ఎస్తేర్ జస్ట్ రెండు మూడు సీన్లలో మెరిసింది. మిగిలిన పాత్రలు జస్ట్ ఓకే అనిపించాయి.
టెక్నీషియన్లుః
ఒక్క డైరెక్షన్ పక్కన పెడితే టెక్నీకల్‌గా సినిమా ఫర్వాలేదనిపిస్తుంది. కృష్ణ సౌరభ్ మ్యూజిక్ గురించి చూస్తే సాంగ్స్ పెద్దగా గుర్తిండిపోవు. కానీ బీజీఎం ఫర్వాలేదనిపిస్తుంది. సుందర్ ఎన్‌సీ కెమెరా వర్క్ బాగుంది. విజువల్స్ రిచ్‌గా ఉన్నాయి. కెమెరామెన్ పనితీరుని అభినందించాల్సిందే. ఎడిటర్ మాత్రం తన కత్తిని వదిలేశాడనిపిస్తుంది. జనార్థన్ పసుమర్తి డైలాగులు అక్కడక్కడ ఆలోచింపచేసేలా ఉన్నాయి. నిర్మాణ విలువలకు కొదవలేదు. ఇక దర్శకత్వమే వీక్. సినిమాని కథని ఇంకా క్రిస్పీగా, క్లారిటీగా రాసుకోవాల్సింది. అదే సమయంలో ఫన్ క్రియేట్ అయ్యేలా మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సింది. దీంతో `ఛాంగురే బంగారు రాజా` బెడిసికొట్టిందని చెప్పొచ్చు.
ఫైనల్‌గాః కన్‌ఫ్యూజన్ `బంగారురాజా`. సరైన సినిమాని ప్రొడ్యూస్ చేయడంలో రవితేజ కూడా కన్‌ఫ్యూజ్ అయ్యాడు.
రేటింగ్‌ః 2