Chaari 111 Review: `చారి 111` మూవీ రివ్యూ, రేటింగ్‌..

First Published | Mar 1, 2024, 1:37 PM IST

స్టార్‌ కమెడియన్‌ వెన్నెల కిశోర్‌ హీరోగా మారి `చారి 111` చిత్రంలో నటించాడు. ఆయన హీరోగా అంటే అందరిలోనూ క్యూరియాసిటీ నెలకొంది. తాజాగా ఈ మూవీ శుక్రవారం విడుదలైంది. ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

హాస్యనటుడు వెన్నెల కిశోర్‌ చాలా బిజీ ఆర్టిస్ట్. ఆయన ఏకకాలంలో ఏడెనిమిది సినిమాలతో బిజీగా ఉంటారు. స్టార్‌ హీరోల పక్కన కమెడియన్‌గా నటిస్తూ అలరిస్తున్నారు. ఆయన ఫుల్‌ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో హీరోగా టర్న్ తీసుకున్నారు. చాలా మంది హాస్యనటులు హీరోగా మారి నిరూపించుకున్న నేపథ్యంలో తను కూడా హీరోగా ప్రయత్నం చేశాడు. `చారి 111` అనే సినిమాలో నటించాడు. టీజీ కీర్తి కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీలో సంయుక్త విశ్వనాథన్‌ హీరోయిన్‌గా నటించింది. అదితీ సోనీ నిర్మించింది. ఈ మూవీ నేడు శుక్రవారం(మార్చి 1)న విడుదలైంది. మరి సినిమా ఎలా ఉంది? హీరోగా వెన్నెల కిశోర్‌ మెప్పించాడా? లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం. 
 

కథః

రాష్ట్రంలో రుద్రనేత్ర అనే సీక్రెట్ ఏజెంట్‌ సర్వీస్‌ ప్రసాద్‌ రావు(మురళీశర్మ) సారథ్యంలో నడుస్తుంది. దీని వెనకాల స్టేట్‌ సీఎం(రాహుల్‌ రవీంద్రన్‌) ఉంటాడు. ఈ రుద్రనేత్రలో కొత్తగా చారి 111(వెన్నెల కిశోర్‌) తన టీమ్‌(తాగుబోతు రమేష్‌)అపాయింట్‌ అవుతారు. చారి 111 ఫెయిల్యూర్‌ స్పై ఏజెంట్‌. తనే జేమ్స్ బాండ్‌ తరహాలో ఫీలవుతాడు. హైదరాబాద్‌లో ఓ సూసైడ్‌ బ్లాస్టింగ్‌ జరుగుతుంది. కానీ ఎలాంటి పేలుడు పదార్థాలను ఉపయోగించరు. అది ఎలా సాధ్యమనేది పెద్ద మిస్టరీ. దాన్ని ఇన్వెస్టిగేషన్‌ చేసే బాధ్యత సీఎం రుద్రనేత్ర ఏజెన్సీకి అప్పగిస్తారు. ఈ బ్లాస్టింగ్‌లో అనుమానితుడైన బిగ్‌ షాట్‌ శ్రీనివాసరావు(బ్రహ్మాజీ)ని పట్టుకోవాలనుకుంటారు. ఆ బాధ్యత చారి 111 అండ్‌ టీమ్‌కి అప్పగిస్తాడు ఛీఫ్‌. కానీ చారి చేసే కన్‌ఫ్యూజన్‌ యాక్టివిటీస్‌తో అతను తప్పించుకుంటారు. కానీ ప్రసాద్‌ రావు ప్లాన్‌ బీ కారణంగా వాళ్ల వద్ద నుంచి సూట్‌కేస్‌ని కొట్టేస్తారు. ఆ సూట్‌ కేసులో చిన్న కాప్ల్స్యూల్‌ ఉంటుంది. అది తిన్న ఎలుక బ్లాస్టింగ్‌తో చనిపోతుంది. దీంతో దీని వెనకాల పెద్ద ఉగ్ర కుట్ర ఉంటుందని భావిస్తారు. ఈ విచారణలో రావణ్‌ ఉన్నాడని గుర్తిస్తారు. మరి ఆ రావణ్‌ ఎవరు? ఆయన కథేంటి? ఈ హ్యూమన్‌ మెడికల్ బాంబ్‌ని తయారు చేసింది ఎవరు? ప్రసాద్‌ రావు ప్లాన్‌ బి ఏంటి? ఈ కేసుని చారి 111 ఛేదించాడా? ఇందులో హీరోయిన్‌ పాత్ర ఏంటి? అనేది మిగిలిన కథ. 
 


