గోడలు నీట్ గా, శుభ్రంగా ఉంటేనే మన ఇల్లు అందంగా, పరిశుభ్రంగా కనిపిస్తుంది. కానీ వైట్ గోడలకు ఏదైనా మరక అంటితే మాత్రం గోడలు మురికిగా కనిపిస్తాయి. దానివైపే మన చూపు ఎప్పుడూ వెళుతుంది. ఇది ఇంటి అందాన్ని దెబ్బతీస్తుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే? వైట్ గోడలకు అంటుకున్న మరకలు ఎంతకీ పోవు. ఈ మరకలు పోవాలని ఎక్కువ శుభ్రం చేస్తే పెయింటే పోతుంది. ఇక ఇంట్లో చిన్నపిల్లలుంటే గోడల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. పెన్నులు, పెన్సిల్లతో పాటుగా చేతికి ఏది దొరికితే దానితో గోడలకు ఏదో ఒకటి గీస్తూనే ఉంటారు. ఇంక్ మరకలు కూడా అంత ఈజీగా పోవు. పండుగలప్పుడు కుంకుమ, పసుపు, నూనె మరకలు, కూరల మరకలు అంటూ ఏదో ఒకటి అంటుతుంటుంది. వీటన్నింటిని శుభ్రం చేయడం నా వల్ల కాదని అలాగే వదిలేస్తుంటారు. అయితే మీరు కొన్ని సింపుల్ చిట్కాలతో వైట్ గోడలకు అంటుకున్న మొండి మరకలను చాలా సులువుగా పోగొట్టొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
డిష్ వాష్ లిక్విడ్ తో..
గోడలకు మన చేతులకు ఉన్న మురికి కూడా నల్లగా అంటుకుంటుంది. వీటివల్ల గోడల అందం పోతుంది. అయితే మీ ఇంటి గోడలపై ఉండే ఇలాంటి మరకలను శుభ్రం చేయడానికి మీరు డిష్ వాష్ లిక్విడ్ ను కూడా ఉపయోగించొచ్చు. ఇందుకోసం ఒక గిన్నే తీసుకుని అందులో డిష్ వాష్ లిక్విడ్ ను వేసి దానికి కొద్దిగా నీళ్లు కలపండి. ఇప్పుడు స్పాంజ్ ను అందులో ముంచి తేలికగా పిండుకుని దాని సహాయంతో చేతులతో రుద్ది గోడపై ఉన్న మరకలను శుభ్రం చేయండి. మరకలు అప్పుడే అంటినప్పుడు వెంటనే తడి గుడ్డతో బాగా తుడిచినా పోతాయి. ఇలా గోడల మొండి మరకలను ఈజీగా పోగొట్టొచ్చు.
మద్యంతో..
స్కూలుకు వెళ్లే పిల్లల చేతులు ఒక్కచోట ఉండవు. పెన్నో, పెన్సిలో తీసుకుని గోడలపై ఏదో రాయడమో, బొమ్మలు గీయడమో చేస్తుంటారు. ఈ పెన్ను మరకలు మాత్రం అంత ఈజీగా పోవు. కానీ ఈ మొండి మరకలన కూడా మీరు ఆల్కహాల్ తో చాలా ఈజీగా పోగొట్టొచ్చు. ఇందుకోసం మందును తీసుకుని గోడలపై ఉన్న మరకలకు రుద్ది శుభ్రం చేయొచ్చు. ఇందుకోసం ముందుగా స్పాంజ్ లేదా కాటన్ గుడ్డను మందులో ముంచండి. దీన్ని చేతులతో గోడకున్న మరకపై రుద్దండి. మరక పూర్తిగా తొలగిపోయిన తర్వాత తడి పొడి, శుభ్రమైన క్లాత్ తో గోడను బాగా తుడవండి.
వెనిగర్, బేకింగ్ సోడాతో..
గోడలపై ఉన్న డర్టీ మరకలను పూర్తిగా పోగొట్టడానికి మీరు వెనిగర్, బేకింగ్ సోడాను కూడా ఉపయోగించొచ్చు. ముఖ్యంగా వంటగది గోడలపై ఉండే ఆయిల్ మరకలను పోగొట్టడానికి ఇది చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఈ మరకలను పోగొట్టడానికి ముందుగా మరకలు ఉన్న ప్రదేశంలో బేకింగ్ సోడాను చల్లండి. ఇప్పుడు ఒక పాత్రలో నీటిని తీసుకుని దానికి సమాన పరిమాణంలో వెనిగర్ ను కలపండి. ఇప్పుడు తయారుచేసిన మిశ్రమంలో స్పాంజ్ ను ముంచి మరకలను శుభ్రం చేయండి. ఆ తర్వాత తడి గుడ్డతో గోడలను తుడవండి. ఇలా చేయడం వల్ల గోడలపై ఉండే మురికి మరకలు సులభంగా తొలగిపోతాయి.