ఉసిరికాయ మన ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో ఎన్నో రకాల పోషకాలుంటాయి. దీన్ని తీసుకోవడం వల్ల గట్ ఆరోగ్యంగా ఉంటుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది బరువు తగ్గేందుకు కూడా సహాయపడుతుంది. ఉసిరిని వివిధ వంటల్లో కూడా ఉపయోగిస్తారు. కానీ ఉసిరిని తినడానికి చాలా మంది వెనకాడుతుంటారు. కారణం పుల్లగా.. కాస్త చేదుగా ఉంటుందని. అయితే ఈ ఉసిరి ప్రయోజనాల గురించి ఎన్నో ఎన్నో చెప్పుకుంటుంటారు. మరీ వీటి గురించి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
ఉసిరికాయ బరువు తగ్గడానికి సహాయపడుతుందా?
ఉసిరి బరువును తగ్గిస్తుంది. గట్ ను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఉసిరిలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. ఉసిరికాయలో ఉండే పోషకాలు జీర్ణక్రియను, జీవక్రియను మెరుగుపరుస్తాయి.
2017 లో జరిపిన ఒక అధ్యయనం ప్రకారం... ఉసిరికాయ ఎలుకల్లో బరువును, బొడ్డు కొవ్వును కరిగిస్తుందని వెల్లడైంది.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది
పలు అధ్యయనాల్లో.. ఉసిరికాయలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, హైపోగ్లైసీమిక్, యాంటీ హైపర్ గ్లైసెమిక్, యాంటీ హైపర్ లిపిడెమిక్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయని కనుగొన్నారు. అలాగే విటమిన్ సి, పాలీఫెనాల్స్, టానిన్లు, ఖనిజాలు, ఫైబర్స్, ప్రోటీన్లు, అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయని నిపుణులు వెల్లడించారు.
ఉసిరిలో కాంప్లెక్స్ టానిన్‌లు, ఎల్లాజిటానిన్‌లు కోరిలాగిన్, జెరానిన్, చెబులాజిక్ యాసిడ్, ఎలియోకార్పుసిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. అందుకే ఉసిరిని రోగనిరోధక శక్తిని పెంచే మంచి వనరుగా పిలుస్తారు.
ఉసిరికాయను ఎలా తినాలి?
ఉసిరిని వివిధ రూపాల్లో తింటుంటారు. ఊరగాయ, పొడి రూపంలో, తీపి పానీయాలుగా తీసుకుంటారు. ఉసిరిని ఉదయం పానీయంగా తీసుకునే వాళ్లు చాలా మందే ఉన్నారు. అయితే ఉసిరిలో పోషకాలు తగ్గకూడదంటే వీటిని ముక్కలుగా కోసి కొంచెం ఉప్పు జల్లి తింటే మంచిది. మార్కెట్ లో ఉసిరి మిఠాయిలు కూడా అందుబాటులో ఉంటాయి. వీటిని కూడా తినొచ్చు.
ఉసిరి రసం తయారీ విధానం
రెండు ఉసిరికాయలను తీసుకుని వాటిని ముక్కలుగా కోయండి. వీటిని కొన్ని నీళ్లు పోసి ముక్కలు నలిపోయేలా మిక్సీ పట్టండి. కావాలనుకుంటే దీనిలోని గుజ్జును, పీచుపదార్థాలను పారేయొచ్చు. దీనికి కాస్త మిరియాల పొడిని, నల్ల ఉప్పును కలపండి. తియ్యగా తాగాలనుకుంటే దీనిలో కొద్దిగా తేనెను వేయండి. ఈ పానీయాన్ని వెంటనే తాగడం మంచిది.
ఉసిరి గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు
ఉసిరి రసం కొందరి ఆరోగ్యానికి మంచిది కాదు. దీన్ని తాగేటప్పుడు లేదా తినేటప్పుడు మీ జీర్ణక్రియలో అసౌకర్యంగా అనిపించినా.. ఏదైనా సమస్యగా అనిపించినా.. వెంటనే దీన్ని తీసుకోవడం ఆపేయండి. దీని వల్ల ఏదైనా సమస్య వస్తే వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లండి. రోజుకు ఎంత ఉసిరిని తీసుకోవాలో డాక్టర్ సలహా తీసుకోండి. ఉసిరి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ రేర్ గా కనిపించినప్పటికీ.. దీన్ని మోతాదులోనే తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.