snake bite first aid: పాము కరిస్తే వెంటనే ఏం చేయాలి? ఈ ఒక్కటి చేస్తే ప్రాణాపాయం నుంచి కాపాడవచ్చు

First Published | Aug 2, 2024, 9:18 PM IST

పాము కనబడితేనే కొందరు హడలిపోతారు. ప్రమాదవశాత్తు పాము కాటు వేస్తే  ఇక వారిలో ఉండే హైరానా అంతా ఇంతా కాదు. మరి పాము కాటు వేస్తే ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో తెలుసా..?

పాము కాటుకు గురైన వ్యక్తిని కాపాడేందుకు నోటితో విషాన్ని  తీయడం, కొన్ని రకాల రాళ్లతో కాటు వేసిన చోట రుద్దడం, మూలికా మందులు, పసరు వైద్యాలు చేయడం ప్రాణాంతకం.  మరి పాము కాటు వేస్తే ముందుగా ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఏ పామో తెలిస్తే చికిత్స సులభం...

సాధారణంగా పాము కాటు వేస్తే బాధితులు పడే ఆందోళన అంతా ఇంతా కాదు.  ప్రాణం పోతుందేమోనన్న భయంతో తీవ్రమైన ఒత్తిడికి లోనవుతారు.  అయితే అన్ని పాములు విష పూరితం కాదు. పాము కాటు వేసిందని నిర్ధారణ అయినప్పుడు బాధితుడు కాటు వేసింది ఏ పామో గుర్తించాడో లేదో ముందుగా తెలుసుకోవాలి. అది విషపూరితం కాకపోతే ఆందోళన చెందవలసిన అవసరం ఉండదు. ఒకవేళ విషపూరితమైన పాము కాటు వేసినప్పటికీ ఆందోళన చెందకుండా ప్రధమ చికిత్స చేసి వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లడం ద్వారా బాధితుల ప్రాణాలు కాపాడవచ్చు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో యాంటీవీనం ఇంజక్షన్లు అందుబాటులో ఉంటాయి. 
 


ప్రథమ చికిత్స ఎలా చేయాలంటే...

1. ముందుగా బాధితుడిని ప్రమాద స్థలం నుంచి దూరంగా తీసుకెళ్లాలి. నదులు, కాలువలు, సముద్రాల్లో పాము కాటు జరిగితే నీటిలో మునిగిపోకుండా వారిని వెంటనే సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లాలి. 
2. పాము కరిచిన భాగంలో ఉంగరాలు, ఇక్కడ ఆభరణాలు ఉంటే వెంటనే వాటిని తీసేయాలి. లేకపోతే వాపు వచ్చిన తర్వాత అవి ఇరుక్కుపోయి సమస్య తీవ్రం అవుతుంది. చికిత్స చేయడానికీ ఇబ్బంది కలుగుతుంది. 
3. పాము కాటుకు గురైన వ్యక్తి ఆందోళన చెందకుండా ఉండేలా చూడాలి. అటు ఇటు కదలనివ్వకూడదు. మీకు ఏమీ కాదని, త్వరగా కోలుకుంటారని ధైర్యం చెప్పాలి. 
4. స్ట్రచర్ లేదా స్ట్రచర్ లాంటివి ఉపయోగించి వాహనాల్లో సమీపంలో ఉన్న ఆసుపత్రులకు తీసుకెళ్లి యాంటీవీనం ఇంజక్షన్లు వేయించడం ఇతర వైద్య చికిత్సల ద్వారా వారి ప్రాణాలు కాపాడవచ్చు.

కట్టు కట్టడం అన్నివేళలా మంచిది కాదు...

కాటు వేసిన చోట కట్టుకట్టడం అన్ని సందర్భాల్లోనూ మంచిది కాదు. ముఖ్యంగా పాము కాటు వల్ల వాపు వస్తే అక్కడ కట్టుకట్టకూడదు. దీనివల్ల ఆ ప్రాంతం ఇన్ఫెక్షన్ కి గురై చికిత్స సమయంలో తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు అని వైద్యులు చెబుతున్నారు. పాము కాటు వేసినప్పుడు వాంతులు అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల ఆసుపత్రికి తీసుకెళ్లే వరకు బాధితులని ఎడమవైపు తిప్పి పడుకొనేలా ఉంచడం మేలు.

ప్రాణాలను కాపాడే ఇంజక్షన్లు...

యాంటీవీనమ్‌లు ప్రాణాలను రక్షించడమే కాదు, పాము విషంలోని నెక్రోటిక్ ఇతర టాక్సిన్‌ల వల్ల రోగులకు కలిగే బాధలను తగ్గించగలవు. ఈ ఇంజక్షన్లు రోగులు త్వరగా కోలుకోవడానికి సహకరిస్తాయి. 
 

WHO

 ఏటా నాలుగు లక్షల మంది బాధితులు...

WHO వరల్డ్ రిపోర్ట్ ఆన్ చైల్డ్ ఇంజురీ ప్రివెన్షన్ (2008) ప్రకారం  , ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 4 లక్షల పాముకాటు కేసులు నమోదవుతున్నట్లు అంచనా. పాముల విషంలో డెర్మోనెక్రోటిక్, సైటోటాక్సిక్, మయో టాక్సిక్ వంటి ప్రమాదకర ద్రవాలు ఉంటాయి. సరైన సమయంలో వైద్యం అందకపోతే ఇవి శరీరంలో నిల్వ ఉండి ఆయా భాగాలు తీవ్రంగా దెబ్బ తినే విధంగా  చేస్తాయి. దీంతో వైకల్యం ఏర్పడే అవకాశం ఉంటుంది.

20 minutes whole blood clotting test(20WBCT)

కొన్ని విషపూరిత పాము జాతులు కాటు వేయడం వల్ల అధిక రక్తస్రావం జరిగే అవకాశం ఉంటుంది. పాము కాటు విషపూరితమైనదో లేదో తెలుసుకునేందుకు 20WBCT టెస్ట్ అందుబాటులో ఉంది. పాము కాటుకు గురైన వ్యక్తి యొక్క సిరల రక్తం 1 లేదా 2 మిల్లీ లీటర్లు సేకరించి ఒక చిన్న గాజు సీసాలో వేయాలి. 20 నిమిషాల పాటు గది ఉష్ణోగ్రత వద్ద ఉంచాలి. రక్తం గడ్డ కట్టకపోతే విషపూరితమని, గడ్డ కడితే ప్రమాదకరం కాదని వైద్యులు నిర్ధారిస్తారు.  దీంతో వైద్యులు సరైన చికిత్స అందిస్తారు.

Latest Videos

click me!