విశ్లేషణః
హాస్యనటులు హీరోలుగా మారి సినిమాలు చేసినప్పుడు సీరియస్‌గా చేసే ఆడియెన్స్ కి ఎక్కదు. అప్పటి వరకు నవ్వేంచే నటుడు సీరియస్ గా కనిపిస్తే కన్విన్సింగ్‌గా అనిపించదు. కామెడీ కచ్చితంగా ఉండాల్సిందే. నవ్విస్తూనే అంతర్లీనంగా చెప్పాలనుకున్న విషయం చెప్పాలి. ఆ కామెడీని వదిలి సాహసం చేశారా? తేడా కొడుతుంది. `చారి 111` సినిమా విషయంలో దర్శకుడు ఒక విషయాన్ని ఫాలో అయ్యాడు. మరో విషయంలో తడబడ్డాడు. బ్యాక్‌ డ్రాప్‌ సీరియస్ అంశమైనా, దాన్ని వినోదాత్మకంగా చూపించాడు. సినిమా కథలోకి తీసుకెళ్లాడు. ప్రధానంగా కొంత `చార్లీ చాప్లిన్‌` స్టయిల్‌ని, అలాగే `పింక్‌ పాంథర్‌` తరహా కామెడీ స్టయిల్‌ని ప్రయత్నించినట్టుగా ఈ మూవీని తెరకెక్కించాడు. ఈ విషయంలో ఆయన ప్రయత్నం కొంత వరకు ఫలించిందని చెప్పొచ్చు. 
 

సినిమా మొదటి భాగంలో చారి 111 గా వెన్నెల కిశోర్‌ పాత్రని ఎస్లాబ్లిష్‌ చేశాడు. ఆయన అన్నీ సగం సగం వింటూ తనే గొప్ప స్పై ఏజెంట్‌ అని ఫీలవడం, ఈ క్రమంలో ఆయన చేసే యాక్టివిటీస్‌, అమాయకత్వంలో, ఇందులో అతను చేసే పొరపాట్లు నవ్వులు పూయించేలా ఉంటాయి. దీనికితోడు సత్య పాత్రతో కలిసి ఆయన చేసే రచ్చ కడుపుబ్బ నవ్విస్తుంది. మురళీ శర్మతో కన్వర్జేషన్‌, ఇందులో వెన్నెల కిశోర్‌ చెప్పే తెలివి తక్కువ సమాధానాలు, ఆవేశంలో చేసే పనులు కామెడీని పంచుతాయి. ఆయా సీన్లు చాలా వరకు బాగానే పండాయి. కొన్ని చోట్ల ఓవర్‌గానూ అనిపిస్తుంది. మొదటి భాగం మొత్తం కన్‌ఫ్యూజన్‌ కామెడీతో నడిపించిన దర్శకుడు సెకండాఫ్‌లో చాలా సీరియస్‌ టర్న్‌ తీసుకున్నారు. కథ కామెడీ నుంచి సీరియస్‌ ఇన్వెస్టిగేషన్‌కి టర్న్ తీసుకుంటుంది. ఇందులోనూ చాలా వరకు, అవకాశం ఉన్నప్పుడల్లా ఫన్‌ జనరేట్‌ అయ్యేలా చేశారు. అంత వరకు బాగానే ఉంది. 
 

కానీ సెకండాఫ్‌లో చాలా వరకు సినిమా సీరియస్‌గా మారిపోతుంది. ఓ పెద్ద హీరో ఇన్వెస్టిగేషన్‌ స్టయిల్‌లో మారుతుంది. ఇందులో మురళీ శర్మ పాత్ర మెయిన్‌గా మారుతుంది. వెన్నెల కిషోర్‌ పాత్ర డౌన్‌ అవుతుంది. ఆటోమెటిక్‌గా కామెడీ జీరోకి పడిపోయింది. ఇక మెయిన్‌ విలన్‌ ఎంటర్‌ కావడంతో కథ మరోవైపు మలుపు తిప్పుతుంది. అతని ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్‌ కన్విన్సింగ్‌గా అనిపించదు. అది సినిమా ల్యాగ్‌ అనిపిస్తుంది. అంతేకాదు ఆ ఎపిసోడ్‌నే పదే పదే చెప్పడం కూడా బోరింగ్‌గా అనిపిస్తుంది. మరోవైపు విలన్‌ ఎంట్రీ తర్వాత హీరో జీరో అవడం, అక్కడ కూడా తను ఏమాత్రం ప్రభావం చూపించలేకపోవడం, పైగా కామెడీని కూడా పండించలేకపోవడంతో కథ ఎటుపోతుందో అర్థం కాదు. క్లైమాక్స్ చాలా సింపుల్‌గా ముగించారు. ఏమాత్రం కిక్‌ ఇచ్చేలా, సర్‌ప్రైజ్ అనిపించేలా లేదు. హై ఇచ్చే ఎపిసోడ్‌ ఒక్కటి కూడా లేదు. ఎప్పటిలాగే సస్పెన్స్‌ పెట్టి కథని సుఖాంతం చేశారు. క్లైమాక్స్ లో అయినా మరింత బలంగా, హిలేరియస్‌ ఫన్‌ని ప్లాన్‌ చేసి ఉంటే బాగుండేది. అలాగే కథ విషయంలో మరింత కేర్‌ తీసుకోవాల్సింది. 
 

