Holi 2022: హోలీ గురించి మనకు తెలియని విషయాలు ..

First Published | Mar 12, 2022, 3:54 PM IST

Holi 2022: హోలీ, డోలికా పూర్ణిమా, హోలికా పూర్ణిమా పేరేదైనా.. అన్ని రంగుల పండుగ పేర్లే. కార్తీక దీపారాధనకు ఎంత విశిష్టత ఉందో ఈ హోలీకి  కూడా అంతే విశిష్టత ఉంది. ఈ పండుగ మహా విష్ణువుకు ఎంతో పీతిపాత్రమైనది. ఈ ఫాల్గుణ మాసంలో శ్రీమన్నారాయణను పూజించడం వల్ల సకల సంపదలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. 
 

Holi 2022: హోలీ పండుగను ప్రతి ఏడాది ఫాల్గుణ పౌర్ణమి రోజును సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ పండుగ ఇండియాలోనే కాదు బంగ్లాదేశ్, నేపాల్ లో కూడా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. వసంత కాలంలో వచ్చే ఈ పండుగను ‘వసంతోత్సవం’ అని కూడా అంటారు. 

హిందూ పురాణాల ప్రకారం.. ఈ పండుగను సత్య యుగం నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. హోలీ రోజున శ్రీమన్నారాయణను నిష్టగా పూజించి... ఈ దేవుడిని ఊయలలో ఊరేగిస్తారు. దీనినే డోలికా పూర్ణిమా అంటారు. బెంగాల్ లో  ఈ డోలికోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటారు. శ్రీ  కృష్ణున్ని ఊయాలలో వేసిన పండుగకు గుర్తుగా అక్కడ  డోలికోత్సవాన్ని జరుపుకుంటారు. అయితే ఆ రోజున చందనంతో పాటుగా మామిడి పూతను తిన్న వారు ఆయురారోగ్యాలతో ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. 
 


Holi 2022

రాక్షస రాజు హిర్యణ్యాకశ్యపుడు తన కొడుకు చంపాలని పన్నాగం పండి.. తన చెల్లి సాయం తీసుకుంటాడు. ఇందుకోసం ప్రహ్లాదునితో సహా మంటలోకి దుంకిన హోలిక పూర్తిగా దహనమవుతుంది. విష్ణువు మాయతో భక్త ప్రహ్లాదుడు ప్రాణాలతో క్షేమంగా మంటల నుంచి బయటపడతారు. హోలిక అనే రాక్షసి దహనమైన రోజును పురస్కరించుకుని ఈ హోలీ పూర్ణిమను జరుపుకుంటారని కొంతమంది భావిస్తున్నారు. 

ఇకపోతే హిమంతుని కుమార్తెగా జన్మించిన పార్వతితో ఆ పరమేశ్వరుడి పెళ్లిని దేవతలంతా నిర్ణయిస్తారు. కాగా పరమేశ్వరుడి దృష్టంతా ఆ పార్వతీదేవిపై నిలవడానికి దేవతలు మన్మథుని సాయం కోరుతారట. దాంతో ఆ మన్మథుడు పూల భాణాన్ని విసిరి.. ఆ పరమేశ్వరుడికి తపోభంగం కలిగిస్తాడట. దాంతో ఆగ్రహానికి లోనైన పరమేశ్వరుడు తన మూడో కన్ను తెరిగి మన్మథున్ని అంతం చేస్తాడు. ఈ కారణంగానే హోలీ రోజున కామదహనం చేస్తారు. అంటే మన్మథుడిలా గడ్డితో ఒక బొమ్మను తయారుచేసి.. దానికి నిప్పంటిస్తారన్న మాట. 
 

ఇక ఈ పండుగను జరుపుకోవడానికి శాస్త్రీయ కారణాల గురించి చెప్పుకున్నట్టైతే.. వసంత కాలం రాకతో చలి పూర్తిగా వదిలిపోయి.. వేడి వస్తుంది. ఈ వేడితో వైరల్ ఫీవర్, జలుబు వంటి అనేక రోగాలు వచ్చే అవకాశం ఉంది. ఈ రోగాలు సోకకుండా ఉండేందు ఔషద మొక్కల నుంచి తయారు చేసిన రంగు నీళ్లు ఎంతో సహాయపడతాయి. 
 

సహజ రంగుల నీళ్లు ఒకరిపై ఒకరు చల్లుకోవడం వల్ల సీజనల్ వ్యాధులు రావని కొందరు అంటూ ఉంటారు. మీకు తెలుసా.. బిల్వాలు, పసుపు, కుంకుమలను ఉపయోగించి ఆయుర్వేద మూలికలను కూడా తయారు చేస్తుంటారు. 

సహజ రంగులంటే.. మోదుగ పూలను చెట్టు నుంచి తెంపుకొచ్చి బాగా దంచి నీటిలో మరిగిస్తారు. నీళ్ల కలర్ మారగానే దించుతారు. ఈ నీటిలో ఎన్నో ఔషదగుణాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

హోలీ పండుగకు కారణాలేవైనా.. ఇది అందరిలో చిరునవ్వులను తెస్తుంది. ఈ పండుగ జరుపుకోవడానికి ఎలాంటి తారతమ్యాలు అసలే అడ్డురావు. స్నేహితులు, కుంటుంబ సభ్యులు, చిన్నలు పెద్దలు అంటూ అందరు సంతోషంగా హోలీని సెలబ్రేట్ చేసుకుంటారు. 

Latest Videos

click me!