నటీనటులుః

చారి పాత్రలో వెన్నెల కిశోర్‌ దించేశాడు. ఆయన ఎప్పటిలాగే కామెడీ చేశాడు. హీరో అనే ఫీలింగ్‌ మాత్రం ఏమాత్రం రాదు. సినిమాలో హీరోయిన్‌ చెప్పినట్టుగానే ఆయన హీరోగా చేసినా చూడ్డానికి కమెడియన్‌గానే కనిపించాడు. తనదైన అమాయకత్వం, తెలివి తక్కువ పనులు, కన్‌ఫ్యూజింగ్‌ చేష్టలతో నవ్వులు పూయించాడు. సెకండాఫ్‌లోనూ అదే జోరు కనిపించాల్సింది. ఇక హీరోయిన్‌ సంయుక్త విశ్వనాథన్‌ అదరగొట్టింది. ముఖ్యంగా యాక్షన్‌ సీన్లో దుమ్మురేపింది. వెన్నెల కిశోర్‌ని డామినేట్‌ చేసింది. ఒక్కసారిగాసినిమాని తనవైపు తిప్పుకుంది. కానీ చివర్లో ఆమె పాత్ర కూడా తేలిపోయింది. రుద్రనేత్ర ఛీఫ్‌గా మురళీశర్మ బాగా చేశాడు. ఆయనే హీరో అనేలా చేసి మెప్పించాడు. సీఎంగా రాహుల్‌ రవీంద్రన్‌ హుందాగా కనిపించాడు. అలరించారు. తాగుబోతు రమేష్‌, సత్యల కామెడీ నవ్వులు పూయిస్తుంది. వెన్నెల కిశోర్‌కి సపోర్ట్ గా నిలిచారు. బ్రహ్మాజీ సీరియస్‌ పాత్రలో కాసేపు మెరిశాడు. మిగిలిన ఆర్టిస్ట్‌ లు ఓకే అనిపించారు. 
 

టెక్నీకల్‌గాః 
సినిమాలో ఒక్క పాట ఉంది. అది ఆకట్టుకునేలా ఉంటుంది. మ్యూజిక్‌ డైరెక్టర్‌ సైమన్‌ కే కింగ్‌ బీజీఎం మాత్రం అదిరిపోయింది. ఫన్‌తోపాటు కాస్త యాక్షన్‌ స్టయిల్‌ బీజీఎం మెప్పిస్తుంది. ఎడిటింగ్‌ పరంగా మరికాస్త కేర్‌ తీసుకోవాల్సింది. కెమెరా వర్క్ బాగుంది. సినిమా ప్రతి ఫ్రేమ్‌ రిచ్‌గా కనిపిస్తుంది. నిర్మాణ విలువలకు కొదవలేదు. సినిమా లావిషింగ్‌ కనిపించడంలో వారి ప్యాషన్‌ కనిపిస్తుంది. ఇక దర్శకుడు టీజీ కీర్తి కుమార్‌ ఫస్టాఫ్‌ వరకు బాగానే డీల్‌ చేశాడు. ఫన్‌ జనరేట్‌ చేయడంలో సక్సెస్‌ అయ్యాడు. కానీ సెకండాఫ్‌ని అంతే రక్తికట్టించేలా చేయలేకపోయాడు. అక్కడ కథ ట్రాక్‌ తప్పినట్టు అవుతుంది. కొంత కన్ఫ్యూజన్‌ క్రియేట్‌ అవుతుంది. ఆయా అంశాల విషయంలో మరింతగా వర్క్ చేయాల్సింది. సెకండాఫ్‌ని కూడా అదే రేంజ్‌లో తెరకెక్కించి, కన్ని ట్విస్ట్ లు, టర్న్ లతో కథని తీసుకెళితే సినిమా ఫలితం మరింత బాగుండేది. 

ఫైనల్‌గాః `చారి 111` కొంత వరకు నవ్వించే సీక్రెట్‌ ఏజెంట్‌..

రేటింగ్‌ః 2.5
 

Latest Videos

click me!